ఆ జాబితాలో అట్టడుగున తెలుగు రాష్ట్రాలు
ఆ జాబితాలో అట్టడుగున తెలుగు రాష్ట్రాలు
Published Thu, Aug 31 2017 8:48 PM | Last Updated on Sat, Jun 2 2018 2:08 PM
సాక్షి, న్యూఢిల్లీ : భారీ ప్రచారార్భాటాలతో హోరెత్తిస్తున్నా పలు ప్రామాణికాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు అట్టడుగునే నిలుస్తున్నాయి. ప్రతి వేయి మంది పురుషులకు స్త్రీల నిష్పత్తిలో ఏటికేడు ఉమ్మడి ఏపీ స్థానం దిగజారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలకు సంబంధించిన సగటు ఆయు ప్రమాణాలు, ఇతరత్రా అంశాలను గురువారం నీతి ఆయోగ్ ప్రకటించింది. ఆ వివరాల ప్రకారం.. 2008-10లో ప్రతి వేయి మంది పురుషులకు 920 మంది స్త్రీలు ఉండగా, 2013-15 నాటికి ఆడపిల్లల సంఖ్య 918కి పడిపోయింది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వేయి మంది పురుషులకు స్త్రీల నిష్పత్తి 933తో కొంత మెరుగ్గా ఉండగా, ఆశ్చర్యకరంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి వేయి మంది పురుషులకు కేవలం 885 మంది స్త్రీలే ఉన్నారు. ఇది జాతీయ సగటు (890) కన్నా తక్కువ కావడం గమనార్హం. 2011-13 నుంచి 2015 వరకూ పట్టణ ప్రాంతాల్లో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గింది.మరోవైపు సగటు జీవితకాలంలో కూడా తెలుగు రాష్ట్రాల పరిస్థితి మెరుగ్గా లేదు. 2010-14లో తెలుగు ప్రజల సగటు ఆయుఃప్రమాణం 66.4 ఏళ్లుగా నమోదైంది. ఇది జాతీయ సగటు 67.9 ఏళ్ల కన్నా తక్కువగా ఉంది.
సగటు ఆయుఃప్రమాణంలో కేరళ, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు (73) ముందువరుసలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు తక్షణమే స్త్రీ, పురుష నిష్పత్తి మెరుగయ్యేలా చర్యలు చేపట్టడంతో పాటు, మెరుగైన ఆరోగ్య వసతులు, ప్రజారోగ్యాన్ని విస్తృతం చేయాల్సిన ఆవశ్యకతను ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Advertisement