ఆరోగ్యం కోసం ఆస్తుల అమ్మకం | National Health Profile Report Said That Life Expectancy Has Increased | Sakshi
Sakshi News home page

ఆరోగ్యం కోసం ఆస్తుల అమ్మకం

Published Fri, Nov 1 2019 4:24 AM | Last Updated on Fri, Nov 1 2019 4:24 AM

National Health Profile Report Said That Life Expectancy Has Increased - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలు అనారోగ్యం తలెత్తినపుడు చికిత్స కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారని నేషనల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ నివేదిక వెల్లడించింది. వారి సంపాదనలో అధిక మొత్తం వైద్యానికే వెచ్చిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఒక్కో వ్యక్తి సంవత్సరానికి సగటున రూ.13,968, పట్టణ ప్రాంత వాసులు రూ.26,092 హాస్పిటల్‌ ఖర్చులకు వెచ్చిస్తున్నట్టు సెంట్రల్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. హాస్పిటల్‌ ఖర్చుల కోసం నేటికీ లక్షల మంది ఆస్తులు అమ్ముకుంటున్నట్టు నివేదిక వెల్లడించింది.

వైద్య ఖర్చుల కోసం గ్రామీణ ప్రాంతంలో 0.8% మంది, పట్టణ ప్రాంతాల్లో 0.4% మంది ఆస్తులు అమ్ముకుంటున్నారు. గ్రామాల్లో 24.9%, పట్టణాల్లో 18.2% మంది హాస్పిటల్‌ ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నారు. ఇక గ్రామాల్లో 67.8% మంది, పట్టణాల్లో 74.9% మంది తమ పొదుపు చేసుకున్న సొమ్ము (సేవింగ్స్‌)ను హాస్పిటల్‌ ఖర్చుల కోసం వెచ్చిస్తుండడం గమనార్హం. దేశంలో డెలివరీ ఖర్చు కూడా పెరిగిపోయిందని నివేదిక వెల్లడించింది.

సగటున ఒక డెలివరీకి గ్రామీణ ప్రాంతంలో సగటున రూ. 5,544, పట్టణ ప్రాంతాల్లో రూ. 11,685 ఖర్చు అవుతోంది. ప్రైవేటు ఆసుపత్రులో అయితే, గ్రామీణ ప్రాంతాల్లో సగటున రూ.14,778, పట్టణ ప్రాంతాల్లో సగటున రూ. 20,328 డెలివరీ కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. దేశ జనాభా 130 కోట్లు దాటినా, ప్రభుత్వ దవాఖానాల్లో పడకల సంఖ్య 10 లక్షలు దాటడం లేదు. దేశవ్యాప్తంగా 25,778 ప్రభుత్వ హాస్పిటల్స్‌ ఉండగా, వీటిల్లో 7,13,986 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో 863 దవాఖానాలు ఉండగా, 20,983 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 802 దవాఖానాలు 7,668 బెడ్లు, అర్బన్‌ ఏరియాలో 61 హాస్పిటళ్లు 13,315 బెడ్లు ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

దేశానికి హైపర్‌ టెన్షన్‌... 
2018లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జరిపించిన ఒక సర్వేలో 6,51,94,599 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 31,02,186 మందికి డయాబెటీస్, 40, 38,166 మందికి హైపర్‌ టెన్షన్‌ ఉన్నట్టు తేలింది. తెలంగాణలో 2018లో 28,50,666 మందిని స్క్రీన్‌ చేయగా ఇందులో 1,22,456 మందికి డయాబెటీస్, 1,43,118 మందికి హైపర్‌ టెన్షన్‌ ఉన్నట్టు తేలింది. దేశవ్యాప్తంగా 1,68,122 మందికి కేన్సర్‌ సోకినట్టు సర్వేలో తేలగా, ఇందులో తెలంగాణ నుంచి 13,130 మంది ఉన్నారు.

పెరిగిన ఆయుర్దాయం... 
నేషనల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ నివేదికలో వీటితోపాటు పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వీటిలో ప్రధానంగా భారతీయుల్లో ఆయుర్దాయం పెరగడం గమనార్హం. 
►1.1970–75లో సగటు ఆయుర్దాయం 49.5 ఏళ్లు ఉండగా, 2012–16కు 68.7 ఏళ్లకు పెరి గింది. వీరిలో మహిళల సగటు 70.2 ఏళ్లుగా ఉండగా పురుషులు 67.4 ఏళ్లుగా ఉంది. 
►2.ఢిల్లీలోని నేషనల్‌ కేపిటల్‌ టెరిటరీ (ఎన్‌సీటీ) ప్రాంతంలో చదరపు కిలోమీటరుకు 11,320 మంది, అరుణాచల్‌ప్రదేశ్‌లో అతితక్కువగా 17 మందే నివసిస్తున్నారు. 
►3.యువకులు, ఆర్థికంగా చైతన్యవంతుల సంఖ్య  పెరిగిందని నివేదిక చెబుతోంది. 2016 వరకు మొత్తం జనాభాలో 27శాతం 14 ఏళ్లలోపువారు ఉండగా, 15–59 వయసు వారు 64.7 శాతం ఉన్నారు. వీరిలో అధికశాతం ఆర్థికంగా చైతన్యవంతులు. 60–85 ఏళ్లలోపు వారిలోనూ 8.5% మంది ఆర్థికంగా చైతన్యంగా ఉన్నారు. 
►4.డెంగీ, చికెన్‌గున్యా తదితర దోమకాటుతో వచ్చే అనారోగ్యాలు భయపెడుతున్నాయి.  
►5.1950లో భారత్‌లో వెలుగుచూసిన డెంగీ మరణాలు 2 దశాబ్దాలుగా పెరిగాయి. 
►6.ఇక స్వైన్‌ఫ్లూ కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. 2012, 13తో పోలిస్తే 2014లో తగ్గుదల రికార్డయింది. తిరిగి 2015లో స్వైన్‌ఫ్లూ కేసులు పెరిగాయి. 2016లో తగ్గినప్పటికీ 2017, 18లో ఊపందుకున్నాయి. 
►7.2018లో 67,769 కేసులు, 2017లో 57,813 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. 
►8.2015లో ప్రమాదాల్లో మరణించినవారు 4.13 లక్షలు మంది. 1.33 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యంగా యువకుల్లో ఆత్మహత్య రేటు పెరగడం ఆందోళనకరం. వీరిలో 30–45 ఏళ్ల వయసు ఉన్నవారు 44,593 మంది ఉన్నారు. 
►9.2018లో 1.64 లక్షల పాము కాటు కేసులు నమోదయ్యాయి. 885 మంది మరణించారు. 
►10.2018లో 2.68కోట్ల మంది దివ్యాంగులుగా మారారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement