న్యూయార్క్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి ఇటీవల రెండు వ్యాక్సిన్లు చివరి దశలో విజయవంతమైనట్లు కంపెనీలు ప్రకటించాయి. అమెరికన్ దిగ్గజాలు ఫైజర్, మోడర్నా.. తమ వ్యాక్సిన్లు 90 శాతంపైగా సురక్షితమంటూ పేర్కొన్నాయి. దీంతో ప్రపంచ దేశాలు ఈ వ్యాక్సిన్లపై దృష్టిసారించాయి. ఇప్పటికే నోవావాక్స్, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ తదితర కంపెనీల వ్యాక్సిన్లు సైతం చివరి దశ పరీక్షలలో ఉన్నాయి. కాగా.. అమెరికన్ దిగ్గజాల వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో విజయవంతమై నియంత్రణ సంస్థల అనుమతులు పొందవలసి ఉంది. ఒకవేళ యూఎస్‌ఎఫ్‌డీఏ తదితరాలు వ్యాక్సిన్లకు వెంటనే గ్రీన్‌సిగ‍్నల్ ఇచ్చినప్పటికీ వీటి తయారీ, పంపిణీ పలు సవాళ్లతో కూడుకుని ఉన్నట్లు ఫార్మా నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి: (ఇండియాకు మోడర్నా వ్యాక్సిన్)
వచ్చే ఏడాదిలోనే
ఫెడరల్ నియంత్రణ సంస్థల నుంచి ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లకు త్వరితగతిన అనుమతులు పొందినప్పటికీ వీటిని భారీ స్థాయిలో తయారు చేయడం కష్టమేనని ఫార్మా రంగ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది లేదా జనవరికల్లా గరిష్టంగా 5 కోట్ల డోసేజీలను మాత్రమే రూపొందించే వీలున్నట్లు అంచనా వేశారు. ఫైజర్, మోడర్నా సంయుక్తంగా రూపొందిస్తున్న వ్యాక్సిన్లు తొలుత అమెరికన్లకు మాత్రమే అందనున్నాయి. ఫెడరల్ ప్రభుత్వం బిలియన్లకొద్దీ డాలర్లను వ్యాక్సిన్ల అభివృద్ధికి అందించడంతో తొలుత ప్రభుత్వానికి సరఫరా చేయవలసి ఉంటుంది. యూఎస్ ప్రభుత్వం ఈ ఏడాది 30 కోట్ల డోసేజీలను లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: (వ్యాక్సిన్ దెబ్బకు పసిడి- వెండి డీలా)
సాంకేతికత కారణంగా
కోవిడ్-19కు చెక్ పెట్టగల వ్యాక్సిన్ల తయారీలో ఫైజర్, మోడర్నా కొత్త టెక్నాలజీలను వినియోగించాయి. ఇలాంటి టెక్నాలజీ ఆధారిత వ్యాక్సిన్లను ఇంతక్రితం భారీ స్థాయిలో వినియోగించేందుకు నియంత్రణ సంస్థలు అనుమతులు ఇచ్చింది లేదని ఫార్మా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే.. ఫార్మా దిగ్గజాలు మిలియన్లకొద్దీ డోసేజీలను రూపొందించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఇందుకు వీలుగా ముడి(రా) వ్యాక్సిన్, ఇతర ముడిపదార్ధాలు(ఇన్‌గ్రెడియంట్స్) తగినంతగా సమకూర్చుకోవలసి ఉంటుంది. ఇదేవిధంగా వీటన్నిటినీ క్రోడీకరించి అత్యంత నాణ్యమైన వ్యాక్సిన్ల బ్యాచ్‌లను తయారు చేయవలసి ఉంటుంది. అన్నిటినీ ఒకే స్థాయి ప్రమాణాలతో రూపొందించవలసి ఉంటుంది. బయోలాజికల్ ప్రొడక్టుకు సంబంధించిన తయారీని పెంచడంలో పలు సవాళ్లు ఎదురుకావచ్చని ఆరోగ్య పరిరక్షణ శాఖకు చెందిన స్టాఫ్ డిప్యూటీ చీఫ్ పాల్ మ్యాంగో పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా 30 కోట్ల డోసేజీల తయారీ అత్యంత క్లిష్టతతోకూడిన వ్యవహారమని అభిప్రాయపడ్డారు.
5 కోట్ల డోసేజీలే..
ఫైజర్ తొలుత ఈ ఏడాది చివరికల్లా 10 కోట్ల డోసేజీలు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ తాజాగా వీటిలో సగం పరిమాణంలోనే అందించగలమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రపంచ దేశాలకు కోవిడ్-19 విసురుతున్న సవాళ్ల కారణంగా గతంలోలేని విధంగా ముందుగానే ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షలు పూర్తికాకుండానే తయారీ ప్రణాళికలకు శ్రీకారం చుట్టాయి. వ్యాక్సిన్ విజయవంతమైతే వెనువెంటనే భారీ స్థాయిలో డోసేజీలను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 10 కోట్ల డోసేజీలను అందించేందుకు వీలుగా మోడర్నా 2 బిలియన్ డాలర్లను ఫెడరల్ ప్రభుత్వం నుంచి అందుకుంది. అయితే జనవరికల్లా 2 కోట్ల డోసేజీలను అందించే వీలున్నట్లు అంచనా. ఇక ఫైజర్ అయితే 10 కోట్ల డోసేజీలను 1.95 బిలియన్ డాలర్లకు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది చివరికల్లా 5 కోట్ల డోసేజీలను అందించగలమని భావిస్తున్నట్లు ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బోర్లా ఇటీవల తెలియజేశారు.
ఇతర కంపెనీలు
బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా జనవరికల్లా మిలియన్లకొద్దీ వ్యాక్సిన్లను అందించేందుకు సన్నాహాలు చేసినప్పటికీ క్లినికల్ పరీక్షలను ఆరు వారాలపాటు నిలిపివేయడంతో ఈ ఏడాది చివరికల్లా అనుమతులు లభించకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో జనవరిలో ఈ వ్యాక్సిన్లకు గ్రీన్‌సిగ్నల్ లభించవచ్చని భావిస్తున్నారు. ఇక రెండు డోసేజీలలో వ్యాక్సిన్లను రూపొందిస్తున్న నోవావాక్స్ వచ్చే ఏడాదిలో 2 బిలియన్లకుపైగా డోసేజీలను అందించాలని చూస్తోంది. వ్యాక్సిన్ అభివృద్ధికి ఫెడరల్ ప్రభుత్వం నుంచి నోవావాక్స్ 1.6 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇక జాన్సన్ అండ్ జాన్సన్ సైతం మార్చికల్లా 10 కోట్ల డోసేజీలను సిద్ధం చేసే వ్యూహాల్లో ఉంది. 2021 చివరికల్లా 1 బిలియన్ డోసేజీలను సరఫరా చేయాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment