Life expectancy rate
-
చావు ఏ రోజో చెప్పే ఏఐ!
టెక్నాలజీ దాదాపు అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. కృత్రిమమేధ పరిధి పెరుగుతోంది. కిచెన్‌లో రిఫ్రిజిరేటర్, టీవీ, మొబైల్ ఫోన్, ఫ్యాన్.. వంటి అన్ని విభాగాల్లోకి ఏఐ ప్రవేశించింది. సమీప భవిష్యత్తులో మనిషిని ప్రత్యక్షంగా, పరోక్షంగా శాసించే స్థాయికి ఏఐ వెళ్లనుందనేది కఠోర సత్యం. దీని సాయంతో చాలా కంపెనీలు సమాచారాన్ని సేకరించి సులువుగా పని అయ్యేలా చూస్తున్నాయి. కొన్ని సంస్థలు మరింత విభిన్నంగా ఆలోచించి మనిషి మరణాన్ని అంచనా వేసేందుకు ఉపయోగిస్తున్నాయి. మనిషి జీవనశైలి, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ, ఒత్తిడి.. వంటి వివరాలు అందించి మరణానికి మరెంత సమయం ఉందో తెలుసుకునేందుకు ఏఐ సాయం కోరుతున్నారు. ఈమేరకు మార్కెట్లో కొత్తగా యాప్‌లో వెలుస్తున్నాయి. వీటిపై వినియోగదారుల్లో ఆసక్తి నెలకొనడంతో వీటికి ఆదరణ పెరుగుతోంది.మరణ తేదీ అంచనా..‘డెత్ క్లాక్’ అనే కృత్రిమ మేధ ఆధారిత యాప్ వినియోగదారుల జీవనశైలి, అలవాట్ల ఆధారంగా వారి ఆయుష్షును అంచనా వేయగల సామర్థ్యం కలిగి ఉంది. దీన్ని జులైలో ప్రారంభించినప్పటి నుంచి చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు. బ్రెంట్ ఫ్రాన్సన్ అభివృద్ధి చేసిన ఈ యాప్ దాదాపు 1,200 కంటే ఎక్కువ అధ్యయనాలను విశ్లేషిస్తుంది. 5.3 కోట్ల మంది నుంచి సేకరించిన వివరాలను అధ్యయనం చేస్తుంది. వినియోగదారు తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం, ఒత్తిడి స్థాయిలు, నిద్రపోయే విధానాలు.. వంటి విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని మరణించే అవకాశం ఉన్న తేదీని అంచనా వేస్తుంది.ఇదీ చదవండి: ‘మస్క్ ఒక విలన్.. అందుకే రాజీనామా’సమయం వృథా చేయడం దేనికి..మరణం ఎప్పడైనా, ఎలాగైనా సంభవించవచ్చు. మన పరిధిలోలేని దాని గురించి ఆలోచించి సమయం వృథా చేయడం కంటే.. మరణం తథ్యం అనే వాస్తవాన్ని జీర్ణించుకుని జీవితంలో చేయాల్సిన కార్యాలు, మంచి పనులపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకస్మాత్తుగా ఏదైనా జరిగి మరణిస్తే కుటుంబానికి ఆర్థికంగా భరోసానిచ్చే టర్మ్ పాలసీను తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రిపాలైతే ఆరోగ్యబీమా ఆదుకుంటుందని సూచిస్తున్నారు. -
ఢిల్లీ గాలి యమ డేంజర్
ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ కట్టలు తెంచుకుంటోంది. నెల రోజులకు పైగా కాలుష్య మేఘాలు వాతావరణం నిండా దట్టంగా పరుచుకున్నాయి. దాంతో జనానికి ఊపిరి కూడా ఆడని పరిస్థితి! ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానిలో గాలి పీల్చడమంటే రోజుకు ఏకంగా 25 నుంచి 30 సిగరెట్లు తాగడంతో సమానమని షికాగో యూనివర్సిటీ జరిపిన తాజా అధ్యయనం ఒకటి తేల్చింది! అంతేగాక కాలుష్యం దెబ్బకు ఢిల్లీ ప్రజల ఆయు ప్రమాణం కూడా ఏకంగా 7.8 ఏళ్ల దాకా తగ్గుతోందని వెల్లడించింది. దీర్ఘకాలం పాటు ఢిల్లీ గాలి పీల్చడం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీసే ఆస్కారం కూడా చాలా ఎక్కువని తెలిపింది. ముఖ్యంగా విషతుల్యమైన పీఎం2.5 స్థాయిలు ఢిల్లీలో ఏకంగా 247 గ్రా/ఎం3గా నమోదవుతుండటం గుబులు పుట్టిస్తోంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన 15గ్రా/ఎం3 ప్రమాణాల కంటే ఏకంగా 20 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇక ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ కూడా ఎప్పుడో 400 దాటేసింది. శుక్రవారం కూడా ఇది 411గా నమోదైంది. కాలుష్యం ధాటికి ఢిల్లీవాసులు ఇప్పటికే దగ్గు తదితర శ్వాస సంబంధ సమస్యలతో పాటు కళ్ల మంటలు, జర్వం తదిరాలతో అల్లాడుతున్నారు. వాయు కాలుష్య భూతం బారిన పడకుండా ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు బిగించుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లినప్పుడు విధిగా ఎన్95, ఎన్99 మాస్కులు ధరించాలని చెబుతున్నారు.భారత్‌లో 30 నుంచి 50 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకు వాయు కాలుష్యమే కారణమని అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల వెల్లడించిన నివేదిక పేర్కొంది. అయితే ఆ కాలుష్యం మెడ, తల భాగాల క్యాన్సర్‌కు కూడా దారి తీయవచ్చని షికాగో వర్సిటీ అధ్యయనం పేర్కొంది. పొగ తాగేవారిలో ఈ తరహా క్యాన్సర్లు పరిపాటి అని అధ్యయన బృందం సారథి జాన్ క్రామర్ గుర్తు చేశారు. భారత్‌లో ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితుల్లో అత్యధికులు జీవితంలో ఎన్నడూ పొగ తాగనివారేనని ముంబైలోని టాటా స్మారక ఆస్పత్రి గత జూలైలో ప్రచురించిన ఒక అధ్యయనం వెల్లడించడం గమనార్హం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కీలక రంగాల్లో దేశం కంటే మెరుగ్గా తెలంగాణ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నవంబర్ 25న "హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ 2020-21" పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఆర్బీఐ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం తెలంగాణ అనేక రంగాల్లో మంచి పనితీరు కనబరుస్తోంది. రాష్ట్రం పనితీరు జాతీయ సగటు పనితీరు కంటే కూడా మెరుగ్గా ఉంది. 2020-21 నాటికి తెలంగాణలో తలసరి విద్యుత్ లభ్యత 1,904.5 యూనిట్లు కాగా, జాతీయ సగటు 1,031.4 యూనిట్లుగా ఉంది. 2020-21లో తెలంగాణలో విద్యుత్ లభ్యత 6,699 కోట్ల యూనిట్లు అయితే, ఇంకా తెలంగాణలో కోటి యూనిట్ల కొరత ఉంది. తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల్లో(1 నుంచి 5 తరగతులు) స్థూల నమోదు నిష్పత్తి 111.9 అయితే, జాతీయ నిష్పత్తి 102.7గా ఉంది. తెలంగాణలో ఎగువ ప్రాథమిక పాఠశాలల్లో (6 నుంచి 8 తరగతులు) చదివే వారి నిష్పత్తి 97.4 కాగా, అఖిల భారత నిష్పత్తి 88.9గా నమోదు అయ్యింది. తెలంగాణలో సెకండరీ (8, 9) హయ్యర్ సెకండరీ (11, 12) తరగతుల్లో నమోదు సంఖ్య వరుసగా 88, 57.2, అయితే అదే తరగతులకు అఖిల భారత సగటులు 50.5, 51.4గా ఉంది. 2018 డేటా ప్రకారం తెలంగాణలో జననాల రేటు 1,000కు 16.9గా ఉంది. ఇది అఖిల భారత సగటు 20 కంటే గణనీయంగా తక్కువగా ఉంది. రాష్ట్రంలో 1,000 మందిలో మరణాల రేటు జాతీయ సగటు 6.2కి వ్యతిరేకంగా 6.3గా ఉంది. తెలంగాణలో శిశు మరణాల రేటు ప్రతి 1,000కి 27 కాగా, జాతీయ సగటు 32. 2014-18 మధ్య తెలంగాణలో ఆయుర్దాయం 69.6 సంవత్సరాలు భారత సగటు 69.4. (చదవండి: డైనోసార్ల అంతానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే!) -
మహమ్మారి ఎఫెక్ట్: రెండేళ్లు తగ్గిన భారతీయుల ఆయుర్దాయం
న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతీయుల ఆయుర్దాయం దాదాపు రెండేళ్లు పడిపోయిందని ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ నిర్వహించిన అస్టాటిస్టికల్ స్టడీ వెల్లడించింది. ఐఐపీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూరయకాంత్ యాదవ్ ప్రకారం, పురుషులు, స్త్రీల ఆయుర్దాయం 2019 సంవత్సరంలో 69.5 సంవత్సరాలు, 72 సంవత్సరాల ఉండగా.. 2020లో అది వరుసగా 67.5 సంవత్సరాలు, 69.8కి తగ్గిందని తెలిపారు. మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనివల్ల దేశవ్యాప్తంగా మరణాల నమూనాలపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని విశ్లేషించడానికి ఈ అధ్యయనం నిర్వహించారు. 35-69 ఏళ్లలోపు పురుషులపై కోవిడ్ ప్రభావం అత్యధికంగా ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది. కోవిడ్ కారణంగా ఈ వయస్సు వారు అధికంగా మరణించడంతో వారి ఆయుర్దాయం గణనీయంగా పడిపోయినట్లు స్టడీ తెలిపింది. (చదవండి: యూకేను వణికిస్తున్న కరోనా వైరస్ కొత్తరకం వేరియెంట్) ఐఐపీఎస్ 145 దేశాల గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజ్ స్టడీ అండ్ కోవిడ్-ఇండియా అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ (ఏపీఐ) పోర్టల్ ద్వారా సేకరించిన డేటాపై నిర్వహించిన స్టడీ ఆధారంగా ఈ విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా యాదవ్ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ ప్రభావం గత దశాబ్దంలో ఆయుర్దాయం వయసును పెంచడానికి మేము చేసిన కృషిని, సాధించిన పురోగతిని కోవిడ్ తుడిచిపెట్టేసింది. మహమ్మారి ఫలితంగా ప్రస్తుతం భారతదేశ ఆయుర్దాయం ఇప్పుడు 2010లో ఉన్నట్లే ఉంది. దానిని చేరుకోవడానికి మాకు సంవత్సరాలు పడుతుంది’’ అని తెలిపారు. (చదవండి: డెల్టా వేరియంట్‌పై కోవిషీల్డ్ 90% రక్షణ) అయితే, ఆఫ్రికాతో సహా దేశాల్లో గతంలో వచ్చిన అంటువ్యాధులు ఆయుర్దాయంపై తీవ్ర ప్రభావం చూపాయని, అయితే కొన్ని సంవత్సరాల్లో అది తిరిగి పూర్వ స్థితికి వచ్చిందని ఐఐపీఎస్ డైరెక్టర్ డాక్టర్ కేఎస్ జేమ్స్ తెలిపారు. చదవండి: కరోనా ఎండమిక్ స్టేజ్‌కు చేరుకుంటున్నట్టేనా? -
ఆరోగ్యం కోసం ఆస్తుల అమ్మకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలు అనారోగ్యం తలెత్తినపుడు చికిత్స కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారని నేషనల్ హెల్త్ ప్రొఫైల్ నివేదిక వెల్లడించింది. వారి సంపాదనలో అధిక మొత్తం వైద్యానికే వెచ్చిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఒక్కో వ్యక్తి సంవత్సరానికి సగటున రూ.13,968, పట్టణ ప్రాంత వాసులు రూ.26,092 హాస్పిటల్ ఖర్చులకు వెచ్చిస్తున్నట్టు సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. హాస్పిటల్ ఖర్చుల కోసం నేటికీ లక్షల మంది ఆస్తులు అమ్ముకుంటున్నట్టు నివేదిక వెల్లడించింది. వైద్య ఖర్చుల కోసం గ్రామీణ ప్రాంతంలో 0.8% మంది, పట్టణ ప్రాంతాల్లో 0.4% మంది ఆస్తులు అమ్ముకుంటున్నారు. గ్రామాల్లో 24.9%, పట్టణాల్లో 18.2% మంది హాస్పిటల్ ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నారు. ఇక గ్రామాల్లో 67.8% మంది, పట్టణాల్లో 74.9% మంది తమ పొదుపు చేసుకున్న సొమ్ము (సేవింగ్స్)ను హాస్పిటల్ ఖర్చుల కోసం వెచ్చిస్తుండడం గమనార్హం. దేశంలో డెలివరీ ఖర్చు కూడా పెరిగిపోయిందని నివేదిక వెల్లడించింది. సగటున ఒక డెలివరీకి గ్రామీణ ప్రాంతంలో సగటున రూ. 5,544, పట్టణ ప్రాంతాల్లో రూ. 11,685 ఖర్చు అవుతోంది. ప్రైవేటు ఆసుపత్రులో అయితే, గ్రామీణ ప్రాంతాల్లో సగటున రూ.14,778, పట్టణ ప్రాంతాల్లో సగటున రూ. 20,328 డెలివరీ కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. దేశ జనాభా 130 కోట్లు దాటినా, ప్రభుత్వ దవాఖానాల్లో పడకల సంఖ్య 10 లక్షలు దాటడం లేదు. దేశవ్యాప్తంగా 25,778 ప్రభుత్వ హాస్పిటల్స్ ఉండగా, వీటిల్లో 7,13,986 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో 863 దవాఖానాలు ఉండగా, 20,983 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 802 దవాఖానాలు 7,668 బెడ్లు, అర్బన్ ఏరియాలో 61 హాస్పిటళ్లు 13,315 బెడ్లు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. దేశానికి హైపర్ టెన్షన్... 2018లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జరిపించిన ఒక సర్వేలో 6,51,94,599 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 31,02,186 మందికి డయాబెటీస్, 40, 38,166 మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు తేలింది. తెలంగాణలో 2018లో 28,50,666 మందిని స్క్రీన్ చేయగా ఇందులో 1,22,456 మందికి డయాబెటీస్, 1,43,118 మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు తేలింది. దేశవ్యాప్తంగా 1,68,122 మందికి కేన్సర్ సోకినట్టు సర్వేలో తేలగా, ఇందులో తెలంగాణ నుంచి 13,130 మంది ఉన్నారు. పెరిగిన ఆయుర్దాయం... నేషనల్ హెల్త్ ప్రొఫైల్ నివేదికలో వీటితోపాటు పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వీటిలో ప్రధానంగా భారతీయుల్లో ఆయుర్దాయం పెరగడం గమనార్హం. ►1.1970–75లో సగటు ఆయుర్దాయం 49.5 ఏళ్లు ఉండగా, 2012–16కు 68.7 ఏళ్లకు పెరి గింది. వీరిలో మహిళల సగటు 70.2 ఏళ్లుగా ఉండగా పురుషులు 67.4 ఏళ్లుగా ఉంది. ►2.ఢిల్లీలోని నేషనల్ కేపిటల్ టెరిటరీ (ఎన్సీటీ) ప్రాంతంలో చదరపు కిలోమీటరుకు 11,320 మంది, అరుణాచల్‌ప్రదేశ్‌లో అతితక్కువగా 17 మందే నివసిస్తున్నారు. ►3.యువకులు, ఆర్థికంగా చైతన్యవంతుల సంఖ్య పెరిగిందని నివేదిక చెబుతోంది. 2016 వరకు మొత్తం జనాభాలో 27శాతం 14 ఏళ్లలోపువారు ఉండగా, 15–59 వయసు వారు 64.7 శాతం ఉన్నారు. వీరిలో అధికశాతం ఆర్థికంగా చైతన్యవంతులు. 60–85 ఏళ్లలోపు వారిలోనూ 8.5% మంది ఆర్థికంగా చైతన్యంగా ఉన్నారు. ►4.డెంగీ, చికెన్‌గున్యా తదితర దోమకాటుతో వచ్చే అనారోగ్యాలు భయపెడుతున్నాయి. ►5.1950లో భారత్‌లో వెలుగుచూసిన డెంగీ మరణాలు 2 దశాబ్దాలుగా పెరిగాయి. ►6.ఇక స్వైన్‌ఫ్లూ కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. 2012, 13తో పోలిస్తే 2014లో తగ్గుదల రికార్డయింది. తిరిగి 2015లో స్వైన్‌ఫ్లూ కేసులు పెరిగాయి. 2016లో తగ్గినప్పటికీ 2017, 18లో ఊపందుకున్నాయి. ►7.2018లో 67,769 కేసులు, 2017లో 57,813 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. ►8.2015లో ప్రమాదాల్లో మరణించినవారు 4.13 లక్షలు మంది. 1.33 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యంగా యువకుల్లో ఆత్మహత్య రేటు పెరగడం ఆందోళనకరం. వీరిలో 30–45 ఏళ్ల వయసు ఉన్నవారు 44,593 మంది ఉన్నారు. ►9.2018లో 1.64 లక్షల పాము కాటు కేసులు నమోదయ్యాయి. 885 మంది మరణించారు. ►10.2018లో 2.68కోట్ల మంది దివ్యాంగులుగా మారారు. -
మెరుగైన భారతీయుల ఆయుప్రమాణం
సాక్షి,న్యూఢిల్లీ: భారతీయుల జీవనశైలి ఆందోళనకరంగా మారినా గత మూడు దశాబ్దాలుగా మెరుగైన వైద్య విధానాలతో సగటు ఆయుప్రమాణం వృద్ధి చెందింది. 1990తో పోలిస్తే దేశ పౌరుల సగటు ఆయుప్రమాణం గణనీయంగా పెరిగిందని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెట్ అథ్యయనం వెల్లడించింది. దేశంలోనే కేరళ అత్యంత ఆరోగ్యకర రాష్ర్టంగా ఈ అథ్యయనం తేల్చింది. 1990లో మహిళల జీవితకాలం 59.7 ఏళ్ల నుంచి 2016లో ఏకంగా 70.3 సంవత్సరాలకు పెరగ్గా, పురుషుల్లో 1990లో 58 ఏళ్ల నుంచి ప్రస్తుతం 66.9 ఏళ్లకు సగటు ఆయుప్రమాణం పెరిగిందని అథ్యయనం పేర్కొంది. ఇక కేరళలో పురుషుల సగటు జీవనకాలం 73.8 శాతంగా ఉండగా అస్సాంలో కేవలం 63.6 సంవత్సరాలుగా అంచనా వేసింది. ఇక ఉత్తరప్రదేశ్‌లో స్ర్తీల ఆయుప్రమాణం జాతీయ సగటు కన్నా తక్కువగా కేరళ మగువల కన్నా 12 ఏళ్లు తక్కువగా 66.8 ఏళ్లుగా నమోదైంది. మూడు దశాబ్ధాలుగా భారత్‌లో సగటు ఆయుప్రమాణం గణనీయంగా మెరుగైనా చైనా, శ్రీలంకతో పోలిస్తే 11 ఏళ్లు తక్కువగా ఉండటం గమనార్హం. -
ఆ జాబితాలో అట్టడుగున తెలుగు రాష్ట్రాలు
సాక్షి, న్యూఢిల్లీ : భారీ ప్రచారార్భాటాలతో హోరెత్తిస్తున్నా పలు ప్రామాణికాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు అట్టడుగునే నిలుస్తున్నాయి. ప్రతి వేయి మంది పురుషులకు స్త్రీల నిష్పత్తిలో ఏటికేడు ఉమ్మడి ఏపీ స్థానం దిగజారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలకు సంబంధించిన సగటు ఆయు ప్రమాణాలు, ఇతరత్రా అంశాలను గురువారం నీతి ఆయోగ్ ప్రకటించింది. ఆ వివరాల ప్రకారం.. 2008-10లో ప్రతి వేయి మంది పురుషులకు 920 మంది స్త్రీలు ఉండగా, 2013-15 నాటికి ఆడపిల్లల సంఖ్య 918కి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వేయి మంది పురుషులకు స్త్రీల నిష్పత్తి 933తో కొంత మెరుగ్గా ఉండగా, ఆశ్చర్యకరంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి వేయి మంది పురుషులకు కేవలం 885 మంది స్త్రీలే ఉన్నారు. ఇది జాతీయ సగటు (890) కన్నా తక్కువ కావడం గమనార్హం. 2011-13 నుంచి 2015 వరకూ పట్టణ ప్రాంతాల్లో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గింది.మరోవైపు సగటు జీవితకాలంలో కూడా తెలుగు రాష్ట్రాల పరిస్థితి మెరుగ్గా లేదు. 2010-14లో తెలుగు ప్రజల సగటు ఆయుఃప్రమాణం 66.4 ఏళ్లుగా నమోదైంది. ఇది జాతీయ సగటు 67.9 ఏళ్ల కన్నా తక్కువగా ఉంది. సగటు ఆయుఃప్రమాణంలో కేరళ, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు (73) ముందువరుసలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు తక్షణమే స్త్రీ, పురుష నిష్పత్తి మెరుగయ్యేలా చర్యలు చేపట్టడంతో పాటు, మెరుగైన ఆరోగ్య వసతులు, ప్రజారోగ్యాన్ని విస్తృతం చేయాల్సిన ఆవశ్యకతను ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
మలిసందెలో మళ్లీ టీకాలు..
పాపాయి పుట్టిన అనేక వ్యాధుల నుంచి రక్షణ కోసం నిర్ణీత వ్యవధిలో అనేక వ్యాక్సిన్లు ఇస్తుంటారు. జీవితంలోని బాధ్యతలు ముగిసి... వార్థక్యంలోకి ప్రవేశించాక దాన్ని కూడా మరో బాల్యం అంటారు అనుభవజ్ఞులు. ఎందుకంటే... పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఎలా తగ్గుతుందో... పెద్దవాళ్ల వయసు మరింత పైబడుతున్న కొద్దీ వాళ్లలోనూ రోగ నిరోధక శక్తి తగ్గుతుంటుంది. అందుకే పుట్టిన పాపాయి లాగే వృద్ధాప్యంలో అడుగిడుతున్న వారికీ టీకాల అవసరం ఉంటుంది. కానీ... ఉన్న ఆరోగ్యం ఎలాగూ బాగుంది... దీని కోసం మళ్లీ ఈ వయసులో టీకాలెందుకు అన్నది చాలామంది వృద్ధుల ఆలోచనాసరళి. ఆర్థికకోణం నుంచి చూసినా వృద్ధాప్యంలో సమయానికి తీసుకోవాల్సిన టీకాలు వేయించుకోవడం లాభదాయకం. ఆ విషయంపై అవగాహన కల్పించడం కోసమే ఈ కథనం. ఇప్పుడు మనదేశవాసుల సగటు ఆయుఃప్రమాణం (లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ రేట్) 68.89 ఏళ్లు. అంటే దాదాపు 70 ఏళ్లు అనుకోవచ్చు. గత పదేళ్ల వ్యవధిలో ప్రజల ఆయుఃప్రమాణం ఐదు సంవత్సరాలు పెరిగింది. ఇలా ప్రజల ఆయుప్రమాణం పెరగడం అన్నది ఒక మంచి సూచికగా భావించినా... వృద్ధాప్యంలో వచ్చే న్యుమోనియా జబ్బుతో ఏటా మన దేశంలో రెండున్నర లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. న్యుమోనియా వ్యాధికి బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లలో ఏవైనా కారణం కావచ్చు. సాధారణంగా యువకుల్లో, మధ్యవయస్కుల్లో అంత ప్రమాదకరం కాకుండా ఉండే న్యుమోనియా వృద్ధుల్లో చాలా ప్రమాదకరంగా పరిణమించడమే కాదు... ఒక్కోసారి ప్రాణాలనూ హరించవచ్చు. టీకాలు ఎలా లాభదాయకం...? ముందుగా చెప్పుకున్నట్లు న్యుమోనియా సమస్యను సాధారణ యాంటీబయాటిక్స్‌తో అధిగమించవచ్చు. కానీ వృద్ధుల్లో న్యుమోనియా వస్తే అది ప్రాణాపాయం కావచ్చు. లేదా ఒకవేళ వెంటిలేటర్‌పై పెట్టి బతికి బయటపడ్డా ఆసుపత్రి ఖర్చులు తడిసి మోపెడు కావడం ఖాయం. కానీ న్యుమోనియాను నివారించే న్యూమోకోకల్ వ్యాక్సిన్‌ను తీసుకుంటే అది ప్రాణాలనూ రక్షిస్తుంది. ఒకవేళ ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తే వేలలో అయ్యే వ్యయాన్ని ఒకటి రెండు వందలకే పరిమితం చేస్తుంది. కాబట్టి ఏ రకంగా చూసినా వృద్ధాప్యంలో టీకాలు లాభదాయకమే. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల కలిగే ఫ్లూ వ్యాధి. మనకు సాధారణంగా జలుబు చేసినప్పుడు కనిపించే లక్షణాలే ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకినప్పుడూ కనిపిస్తాయి. అయితే ఇన్ఫ్లుయెంజా నేరుగా హాని చేయకపోవచ్చు. జలుబు తగ్గినట్లే అదీ తగ్గిపోతుంది. కానీ ఒక్కోసారి ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగా వచ్చే రెండో దశ దుష్పరిణామాలైన శ్వాసకోశ సమస్యల వంటివి రోగిని బాధిస్తాయి. పైగా ఇన్ఫ్లుయెంజా వైరస్ ఎప్పటికప్పుడు తన జన్యుస్వరూపాన్ని మార్చుకుంటుంటుంది. అందుకే జలుబు వైరస్‌కు ఒకే వ్యాక్సిన్ రూపొందించడం కష్టసాధ్యం. అందుకే అరవై ఏళ్లు పైబడిన వారు ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను ప్రతి ఏడాదీ తీసుకోవాలి. పైగా దీని ధర కూడా చాలా తక్కువ. (రూ. 60 నుంచి రూ.100 లోపే ఉంటుంది). దురదృష్టవశాత్తూ ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగా రెండోదశ సమస్యలు ఏర్పడి ఒకసారి హాస్పిటల్లో చేరితే అయ్యే ఖర్చుతో పోలిస్తే పైన పేర్కొన్న ఖర్చు చాలా చాలా తక్కువ. హెపటైటిస్ వ్యాక్సిన్లు హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ : హెపటైటిస్-ఏ అనే వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంది. హెపటైటిస్-బి తో పోలిస్తే ఇది అంత ప్రమాదకరం కానప్పటికీ సాధారణంగా యువకులు, మధ్యవయస్కుల్లో ఎలాంటి చికిత్సా తీసుకోకపోయినా తగ్గిపోతుంది. కానీ వృద్ధుల్లో వ్యాధి నిరోధకత తక్కువగా ఉండే కారణాన దీనికి వ్యాక్సిన్ తీసుకోవడం మేలు. హెపటైటిస్-బి వ్యాక్సిన్ : హెపటైటిస్-బి వైరస్ వల్ల కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. హెచ్ఐవీ వ్యాపించే మార్గాల ద్వారానే ఇదీ వ్యాపిస్తుంది. కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసి ప్రాణాంతకంగా మారే అవకాశమూ ఉంది. అయితే అదృష్టవశాత్తూ దీనికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. వృద్ధుల్లో వ్యాధి నిరోధకశక్తి తక్కువ కాబట్టి అరవై ఏళ్లు దాటిన వారు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మేలు. వ్యారిసెల్లా వ్యాక్సిన్ వ్యారిసెల్లా జోస్టర్ వైరస్ (వీజడ్వీ) అనే ఈ వైరస్ మనం సాధారణ పరిభాషలో ‘చికెన్‌పాక్స్’ అంటూ మనం పిలుచుకునే వ్యాధిని కలిగిస్తుంది. వ్యారెసెల్లా వ్యాక్సిన్ వృద్ధుల్లో ఈ చికెన్ పాక్స్నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే అప్పటికే ఏవైనా వ్యాధులతో ఉన్నవారికీ, గతంలో ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు తీవ్రమైన అలర్జీ వచ్చిన వారికీ, హెచ్ఐవీ వంటి వ్యాధి నిరోధక శక్తిని ప్రభావితం చేసే వ్యాధులు ఉన్నవారికీ, స్టెరాయిడ్స్ మీద ఉన్నవారికి ఈ వ్యాక్సిన్‌ను డాక్టర్లు సిఫార్సు చేయరు. అలాగే క్యాన్సర్ చికిత్స (కీమోథెరపీ) తీసుకుంటున్నవారు, గత ఐదు నెలల వ్యవధిలో రక్తమార్పిడి / రక్తంలోని ఏదైనా అంశాన్ని స్వీకరించడం వంటి చికిత్స తీసుకున్న వారు సైతం ఈ వ్యాక్సిన్‌ను తీసుకోకూడదు. న్యుమోనియా వ్యాక్సిన్స్... న్యుమోనియా వ్యాధి ప్రధానంగా న్యుమోకాకల్ బ్యాక్టీరియాతో వస్తుంది. ఇదొక్కటే గాక మరో 23 రకాల ఇన్ఫెక్షన్లు సైతం న్యుమోనియాకు దారితీస్తాయి. సాధారణంగా ఈ వ్యాధితో ఆసుపత్రిలో చేరే రోగుల్లో 11 శాతం నుంచి 20 శాతం మందికి న్యూమోనియా ప్రాణాపాయం కలిగిస్తుంది. అందుకే అలాంటి ప్రమాదం రాకుండా 65 ఏళ్లు దాటిన వారు న్యుమోనియా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇందులో రెండు రకాలు ఉంటాయి. మొదటిది న్యుమోవ్యాక్ 23, రెండోది ప్రివెనార్ 13. న్యుమోవ్యాక్ 23: న్యుమోనియా అనే ఊపిరితిత్తులు ప్రభావితమయ్యే కండిషన్‌కు స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా ప్రధాన కారణం. దీంతోపాటు మరో 22 ఇతర అంశాలూ న్యుమోనియాకు కారణమవుతాయి. మొత్తం కలిపి ఈ వ్యాక్సిన్ 23 రకాల న్యుమోనియాల నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే దీన్ని న్యూమోవ్యాక్ 23 అంటారు. అంతేకాదు... ఇది మెదడువాపు (మెనింజైటిస్) నుంచి, రక్తంలో ఉండే ఇతర బ్యాక్టీరియాల దుష్ర్పభావం నుంచి, కాలేయ సమస్యలు, ఆల్కహాల్ తాగే అలవాటు వల్ల వచ్చే దుష్ర్పభావాలు, డయాబెటిస్ సమస్యలు, స్ప్లీన్ సమస్యలు, సికిల్ సెల్ అనీమియా వంటి ఇతర రిస్క్‌లు ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన వ్యాక్సిన్. దీన్ని భుజంపైన గానీ లేదా తొడపైనగాని ఉండే చర్మం కింద ఉండే కండరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఒకసారి ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారైనప్పటికీ ఒకవేళ రిస్క్ ఎక్కువగా ఉంటే మరో డోస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇక స్ప్లీన్ సర్జరీ లేదా క్యాన్సర్‌కు కీమోథెరపీ లేదా రోగనిరోధక శక్తిని ఒకింత తగ్గించే ఇతర మందులు వాడాల్సిన సమయంలో ఆ ప్రక్రియ జరగడానికి కనీసం రెండు వారాల ముందే ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అరవై ఐదేళ్లు దాటిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం మంచిదని అడ్వయిజరీ కమిటీ ఆన్ ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ (ఏసిఐపీ) సిఫార్సు చేస్తోంది. ఇదిఒకసారి తీసుకున్న తర్వాత దీని వల్ల కలిగే వ్యాధి నిరోధక శక్తి ఐదేళ్ల పాటు ఉంటుందని ఏసిఐపీ పేర్కొంటోంది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే లుకేమియా, లింఫోమా వంటి క్యాన్సర్లు ఉన్నవారిలో, కార్టికో స్టెరాయిడ్స్ తీసుకునేవారిలో దీన్ని ఐదేళ్ల తర్వాత మరోసారి తీసుకోవాలని ఏసీఐపీ సిఫార్సు చేస్తోంది. ప్రివెనార్ 13: ఇది పదమూడు రకాల స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియాల నుంచి సేకరించిన యాంటీబాడీలతో రూపొందించిన వ్యాక్సిన్. ఇది వ్యాధి నిరోధక సామర్థ్యాన్ని మరింత శక్తిమంతం చేస్తుంది. దీన్ని సాధారణంగా 50 ఏళ్ల పైబడినప్పటి నుంచి ఇవ్వవచ్చు. ఇది స్ట్రెపోకాకల్ బ్యాక్టీరియా కారణంగా న్యూమోనియాతో పాటు మెదడువాపు (మెనింజైటిస్), రక్తం విషపూరితం కావడం (బ్లడ్పాయిజనింగ్), మధ్య చెవికి వచ్చే ఇన్ఫెక్షన్లు (మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ / ఓటైటిస్ మీడియా) వంటి అనేక సమస్యల నుంచి రక్షిస్తుంది. కానీ న్యూమోకాకల్ బ్యాక్టీరియా కారణంగా వచ్చే మెనింజైటిస్, రక్తం విషపూరితం కావడం (సెప్టిసీమియా), మధ్య చెవికి వచ్చే ఇన్ఫెక్షన్లు (మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ / ఓటైటిస్ మీడియా) వంటి వాటినుంచి రక్షించలేదు. అందుకే వృద్ధులకు ఈ రెండు రకాల వ్యాక్సిన్లనూ ఇవ్వాలి. అయితే ఈ వ్యాక్సిన్లు తీసుకునే క్రమంలో రెండింటి మధ్య కనీసం ఒక ఏడాదైనా కాలవ్యవధి ఉండాలి. పైన పేర్కొన్న వ్యాక్సిన్లను వృద్ధాప్యంలో ఎలాంటి జబ్బూ లేకపోయినా తీసుకోవాలి. ఒకవేళ ఆ వృద్ధాప్య దశలో ఉన్నవారికి డయాబెటిస్, ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) వంటి జబ్బులతో పాటు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఏడాది గ్యాప్‌తో ఈ రెండు వ్యాక్సిన్లను తీసుకోవడం తప్పనిసరి. హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్ ఇది షింగిల్స్ అనే వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుంది. అరవై ఏళ్లు పైబడిన వారు తీసుకోవాల్సిన వ్యాక్సిన్ ఇది. ఎందుకంటే ఇది పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. నిజానికి షింగిల్స్, చికెన్‌పాక్స్... ఈ రెండూ ఒకే వైరస్ ద్వారా వస్తాయి. చికెన్‌పాక్స్ వైరస్ పూర్తిగా నిరోధితం కాకుండా నరాల చివరల్లో నిద్రాణంగా ఉండిపోయి ఆ తర్వాత ఎప్పుడో క్రియాశీలం అయి, తీవ్రమైన బాధ కలిగిస్తుంది. ఆ దశనే షింగిల్స్ అంటారు. అందుకే దీని మోతాదు సాధారణ చికెన్‌పాక్స్ డోస్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాక్సిన్ వల్ల కలిగే రోగనిరోధక శక్తి సాధారణంగా ఐదేళ్లకు పైబడి ఉంటుంది. ఒకవేళ గతంలో వారికి చికెన్‌పాక్స్ వచ్చినా రాకున్నా, చికెన్‌పాక్స్‌కు వ్యాక్సిన తీసుకుని ఉన్నవారు సైతం హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదే. అయితే లుకేమియా, లింఫోమా వంటి వ్యాధులతో కీమోథెరపీ, రేడియో థెరపీ వంటివి తీసుకునేవారు, కార్టికోస్టెరాయిడ్స్ ఉపయోగించేవారు దీన్ని తీసుకోవడం మంచిది కాదు. ఎసైక్లోవిర్, వాలాసైక్లోవిర్ వంటి యాంటీవైరల్ మందులు తీసుకునే వారు ఈ వ్యాక్సిన్ తీసుకునే ముందర కనీసం 24 గంటల పాటు ఈ మందులను వాడకపోవడం మంచిది. ఈ వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా 14 రోజుల పాటు ఆ మందులను వాడకపోవడమే మంచిది. సైడ్ఎఫెక్ట్స్: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సాధారణంగా ఆ ప్రాంతంలో నొప్పి, వాపు, దురద రావచ్చు. కొందరిలో చాలా అరుదుగా ఒళ్లంతా దద్దుర్ల వంటివి (జోస్టెరిఫార్మ్ ర్యాష్) కనిపించవచ్చు. ఇవి మినహా ఈ వ్యాక్సిన్ తీసుకునే ముందు ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలూ తీసుకోవాల్సిన అవసరం లేదు. డిఫ్తీరియా, టెటనస్ వ్యాక్సిన్ ప్రతి చిన్నారికీ చిన్నప్పుడు డీటీపీ వ్యాక్సిన్ ఇస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆ చిన్నారి 40 ఏళ్ల వయస్కుడయ్యే సమయానికి టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం సగానికి తగ్గుతుంది. అదే 60 ఏళ్ల వయసుకు రాగానే టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం కేవలం 10 శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ టెటనస్ డోస్‌ను 60 దాటిన వారికి బూస్టర్‌డోస్ ఇవ్వాలి. దాంతో అది వ్యాక్సిన్ తీసుకున్నవారికి టెటనస్ (ధనుర్వాతం) నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే డిఫ్తీరియా వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. చిన్నప్పుడు ఇచ్చే డీపీటీలలో పెర్టుసిస్ (కోరింత దగ్గు) అనే సమస్య పెద్ద వయసులో రాదు కాబట్టి ఈ పెర్టుసిస్ వ్యాక్సిన్ పెద్దలకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మరికొన్ని వ్యాక్సిన్లు పైన పేర్కొన్న వాటితో పాటు జపనిస్ ఎన్కెఫలైటిస్, మెనింగోకోకస్, రేబీస్, టైఫాయిడ్, పోలియో, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధుల నివారణకు ముందస్తు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎల్లో ఫీవర్ అనే వ్యాధి మన దేశంలో లేదు. అది ఉన్నచోటికి ప్రయాణం చేసేవారు ముందుగా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మేలు. రాబోయే వ్యాక్సిన్లు ప్రస్తుతానికి అందుబాటులో లేకపోయినా... చాలా తక్కువ వ్యవధిలో (సుమారు ఏడాది కాలంలోనే) మరికొన్ని వ్యాక్సిన్లూ మనకు అందుబాటులోకి రానున్నాయి. అవి... డెంగ్యూ, చికెన్‌గున్యా, ఎబోలా వైరస్‌లకు వ్యాక్సిన్లు. ఉపసంహారం వృద్ధాప్యంలో వ్యాక్సిన్ల అవసరాన్ని గుర్తించి, సమయానుకూలంగా వాటిని తీసుకునే అభివృద్ధి చెందిన దేశాల్లో ఆసుపత్రుల్లో చేరే వృద్ధుల శాతం 200 శాతం నుంచి 300 శాతం తగ్గింది. ఇదే అవగాహన మనలోనూ పెరిగితే... వృద్ధాప్యం ప్రమాదరహితంగా, ఆసుపత్రులకు దూరంగా, హాయిగా సాగే అవకాశం ఉంది. ఇక మనదేశంలోనూ ఈ అంశంపై అవగాహన ఉన్న డాక్టర్లు, ఆరోగ్యరంగంలో పనిచేసే ఇతర నిపుణులూ వీటిని ఇప్పటికే తీసుకుంటున్నారు.