ముంబై: కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ విషయంలో అమెరికాలోని ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఫైజర్, జర్మనీలోని బయోఎన్‌టెక్ సంస్థలు ముందంజలో ఉన్నాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా కరోనా టీకాను అభివృద్ధి చేశాయి. తమ టీకా 95 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు పరీక్షల్లో తేలిందని ఆయా సంస్థలు ప్రకటించాయి. కొన్ని దేశాలు కరోనా బాధితులకు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం ఇప్పటికే మొదలుపెట్టాయి. మరోవైపు భారత్‌లోనూ కోవిడ్–19 ఇమ్యూనైజేషన్ కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అదిపెద్ద టీకా కార్యక్రమం కానుంది. అయితే, ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ ఇండియాలోని కరోనా బాధితులకు దక్కే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ అధిక ధరే ఇందుకు ప్రధాన కారణం.
ఎందుకంత అధిక వ్యయం?
ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ వ్యయం అధికంగా ఉండడానికి కారణం. దాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలకు విపరీతంగా పెట్టుబడి పెట్టాల్సి రావడం. ఇతర టీకాల మాదిరిగా కాకుండా ఫైజర్ టీకాను మైనస్ 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. 68 కోట్ల కరోనా టీకాల డోసులను కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రూ.13,870 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయానికి వచ్చింది. దీన్నిబట్టి చూస్తే ఒక్కో డోసుకు రూ.220 వ్యయం కానుంది.
కాబట్టి ప్రభుత్వం ఒక్కో డోసుకు రూ.2,725 చొప్పున వెచ్చింది, ఫైజర్ టీకాను కొనుగోలు చేసి, ప్రజలకు అందించడం అసాధ్యమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలోని ప్రజలందరికీ కరోనా టీకా ఇవ్వాలంటే రూ.43,800 కోట్లు(ఒక్కో డోసు రూ.220 చొప్పున) అవసరం. ఈ మేరకు ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడితేనే ప్రజలందరికీ టీకా ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. కేవలం ప్రభుత్వం ద్వారానే తమ వ్యాక్సిన్ విక్రయిస్తామని ఫైజర్ సంస్థ చెబుతోంది. అత్యవసర వినియోగ అనుమతి కోసం భారత ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేసింది. ఇండియాలో ఇప్పటికిప్పుడు ఫైజర్ టీకాను ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేయాలన్నా కుదరదు.
కాగా, ఫైజర్–బయోఎన్‌టెక్‌లు సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌కు సింగపూర్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల చివరికల్లా వ్యాక్సిన్ డోసులు తమ దేశానికి చేరతాయని ఆ దేశ ప్రధాని లీ హెయిన్ లూంగ్ సోమవారం ప్రకటించారు.
కోవిషీల్డ్ చాలా చౌక
ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ ఒక్కో డోసు రూ.2,725 (37 డాలర్లు) పలుకుతోంది. అక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనెకా సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా ‘కోవిషీల్డ్’ ఒక్కో డోసు ధర కేవలం రూ.221 (3 డాలర్లు). ఇక రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–5 వ్యాక్సిన్ ధర కూడా తక్కువే. అది ఒక్కో డోసు రూ.736కు (10 డాలర్లు) లభ్యమవుతోంది. హైదరాబాద్‌లోని భారత్ బయో టెక్ సంస్థ భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)తో కలిసి అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ ఒక్కో డోసు రూ.220 నుంచి రూ.440(3–6 డాలర్లు) ధరకు లభించే అవకాశం ఉంది. జైడస్ కాడిలా సంస్థ టీకా ధర కూడా ఇదే రేంజ్‌లో ఉండనుంది.
భారత్‌లో తగ్గిన కేసులు
న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 27,071 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో ఈ నెలలో మూడో సారి ఒక రోజులో 30 వేల కంటే తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,52,586గా ఉంది. మరోవైపు మొత్తం కేసుల సంఖ్య 98,84,100కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 336 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,43,355కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య సోమవారానికి 93,88,159కు చేరుకుంది.
వ్యాక్సిన్ ధర(రూ.లో)
ఫైజర్ 2,725
స్పుత్నిక్ వీ 736
ఆస్ట్రాజెనెకా 221
భారత్ బయోటెక్ 220–440
జైడస్ కాడిలా 220–440
Comments
Please login to add a commentAdd a comment