జాన్సన్ అండ్ జాన్సన్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్
► అమెరికాలో కేటీఆర్ రెండోరోజు పర్యటన
► జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ
► రాష్ట్రంలో టీబీ నిర్మూలనకు ఒప్పందం
► డయేరియా నిర్మూలనకు మెర్క్ కంపెనీ చేయూత
► రాష్ట్రంలో వ్యాక్సిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు సుముఖత
► పలు కంపెనీలతో ఎంవోయూలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ రోగాల నిర్మూలనకు ప్రపంచ ప్రఖ్యాత ఔషధ కంపెనీలు ప్రభుత్వంతో చేతులు కలిపాయి. టీబీ రహిత రాష్ట్రంగా మార్చేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. పెట్టుబడుల సమీకరణలో భాగంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికాలో శుక్రవారం రెండోరోజు పర్యటించారు. ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ ఫార్మాస్యూటికల్ విభాగ చైర్మన్ పాల్ స్టోఫెల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది భారత్ పర్యటనలో భాగంగా తెలంగాణకు రానున్నట్లు పాల్ తెలిపారు. ఫార్మాసిటీ పట్ల ఆసక్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జాన్సన్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈవో మెలిండా పేర్కొన్నారు.
మరో ఫార్మా దిగ్గజమైన మెర్క్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు సనత్ ఛటోపాధ్యాయతో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో డయేరియా మహమ్మారిని నిర్మూలించేందుకు తమ సహకారాన్ని అందిస్తామని సనత్ హామీనిచ్చారు. అలాగే పలు సేవా కార్యక్రమాలను రాష్ట్రంలో విస్తృతపరుస్తామని చెప్పారు. వచ్చేనెలలో హైదరాబాద్‌లో పర్యటిస్తామని, స్థానిక సంస్థలతో కలిసి నగరంలో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మంత్రికి వివరించారు. వాక్సిన్ ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా కంపెనీ సిద్ధంగా ఉందన్నారు. దీనిద్వారా వ్యాక్సిన్ తయారీ రంగంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
అనంతరం ఫైజర్ కంపెనీ గ్లోబల్ హెడ్ నానెట్ సొనెరో బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ కోసం ఏరా్పాటు చేసిన ఇకో ప్రాజెక్టు వివరాలను మంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (ఆర్‌ఐసీహెచ్) ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కేటీఆర్ వారిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఐవీ2 అలియెన్స్‌తో మరో ఎంవోయూ కుదుర్చుకుంది. మెడికల్ అండ్ హెల్త్‌కేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆవిష్కరణలను ఒకచోటుకు తీసుకురావడం ఈ ఎంవోయూ ఉద్దేశం.