మలిసందెలో మళ్లీ టీకాలు.. | Here's how irrational flu vaccine deniers are | Sakshi
Sakshi News home page

మలిసందెలో మళ్లీ టీకాలు..

Published Tue, Dec 9 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

మలిసందెలో మళ్లీ టీకాలు..

మలిసందెలో మళ్లీ టీకాలు..

పాపాయి పుట్టిన అనేక వ్యాధుల నుంచి రక్షణ కోసం నిర్ణీత వ్యవధిలో అనేక వ్యాక్సిన్లు ఇస్తుంటారు. జీవితంలోని బాధ్యతలు ముగిసి... వార్థక్యంలోకి ప్రవేశించాక దాన్ని కూడా మరో బాల్యం అంటారు అనుభవజ్ఞులు. ఎందుకంటే... పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఎలా తగ్గుతుందో... పెద్దవాళ్ల వయసు మరింత పైబడుతున్న కొద్దీ వాళ్లలోనూ రోగ నిరోధక శక్తి తగ్గుతుంటుంది. అందుకే పుట్టిన పాపాయి లాగే వృద్ధాప్యంలో అడుగిడుతున్న వారికీ టీకాల అవసరం ఉంటుంది. కానీ... ఉన్న ఆరోగ్యం ఎలాగూ బాగుంది... దీని కోసం మళ్లీ ఈ వయసులో టీకాలెందుకు అన్నది చాలామంది వృద్ధుల ఆలోచనాసరళి. ఆర్థికకోణం నుంచి చూసినా వృద్ధాప్యంలో సమయానికి తీసుకోవాల్సిన టీకాలు వేయించుకోవడం లాభదాయకం. ఆ విషయంపై అవగాహన కల్పించడం కోసమే ఈ కథనం.
 
ఇప్పుడు మనదేశవాసుల సగటు ఆయుఃప్రమాణం (లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ రేట్) 68.89 ఏళ్లు. అంటే దాదాపు 70 ఏళ్లు అనుకోవచ్చు. గత పదేళ్ల వ్యవధిలో ప్రజల ఆయుఃప్రమాణం ఐదు సంవత్సరాలు పెరిగింది. ఇలా ప్రజల ఆయుప్రమాణం పెరగడం అన్నది ఒక మంచి సూచికగా భావించినా... వృద్ధాప్యంలో వచ్చే న్యుమోనియా జబ్బుతో ఏటా మన దేశంలో రెండున్నర లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. న్యుమోనియా వ్యాధికి బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లలో ఏవైనా కారణం కావచ్చు. సాధారణంగా యువకుల్లో, మధ్యవయస్కుల్లో అంత ప్రమాదకరం కాకుండా ఉండే న్యుమోనియా వృద్ధుల్లో చాలా ప్రమాదకరంగా పరిణమించడమే కాదు... ఒక్కోసారి ప్రాణాలనూ హరించవచ్చు.
 
టీకాలు ఎలా లాభదాయకం...?

ముందుగా చెప్పుకున్నట్లు న్యుమోనియా సమస్యను సాధారణ యాంటీబయాటిక్స్‌తో అధిగమించవచ్చు. కానీ వృద్ధుల్లో న్యుమోనియా వస్తే అది ప్రాణాపాయం కావచ్చు. లేదా ఒకవేళ వెంటిలేటర్‌పై పెట్టి బతికి బయటపడ్డా ఆసుపత్రి ఖర్చులు తడిసి మోపెడు కావడం ఖాయం. కానీ న్యుమోనియాను నివారించే న్యూమోకోకల్ వ్యాక్సిన్‌ను తీసుకుంటే అది ప్రాణాలనూ రక్షిస్తుంది. ఒకవేళ ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తే వేలలో అయ్యే వ్యయాన్ని ఒకటి రెండు వందలకే పరిమితం చేస్తుంది. కాబట్టి ఏ రకంగా చూసినా వృద్ధాప్యంలో టీకాలు లాభదాయకమే.
 
ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్
ఇది ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వల్ల కలిగే ఫ్లూ వ్యాధి. మనకు సాధారణంగా జలుబు చేసినప్పుడు కనిపించే లక్షణాలే ఇన్‌ఫ్లుయెంజా వైరస్ సోకినప్పుడూ కనిపిస్తాయి. అయితే ఇన్‌ఫ్లుయెంజా నేరుగా హాని చేయకపోవచ్చు. జలుబు తగ్గినట్లే అదీ తగ్గిపోతుంది. కానీ ఒక్కోసారి ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కారణంగా వచ్చే రెండో దశ దుష్పరిణామాలైన శ్వాసకోశ సమస్యల వంటివి రోగిని బాధిస్తాయి. పైగా ఇన్‌ఫ్లుయెంజా వైరస్ ఎప్పటికప్పుడు తన జన్యుస్వరూపాన్ని మార్చుకుంటుంటుంది.

అందుకే జలుబు వైరస్‌కు ఒకే వ్యాక్సిన్ రూపొందించడం కష్టసాధ్యం. అందుకే అరవై ఏళ్లు పైబడిన వారు ఈ ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను ప్రతి ఏడాదీ తీసుకోవాలి. పైగా దీని ధర కూడా చాలా తక్కువ. (రూ. 60 నుంచి రూ.100 లోపే ఉంటుంది). దురదృష్టవశాత్తూ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కారణంగా రెండోదశ సమస్యలు ఏర్పడి ఒకసారి హాస్పిటల్‌లో చేరితే అయ్యే ఖర్చుతో పోలిస్తే పైన పేర్కొన్న ఖర్చు చాలా చాలా తక్కువ.
 
హెపటైటిస్ వ్యాక్సిన్లు
హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ :
హెపటైటిస్-ఏ అనే వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంది. హెపటైటిస్-బి తో పోలిస్తే ఇది అంత ప్రమాదకరం కానప్పటికీ సాధారణంగా యువకులు, మధ్యవయస్కుల్లో ఎలాంటి చికిత్సా తీసుకోకపోయినా తగ్గిపోతుంది. కానీ వృద్ధుల్లో వ్యాధి నిరోధకత తక్కువగా ఉండే కారణాన దీనికి వ్యాక్సిన్ తీసుకోవడం మేలు.
 
హెపటైటిస్-బి వ్యాక్సిన్ : హెపటైటిస్-బి వైరస్ వల్ల కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. హెచ్‌ఐవీ వ్యాపించే మార్గాల ద్వారానే ఇదీ వ్యాపిస్తుంది. కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసి ప్రాణాంతకంగా మారే అవకాశమూ ఉంది. అయితే అదృష్టవశాత్తూ దీనికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. వృద్ధుల్లో వ్యాధి నిరోధకశక్తి తక్కువ కాబట్టి అరవై ఏళ్లు దాటిన వారు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మేలు.
 
వ్యారిసెల్లా వ్యాక్సిన్
వ్యారిసెల్లా జోస్టర్ వైరస్ (వీజడ్‌వీ) అనే ఈ వైరస్ మనం సాధారణ పరిభాషలో ‘చికెన్‌పాక్స్’ అంటూ మనం పిలుచుకునే వ్యాధిని కలిగిస్తుంది. వ్యారెసెల్లా వ్యాక్సిన్ వృద్ధుల్లో ఈ చికెన్ పాక్స్‌నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే అప్పటికే ఏవైనా వ్యాధులతో ఉన్నవారికీ, గతంలో ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు తీవ్రమైన అలర్జీ వచ్చిన వారికీ, హెచ్‌ఐవీ వంటి వ్యాధి నిరోధక శక్తిని ప్రభావితం చేసే వ్యాధులు ఉన్నవారికీ, స్టెరాయిడ్స్ మీద ఉన్నవారికి ఈ వ్యాక్సిన్‌ను డాక్టర్లు సిఫార్సు చేయరు. అలాగే క్యాన్సర్ చికిత్స (కీమోథెరపీ) తీసుకుంటున్నవారు, గత ఐదు నెలల వ్యవధిలో రక్తమార్పిడి / రక్తంలోని ఏదైనా అంశాన్ని స్వీకరించడం వంటి చికిత్స తీసుకున్న వారు సైతం ఈ వ్యాక్సిన్‌ను తీసుకోకూడదు.
 
న్యుమోనియా వ్యాక్సిన్స్...
న్యుమోనియా వ్యాధి ప్రధానంగా న్యుమోకాకల్ బ్యాక్టీరియాతో వస్తుంది. ఇదొక్కటే గాక మరో 23 రకాల ఇన్ఫెక్షన్లు సైతం న్యుమోనియాకు దారితీస్తాయి. సాధారణంగా ఈ వ్యాధితో ఆసుపత్రిలో చేరే రోగుల్లో 11 శాతం నుంచి 20 శాతం మందికి న్యూమోనియా ప్రాణాపాయం కలిగిస్తుంది. అందుకే అలాంటి ప్రమాదం రాకుండా 65 ఏళ్లు దాటిన వారు న్యుమోనియా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇందులో రెండు రకాలు ఉంటాయి. మొదటిది న్యుమోవ్యాక్ 23, రెండోది ప్రివెనార్ 13.
 
న్యుమోవ్యాక్ 23: న్యుమోనియా అనే ఊపిరితిత్తులు ప్రభావితమయ్యే కండిషన్‌కు స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా ప్రధాన కారణం. దీంతోపాటు మరో 22 ఇతర అంశాలూ న్యుమోనియాకు కారణమవుతాయి. మొత్తం కలిపి ఈ వ్యాక్సిన్ 23 రకాల న్యుమోనియాల నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే దీన్ని న్యూమోవ్యాక్ 23 అంటారు. అంతేకాదు... ఇది మెదడువాపు (మెనింజైటిస్) నుంచి, రక్తంలో ఉండే ఇతర బ్యాక్టీరియాల దుష్ర్పభావం నుంచి, కాలేయ సమస్యలు, ఆల్కహాల్ తాగే అలవాటు వల్ల వచ్చే దుష్ర్పభావాలు, డయాబెటిస్ సమస్యలు, స్ప్లీన్ సమస్యలు, సికిల్ సెల్ అనీమియా వంటి ఇతర రిస్క్‌లు ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన వ్యాక్సిన్.

దీన్ని భుజంపైన గానీ లేదా తొడపైనగాని ఉండే చర్మం కింద ఉండే కండరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఒకసారి ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారైనప్పటికీ ఒకవేళ రిస్క్ ఎక్కువగా ఉంటే మరో డోస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇక స్ప్లీన్ సర్జరీ లేదా క్యాన్సర్‌కు కీమోథెరపీ లేదా రోగనిరోధక శక్తిని ఒకింత తగ్గించే ఇతర మందులు వాడాల్సిన సమయంలో ఆ ప్రక్రియ జరగడానికి కనీసం రెండు వారాల ముందే ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
 
అరవై ఐదేళ్లు దాటిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం మంచిదని అడ్వయిజరీ కమిటీ ఆన్ ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ (ఏసిఐపీ) సిఫార్సు చేస్తోంది. ఇదిఒకసారి తీసుకున్న తర్వాత దీని వల్ల కలిగే వ్యాధి నిరోధక శక్తి ఐదేళ్ల పాటు ఉంటుందని ఏసిఐపీ పేర్కొంటోంది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే లుకేమియా, లింఫోమా వంటి క్యాన్సర్లు ఉన్నవారిలో, కార్టికో స్టెరాయిడ్స్ తీసుకునేవారిలో దీన్ని ఐదేళ్ల తర్వాత మరోసారి తీసుకోవాలని ఏసీఐపీ సిఫార్సు చేస్తోంది.
 
ప్రివెనార్ 13: ఇది పదమూడు రకాల స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియాల నుంచి సేకరించిన యాంటీబాడీలతో రూపొందించిన వ్యాక్సిన్. ఇది వ్యాధి నిరోధక సామర్థ్యాన్ని మరింత శక్తిమంతం చేస్తుంది. దీన్ని సాధారణంగా 50 ఏళ్ల పైబడినప్పటి నుంచి ఇవ్వవచ్చు. ఇది స్ట్రెపోకాకల్ బ్యాక్టీరియా కారణంగా న్యూమోనియాతో పాటు మెదడువాపు (మెనింజైటిస్), రక్తం విషపూరితం కావడం (బ్లడ్‌పాయిజనింగ్), మధ్య చెవికి వచ్చే ఇన్ఫెక్షన్లు (మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ / ఓటైటిస్ మీడియా) వంటి అనేక సమస్యల నుంచి రక్షిస్తుంది. కానీ న్యూమోకాకల్ బ్యాక్టీరియా కారణంగా వచ్చే మెనింజైటిస్, రక్తం విషపూరితం కావడం (సెప్టిసీమియా), మధ్య చెవికి వచ్చే ఇన్ఫెక్షన్లు (మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ / ఓటైటిస్ మీడియా) వంటి వాటినుంచి రక్షించలేదు.
 
అందుకే వృద్ధులకు ఈ రెండు రకాల వ్యాక్సిన్లనూ ఇవ్వాలి. అయితే ఈ వ్యాక్సిన్లు తీసుకునే క్రమంలో రెండింటి మధ్య కనీసం ఒక ఏడాదైనా కాలవ్యవధి ఉండాలి. పైన పేర్కొన్న వ్యాక్సిన్లను వృద్ధాప్యంలో ఎలాంటి జబ్బూ లేకపోయినా తీసుకోవాలి. ఒకవేళ ఆ వృద్ధాప్య దశలో ఉన్నవారికి డయాబెటిస్, ఆస్తమా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) వంటి జబ్బులతో పాటు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఏడాది గ్యాప్‌తో ఈ రెండు వ్యాక్సిన్లను తీసుకోవడం తప్పనిసరి.
 
హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్
ఇది షింగిల్స్ అనే వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుంది. అరవై ఏళ్లు పైబడిన వారు తీసుకోవాల్సిన వ్యాక్సిన్ ఇది. ఎందుకంటే ఇది పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. నిజానికి షింగిల్స్, చికెన్‌పాక్స్... ఈ రెండూ ఒకే వైరస్ ద్వారా వస్తాయి. చికెన్‌పాక్స్ వైరస్ పూర్తిగా నిరోధితం కాకుండా నరాల చివరల్లో నిద్రాణంగా ఉండిపోయి ఆ తర్వాత ఎప్పుడో క్రియాశీలం అయి, తీవ్రమైన బాధ కలిగిస్తుంది. ఆ దశనే షింగిల్స్ అంటారు. అందుకే దీని మోతాదు సాధారణ చికెన్‌పాక్స్ డోస్ కంటే ఎక్కువగా ఉంటుంది.

ఈ వ్యాక్సిన్ వల్ల కలిగే రోగనిరోధక శక్తి సాధారణంగా ఐదేళ్లకు పైబడి ఉంటుంది. ఒకవేళ గతంలో వారికి చికెన్‌పాక్స్ వచ్చినా రాకున్నా, చికెన్‌పాక్స్‌కు వ్యాక్సిన తీసుకుని ఉన్నవారు సైతం హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదే. అయితే లుకేమియా, లింఫోమా వంటి వ్యాధులతో కీమోథెరపీ, రేడియో థెరపీ వంటివి తీసుకునేవారు, కార్టికోస్టెరాయిడ్స్ ఉపయోగించేవారు దీన్ని తీసుకోవడం మంచిది కాదు. ఎసైక్లోవిర్, వాలాసైక్లోవిర్ వంటి యాంటీవైరల్ మందులు తీసుకునే వారు ఈ వ్యాక్సిన్ తీసుకునే ముందర కనీసం 24 గంటల పాటు ఈ మందులను వాడకపోవడం మంచిది. ఈ వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా 14 రోజుల పాటు ఆ మందులను వాడకపోవడమే మంచిది.
 
సైడ్‌ఎఫెక్ట్స్: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సాధారణంగా ఆ ప్రాంతంలో నొప్పి, వాపు, దురద రావచ్చు. కొందరిలో చాలా అరుదుగా ఒళ్లంతా దద్దుర్ల వంటివి (జోస్టెరిఫార్మ్ ర్యాష్) కనిపించవచ్చు. ఇవి మినహా ఈ వ్యాక్సిన్ తీసుకునే ముందు ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలూ తీసుకోవాల్సిన అవసరం లేదు.
 
డిఫ్తీరియా, టెటనస్ వ్యాక్సిన్
ప్రతి చిన్నారికీ చిన్నప్పుడు డీటీపీ వ్యాక్సిన్ ఇస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆ చిన్నారి 40 ఏళ్ల వయస్కుడయ్యే సమయానికి టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం సగానికి తగ్గుతుంది. అదే 60 ఏళ్ల వయసుకు రాగానే టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం కేవలం 10 శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ టెటనస్ డోస్‌ను 60 దాటిన వారికి బూస్టర్‌డోస్ ఇవ్వాలి. దాంతో అది వ్యాక్సిన్ తీసుకున్నవారికి టెటనస్ (ధనుర్వాతం) నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే డిఫ్తీరియా వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. చిన్నప్పుడు ఇచ్చే డీపీటీలలో పెర్టుసిస్ (కోరింత దగ్గు) అనే సమస్య పెద్ద వయసులో రాదు కాబట్టి ఈ పెర్టుసిస్ వ్యాక్సిన్ పెద్దలకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
 
మరికొన్ని వ్యాక్సిన్లు
పైన పేర్కొన్న వాటితో పాటు జపనిస్ ఎన్‌కెఫలైటిస్, మెనింగోకోకస్, రేబీస్, టైఫాయిడ్, పోలియో, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధుల నివారణకు ముందస్తు వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎల్లో ఫీవర్ అనే వ్యాధి మన దేశంలో లేదు. అది ఉన్నచోటికి ప్రయాణం చేసేవారు ముందుగా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మేలు.
 
రాబోయే వ్యాక్సిన్లు

ప్రస్తుతానికి అందుబాటులో లేకపోయినా... చాలా తక్కువ వ్యవధిలో (సుమారు ఏడాది కాలంలోనే) మరికొన్ని వ్యాక్సిన్లూ మనకు అందుబాటులోకి రానున్నాయి. అవి... డెంగ్యూ, చికెన్‌గున్యా, ఎబోలా వైరస్‌లకు వ్యాక్సిన్లు.
 
ఉపసంహారం
వృద్ధాప్యంలో వ్యాక్సిన్ల అవసరాన్ని గుర్తించి, సమయానుకూలంగా వాటిని తీసుకునే అభివృద్ధి చెందిన దేశాల్లో ఆసుపత్రుల్లో చేరే వృద్ధుల శాతం 200 శాతం నుంచి 300 శాతం తగ్గింది. ఇదే అవగాహన మనలోనూ పెరిగితే... వృద్ధాప్యం ప్రమాదరహితంగా, ఆసుపత్రులకు దూరంగా, హాయిగా సాగే అవకాశం ఉంది. ఇక మనదేశంలోనూ ఈ అంశంపై అవగాహన ఉన్న డాక్టర్లు, ఆరోగ్యరంగంలో పనిచేసే ఇతర నిపుణులూ వీటిని ఇప్పటికే తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement