బేబీ ఖుష్... మనమూ!
చిన్నప్పుడు మీకు దిష్టితాడు కట్టారా? కట్టే ఉంటారులెండి. టెటనస్ మొదలుకొని చికెన్‌పాక్స్ వరకూ అన్ని టీకాలూ వేయించారా?... ఏమో సరిగ్గా గుర్తు లేదంటున్నారా? అక్షరాస్యులతోపాటు చదువులేని వాళ్లలోనూ చాలామందిది ఇదే పరిస్థితి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు జరిగిన ప్రయత్నమే ‘ఖుషీ బేబీ’ దిష్టితాడు. సంప్రదాయానికి హైటెక్ సెన్సర్లతో కూడిన పెండెంట్‌ను జతచేర్చి సిద్ధం చేశారు దీన్ని. స్మార్ట్‌ఫోన్లలో ఉండే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్, మొబైల్ హెల్త్ అప్లికేషన్, క్లౌడ్ కంప్యూటింగ్‌లతో పనిచేసే ఈ పరికరం చిన్నారుల వైద్య రికార్డులన్నింటినీ భద్రపరచే ఓ లాకర్!
మొబైల్‌ఫోన్‌లోని అప్లికేషన్‌తో పెండెంట్‌ను స్కాన్ చేస్తే చాలు. అప్పటివరకూ ఆ పిల్లోడికి వేసిన టీకాలు ఏమేమిటి? ఇతర టీకాలు వేయాల్సిన సమయం అన్ని కనిపిస్తాయన్నమాట. అంతేకాదు... ఈ పెండెంట్ టీకా వేయాల్సిన సమయాన్ని రికార్డ్ చేసిన సందేశాల ద్వారా ఎప్పటికప్పుడు తెలుపుతుంది కూడా. ప్రస్తుతం ఖుషీబేబీ ప్రాజెక్టు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్రాంతంలో సేవామందిర్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తోంది. దీంతోపాటు ఉత్తర భారతదేశంలోని దాదాపు 96 ప్రాంతాల్లోనూ ఖుషీబేబీ పెండెంట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
చాక్‌పీస్, సోపు ఒక్కటైతే...?
ఆహారం తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కుంటే అతిసారంతోపాటు అనేక వ్యాధులు సోకకుండా అరికట్టవచ్చు. అదే ఈ అలవాటు ఓ ఆటలా మారిపోతే? అచ్చంగా ఈ ఐడియాతో సిద్ధమైందే... సోపెన్! చాక్‌పీస్‌లాంటి సోప్ అన్నమాట! ఈ సోపెన్‌తో పిల్లల చేతులపై చిన్నచిన్న బొమ్మలు గీసి కడుక్కోమన్నారనుకోండి. వాళ్లు ఎంచక్కా బొమ్మల గుర్తులు అన్నీ చెరిగిపోయేంతవరకూ చేతులను శుభ్రంగా కడుక్కుంటారన్నమాట. మూడు నుంచి ఆరేళ్ల వయసు పిల్లల్లో శారీరక పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఇది మేలైన మార్గమని అంటున్నారు దీన్ని డిజైన్ చేసిన యువ బృందం. ముగ్గురు భారతీయ యువతులు, ఒక కొరియన్ యువకుడు కలిసి దీన్ని అమెరికాలో తయారు చేశారు.