సాక్షి, అమరావతి: అప్పుడే పుట్టిన శిశువులను జబ్బుల నుంచి రక్షించే వ్యాక్సిన్లు (సూదిమందు) ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో లేక పేద తల్లులు తల్లడిల్లుతున్నారు. ఇన్‌ఫెక్షన్లు, కామెర్లు సోకకుండా నవజాత శిశువులకు తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించాల్సి ఉంటుంది.
రెండు నెలలుగా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోయినా ప్రభుత్వం చలించకపోవడం గమనార్హం. ఏటా రాష్ట్రంలో 8 లక్షల వరకు ప్రసవాలు జరుగుతుండగా, ప్రభుత్వాస్పత్రుల్లో దాదాపు 3.80 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో నెలకు సగటున 32,000 మంది శిశువులు జన్మిస్తున్నారు. అయితే, నవజాత శిశువులకు విధిగా ఇవ్వాల్సిన రొటావాక్, హెపటైటిస్–బి వ్యాక్సిన్లు జూన్ 25వ తేదీ నుంచి ఆరోగ్య ఉపకేంద్రాల్లో గానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గానీ అందుబాటులో లేవు. అధికారులను అడిగితే స్టాక్ లేదంటూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో తమ బిడ్డలకు వ్యాక్సిన్లు వేయించేందుకు ప్రభుత్వాస్పత్రులకు వస్తున్న నిరుపేద తల్లులు మరో దిక్కులేక వెనక్కి తీసుకెళ్తున్నారు.
అతి కొద్దిమంది మాత్రమే డబ్బు ఖర్చు చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళుతున్నట్లు తేలింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లు వేయించుకునే స్తోమత లేక చాలామంది చిన్నారులు వ్యాక్సిన్లకు దూరమవుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని, రెండు మాసాలుగా చిన్నారులకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్లు లేకపోయినా పట్టించుకునేవారే లేరని పీహెచ్‌సీ వైద్యులు చెబుతున్నారు. ఓవైపు మాతా శిశుమరణాలను తగ్గించాలని చెబుతూనే, మరోవైపు కనీసం టీకాలు కూడా లేని దుస్థితి నెలకొందని వాపోతున్నారు. వ్యాక్సిన్ల కొరతపై అధికారులను వివరణ కోరేందుకు యత్నించగా... వారు స్పందించలేదు.
రోటావాక్
- బిడ్డ పుట్టగానే ఆరు వారాల్లోగా ఓ సారి, 10 వారాల వయసులో రెండోసారి, 14 వారాల్లోగా మరోసారి ఈ వ్యాక్సిన్ వేయాలి.
- చిన్నారుల్లో వచ్చే నీళ్ల విరోచనాలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత వచ్చే ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.
హెపటైటిస్–బి
- బిడ్డ పుట్టిన 24 గంటల్లోగా ఈ వ్యాక్సిన్ వేయాలి.
- ప్రమాదకరమైన హెపటైటిస్ (కామెర్లు) వ్యాధి రాకుండా ఈ వ్యాక్సిన్ వేస్తారు.
- ఇది వేయకపోతే చిన్నారులు కామెర్లకు గురై మృత్యువాత పడే ప్రమాదం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment