Johnson & Johnson
-
హెటిరో చేతికి జాన్సన్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ హెటిరో తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన ఇంజెక్టేబుల్స్ తయారీ కేంద్రాన్ని కొనుగోలు చేసినట్టు సోమవారం ప్రకటించింది. డీల్ విలువ రూ.130 కోట్లు. హైదరాబాద్ సమీపంలోని పెంజెర్ల వద్ద 55.27 ఎకరాల్లో ఈ ప్లాంటు విస్తరించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హెటిరో ఫ్లాగ్షిప్ స్టెరైల్ ఫార్మాస్యూటికల్, బయోలాజిక్స్ తయారీ యూనిట్‌గా ఇది నిలవనుంది. ఈ కేంద్రంలో ఇప్పటికే ఉన్న సౌకర్యాల ఆధునీకరణకు, మెరుగుపరచడానికి, బయోలాజిక్స్, స్టెరైల్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల తయారీని విస్తరించడానికి సుమారు రూ.600 కోట్ల పెట్టుబడికి కట్టుబడి ఉన్నట్టు హెటిరో ఎండీ వంశీ కృష్ణ బండి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ఫెసిలిటీ ద్వారా బయోకెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, మాలిక్యులర్ బయోసైన్సెస్, ఇంజనీరింగ్, అనుబంధ విభాగాల్లో నూతనంగా 2,000 ఉద్యోగాలను జోడించాలని సంస్థ లక్ష్యంగా చేసుకుంది. ఈ డీల్‌కు ప్రత్యేక ఆర్థిక సలహాదారుగా పీడబ్ల్యూసీ వ్యవహరించింది. -
జాన్సన్ అండ్ జాన్సన్‌కు భారీ దెబ్బ, కోర్టును ఆశ్రయించిన సంస్థ
సాక్షి,ముంబై: జాన్సన్ అండ్ జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మహారాష్ట్రలో మరో ఎదరుదెబ్బ తగిలింది. అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్( ఎఫ్‌డిఎ) జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ తయారీ లైసెన్స్నురద్దు చేసింది. ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేసిసినట్టు ఎఫ్‌డీఏ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. జాన్సన్స్ బేబీ పౌడర్ నవజాత శిశువుల చర్మంపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. (Gold Price: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్) ప్రయోగశాల పరీక్షలో శిశువులకు పౌడర్ నమూనాలు ప్రామాణిక విలువలకు అనుగుణంగా లేవని రెగ్యులేటరీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ కాస్మెటిక్స్ చట్టం 1940, నిబంధనల ప్రకారం జాన్సన్ కంపెనీకి ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది, అంతేకాకుండా మార్కెట్ నుండి జాన్సన్ బేబీ పౌడర్ స్టాక్‌ను రీకాల్ చేయాలని కూడా కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. (లాభాలు కావాలంటే...సారథ్య బాధ్యతల్లో మహిళలు పెరగాలి) ప్రభుత్వ విశ్లేషకుల నివేదికను అంగీకరించని జాన్సన్ అండ్ జాన్సన్ కోర్టులో సవాలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కంపెనీ వివరణాత్మక ప్రకటన రావాల్సి ఉంది. -
జాన్సన్ బేబీ పౌడర్ ఇక దొరకదు
న్యూజెర్సీ: చిన్నారుల నాజూకైన చర్మం కోసం మరింత మృదువైన పౌడర్, సౌమ్యతలోని అద్భుతం అంటూ కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారుల్ని ఆకర్షించిన అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి బేబీ టాల్కమ్ పౌడర్ అమ్మకాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. అమెరికా, కెనడాలో 2020 నుంచి ఈ పౌడర్ విక్రయాలను నిలిపివేసిన జాన్సన్ కంపెనీ 2023 నుంచి ప్రపంచ వ్యాప్తంగా విక్రయాలను ఆపేస్తున్నట్టు స్పష్టం చేసింది. బేబీ టాల్కమ్ పౌడర్లు కేన్సర్‌కు దారి తీస్తున్నాయన్న ఆందోళనలతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీపై కోర్టులో 40 వేలకు పైగా పిటిషన్లు పడ్డాయి. ఈ వివాదం నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. టాల్కమ్ పౌడర్లలో ఉండే అస్బెస్టాస్ అనే పదార్థం వల్ల కేన్సర్ సోకుతోందంటూ ఎందరో వినియోగదారులు కోర్టులకెక్కారు. దీంతో జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడర్ స్థానంలో కార్న్ స్టార్చ్ (మొక్కజొన్న పిండి)తో తయారు చేసిన పౌడర్‌ను విక్రయించనుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ కార్న్ స్టార్చ్ పౌడర్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ కేన్సర్ వస్తోందంటూ న్యాయస్థానంలో పిటిషన్లు ఆగడం లేదు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ విక్రయాలను నిలిపివేయాలని ఆ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకునే టాల్కమ్ పౌడర్ అమ్మకాలనే నిలిపివేస్తున్నామే తప్ప తమ పౌడర్‌లో ఎలాంటి కేన్సర్ కారకాలు లేవని వాదిస్తోంది. వివాదం ఎలా వెలుగులోకొచ్చింది ? జాన్సన్ బేబీ పౌడర్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ పౌడర్ పూస్తే తమ బిడ్డల చర్మం మరింత మృదువుగా, పొడిగా ఉంటుందని ఎందరో తల్లులు కొన్ని దశాబ్దాలుగా వాడుతున్నారు. డైపర్లు వాడినçప్పుడు ఏర్పడే ర్యాష్‌ని కూడా ఈ పౌడర్ నిరోధించడంతో ఎంతోమంది తల్లుల మనసు దోచుకుంది. తాజాదనం కోసం పిల్లలే కాదు పెద్దలు కూడా ఈ పౌడర్ని వాడుతూ వస్తున్నారు. అందుకే కొన్ని దశాబ్దాలు ఈ పౌడర్ ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. 2017లో అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌కి చెందిన మహిళ తాను సుదీర్ఘకాలం జాన్సన్ బేబీ పౌడర్ వాడడంతో ఒవేరియన్ కేన్సర్ బారిన పడ్డానంటూ కోర్టుకెక్కారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు పౌడర్‌లో కేన్సర్ కారకాలు ఉన్నాయని తేలిందని స్పష్టం చేస్తూ కంపెనీకి 7 కోట్ల డాలర్లు నష్టపరిహారం కింద చెల్లించాలని తీర్పు చెప్పింది. దశాబ్దాలుగా కేన్సర్ కారకాలున్న పౌడర్ని అమ్ముతున్నందుకు మరో 34.7 కోట్ల డాలర్లను జరిమానాగా విధించింది. పౌడర్‌లో ఉండే అస్బెస్టాస్‌తో దీర్ఘకాలంలో ఊపిరితిత్తులు, అండాశయ ముఖద్వార కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయని పరిశోధనలు కూడా తేల్చాయి. వాస్తవానికి 1957లో జాన్సన్ బేబీ పౌడర్‌లో అస్బెస్టాస్ ఉందని తేలింది. కానీ దీర్ఘకాలం వాడాకే దుష్ప్రభావాలు బయటపడ్డాయి. -
ఐకానిక్ బేబీ పౌడర్‌కు గుడ్‌బై!
సాక్షి, ముంబై: జాన్సన్ & జాన్సన్ కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది. పలు వివాదాల నేపథ్యంలో ఇకపై జాన్సన్ బేబీ పౌడర్ విక్రయాలకు స్వస్తి పలకే ఆలోచనలో ఉంది. వివిధ దేశాల్లో చట్టపరమైన సవాళ్ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ బేబీ పౌడర్ ఉత్పత్తులను నిలిపివేయాలని యోచిస్తోంది. (ఫెస్టివ్ సీజన్: పలు కంపెనీల కార్లపై డిస్కౌంట్ బొనాంజా) కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ 2023 నాటికి టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ ప్రపంచవ్యాప్తంగా విక్రయాలను నిలిపివేయనున్నట్టు జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించింది. ఈమేరకు హెల్త్‌కేర్ దిగ్గజం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో ఉత్పత్తి విక్రయాలను ముగించిన రెండు సంవత్సరాల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. అయితే ప్రపంచవ్యాప్త పోర్ట్‌ఫోలియో మదింపులో భాగంగా, కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ పోర్ట్‌ఫోలియోకు మారాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో విక్రయిస్తున్నామని పేర్కొంది. అమెరికా, కెనడాలలో బేబీ పౌడర్ అమ్మకాలను 2020లో నిలిపివేసిన సంగతి తెలిసిందే. జాన్సన్ టాల్కం పౌడర్‌పై వినియోగదారులకు తప్పుడు సమాచారం అందించిందనీ, ప్రమాదకరమైన, కలుషిత పదార్థాలు ఉన్నాయని పలుపరిశోధనల్లో తేటతెల్లమైంది. దీంతో యూరప్‌లో డిమాండ్ పూర్తిగా పడిపోయింది. 1894 నుండి జాన్సన్ బేబీ పౌడర్ ఐకానిక్ సింబల్‌గా మారింది. అయితే ఆ తరువాతికాలంలో జాన్సన్ పౌడర్ వల్లనే కేన్సర్‌కు గురైమయ్యామని, బాధితులు, చనిపోయిన వారి బంధువులు కోర్టుకెక్కారు. అలాగే టాల్క్ ఉత్పత్తులలో ఆస్బెస్టాస్ కేన్సర్ కారకం ఉందని దశాబ్దాలుగా కంపెనీకి తెలుసని 2018 రాయిటర్స్ పరిశోధన వాదించింది. అయితే ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చిన జాన్సన్ అండ్ జాన్సన్ తమ ఉత్పత్తులు సురక్షితమైనవనీ, అస్బెస్టాస్-రహితమైనవని ఇప్పటికీ వాదిస్తోంది. పలు వినియోగ దారులు, ప్రాణాలతో బయటపడినవారు, బంధువులకు చెందిన సుమారు 38వేల వ్యాజ్యాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇప్పటికే పలుకోర్టులు కస్టమర్లకు సానుకూలంగా తీర్పునిచ్చాయి. 22 మంది మహిళలకు 2 బిలియన్ల డాలర్లకుపైగానే పరిహారం అందించింది కూడా. ఈ పరిణామాల నేపథ్యంలో గ్లోబల్ అమ్మకాలను నిలిపి వేయాలని కోరుతూ చాలా మంది కోర్టులో దావా వేశారు. ఈ క్రమంలో టాల్కం పౌడర్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపి వేయాలనే చూస్తోంది. -
జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం !
హెల్త్‌కేర్ రంగంలో దిగ్గజ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ల తయారీపై వెనక్కి తగ్గింది. మార్కెట్లో వివిధ కంపెనీలు భారీ ఎత్తున వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడం దీనికి తోడు డిమాండ్‌లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండటంతో ముందుగా నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాలపై పునరాలోచనలో పడింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసిన సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అప్పటికే ఫైజర్, మోడెర్నా, సీరమ్, భారత్‌బయోటెక్, ఇండియా, రష్యా, ఇంగ్లండ్‌లకు చెందిన పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లు మార్కెట్లోకి తెచ్చాయి. అయితే కరోనా వేవ్‌లు ఒకదాని తర్వాత ఒకటిగా ముంచెత్తడంతో 2021 చివరి వరకు వ్యాక్సిన్లకు డిమాండ్ తగ్గలేదు. గతేడాది 2.38 బిలియన్ డాలర్ల విలువైన వ్యాక్సిన్ల అమ్మకాలు సాగించింది. ఇదే క్రమంలో ఈ ఏడాది 3.5 బిలియన్ డాలర్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ వ్యాక్సిన్ అమ్మకాలు 457 మిలియన్లకే పరిమితం అయ్యాయి. ఇందులో కూడా 75 శాతం అమ్మకాలు బయటి దేశాల్లోనే జరిగాయి. యూఎస్‌లో కేవలం 25 శాతం అమ్మకాలే నమోదు అయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత కోవిడ్ ప్రభావ శీలత తగ్గిపోయిందా అనే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఉక్రెయిన్ యుద్ధంతో సప్లై చెయిన్‌లో చాలా మార్పులు వచ్చాయి. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నా గతంలో ఉన్న స్థాయిలో కోవిడ్ భయాలు ఉండటం లేదు. పైగా అనేక కంపెనీలు వ్యాక్సిన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది నిర్దేశించుకున్న వ్యాక్సిన్ల అమ్మకాల లక్ష్యాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ సస్పెండ్ చేసింది. చదవండి: చైనాకు మరోసారి గట్టిషాకిచ్చిన కోవిడ్-19..! -
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి..!
-
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మన దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పూత్నిక్-వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో మరో వ్యాక్సిన్ కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది. తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు కేంద్రం నుంచి అనుమతి లభించింది. టీకాను అత్యవసర వినియోగానికి వాడవచ్చునని కేంద్రం అనుమతి ఇచ్చింది. కరోనాబారి నుంచి రక్షించుకోవడానికి ప్రజలకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తాను అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు ఆగస్టు 5న దరఖాస్తు చేసింది. ఈ సంస్థ ‘జాన్సన్’ పేరుతో సింగిల్ డోసు వ్యాక్సిన్‌ను తయారు చేసింది. తమ వ్యాక్సిన్ సింగిల్ డోస్‌తోనే కరోనాను కట్టడి చేయవచ్చని కంపెనీ అధికారులు తెలిపారు. -
‘సింగిల్ డోస్‌తో వైరస్ కట్టడి.. మా టీకాకు అనుమతివ్వండి’
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కట్టడికి ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికైతే మన దేశంలో ఎక్కువగా కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పూత్నిక్ వ్యాక్సిన్లను 18 ఏళ్లు పైబడిన వారికి పంపిణీ చేస్తున్నారు. అయితే.. ఇవన్ని రెండు డోసులు తీసుకోవాలి. కానీ త్వరలో సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తాను అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు ఆగస్టు 5న దరఖాస్తు చేసుకుంది. ఈ సంస్థ ‘జాన్సన్’ పేరుతో సింగిల్ డోసు వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. తమ వ్యాక్సిన్ సింగిల్ డోస్‌తో కరోనాను కట్టడి చేయవచ్చని కంపెనీ అధికారులు తెలిపారు. ఈ మేరకు జాన్సన్ అండ్ జాన్సన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘అత్యవసర వినియోగ ప్రామాణీకరణ అనేది మూడో దశ క్లినికల్ ట్రయల్‌కు సంబంధించిన అత్యంత సమర్థవంతమైన, సురక్షితమైన డాటా మీద ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం మా వ్యాక్సిన్ పంపిణీ చేసిన అన్ని ప్రాంతాల్లో సింగిల్ డోస్ తీవ్రమైన వ్యాధిని నివారించడంలో 85 శాతం ప్రభావవంతమైనదని నిరూపితమైంది. అంతకాక వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తర్వాత మరణాల రేటును తగ్గించడంలో, కోవిడ్ వల్ల ఆస్పత్రిలో చేరే కేసులను తగ్గించడంలోనూ ప్రభావవంతంగా పని చేసినట్లు క్లినికల్ ట్రయల్ డాటా వెల్లడిస్తుంది’’ అని పేర్కొంది. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థతో హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ ఫార్మా కంపెనీ భాగస్వామిగా ఉంది. ఈ క్రమంలో బయోలాజికల్ ఈ తమ గ్లోబల్ సప్లై చైన్ నెట్‌వర్క్‌లో ఒక ముఖ్యమైన భాగం అని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అధికారులు తెలిపారు. తమ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన మైలురాయి అని.. బయోలాజికల్ ఈ సహకారంతో భారతదేశంలోనే కాక, ప్రపంచంలోని ప్రజలందరికి తమ సింగిల్-డోస్ కోవిడ్-19 టీకాను పంపిణీ చేయడానికి మార్గం సుగమం అవుతుంది అన్నారు. అయితే.. గతంలో ఈ సంస్థ భారత్‌లో ట్రయల్స్ నిర్వహించేందుకు దరఖాస్తు చేసుకొని దానిని ఉపసంహరించుకుంది. పలు దేశాల్లో ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను వినియోగిస్తున్నారు. కాగా.. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు దేశాలు అనుమతించిన వ్యాక్సిన్లను.. ట్రయల్స్ నిర్వహణ అవసరం లేకుండానే నేరుగా అత్యవసర వినియోగానికి అనుమతించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. -
జాన్సన్ వ్యాక్సిన్‌కు మరోషాక్ : షాకింగ్ స్టడీ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్‌కు సంబంధించి జాన్సన్ అండ్ జాన్సన్‌కు మరో భారీ షాక్ తగిలింది. జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ డెల్టా వేరియంట్, ఇతర వేరియంట్లపై సరిగా పనిచేయడంలేదని తాజా నివేదికలో తేలింది ప్రస్తుతం అమెరికాలో మళ్లీ విస్తరిస్తున్న కేసులకు కారణమైందని న్యూయార్క్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం అమెరికాలో ఆమోదించిన మూడు కరోనా వ్యాక్సిన్లను తీసుకున్న వ్యక్తుల నుండి తీసుకున్న రక్త నమూనాలపై నిర్వహించిన పరీక్షల ఆధారంగా ఈ అధ్యయనాన్నినిర్వహించారు ఈ సందర్బంగా జాన్సన్ టీకా సమర్థత 29 శాతం మాత్రమేనని తేల్చారు. ఈ క్రమంలో ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారికి బూస్టర్ డోస్‌లు అవసరమవుతాయని అధ్యయనవేత్తలు సూచించారు. డెల్టా వేరియంట్‌పై ఆస్ట్రాజెనెకా టీకా సింగిల్ డెస్ పనితీరు 33 శాతం సమర్ధతతో పనిచేస్తుంది. రెండు డోసులకు గాను 60 శాతం సమర్ధతతను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో రెండో డోస్ కావాలని అధ్యయనం అంచనా వేసింది. వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ మాట్లాడుతూ, బూస్టర్ షాట్లు అవసరమా అనేదానిపై పరిశోధకులు ఇంకా అంచనా వేస్తున్నారన్నారు. మరోవైపు ఈ వాదనను జే అండ్ జే ప్రతినిధి సీమా కుమార్ తోసి పుచ్చారు. ఇతర కొత్త వేరియంట్లపై తమ టీకా ప్రభావవంతంగా ఉంటుందని స్పష్టం చేశారు. క్లినికల్ ట్రయల్స్‌లో సింగిల్ షాట్ జాన్సన్ వ్యాక్సిన్ మొదటి కరోనా వైరస్‌పై 66శాతం, రెండు-షాట్ల ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు 90శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని తేలాయి. సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రోషెల్ వాలెన్స్కీ మంగళవారం అందించిన సమాచారం అమెరికాలో మొత్తం కేసుల్లో 83 శాతం డెల్టా వేరియంట్ కేసులే. అలాగే అమెరికాలో 13 మిలియన్లకు పైగా జాన్సన్ టీకాను తీసుకున్నారు. కాగా ఇప్పటికే ఈ కంపెనీకి చెందిన కరోనా వ్యాక్సిన్ పలు విమర్శలొచ్చాయి. జాన్సన్ వ్యాక్సిన్ ఫిబ్రవరిలో ఆమోదం పొందినప్పటి నుండి అనేక సమస్యపై నివేదికలు వెలువడ్డాయి. తీవ్రమైన రక్తం గడ్డకట్టేసమస్యల వివాదంతో ఏప్రిల్‌లో 10 రోజుల విరామాన్ని ప్రకటించింది. ఆ తరువాత ఈ టీకా తీసుకున్న వారిలో అరుదైన నాడీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, గుల్లెయిన్-బారే సిండ్రోమ్ అనే న్యూరోలాజికల్ డిజార్డర్ ప్రమాదం ఉందని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఈ వ్యాక్సిన్ తీసుకుంటే పక్షవాతం రావచ్చు: ఎఫ్‌డీఏ హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కరోనా టీకాకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కరోనా టీకా పై యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) తాజాగా కీలక హెచ్చరికలు చేసింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారికి అరుదైన న్యూరాలజీ సమస్యలు వస్తున్నాయని సోమవారం ప్రకటించింది. దీనిపై 100 మంది నుంచి ఫిర్యాదులు అందుకున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఒక ప్రకటనలో తెలిపింది.రానున్న సమావేశాల్లో దీన్ని సమీక్షించమని సీడీసీ వ్యాక్సిన్ నిపుణుల ప్యానెల్‌ను కోరనుంది. అయితే దీనిపై జాన్సన్ అండ్ జాన్సన్ ఇంకా స్పందించలేదు. ఎఫ్‌డీఏ ప్రకారంటీకా తీసుకున్నవారిలో నరాల కణాలను దెబ్బతీయడం,కండరాల బలహీనత, ఒక్కోసారి పక్షవాతం వస్తుందని, దీన్నే గుల్లెయిన్-బార్-సిండ్రోమ్ అంటారు. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా తీసుకున్న వారిలో 100 గుల్లెయిన్-బార్ అనుమానాస్పద కేసులను ఫెడరల్ అధికారులు గుర్తించారు. ఈ కేసులలో తొంభై ఐదు శాతం తీవ్రమైనవి పేర్కొంది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉందని కూడా ఎఫ్‌డీఏ తెలిపింది. అయితే ప్రమాద అవకాశాలు తక్కువగా ఉన్నాయని వెల్లడించి నప్పటికీ జాన్సన్ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో టీకాలు 42 రోజులలో ఈ ప్రభావం మూడు నుండి ఐదు రెట్లు అధికంగా ఉందని తెలిపింది. వ్యాక్సిన్ ప్రొవైడర్లు, టీకా తీసుకుంటున్న వారికి టీకా గురించి హెచ్చరికలఎటాచ్ మెంట్‌ద్వారా వివరిస్తోంది. కాగా అమెరికా, లాటిన్ అమెరికా, దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ప్రయోగాల్లో జేఅండ్‌జే వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనది, సామర్థ్యమైనదని తేలింది. కరోనా వైరస్‌పై 85శాతం సామర్థ్యంతో ఈ వ్యాక్సిన్ పని చేస్తుందని వివిధ ప్రయోగాలు వెల్లడించాయి. దక్షిణాఫ్రికా వేరియెంట్‌పైన కూడా ఈ టీకా అద్భుతంగా పని చేస్తోందని ప్రాథమికంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దీనిపై అమెరికా అధ్యకక్షుడు జోబైడెన్ ప్రశంసలు కురిపించారు. ఈ ఏడాది మార్చిలో దీనికి అక్కడ అత్యవసర వినియోగం కింద అనుమతి లభించింది. అమెరికాలో సుమారు 12.8 మిలియన్ల మంది పూర్తిగా టీకాలు తీసుకోగా , జనాభాలో 8 శాతం మంది - జాన్సన్ అండ్ జాన్సన్ షాట్ అందుకున్నారు. సుమారు 146 మిలియన్లకు ఫైజర్ లేదా మోడెర్నా వ్యాక్సిన్లు తీసుకున్నారు. -
కరోనా: జాన్సన్ సింగిల్ షాట్‌కు యూకే ఓకే
లండన్: ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లన్నీ రెండు డోసులవి కాగా, జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన సింగిల్ డోస్ టీకాకు యూకే ఆమోదం తెలిపింది. యూకేలో ఆమోదం పొందిన నాలుగో వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం. రెండు కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లను బ్రిటన్ ఆర్డర్ చేసింది. రాబోయే రోజుల్లో సింగిల్ డోస్ వ్యాక్సిన్ ముఖ్యమైన పాత్ర పోషించబోతోందని యూకే హెల్త్ అండ్ సోషల్ కేర్ విభాగం తెలిపింది. భారత్‌లో కొత్త వేరియంట్ బయట పడిన నేపథ్యంలో యూకే లో యువత వ్యాక్సినేషన్ల కోసం పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారని తెలిపింది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా 72శాతం ప్రభావవంతంగా పని చేస్తోందని అమెరికా ట్రయల్స్‌లో వెల్లడైంది. ప్రస్తుతం యూకేలో దాదాపు సగం జనాభాకు ఏదో ఒక వ్యాక్సిన్ కనీసం ఒక డోస్ అయినా పూర్తి అయింది. మిగతా వాక్సిన్లతో పోలిస్తే జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు టీకా ఆలస్యంగానే అనుమతులు పొందింది. చదవండి: రక్షణ భాగస్వామ్యం పెంచుదాం -
అమెరికాలో జాన్సన్ టీకా నిలిపివేత.. కారణమిదే
వాషింగ్టన్: అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇవ్వడాన్ని నిలిపివేయాలంటూ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో మెదడులో రక్తం గడ్డగట్టిపోతున్న లక్షణాలు బయటపడటంతో ఆ వ్యాక్సిన్‌ను నిలిపేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మెదడు నుంచి రక్తాన్ని తీసుకొచ్చే నాళాల్లో రక్తం గడ్డకడుతోందని, అందులోనూ ప్లేట్లెట్లు తక్కువగా ఉంటున్నట్లు వైద్యులు గుర్తించారు. మొత్తం 60 లక్షల మందికి పైగా ప్రజలకు ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే ఇవ్వగా, వారిలో 6 మందికి ఇలాంటి లక్షణాలు కనిపించాయి. యూరోపియన్ యూనియన్‌లో సైతం ఆ్రస్టాజెనెకా వ్యాక్సిన్‌తో ఇలాంటి లక్షణాలే కన్పించడంతో వాడకం నిలిపేసిన విషయం తెలిసిందే. చదవండి: కోవిడ్ ఇంకా ముగియలేదు.. -
అమెరికా జాన్సన్ అండ్ జాన్సన్‌కు భారీ షాక్
వాషింగ్టన్: ఉత్పత్తి సమయంలో చోటు చేసుకున్న తప్పిదం కారణంగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేస్తోన్న కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి దాదాపు 15 మిలియన్ డోసులకు సరిపడా ఔషధ పదార్థాలు వృథా అయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు వెల్లడించారు. అయితే కంపెనీ ప్రస్తుతం పరిస్థితిని చక్కదిద్దిడమే కాక వ్యాక్సిన్ డెలివరీ టార్గెట్‌ని రీచ్ అయినట్లు వారు తెలిపారు. ఈ సంఘటన బాల్టిమోర్‌లోని ఎమర్జెంట్ బయో సొల్యూషన్స్ ఇంక్ కేంద్రంలో చోటు చేసుకుంది. దీని వల్ల మే నాటికి దేశంలో పెద్దలందరికి వ్యాక్సిన్ ఇవ్వాలనే అధ్యక్షుడి ఆలోచనకు బ్రేక్ పడవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక తప్పిదం సంభవించిన యూనిట్ నుంచి ఒక్క డోసును కూడా బయటకు పంపలేదని తెలిసింది. కానీ దీని గురించి కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇక ఒక బ్యాచ్ ఔషధ పదార్థాలు క్వాలిటీ టెస్ట్‌లో ఫెయిల్ అయినట్లు జాన్సన్ అండ్ జాన్సన్ ఓ ప్రకటన చేసింది. ప్లాంట్‌లో ఉత్పత్తి సమయంలో తలెత్తిన లోపం గురించి తొలుత న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. కార్మికులు అనుకోకుండా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు సంబంధించని ఔషధ పదార్థాలను ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ పదార్థలతో కలిపినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. దీని గురించి ఆస్ట్రాజెనికా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ తప్పిదం అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రభావం చూపుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కోవిడ్ టీకా కార్యక్రమం కోసం జాన్సన్ అండ్ జాన్సన్‌తో పాటు ఫైజర్, మోడర్నా కంపెనీలు వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ మినహాయించి మిగతా రెండు కంపెనీలు 120 మిలియన్, 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేసి టార్గెట్ రీచ్ అయ్యాయి. ఈ తప్పిదం విషయాన్ని ఎమర్జెంట్‌తో పాటు ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) అధికారులకు కూడా తెలిపామని జాన్సన్ అండ్ జాన్సన్ ఉద్యోగి ఒకరు తెలిపారు. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా ఒక్క డోసు ఇస్తే సరిపోతుందని, రెండు డోసులు అవసరం లేదని ఎఫ్‌డీఏ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: నేపాల్ సైన్యానికి భారత్ అరుదైన బహుమతి -
ఆ టీకా ఒక్క డోసు చాలు
వాషింగ్టన్: కరోనాతో అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యం అమెరికా మూడో వ్యాక్సిన్‌కి అనుమతులు మంజూరు చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసిన టీకా వినియోగానికి శనివారం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతినిచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా ఒక్క డోసు ఇస్తే సరిపోతుందని, రెండు డోసులు అవసరం లేదని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లకు అనుమతిచ్చింది. దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పుడు మూడో కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌కి ఎఫ్‌డీఏ అనుమతులు రావడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. కరోనాపై పోరాటం ఇక తుది దశకు చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ప్రజలందరికీ ఇది అత్యంత ఉత్సాహాన్నిచ్చే వార్తని బైడెన్ వ్యాఖ్యానించారు. ‘‘జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌ను అన్ని విధాలుగా పరీక్షించి, రకరకాలుగా ప్రయోగాలు నిర్వహించి సంతృప్తి చెందిన తర్వాతే ఎఫ్‌డీఏ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. కరోనాని తరిమికొట్టడానికి ఈ వ్యాక్సిన్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది’’అని బైడెన్ చెప్పారు. వీలైనంత తొందరగా దేశంలో అత్యధిక మందికి వ్యాక్సిన్ డోసులు ఇస్తేనే కరోనా ఉధృతిని కట్టడి చేయగలమని అన్నారు. ప్రపంచంలోనే కరోనా వైరస్‌తో అత్యధికంగా అమెరికాలోనే 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌ను అడ్డుకోగలదు అమెరికా, లాటిన్ అమెరికా, దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ప్రయోగాల్లో జేఅండ్‌జే వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనది, సామర్థ్యమైనదని తేలింది. కరోనా వైరస్‌పై 85% సామర్థ్యంతో ఈ వ్యాక్సిన్ పని చేస్తుందని వివిధ ప్రయోగాలు వెల్లడించాయి. దక్షిణాఫ్రికా వేరియెంట్‌పైన కూడా ఈ టీకా అద్భుతంగా పని చేస్తోందని ప్రాథమికంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ ఏడాది చివరి నాటికి కోటి డోసుల్ని ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించింది. జాన్సన్ వ్యాక్సిన్ నిల్వ చేయడం కూడా చాలా సులభం. ఫైజర్, మోడెర్నా మాదిరిగా అత్యంత శీతల వాతావరణంలో ఉంచాల్సిన పని లేదు. సాధారణ రిఫ్రిజిరేటర్లలో కూడా మూడు నెలల పాటు ఈ టీకా నిల్వ ఉంటుంది. -
60వేల మందిపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు
న్యూయార్క్ : ప్రముఖ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు వేసింది. వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్‌కు రంగం సిద్ధం చేసింది. ఈ దశలో దాదాపు 60 వేల మందిపై వ్యాక్సిన్‌ను ప్రయోగించనుంది. ఇందుకు సంబంధించిన వాలంటీర్ల నమోదు ప్రక్రియకు సన్నద్ధాలు మొదలుపెట్టింది. అమెరికాతో పాటు దాదాపు 200 దేశాల వారికి నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్)తెలిపింది. (కరోనా పాపం చైనాదే) కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ నిర్వహించబోతున్న సంస్థల్లో జాన్సన్ అండ్ జాన్సన్ పదవది, అమెరికా వ్యాప్తంగా నాలుగవది. సదరు కంపెనీ ఎలాంటి ఆదాయం ఆశించకుండా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం అమెరికా ప్రభుత్వం జే అండ్ జే కంపెనీకి 1.45బిలియన్ డాలర్లను ఫండ్‌గా ఇచ్చింది. -
ఫెయిర్‌నెస్ క్రీమ్ అమ్మకాలు నిలిపివేత
సాక్షి,న్యూఢిల్లీ : అమెరికా హెల్త్‌కేర్, ఎఫ్ఎంసీజీ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే) మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత ఊపందుకున్న ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమానికి మద్దతుగా స్కిన్ వైట్నింగ్ (చర్మం తెల్లబడే) క్రీమ్‌ల అమ్మకాలను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. వీటితోపాటు న్యూట్రోజెనా ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల అమ్మకాన్ని కూడా ఆపివేసినట్టు వెల్లడించింది. భారతదేశం సహా ఇతర ప్రాంతాల్లో క్లీన్ అండ్ క్లియర్ ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తామని జేజే తెలిపింది. ఆసియా, మధ్యప్రాచ్యంలో విక్రయించే న్యూట్రోజెనా ఫైన్ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అమ్మకాలు ఉండవని పేర్కొంది. అయితే స్టాక్ ఉన్నంత వరకు క్లీన్ అండ్ క్లియర్ ఫెయిర్‌నెస్ ఉత్పత్తులను విక్రయిస్తామని చెప్పింది. నల్లమచ్చల్ని తొలగించుకొని అందంగా, తెల్లగా అవ్వమంటూ తమ ఉత్పత్తి పేర్లు లేదా ప్రచారం సాగిందని, మీ సొంత స్కిన్ టోన్ కంటే మెరిసిపోవాలంటూ తెల్ల రంగును హైలైట్ చేసిందని తెలిపింది. నిజానికి తమ ఉద్దేశం అది కాదని "ఆరోగ్యకరమైన చర్మం అందమైన చర్మం" అని కంపెనీ తెలిపింది. సాహసోపేతమైన తమ నిర్ణయాన్ని సానుకూల దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అయితే కంపెనీ వ్యాపారంపై ఇది పెద్దగా ప్రభావం చూపదని ఎందుకంటే దాని మార్కెట్ వాటా చాలా తక్కువ అని జేజే ప్రతినిధి చెప్పారు. మరోవైపు జాన్సన్ అండ్ జాన్సన్ నిర్ణయం తరువాత ఇతర కంపెనీలు ఇలాంటి ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసే ధైర్యం చేస్తాయా అనే ప్రశ్నకు విశ్లేషకులు పెదవి విరిచారు. దేశీయ ఫెయిర్‌నెస్ క్రీమ్ మార్కెట్లో 2019లో సుమారు 450 మిలియన్ల డాలర్ల మార్కెట్ వాటా వున్న, ఇతర ఎఫ్ఎంసీజీ కంపెనీలు దీనిని అనుసరించకపోవచ్చన్నారు. బ్రిటిష్-డచ్ బహుళజాతి సంస్థ అనుబంధ కంపెనీ హిందూస్తాన్ యూనిలీవర్, మరో విదేశీ సంస్థ ప్రొక్టర్ అండ్ గాంబుల్, గార్నియర్ (లోరియల్) ఈ విభాగంలో మార్కెట్ ను ఏలుతున్న సంగతి తెలిసిందే. బయోటిక్, లోటస్ హెర్బల్, హిమాలయ వంటి అనేక భారతీయ కంపెనీల ఫెయిర్‌నెస్ ఉత్పత్తులు కూడా భారీ విక్రయాలనే నమోదు చేస్తున్నాయి. మనదేశంలో అత్యధికంగా అమ్ముడుబోయే ఫెయిర్‌నెస్ క్రీమ్ ఫెయిర్ అండ్ లవ్లీ. హిందూస్తాన్ యునిలివర్ కు అత్యంత విజయవంతమైన ఈ క్రీమ్ 2012 నాటికి, కంపెనీ మార్కెట్లో 80 శాతం ఆక్రమించిందంటే దీని డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు గత దశాబ్ద కాలంగా పురుషుల ప్రత్యేక ఫెయిర్‌నెస్ ఉత్పత్తులు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ తారలు షారూఖ్ ఖాన్, జాన్ అబ్రహం వీటికి ప్రచారకర్తలుగా ఉన్నారు. అయితే ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల వ్యాపారం చాలా సంవత్సరాలుగా విమర్శలను ఎదుర్కొంటోంది. సౌందర్య సాధన పేరుతో జరుగుతున్న ఇలాంటి అమ్మకాలను నిషేధించాలంటూ ఇటీవల ఆన్లైన్ పిటిషన్ కూడా సర్క్యులేట్ అయింది. యూరోమోనిటర్ ఇంటర్నేషనల్ ప్రకారం, గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఫెయిర్‌నెస్ క్రీములు, మచ్చల నివారణ, యాంటీ ఏజింగ్ ఉత్పత్తులతో సహా సుమారు 6,277 టన్నుల స్కిన్ లైట్నర్ అమ్ముడుబోయిందట. -
జాన్సన్ అండ్ జాన్సన్ కీలక నిర్ణయం
సాక్షి,న్యూడిల్లీ : ఎట్టకేలకు వివాదాస్పద బేబీ పౌడర్ అమ్మకాలను జాన్సన్ అండ్ జాన్సన్ నిలిపివేసింది. అమెరికా, కెనడా దేశాలలో తమ బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపి వేయనున్నామని అమెరికా ఫార్మా దిగ్గజ సంస్థ అధికారికంగా ప్రకటించింది. వేలాది కేసులు, కోట్ల డాలర్ల పరిహారం లాంటి అంశాల నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆరోగ్య సమస్యల ఆరోపణలు ఖండించిన సంస్థ ఉత్తర అమెరికాలో టాల్క్-ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ డిమాండ్ చాలావరకు తగ్గుతోందని మంగళవారం ప్రకటించింది. వినియోగదారుల అలవాట్లలో మార్పులు, తప్పుడు సమాచారం, వ్యాజ్యాలు దీనికి ఆజ్యం పోసాయని జాన్సన్ అండ్ జాన్సన్ ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే నెలల్లో ఈ రెండు దేశాల మార్కెట్లలో అమ్మకాలను నిలిపివేస్తున్నామని నార్త్ అమెరికా కన్స్యూమర్ యూనిట్ ఛైర్మన్ కాథ్లీన్ విడ్మెర్ చెప్పారు. సరఫరా ముగిసే వరకు ఉన్న ఇతర రీటైల్ మార్కెట్లటలో అమ్మకాలు కొనసాగుతాయని ఆమె చెప్పారు. అయితే 1980 నుండి మార్కెట్లో ఉన్న తమ కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలు అమెరికా కెనడాలో కొనసాగుతాయన్నారు. మొదట 1890 లలో బేబీ-పౌడర్ ఉత్పత్తులను అమ్మడం ప్రారంభించిందని కంపెనీ బ్లాగ్ తెలిపింది. (కోవిడ్-19: రోల్స్ రాయిస్‌లో వేలాదిమందికి ఉద్వాసన) కాగా 2014 నుంచి జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ పౌడర్, ఇతర ఉత్పత్తుల్లో ఆస్బెస్టాస్ ఆనవాళ్లు న్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఉత్పత్తుల వల్ల తమకు క్యాన్సర్ వచ్చిందనే ఆరోపణలతో వేలాది (16,000 కంటే ఎక్కువ) కేసులను సంస్థ ఎదుర్కొంటున్నసంగతి తెలిసిందే. దీంతోపాటు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన పరీక్షలో ఒక బాటిల్ బేబీ పౌడర్‌లో కలుషిత, ప్రమాదకర అవశేషాలను కనుగొన్న తర్వాత గత ఏడాది అక్టోబర్‌లో 33వేల బాటిళ్లను మార్కెట్ నుండి వెనక్కి తీసుకుంటున్నట్టు జె అండ్ జె తెలిపింది. మరోవైపు న్యూజెర్సీలోని ఫెడరల్ కోర్టులో 16,000కు పైగా సూట్లను పర్యవేక్షిస్తున్న అలబామా న్యాయవాది లీ ఓ'డెల్ మాట్లాడుతూ అమ్మకాలను నిలిపివేసే ప్రకటన విచారణ నుంచి తప్పించుకునేందుకే అని వ్యాఖ్యానించారు. అండాశయ క్యాన్సర్‌కు కారణమైన సంస్థ ఉత్పత్తులను నిలిపివేయాలని ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. (కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు) -
ఆ కంపెనీ షాంపూ, పౌడర్ వాడకండి
ఢిల్లీ: జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపూ, పౌడర్ అమ్మకాలను నిలుపుదల చేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘం(ఎన్సీపీసీఆర్) లేఖలు పంపింది. అలాగే.. ఇప్పటికే దుకాణాల్లోకి వెళ్లిన జాన్సన్ ఉత్పత్తులను వెనక్కి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. జాన్సన్ ఉత్పత్తుల శాంపిల్స్‌ను పరీక్షలకు పంపించి నివేదిక పంపాలని ఆదేశించింది. జైపూర్‌లోని డ్రగ్స్ టెస్టింగ్ లేబరేటరీలోని ప్రభుత్వ నిపుణులు ఇచ్చిన నివేదికను జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘానికి రాజస్తాన్ ప్రభుత్వం అందజేసింది. జాన్సన్ ఉత్పత్తుల్లో ఫార్మల్ డీహైడ్ ఉండటంతో నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవని రాజస్థాన్ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. జాన్సన్ ఉత్పత్తులలో ఆస్బెస్టాస్, కార్సినో జెనిక్ కారకాలు ఉన్నాయని మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ, రాజస్తాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు జాన్సన్ ఉత్పత్తుల నమూనాలు పరిశీలించి నివేదిక పంపాలని ఎస్సీపీసీఆర్ కోరింది. ఈ విషయంపై జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ జాతీయ బాల హక్కుల రక్షణ సంఘం ఆదేశాలు తమ దృష్టికి రాలేదని పేర్కొంది. సెంట్రల్ డ్రగ్స్ లాబరేటరీలో వచ్చిన ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తెలిపింది. -
జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపూ వాడుతున్నారా?
జైపూర్ : అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్‌కు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ మాత్రమే కాదు బేబీ షాంపూ కూడా ప్రమాదకరమైనదేనని తాజా పరీక్షల్లో తేలింది. రాజస్థాన్‌లో జరిపిన నాణ్యతా పరీక్షల్లో జాన్సన్ అండ్ జాన్సన్ షాంపూ భారత ప్రమాణాలను అందుకోలేకపోయింది. ఈ మేరకు రాజస్థాన్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జాన్సన్ అండ్ జాన్సన్‌కు మార్చి 5వ తేదీని నోటీసులు జారీ చేసింది. కంపెనీ బేబీ షాంపూ రెండు బ్యాచ్‌ల నమూనాల పరీక్షల్లో షాంపూలో హాని కారక పదార్థాలు ఉన్నాయని తెలిపింది. ఈ శాంపిల్స్‌లో ప్రమాదకర ఫార్మల్ డిహైడ్ ఉన్నట్లు తేలిందని పేర్కొంది. ఈ ఫార్మల్డిహైడ్ను భవన నిర్మాణ సామగ్రి (కార్సినోజెన్) తయారీలో ఉపయోగిస్తారని వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ అంశాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రతినిధి తిరస్కరించారు. తమ కంపెనీకి చెందిన ఎస్యూరెన్స్ ప్రాసెస్ ప్రపంచంలోనే అత్యంత కఠినంగా ఉంటుందనీ అత్యంత సురక్షితంగా తమ ఉత్పత్తులను ఉంచుతామంటూ ఈ ఆరోపణలను తిరస్కరించారు. ఈ ఫలితాలు ఏకపక్షమైనవనీ, వీటిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమన్నారు. కాగా జే అండ్ జే బేబీ పౌడర్‌లో ప్రమాదకర క్యాన్సర్ కారకాలు ఉన్నాయని ఇప్పటికే తేలింది. అలాగే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థపై ప్రపంచ వ్యాప్తంగా వేలాది కేసులు విచారణలో ఉన్నాయి. పలు కేసులో భారీ నష్టపరిహారం చెల్లించాలని సంబంధిత కోర్టులు సంస్థను అదేశించిన సంగతి తెలిసిందే. -
జాన్సన్ అండ్ జాన్సన్‌కు మరో ఎదురు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. జాన్సన్ బేబీ పౌడర్‌లో ఆస్బెస్టాస్ ఆనవాళ్లున్నాయన్న సమాచారంతో దేశీయ ఔషధ నియంత్రణ అధికారులు స్పందించారు. హిమాచల్ ప్రదేశ్‌లో జాన్సన్ ఫ్యాక్టరీలో జాన్సన్ బేబీ పౌడర్ శాంపిళ్లను డ్రగ్ అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డీ ప్లాంట్‌నుంచి ఈ నమూనాలు సేకరించినట్టు పేరు వెల్లడించడానికి అంగీకరించని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీ) అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. అలాగే వార్తా కథనాల ఆధారంగా శాంపిళ్లను సీజ్ చేయాల్సిందేగా ఆదేశించానని తెలంగాణాకు చెందిన రీజనల్ డ్రగ్ ఆఫీసర్ సురేంద్రనాథ్ సాయి ధృవీకరించారు. పరీక్షల అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని ప్రభావానికి లక్షలాదిమంది పసిపిల్లలు గురి కానున్నారనే అంశం బాధిస్తోందన్నారు. అయితే తాజా పరిణామంపై జాన్సన్ అండ్ జాన్సన్ ఇంకా స్పందించలేదు. మరోవైపు ఈ వ్యవహరాన్ని పరిశీలించేందుకు సుమారు 100మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లను నియమించినట్టు వార్తలొచ్చాయి. జాన్సన్ ఇండియాతో సంబంధమున్న వేర్వేరు ఉత్పాదక యూనిట్లు, హోల్‌సేలర్స్, పంపిణీదారులను పరిశీలించడానికి నియమించారు. దీనిపై సంప్రదించినప్పుడు ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. అయితే ఈ రిపోర్టులో నివేదించిన అంశాలు చాలా ఆందోళన కరమని మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించినట్టు తెలిపింది. కాగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌లో క్యాన్సర్కారకాలు ఉన్నాయన్న సంగతిని మూడు దశాబ్దాలుగా కంపెనీ దాచి పెట్టిందంటూ ఇటీవల రాయిటర్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ ఆరోపణలను జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రతినిధులు తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
జాన్సన్ అండ్ జాన్సన్‌కు రాయిటర్స్ షాక్ : వేల కోట్లు హాంఫట్
జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు అంతర్జాతీయ మీడియా సంస్థ భారీ షాక్ ఇచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్‌కు తమ బేబీపౌడర్లో క్యాన్సర్ కారకాలున్నాయన్న సంగతి ముందే తెలుసునని రాయటర్స్ తాజాగా వాదిస్తోంది. అయితే ఈ విషయంలో దశాబ్దాల తరబడి వినియోగదారులను మోసం చేస్తూ వస్తోందని విమర్శించింది. ఆస్బెస్టాస్ మూలంగా మేసోథెలియోమా లాంటి అనేక అరుదైన, బాధాకరమైన కాన్సర్లకుదారి తీస్తుందని పేర్కొంది. దీంతో వివాదాలు, పలు కేసులు, కోర్టు తీర్పులతో ఇబ్బందుల్లో పడిన అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఈ రిపోర్టును ఎప్పటిలాగానే జాన్సన్ అండ్ జాన్సన్ తిరస్కరించింది. తమ బేబీ టాల్కమ్ పౌడర్‌లో ఆస్బెస్టాస్ అనే క్యాన్సర్ కారకం ఉన్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి దశాబ్దాలుగా తెలుసని రాయిటర్స్ కథనం పేర్కొంది. బేబీ పౌడర్‌లో ఆస్బెస్టాస్ ఆనవాళ్లు ఉన్నట్లు 1971లోనే జాన్సస్ సంస్థ గుర్తించిందని తెలిపింది. ఈ విషయమై ఇటీవల కంపెనీపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయిటర్స్ మీడియా సంస్థ పలు పత్రాలను అధ్యయనం చేసి మరీ నిర్ధారించింది. అయితే ఇది తక్కువ మోతాదు, హానికరం కాదంటూ రెగ్యులేటరీ సంస్థలను ఒప్పించటానికి ప్రయత్నం చేసిందని, కానీ ఈ సంవత్సరం న్యూజెర్సీ న్యాయమూర్తి జాన్సన్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ రాయటర్స్ నివేదించింది. అయితే ఈ వార్తలను జాన్సన్ అండ్ జాన్సన్ కొట్టిపారేసింది. ఇవన్నీ కల్పిత వార్తలని, నిజాన్నితప్పుదోవ పట్టించేందుకు చేసే ప్రయత్నాలను కంపెనీ ఆరోపించింది. తమ టాల్కం పౌడర్‌లో ఎలాంటి క్యాన్సర్ కారకాలు లేవని ఇప్పటికే చాలా పరీక్షలు రుజువుచేశాయని కంపెనీ గ్లోబల్ మీడియా రిలేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఎర్నీ నీవిట్జ్ తెలిపారు. అయితే బేబీ పౌడర్ కాకుండా పారిశ్రామిక అవసరాలకోసం ఉద్దేశించిన తమ టాల్క్ బ్యాచ్‌లలో ఆస్బెస్టాస్ ఆనవాళ్లు ఉండి వుండవచ్చని వాదించారు. కాగా జాన్సన్ అండ్ జాన్స్ బేబీ పౌడర్‌తో పాటు షవర్ ఉత్పత్తుల్లోనూ క్యాన్సర్ కారకాలు ఉన్నాయని, తద్వారా తమకు క్యాన్సర్ సోకిందన్న ఆరోపణలపై వేలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే బాధితులను వాదనలను సమర్థించిన పలుకోర్టులు పరిహారం చెల్లించాల్సిందిగా జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థను ఆదేశించిన సంగతి తెలిసిందే. 2006లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక విభాగం జాన్సన్‌కు చెందిన జననేంద్రియ ప్రాంతాల్లో ఉపయోగించే (వెజైనల్) టాల్క్ అండాశయ క్యాన్సర్‌కు కారణం కావచ్చని ఒక ప్రకటన జారీ చేసింది, అయితే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఈ ఆరోపణకు ఎలాంటి ఆధారం లేదని కొట్టి పారేసింది. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో అమెరికా మార్కెట్లో శుక్రవారం జాన్సన్ అండ్ జాన్సన్ షేర్లు కుప్పకూలాయి. షేరు విలువ 10శాతం మేర పడిపోయింది. 45బిలియన్ డాలర్ల సంపద (సుమారు 32వేల కోట్ల రూపాయలు) తుడిచిపెట్టుకుపోయింది. 16ఏళ్లలో కంపెనీ షేర్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారని బిజినెస్ వర్గాలు పేర్కొన్నాయి. -
జాన్సన్ అండ్ జాన్సన్‌కు 4.7 బిలియన్ డాలర్ల జరిమానా
సెయింట్ లూయీ (అమెరికా): బేబీ టాల్కం పౌడర్‌లో ఆస్బెస్టాస్ అవశేషాల వివాదంలో దిగ్గజ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్‌కి (జేఅండ్‌జే) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పౌడర్ వాడటం వల్ల ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడిన 22 మంది బాధిత మహిళలు, వారి కుటుంబాలకు 4.7 బిలియన్ డాలర్ల మేర పరిహారం చెల్లించాలంటూ సెయింట్ లూయీ సర్క్యూట్ కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా జేఅండ్‌జే తయారు చేసే బేబీ పౌడర్, షవర్ టు షవర్ ఉత్పత్తుల్లో ప్రధానంగా ప్రమాదకమైన ఆస్బెస్టాస్ అవశేషాలు ఉన్న సంగతి వాస్తవమేనని వైద్య నిపుణులు వాంగ్మూలం ఇచ్చారు. పలువురు బాధిత మహిళల అండా శయ కణాల్లో ఆస్బెస్టాస్ ఫైబర్, టాల్కం పౌడర్ రేణువులు కనిపించినట్లు తెలిపారు. అయితే, కోర్టు తీర్పుపై జేఅండ్‌జే అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు తమ ఏ ఉత్పత్తిలోనూ ఆస్బెస్టాస్ వినియోగం ఉండదని స్పష్టం చేసింది. విచారణంతా పక్షపాత ధోరణితో నడిచిందని, కోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తామని వివరించింది. మొత్తం మీద 9,000 మంది పైచిలుకు మహిళలు కంపెనీపై దావా వేశారు. -
జాన్సన్ అండ్ జాన్సన్‌కు రికార్డ్ జరిమానా
లాస్ఏంజిల్స్:జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి మరోసారి భారీ షాక్ తగిలింది. లాస్ ఏంజిల్స్ జ్యూరీ జాన్సన్ & జాన్సన్ రికార్డు స్థాయిలో పెనాల్టీ విధించింది. కంపెనీకి చెందిన బేబీ పౌడర్ వల్లే ఈవా ఎచివెరియా అనే మహిళకు ఒవేరియన్ (అండాశయ) క్యాన్సర్ సోకిందని నమ్మిన కోర్టు ఆమెకు రూ. 2700 కోట్లు(417 మిలియన్ల డాలర్లు) నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన ఫేమస్ బేబీ టాల్కమ్ పౌడర్ అండాశయ క్యాన్సర్ కారణమవుతోందని చెబుతూ లాస్ ఏంజిల్స్ కోర్టు ఈ భారీ జరిమానా విధించింది. దీన్ని వాడడం వల్లే ఆమెకు క్యాన్సర్ వచ్చినట్లు జ్యూరీ అభిప్రాయపడింది. టాల్కమ్ పౌడర్ వాడడం వల్ల వచ్చే క్యాన్సర్ ఇబ్బందుల గురించి జాన్సన్ కంపెనీ తమ ఉత్పత్తులపై హెచ్చరికలు చేయలేదని ఎచివెరియా ఆరోపించింది. 1950 నుంచి 2016 వరకు ఆమె జాన్సన్ బేబీ టాల్కమ్ను వాడుతున్నది. అయితే 2007లో తనకు ఒవేరియన్ క్యాన్సర్ వచ్చినట్లు గుర్తించారు. ప్రమాదకరమైన టాల్కమ్ను వాడడం వల్ల క్యాన్సర్ వచ్చినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనలాగా మరొకరికి నష్టం జరగకూడదనీ, ఇతర మహిళలకు తన పరిస్థితి గురించి హెచ్చరించాలన్న ఉద్దేశంతో కేసు ఫైల్ చేసినట్లు ఆమె లాయర్ మార్క్ రాబిన్సన్ చెప్పారు. నష్టం కింద 68 మిలియన్ల డాలర్లు, శిక్ష పరిహారం కింద 340 మిలియన్ల డాలర్లు చెల్లించాలని జాన్సన్ కంపెనీని ఆదేశించినట్టు తెలిపారు. మరోవైపు ఈ తీర్పుపై జాన్సన్ & జాన్సన్ స్పందించింది. జ్యూరీ నిర్ణయంపై అప్పీల్ చేస్తామని కంపెనీ ప్రతినిధి కరోల్ గూడ్రిచ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆరోపణలకు శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు. కాగా దాదాపు వెయ్యి దాకా ఇలాంటి వ్యాజ్యాలు కంపెనీపై దాఖలు అయ్యాయి. కొన్నింటిలో జరిమానాను కూడా ఎదుర్కొంటోంది. అయితే ఇప్పటివరకు వచ్చిన వాటిలోఇదే అతిపెద్ద పెనాల్టీగా తెలుస్తోంది. ముఖ్యంగా సెయింట్ లూయిస్, ఈ ఏడాది మే నెలలో మిస్సౌరీ జ్యూరీ వర్జీనియా మహిళకు 110.5 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించగా మరో కేసులో 72 మిలియన్డాలర్లు, 70.1 మిలియన్డాలర్లు, 55 మిలియన్‌డాలర్ల జరిమానాను ఫిర్యాదు దారులకు చెల్లించాల్సిందిగాకోర్టులు ఆదేశించాయి. అయితే సెయింట్ టూయిస్, న్యూ జెర్సీకోర్టులు బేబీ పౌడర్ వాడడం వల్లే అండాశయ క్యాన్సర్ వచ్చిందన్న వాదనను తిరస్కరించాయి. -
జాన్సన్ అండ్ జాన్సన్ కు భారీ జరిమానా
బేబీ ఫౌండర్ తో మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన ప్రముఖ ఎఫ్ ఎంసీజీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కు భారీ జరిమానా పడింది. కంపెనీకి చెందిన టాల్కం ఫౌడర్‌ను వాడటం వల్ల తనకు అండాశయ క్యాన్సర్ వచ్చిందంటూ ఓ మహిళ కోర్టుకు ఎక్కడంతో, అమెరికా కోర్టు ఈ సంస్థకు 110 మిలియన్ డాలర్ల(రూ.708కోట్లకుపైగా) జరిమానా విధించింది. వెర్జినీయాకు చెందిన లోయిస్ స్లేమ్ప్ అనే మహిళ నాలుగు దశాబ్దాలు టాల్కం ఫౌండర్లను వాడిన అనంతరం ఆమెకు అండాశయ క్యాన్సర్ సోకింది. అయితే ఈ ఫౌండర్ లో ఉండే కారకాల వల్ల క్యాన్సర్ వస్తుందని కంపెనీ ఎక్కడా కూడా హెచ్చరికలు చేయకపోవడం వల్ల ఇలాంటి పరిణామాలు వస్తున్నాయని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఈ జాన్సన్ అండ్ జాన్సన్ పై దాదాపు 2400 మేర ఫిర్యాదులు కోర్టులో ఉన్నాయి. అండాశయ క్యాన్సర్ సోకినట్టు లోయిస్ కు 2012లో డాక్టర్లు తేల్చారు. అనంతరం ఆ క్యాన్సర్ లివర్ కి కూడా సోకింది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఉత్పత్తులు బేబీ ఫౌండర్, షోవర్ టూ షోవర్ ఫౌండర్లను తాను వాడినట్టు లోయిస్ చెప్పడంతో, ఈ ఉత్పత్తులను వాడటం వల్లనే ఆమెకు క్యాన్సర్ వచ్చినట్టు నిర్ధారణైంది. అయితే ఈ కంపెనీ తనను తాను నిరూపించుకోవడంలో విఫలమవుతూ వస్తోంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ చూపించడంలో ఈ కంపెనీలు మరోసారి నిరాకరించాయని, మహిళల విషయంలో కనీస బాధ్యతలు కూడా వారు నిర్వర్తించడం లేదని లోయిస్ లాయర్ చెప్పారు. ఇంతకముందు కూడా ఇలాంటి కేసులు నిర్ధారణ కావడంతో జాన్సన్ అండ్ జాన్సన్ కు భారీ జరిమానాలనే అమెరికా కోర్టులు విధించాయి. -
నగరంలో ‘జాన్సన్’ ల్యాబ్
► అమెరికాలో కేటీఆర్ రెండోరోజు పర్యటన ► జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ ► రాష్ట్రంలో టీబీ నిర్మూలనకు ఒప్పందం ► డయేరియా నిర్మూలనకు మెర్క్ కంపెనీ చేయూత ► రాష్ట్రంలో వ్యాక్సిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు సుముఖత ► పలు కంపెనీలతో ఎంవోయూలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ రోగాల నిర్మూలనకు ప్రపంచ ప్రఖ్యాత ఔషధ కంపెనీలు ప్రభుత్వంతో చేతులు కలిపాయి. టీబీ రహిత రాష్ట్రంగా మార్చేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. పెట్టుబడుల సమీకరణలో భాగంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికాలో శుక్రవారం రెండోరోజు పర్యటించారు. ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ ఫార్మాస్యూటికల్ విభాగ చైర్మన్ పాల్ స్టోఫెల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది భారత్ పర్యటనలో భాగంగా తెలంగాణకు రానున్నట్లు పాల్ తెలిపారు. ఫార్మాసిటీ పట్ల ఆసక్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జాన్సన్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈవో మెలిండా పేర్కొన్నారు. మరో ఫార్మా దిగ్గజమైన మెర్క్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు సనత్ ఛటోపాధ్యాయతో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో డయేరియా మహమ్మారిని నిర్మూలించేందుకు తమ సహకారాన్ని అందిస్తామని సనత్ హామీనిచ్చారు. అలాగే పలు సేవా కార్యక్రమాలను రాష్ట్రంలో విస్తృతపరుస్తామని చెప్పారు. వచ్చేనెలలో హైదరాబాద్‌లో పర్యటిస్తామని, స్థానిక సంస్థలతో కలిసి నగరంలో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మంత్రికి వివరించారు. వాక్సిన్ ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా కంపెనీ సిద్ధంగా ఉందన్నారు. దీనిద్వారా వ్యాక్సిన్ తయారీ రంగంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఫైజర్ కంపెనీ గ్లోబల్ హెడ్ నానెట్ సొనెరో బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ కోసం ఏరా్పాటు చేసిన ఇకో ప్రాజెక్టు వివరాలను మంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (ఆర్ఐసీహెచ్) ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కేటీఆర్ వారిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఐవీ2 అలియెన్స్తో మరో ఎంవోయూ కుదుర్చుకుంది. మెడికల్ అండ్ హెల్త్‌కేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆవిష్కరణలను ఒకచోటుకు తీసుకురావడం ఈ ఎంవోయూ ఉద్దేశం.