హెల్త్‌కేర్ రంగంలో దిగ్గజ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ల తయారీపై వెనక్కి తగ్గింది. మార్కెట్‌లో వివిధ కంపెనీలు భారీ ఎత్తున వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడం దీనికి తోడు డిమాండ్‌లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండటంతో ముందుగా నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాలపై పునరాలోచనలో పడింది.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసిన సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అప్పటికే ఫైజర్, మోడెర్నా, సీరమ్, భారత్‌బయోటెక్, ఇండియా, రష్యా, ఇంగ్లండ్‌లకు చెందిన పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లు మార్కెట్‌లోకి తెచ్చాయి.
అయితే కరోనా వేవ్‌లు ఒకదాని తర్వాత ఒకటిగా ముంచెత్తడంతో 2021 చివరి వరకు వ్యాక్సిన్లకు డిమాండ్ తగ్గలేదు. గతేడాది 2.38 బిలియన్ డాలర్ల విలువైన వ్యాక్సిన్ల అమ్మకాలు సాగించింది. ఇదే క్రమంలో ఈ ఏడాది 3.5 బిలియన్ డాలర్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ వ్యాక్సిన్ అమ్మకాలు 457 మిలియన్లకే పరిమితం అయ్యాయి. ఇందులో కూడా 75 శాతం అమ్మకాలు బయటి దేశాల్లోనే జరిగాయి. యూఎస్‌లో కేవలం 25 శాతం అమ్మకాలే నమోదు అయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత కోవిడ్ ప్రభావ శీలత తగ్గిపోయిందా అనే పరిస్థితి నెలకొంది.
దీనికి తోడు ఉక్రెయిన్ యుద్ధంతో సప్లై చెయిన్‌లో చాలా మార్పులు వచ్చాయి. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నా గతంలో ఉన్న స్థాయిలో కోవిడ్ భయాలు ఉండటం లేదు. పైగా అనేక కంపెనీలు వ్యాక్సిన్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది నిర్దేశించుకున్న వ్యాక్సిన్ల అమ్మకాల లక్ష్యాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ సస్పెండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment