సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్ల ప్రభుత్వ విలు వల మదింపు ప్రక్రియ క్రమంగా కొలిక్కి వస్తోం ది. గత ఏడాది జూలైలో సవరించిన విలువలను మరోమారు సవరించాలని ప్రభుత్వం నిర్ణయిం చిన నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు గత వారం రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గతంలో వ్యవసాయ భూమి ఎకరానికి కనిష్టంగా రూ.75 వేలు ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.1.20 లక్షలుగా నిర్ధారించనున్నారు. అంటే సవరించిన విలువలు అమల్లోకి వస్తే వ్యవసాయ భూమి ఎక్కడ ఉన్నా ఎకరం కనిష్టంగా రూ.1.20 లక్షలు ఉంటుందన్న మాట.
ఈ మేరకే లెక్కకట్టి రిజి స్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తారు. గ్రామాల్లోని సబ్ డివిజన్ సర్వే నంబర్లు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, హెచ్‌ఎండీఏ, వైటీడీఏ, కుడా, వీటీ డీఏ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ప్రాతిపదికన వ్యవసాయ భూముల విలువలను పెంచ నున్నారు. మొదట్లో వ్యవసాయ భూముల విలు వలను 50% వరకు పెంచాలని నిర్ణయించగా, తాజా మదింపు అనంతరం ఆయా భూములకు బహిరంగ మార్కెట్‌లో ఉన్న విలువలను బట్టి 100 శాతం పెంచేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధ్ధమవుతున్నాయి.
వాస్తవానికి జిల్లాల నుంచి వ్యవసాయ భూముల విలువలను 100, 200 శాతంతో పాటు కొన్నిచోట్ల మూడు రెట్లు సైతం పెంచుతూ ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ఆ మేరకు విలువలు పెంచితే ప్రజలపై అధిక భారం పడుతుందనే ఉద్దేశంతో గరిష్టంగా 100 శాతం మేరకే విలువలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, ఖాళీ స్థలాలకు సంబంధించి చదరపు గజానికి గతంలో కనిష్ట విలువ రూ.200 ఉండగా దాన్ని రూ.500గా నిర్ధారించనున్నారు. అదే విధంగా ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్లకు సంబం ధించి చదరపు అడుగుకు గతంలో రూ. 1000 ఉండగా, ఇప్పుడు ఆ కనిష్ట విలువను రూ.1100 లేదా రూ.1200 చేయనున్నారు.
అగ్రీ ‘భూమ్’
రాష్ట్రంలోని మెజార్టీ గ్రామాల్లో ఎకరం వ్యవ సాయ భూమి బహిరంగ మార్కెట్‌లో కనీసం రూ.10–12 లక్షలు పలుకుతున్న నేపథ్యంలో.. ఈ బూమ్ ఆధారంగానే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. ఏ ప్రాంతంలో ఉన్న భూమి బహిరంగ మార్కెట్‌లో ఎంత విలువ పలుకుతుందన్న దాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వ విలువలను కూడా ఖరారు చేయనున్నారు. దీంతో ఈసారి వ్యవసాయ భూముల విలువల సవరణ కనీసం 50 శాతం నుంచి 100 శాతం వరకు పెరగవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెపుతున్నారు. ముఖ్యంగా టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీలు, కొత్తగా ఏర్పడిన జిల్లాలు, ఉమ్మడి జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ శివార్లలోని భూముల విలువలు 90–100 శాతం పెరుగుతాయని తెలుస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో కనీసం 50 శాతం మేర విలువలు సవరించనున్నారు.
నేడో, రేపో సబ్‌రిజిస్ట్రార్లకు తుది ప్రతిపాదనలు!
ఉన్నత స్థాయిలో జరుగుతున్న భూముల విలువల మదింపు ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో ముగుస్తుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెపుతున్నారు. జిల్లా రిజిస్ట్రార్ల స్థాయిలో ముగిసిన పరిశీలన ప్రక్రియపై ఉన్నతాధికారులు మదింపు చేస్తుండగా, ఇందుకు సంబంధించిన తుది ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తీసుకుని నేడో, రేపో సబ్ రిజిస్ట్రార్లకు పంపుతారని, వాటిపై క్షేత్రస్థాయి కమిటీల ఆమోదం తీసుకుని, అవసరమైతే అక్కడక్కడా విలువలు సవరించి పూర్తిస్థాయి ప్రతిపాదనలు తయారు చేస్తామని అంటున్నారు. మొత్తం మీద ఫిబ్రవరి 1 నుంచే సవరించిన ప్రభుత్వ విలువలు అమల్లోకి వచ్చేలా ముందుకెళుతున్నామని, సీఎం ఆమోదం విషయంలో జాప్యం జరిగితే తప్ప అప్పటినుంచే విలువలు పెరుగుతాయని చెబుతున్నారు. సీఎం సలహాలు, సూచనల మేరకు ఈ ప్రక్రియలో స్వల్ప మార్పులుండే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment