
మెంఫిస్ సిటీ: కుక్క మనిషిని కరవడం వార్తకాదు.. మనిషే కుక్కను కరవడం వార్త అని గతంలో ఒక ఫేమస్ వాక్యం ఉండేది. ఇప్పుడు దానిని ‘‘మనిషి కుక్కను షూట్ చేయడంకాదు.. కుక్క మనిషిని షూట్ చేయడం వార్త’’ అని మార్చి రాసుకోవాలేమో. ఇలాంటి ఉదంతం సోమవారం తెల్లవారుజామున అమెరికాలో జరిగింది. టెన్నిస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ సిటీ సమీప ఫ్రేసర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. జెరాల్డ్ కిర్క్‌వుడ్ అనే వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి బెడ్‌పై నిద్రిస్తుండగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఏడాది వయస్సున్న పిట్‌బుల్ జాతి పెంపుడు శునకం ఆ గదికి వచ్చింది.
వీళ్లిద్దరూ నిద్రిస్తూ బెడ్ మీద ఒక గన్‌ను అలాగే వదిలేశారు. దాంట్లో బుల్లెట్లు లోడ్‌చేసి ఉన్నాయి. శునకం ఒక్క ఉదుటున బెడ్ మీదకు దూకింది. అది సరిగ్గా గన్ ట్రిగ్గర్‌పై దూకడంతో ట్రిగ్గర్ నొక్కుకుని గన్ పేలింది. దీంతో దూసుకొచి్చన బుల్లెట్ ఆ వ్యక్తి ఎడమ తొడను పైపైన చీలిస్తూ బయటకు దూసుకెళ్లింది. బుల్లెట్ గాయంతో జెరాల్డ్, అతని గర్ల్‌ఫ్రెండ్‌ల నిద్ర మొత్తం ఒక్క దెబ్బతో పోయింది. రక్తమోడుతున్న జెరాల్డ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. శునకం కారణంగా గన్ పేలిన ఘటనపై బాధితుడిని మీడియా ప్రశ్నించింది. కుక్క దూకడంతో నిద్రలేచారా? బుల్లెట్ గాయంతో లేచారా? అని ప్రశ్నించగా రెండూ ఒకేసారి జరిగాయని ఆయన నవ్వుతూ చెప్పడం విశేషం. ఆ ఆయుధాన్ని అతని గర్ల్‌ఫ్రెండ్ తర్వాత తీసుకెళ్లింది. ఓరియో పేరున్న ఆ కుక్కపై పోలీసులు ఎలాంటి కేసు నమోదుచేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment