టెక్నాలజీ దాదాపు అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. కృత్రిమమేధ పరిధి పెరుగుతోంది. కిచెన్‌లో రిఫ్రిజిరేటర్, టీవీ, మొబైల్ ఫోన్, ఫ్యాన్.. వంటి అన్ని విభాగాల్లోకి ఏఐ ప్రవేశించింది. సమీప భవిష్యత్తులో మనిషిని ప్రత్యక్షంగా, పరోక్షంగా శాసించే స్థాయికి ఏఐ వెళ్లనుందనేది కఠోర సత్యం. దీని సాయంతో చాలా కంపెనీలు సమాచారాన్ని సేకరించి సులువుగా పని అయ్యేలా చూస్తున్నాయి. కొన్ని సంస్థలు మరింత విభిన్నంగా ఆలోచించి మనిషి మరణాన్ని అంచనా వేసేందుకు ఉపయోగిస్తున్నాయి. మనిషి జీవనశైలి, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ, ఒత్తిడి.. వంటి వివరాలు అందించి మరణానికి మరెంత సమయం ఉందో తెలుసుకునేందుకు ఏఐ సాయం కోరుతున్నారు. ఈమేరకు మార్కెట్లో కొత్తగా యాప్‌లో వెలుస్తున్నాయి. వీటిపై వినియోగదారుల్లో ఆసక్తి నెలకొనడంతో వీటికి ఆదరణ పెరుగుతోంది.
మరణ తేదీ అంచనా..
‘డెత్ క్లాక్’ అనే కృత్రిమ మేధ ఆధారిత యాప్ వినియోగదారుల జీవనశైలి, అలవాట్ల ఆధారంగా వారి ఆయుష్షును అంచనా వేయగల సామర్థ్యం కలిగి ఉంది. దీన్ని జులైలో ప్రారంభించినప్పటి నుంచి చాలామంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. బ్రెంట్ ఫ్రాన్సన్ అభివృద్ధి చేసిన ఈ యాప్ దాదాపు 1,200 కంటే ఎక్కువ అధ్యయనాలను విశ్లేషిస్తుంది. 5.3 కోట్ల మంది నుంచి సేకరించిన వివరాలను అధ్యయనం చేస్తుంది. వినియోగదారు తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం, ఒత్తిడి స్థాయిలు, నిద్రపోయే విధానాలు.. వంటి విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని మరణించే అవకాశం ఉన్న తేదీని అంచనా వేస్తుంది.
ఇదీ చదవండి: ‘మస్క్ ఒక విలన్.. అందుకే రాజీనామా’
సమయం వృథా చేయడం దేనికి..
మరణం ఎప్పడైనా, ఎలాగైనా సంభవించవచ్చు. మన పరిధిలోలేని దాని గురించి ఆలోచించి సమయం వృథా చేయడం కంటే.. మరణం తథ్యం అనే వాస్తవాన్ని జీర్ణించుకుని జీవితంలో చేయాల్సిన కార్యాలు, మంచి పనులపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకస్మాత్తుగా ఏదైనా జరిగి మరణిస్తే కుటుంబానికి ఆర్థికంగా భరోసానిచ్చే టర్మ్ పాలసీను తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రిపాలైతే ఆరోగ్యబీమా ఆదుకుంటుందని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment