రోజుకు 30 సిగరెట్లతో సమానం
ఆయువులో ఏకంగా 7.8 ఏళ్లు కోత
ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ కట్టలు తెంచుకుంటోంది. నెల రోజులకు పైగా కాలుష్య మేఘాలు వాతావరణం నిండా దట్టంగా పరుచుకున్నాయి. దాంతో జనానికి ఊపిరి కూడా ఆడని పరిస్థితి! ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానిలో గాలి పీల్చడమంటే రోజుకు ఏకంగా 25 నుంచి 30 సిగరెట్లు తాగడంతో సమానమని షికాగో యూనివర్సిటీ జరిపిన తాజా అధ్యయనం ఒకటి తేల్చింది! అంతేగాక కాలుష్యం దెబ్బకు ఢిల్లీ ప్రజల ఆయు ప్రమాణం కూడా ఏకంగా 7.8 ఏళ్ల దాకా తగ్గుతోందని వెల్లడించింది. దీర్ఘకాలం పాటు ఢిల్లీ గాలి పీల్చడం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీసే ఆస్కారం కూడా చాలా ఎక్కువని తెలిపింది.
ముఖ్యంగా విషతుల్యమైన పీఎం2.5 స్థాయిలు ఢిల్లీలో ఏకంగా 247 గ్రా/ఎం3గా నమోదవుతుండటం గుబులు పుట్టిస్తోంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన 15గ్రా/ఎం3 ప్రమాణాల కంటే ఏకంగా 20 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇక ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ కూడా ఎప్పుడో 400 దాటేసింది. శుక్రవారం కూడా ఇది 411గా నమోదైంది. కాలుష్యం ధాటికి ఢిల్లీవాసులు ఇప్పటికే దగ్గు తదితర శ్వాస సంబంధ సమస్యలతో పాటు కళ్ల మంటలు, జర్వం తదిరాలతో అల్లాడుతున్నారు. వాయు కాలుష్య భూతం బారిన పడకుండా ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు బిగించుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లినప్పుడు విధిగా ఎన్95, ఎన్99 మాస్కులు ధరించాలని చెబుతున్నారు.
భారత్‌లో 30 నుంచి 50 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకు వాయు కాలుష్యమే కారణమని అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల వెల్లడించిన నివేదిక పేర్కొంది. అయితే ఆ కాలుష్యం మెడ, తల భాగాల క్యాన్సర్‌కు కూడా దారి తీయవచ్చని షికాగో వర్సిటీ అధ్యయనం పేర్కొంది. పొగ తాగేవారిలో ఈ తరహా క్యాన్సర్లు పరిపాటి అని అధ్యయన బృందం సారథి జాన్ క్రామర్ గుర్తు చేశారు. భారత్‌లో ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితుల్లో అత్యధికులు జీవితంలో ఎన్నడూ పొగ తాగనివారేనని ముంబైలోని టాటా స్మారక ఆస్పత్రి గత జూలైలో ప్రచురించిన ఒక అధ్యయనం వెల్లడించడం గమనార్హం.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment