‘వెనుక నడక’తో గిన్నిస్ రికార్డు
ఇండోర్: ‘అతిపెద్ద వెనుక నడక’ విభాగంలో తలతిప్పి చూడకుండా వెనక్కి నడుస్తూ గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నట్టు ఇండోర్‌లోని ప్రెస్టేజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్(పీఐఎంఆర్) వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 2న స్థానిక విజయనగర్ ప్రాంతంలో ఇన్‌స్టిట్యూట్‌కు చెందినవారు సహా ఎన్‌సీసీ కార్యకర్తలు మొత్తం 1,107 మంది కిలోమీటరు దూరాన్ని వెనుక నడకతో పూర్తి చేసినట్టు ఇన్‌స్టిట్యూట్ మీడియా ఇన్‌చార్జ్ రాజు జాన్ ఆదివారం పీటీఐకి తెలిపారు.
ఈ వెనుక నడక కార్యక్రమాన్ని గిన్నిస్ ప్రతినిధులు పరిశీలించారని, దీనికి సంబంధించిన గిన్నిస్ ధ్రువపత్రం తమ సంస్థకు ఇటీవలే అందినట్టు చెప్పారు. ఫలితంగా ‘అతిపెద్ద వెనుక నడక’ విభాగంలో ఇప్పటి వరకు ఉన్న చైనా రికార్డును తాము అధిగమించినట్టు పేర్కొన్నారు. 2012, జూన్ 10న 1,039 మందితో సుమారు కిలోమీటరు దూరాన్ని వెనుక నడక ద్వారా పూర్తి చేసి చైనా గిన్నిస్ రికార్డు సృష్టించింది.