COVID Delta Plus Variant: Know About Important Things In Telugu - Sakshi
Sakshi News home page

మాస్క్‌ లేకుంటే డెల్టా ప్లస్‌ డేంజరే.. పక్కన ఉన్నా పాజిటివ్‌!

Published Fri, Jun 25 2021 1:51 AM | Last Updated on Fri, Jun 25 2021 10:06 AM

Covid-19 Delta Plus Variant: Important Things You Need To Know - Sakshi

►మన దేశంలో ఇప్పటివరకు 40కి పైగా డెల్టా ప్లస్‌ కేసులు నమోదయ్యాయి. మహా రాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటక, తమిళ నాడు, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రా ల్లోనూ కేసులు మొదలయ్యాయి.
►డెల్టా ప్లస్‌ సోకినట్టు గుర్తించిన వారిలో తొలిసారిగా మధ్యప్రదేశ్‌లో మహిళ చనిపోయింది. ఆమె ఎటువంటి వ్యాక్సిన్‌ తీసుకోకపోవడంతో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉందని వైద్యులు ప్రకటించారు. 
►కొత్త వేరియంట్‌ ప్రమాదకరమయ్యే అవకాశం ఉందన్న అంచనాలతోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌ (ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన కరోనా వేరియంట్‌)’గా ప్రకటించింది. డెల్టా, దాని అనుబంధ వేరియంట్లతో ప్రమాదం ఎక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవల వెల్లడించింది. 
►కరోనా ఏ వేరియంట్‌ వచ్చినా కూడా.. ‘కోవిడ్‌ జాగ్రత్తలు పాటించడం, వ్యాక్సినేషన్, లాక్‌డౌన్‌’ ఈ మూడు అంశాలే కీలకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటితోనే మూడో వేవ్‌ను నియంత్రించవచ్చని చెప్తున్నారు. 
►మహారాష్ట్రలో డెల్టా ప్లస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాయిగఢ్, రత్నగిరి, సింధుదుర్గా, సాతారా, సాంగ్లీ, క్లోహపూర్, హింగోలి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. తొందరపడి లాక్‌డౌన్‌ ఆంక్షలు పూర్తిగా సడలించవద్దని సీఎం అధికారులకు సూచించారు.

సాక్షి, హైదరాబాద్‌: కరోనా రెండో దశలో లక్షల కేసులకు కారణమైన డెల్టా వైరస్‌ను అదుపు చేయగలిగామని అనుకుంటుండగానే.. డెల్టా ప్లస్‌ కలవరం మొదలైంది. ఇది మరింత శక్తివంతమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకిన వారి పక్క నుంచి మాస్కు పెట్టుకోకుండా వెళ్లినా కూడా వైరస్‌ సోకే అవకాశం ఉంటుందని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఇటీవల వెల్లడించారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కొత్త వేరియంట్‌ సోకు తుందని.. మాస్కులు, శానిటైజేషన్, భౌతికదూరం వంటి కోవిడ్‌ జాగ్రత్తతోనే రక్షణ అని స్పష్టం చేశారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ ఔషధాన్ని తట్టుకుంటుందని, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి దేశంలో ఈ కొత్త వేరియంట్‌ కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాలు అత్యంత కీలకమని రణ్‌దీప్‌ స్పష్టం చేశారు. 

మొదట ఇంగ్లండ్‌లో గుర్తింపు 
కరోనా వైరస్‌ రూపాంతరాల్లో డెల్టా ప్లస్‌ (ఏవై.1) సరికొత్తది. ఇంగ్లండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు ఈ కొత్త వేరియంట్‌ను తొలిసారి గుర్తించినట్టుగా ఈ నెల 11న ప్రకటించారు. భారత్‌లో రెండో వేవ్‌కు ప్రధాన కారణమైన డెల్టా వేరియంట్‌లోని కొమ్ము (స్పైక్‌) ప్రొటీన్‌లో ‘కే417’ జన్యు మార్పు జరిగి కొత్త వేరియంట్‌ పుట్టింది. ఈ తరహా జన్యుమార్పును బీటాగా పిలిచే దక్షిణాఫ్రికా వేరియంట్‌లో గతంలోనే గుర్తించారు. అయితే బీటా రకం కంటే డెల్టా వేరియంట్‌కు వ్యాప్తి చెందే సామర్థ్యం ఎక్కువ. అలాంటిది ఈ సామర్థ్యానికి తాజా జన్యుమార్పు జత కలవడంతో.. డెల్టా ప్లస్‌ మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ కొత్త వేరియంట్‌పై మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ చికిత్స ప్రభావం తక్కువగా ఉంటుందని ప్రముఖ వైరాలజిస్ట్‌ షాహీద్‌ జమీల్‌ ఇటీవలే వెల్లడించారు. 

ఎక్కడెక్కడ కేసులు? 
డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులను ఇప్పటికే 11కుపైగా దేశాల్లో గుర్తించారు. మొదట గుర్తించిన బ్రిటన్‌తోపాటు అమెరికా, చైనా, రష్యా, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్, పోలండ్, నేపాల్‌ తదితర దేశాల్లో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. మన దేశంలోనూ 40కిపైగా డెల్టా ప్లస్‌ కేసులు నమోదయ్యాయి. దాదాపు 45 వేల నమూనాల్లోని జన్యుక్రమాలను విశ్లేషించి ఈ కేసులను గుర్తించారు. ఇవి మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. నిజానికి భారత్‌లో ఏప్రిల్‌ ఐదో తేదీన తీసిన ఓ శాంపిల్‌లోనే డెల్టా ప్లస్‌ ఆనవాళ్లు ఉన్నాయని, ఈ వేరియంట్‌ అప్పుడే మొదలైందని ఓ అంచనా. బ్రిటన్‌లో తొలి ఐదు కేసులను ఏప్రిల్‌ 26న సేకరించిన శాంపిళ్లలో గుర్తించారు. 

ప్రమాదం ఎంత? 
రెండో దశలో నమోదైన కేసుల్లో అత్యధికం డెల్టా రూపాంతరితానివే. డెల్టా ప్లస్‌ విషయంలోనూ కేసులు అంత భారీ సంఖ్యలో ఉంటాయా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. డెల్టా ప్లస్‌తో ప్రమాదం ఎంత? ఇప్పుడున్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా? అన్నదానిపై భారత వైద్య పరిశోధన సమాఖ్య, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలు ఇప్పటికే అధ్యయనం ప్రారంభించాయి. 

ప్రమాదం ఉండకపోవచ్చు 
డెల్టా ప్లస్‌లోని కే417 జన్యుమార్పు ఒక్కదానితోనే ప్రమాదం పెరిగిపోదని, లక్షలకొద్దీ కేసులు వస్తాయని అనుకోవాల్సిన పనిలేదని కొందరు వైరాలజిస్టులు అంటున్నారు. కోవిడ్‌ జాగ్రత్తలు, నియమాలు ఎలా అమలు చేస్తున్నామన్నది కూడా ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. కరోనా వైరస్‌ భవిష్యత్తులోనూ మరింతగా రూపాంతరం చెందుతూనే ఉంటుందని, అవకాశం ఉన్నంత వరకు సోకుతూనే ఉంటుందని అంటున్నారు. అందువల్ల నమూనాల సేకరణ, జన్యుక్రమ నమోదు కార్యక్రమం కట్టుదిట్టంగా, విస్తృతంగా జరగాలని.. ఎక్కడికక్కడే కొత్త రూపాంతరితాలను గుర్తించి, కట్టడి చేయడం సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. 

వ్యాక్సిన్లు పనిచేస్తాయా? 
మన దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలు డెల్టా రూపాంతరితం నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ డెల్టా ప్లస్‌ విషయంలో టీకాల సమర్థత ఎంత అన్నది ఇంకా తేలలేదు. టీకా ఒక డోసు తీసుకున్న తర్వాత కొందరు వైరస్‌ బారిన పడటాన్ని బట్టి చూస్తే.. కొత్త రూపాంతరితాలపై టీకా ప్రభావం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు చెప్తున్నారు. 
 
కేసులు తగ్గాయని నిర్లక్ష్యం వద్దు 
కరోనా కేసులు తగ్గిపోయాయి కదా అంటూ మొదటి వేవ్‌ తర్వాతిలాగా ఇప్పుడూ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదు. ఏది ఏమైనాసరే అన్నట్టుగా కఠినంగా మాస్కులు, భౌతికదూరం, శానిటైజేషన్‌ వంటి కోవిడ్‌ జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇదే సమయంలో విస్తృతంగా వ్యాక్సినేషన్‌ చేపట్టాలి. అప్పుడే మూడో వేవ్‌ను ఎదుర్కోగలుతాం. 
-ఎయిమ్స్‌ ప్రధానాధికారి రణదీప్‌ గులేరియా 
 
ఆ కేసులు తక్కువగానే ఉన్నాయి 
డెల్టా ప్లస్‌తో దేశంలో మరోదఫా లక్షల సంఖ్యలో కేసులు వస్తాయన్న దానికి రుజువులేమీ లేవు. అలాగని అజాగ్రత్తగా ఉండటం సరికాదు. మేం ఇప్పటివరకు మహారాష్ట్ర నుంచి సేకరించిన 3,500 నమూనాలను విశ్లేషించాం. ఏప్రిల్, మే నెలల నమూనాల్లో డెల్టా ప్లస్‌కు చెందినవి ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయి. 
-డాక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జినోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజీఐబీ) డైరెక్టర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement