సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 42 గ్రామాల్లో వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువలు 150 శాతం అంటే రెండున్నర రెట్లు పెరగనున్నాయి. ఈ మేరకు సగటున వ్యవసాయ భూముల విలువను 50 శాతం పెంచాలని, కొన్ని గ్రామాల్లో మాత్రం 75, 100, 125, 150 శాతం శ్లాబుల్లో సవరించాలని నిర్ణయించింది. ఇందుకు ప్రభుత్వ విలువ, అమ్మకపు ధరకు మధ్య ఉన్న తేడా (టైమ్ డిఫరెన్స్ రేంజ్ (టీడీఆర్)ను పరిగణనలోకి తీసుకుంది. వాస్తవానికి, రాష్ట్రంలో గతేడాది జూలైకి ముందు ఏడేళ్లపాటు భూముల విలువలు సవరించనందున ప్రభుత్వ విలువలకు, మార్కెట్‌లో అమ్మకపు ధరకు వ్యత్యాసం భారీగా పెరిగింది.
దీన్నే ప్రాతిపదికగా తీసుకుని ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉన్నచోట్ల వ్యవసాయ భూములతో పాటు ఖాళీస్థలాల విలువలను పెంచేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కసరత్తు పూర్తిచేసి తుది విలువలను ఖరారుచేసింది. అయితే ఫ్లాట్ల విలువల సవరణ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించిన అధికారులు చాలా తక్కువగా సవరణ ప్రతిపాదనలను ఖరారుచేశారు.
తద్వారా మధ్యతరగతి ప్రజలు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలుచేసినా రిజిస్ట్రేషన్ ఫీజు భారం ఎక్కువ పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. దీంతోపాటు ప్రభుత్వ విలువ పెరిగితే ఆ మేరకు రియల్టర్లు బహిరంగ మార్కెట్ ధరను కూడా పెంచితే ఫ్లాట్ల ధరలు భారీగా పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ఫ్లాట్ల విలువలను పెద్దగా సవరించలేదు. ఖాళీ స్థలాలను సగటున 35 శాతం పెంచగా, ఫ్లాట్ల విలువను 25 శాతం మాత్రమే సవరించారు.
సమస్యలు రాకుండా నోడల్ అధికారులు
సవరించిన విలువలు వచ్చేనెల 1 నుంచే అమల్లోకి వస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా స్థాయి కమిటీల ఆమోదం వచ్చి ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయినందున శనివారం నుంచే విలువల అప్‌లోడ్‌పై అధికారులు దృష్టి పెట్టనున్నారు. ఆదివారం ఎలాగూ సెలవు కాబట్టి అవసరమైతే సోమవారం రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను నిలిపివేసి కొత్త విలువల అమలులో ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ట్రయల్స్ పూర్తి చేసుకుంటామని చెబుతున్నారు. కొత్త విలువల అమల్లో సమస్యలూ రాకుండా చూసేందుకు 33 జిల్లాలకు 33 మంది నోడల్ అధికారులను నియమించారు. ఇందులో జిల్లా రిజిస్ట్రార్లతో పాటు పలువురు సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment