పేటెంట్ హక్కుల్లో చైనా ప్రపంచ రికార్డు
వాషింగ్టన్: ప్రపంచంలో అమెరికాను అధిగమించి నెంబర్ వన్ స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో ఆర్థికరంగంలో అతివేగంగా దూసుకెళుతున్న చైనా ఓ ఆరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పడమే కాకుండా ఎవరికి అందనంత ఎత్తుకు దూసుకుపోయింది. మేధోసంపన్న హక్కులకు సంబంధించి ఒక్క 2015 సంవత్సరంలోనే పేటెంట్ హక్కుల కోసం ఏకంగా 11 లక్షల దరఖాస్తులు దాఖలు చేసింది. ఆ తర్వాత స్థానాల్లో ఉన్న మూడు దేశాలు ఎన్ని దరఖాస్తులు చేశాయో అన్ని ఒక్క చైనానే చేయడం గమనార్హం.
అమెరికా 5,78,000 దరఖాస్తులతో రెండో స్థానంలో, 3,25,000 దరఖాస్తులతో జపాన్ మూడోస్థానంలో, 2,14,000 దరఖాస్తులతో దక్షిణ కొరియా నాలుగో స్థానంలో నిలిచిందని ఐక్యరాజ్య సమితి మేధో సంపన్న హక్కుల సంఘం అధిపతి ఫ్రాన్సిస్ గర్రీ వార్షిక నివేదిక విడుదల సందర్భంగా వెల్లడించారు. ఏ ఉత్పత్తులనైనా ఇట్టే కాపికొట్టడం ఒక్క చైనాకే చెల్లుతుందని గతంలో భావించేవారు. కానీ సృజనాత్మకత శక్తిలో గత కొన్నేళ్లుగా ప్రపంచంతో పోటీపడి ముందుకు దూసుకెళుతోంది.
ఓ దేశ ఆర్థిక పురోగతికి పేటెంట్ల సంఖ్య ప్రమాణం కాకపోయినప్పటికీ ఆధునిక సాంకేతిక రంగంలో అభివృద్ధికి, పేటెంట్లకు అవినాభావ సంబంధం ఉందనే విషయం అందరికి తెల్సిందేనని ఫ్రాన్సిస్ వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల నుంచి 2015 సంవత్సరానికి మొత్తం 29 లక్షల పేటెంట్ దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది ఎనిమిదిశాతం అధికం. మొత్తం పేటెంట్ దరఖాస్తుల్లో కంప్యూటర్ సాంకేతిక రంగానికి సంబంధించి 7.9 శాతం, ఎలక్ట్రానిక్ మెషినరీకి 7.3 శాతం, డిజిటల్ కమ్యూనికేషన్ రంగానికి సంబంధించి 4.9 శాతం ఉన్నాయని ఆయన వివరించారు.