ఈ బాలుడు రాయదుర్గంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్నాడు. గత నెల 28న స్కూల్‌కు వెళుతుండగా వీధి కుక్క కరిచింది. అదే సమయంలో పక్కనే మరో విద్యార్థుని సైతం గాయపరిచింది. మధ్యాహ్నం మరొకరిని, సాయంత్రం ట్యూషన్‌కు వెళుతున్న మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచింది. ఒక్క రోజే ఐదుగురు విద్యార్థులు కుక్కకాటుకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఈ పరిస్థితి ఒక్క రాయదుర్గంలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా నిత్యం చోటు చేసుకుంటున్నాయి. వెలుగు చూస్తున్నవి కొని...వెలుగులోకి రానివి మరెన్నో....
రాయదుర్గం: పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధుల్లో సంచరిస్తూ స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. కాలినడకన వెళుతున్న వారే కాదు.. పశువులు, మేకలు, గొర్రెలు, ద్విచక్ర వాహన చోదకులు సైతం కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడుతున్నారు.
మూడు నెలల్లో 2,978 కేసులు
కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగింది. గడిచిన మూడు నెలల్లో 2,978 మంది కుక్కకాటుకు గురయ్యారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారం క్రితం రాయదుర్గంలోని దాసప్ప రోడ్డు, చికెన్ మార్కెట్ ప్రాంతాల్లో కుక్కలు బీభత్సం సృష్టించాయి. రెండు రోజుల వ్యవధిలో ఎనిమిది మంది పిక్కలు పీకేశాయి.
ఇక ద్విచక్ర వాహనాల వెంట పడుతూ బెంబేలెత్తిస్తుండడంతో పలువురు ప్రమాదాలకు గురైన ఘటనలూ కోకొల్లలుగా ఉన్నాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, రాప్తాడుతో పాటు అనంతపురం నగర పాలక సంస్థలోనూ కుక్కకాటు బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ ప్రాంతాల్లో దాదాపు 2 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి నియంత్రణ, సంరక్షణ కోసం రూ. లక్షలు ఖర్చు చేస్తున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు.
వ్యర్థాలతో అనర్థాలు
పట్టణ, గ్రామీణ, నగర ప్రాంతాల్లోని పలు చికెన్ సెంటర్ నిర్వాహకులు వ్యర్థాలను రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. వీటి కోసం పదుల సంఖ్యలో కుక్కలు గుమికూడి పోట్లాడుకుంటూ రోడ్డున వెళుతున్న వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. కోడిమాంసాన్ని అధికంగా తినడంవల్ల తరచూ దుష్ప్రభావాలకు గురికావాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బ్రాయిలర్ కోళ్లలో క్యాంపిలోబాక్టర్, సాల్మొనెల్లా, ఎస్చెరిచియా కోలి వంటి బ్యాక్టీరియాలను కలిగి ఉంటాయని, సరిగా ఉడికించకపోతే ఈ బ్యాక్టీరియా మనిషిలో అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తుందని వివరిస్తున్నారు. పచ్చి మాంసం, వ్యర్థాలను తినడం వల్ల కుక్కల్లో పలు రకాల వ్యాధులు వ్యాపిస్తాయని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో కుక్కలు విచిత్రంగా ప్రవర్తిస్తూ కనిపించిన వారిపై దాడికి తెగబడుతాయని అంటున్నారు.
చర్యలు తీసుకుంటాం
గతంలో రీజియన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఏబీసీ కేంద్రానికి వీధికుక్కలు తరలించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేవాళ్లం. కొన్ని నెలలుగా ఈ ప్రక్రియ చేపట్టలేదు. దీంతో ఇటీవల కుక్కల బెడద ఎక్కువైంది. వీటి నియంత్రణకు చర్యలు తీసుకుంటాం.
– దివాకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, రాయదుర్గం
అందుబాటులో టీకా
జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రిలు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో కుక్క కాటుకు టీకా అందుబాటులో ఉంది. కుక్క కాటు బాధితులు అందుబాటులో ఉన్న ఆస్పత్రిలో టీకా వేయించుకోవచ్చు. శీతాకాలంలో కుక్కకాటుకు గురికాకుండా జాగ్రత్త తీసుకోవాలి. కరిచే కుక్కలు ఉంటే ముందస్తుగా వాటికి రేబిస్ టీకా వేయించాలి. – డాక్టర్ విశ్వనాథయ్య, డీఎంహెచ్‌ఓ, అనంతపురం
(చదవండి: బరితెగించిన టీడీపీ నేతలు.. 20కోట్ల ల్యాండ్ కోసం కలెక్టర్ పేరుతో..)
Comments
Please login to add a commentAdd a comment