ఫైల్ ఫోటో
సాక్షి,న్యూఢిల్లీ : అమెరికా హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే) మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత ఊపందుకున్న ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమానికి మద్దతుగా స్కిన్ వైట్నింగ్ (చర్మం తెల్లబడే) క్రీమ్‌ల అమ్మకాలను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. వీటితోపాటు న్యూట్రోజెనా ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల అమ్మకాన్ని కూడా ఆపివేసినట్టు వెల్లడించింది.
భారతదేశం సహా ఇతర ప్రాంతాల్లో క్లీన్ అండ్ క్లియర్ ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తామని జేజే తెలిపింది. ఆసియా, మధ్యప్రాచ్యంలో విక్రయించే న్యూట్రోజెనా ఫైన్ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అమ్మకాలు ఉండవని పేర్కొంది. అయితే స్టాక్ ఉన్నంత వరకు క్లీన్ అండ్ క్లియర్ ఫెయిర్‌నెస్ ఉత్పత్తులను విక్రయిస్తామని చెప్పింది. నల్లమచ్చల్ని తొలగించుకొని అందంగా, తెల్లగా అవ్వమంటూ తమ ఉత్పత్తి పేర్లు లేదా ప్రచారం సాగిందని, మీ సొంత స్కిన్ టోన్ కంటే మెరిసిపోవాలంటూ తెల్ల రంగును హైలైట్ చేసిందని తెలిపింది. నిజానికి తమ ఉద్దేశం అది కాదని "ఆరోగ్యకరమైన చర్మం అందమైన చర్మం" అని కంపెనీ తెలిపింది. సాహసోపేతమైన తమ నిర్ణయాన్ని సానుకూల దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అయితే కంపెనీ వ్యాపారంపై ఇది పెద్దగా ప్రభావం చూపదని ఎందుకంటే దాని మార్కెట్ వాటా చాలా తక్కువ అని జేజే ప్రతినిధి చెప్పారు.
మరోవైపు జాన్సన్ అండ్ జాన్సన్ నిర్ణయం తరువాత ఇతర కంపెనీలు ఇలాంటి ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసే ధైర్యం చేస్తాయా అనే ప్రశ్నకు విశ్లేషకులు పెదవి విరిచారు. దేశీయ ఫెయిర్‌నెస్ క్రీమ్ మార్కెట్లో 2019లో సుమారు 450 మిలియన్ల డాలర్ల మార్కెట్ వాటా వున్న, ఇతర ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు దీనిని అనుసరించకపోవచ్చన్నారు. బ్రిటిష్-డచ్ బహుళజాతి సంస్థ అనుబంధ కంపెనీ హిందూస్తాన్ యూనిలీవర్, మరో విదేశీ సంస్థ ప్రొక్టర్ అండ్ గాంబుల్, గార్నియర్ (లోరియల్) ఈ విభాగంలో మార్కెట్ ను ఏలుతున్న సంగతి తెలిసిందే. బయోటిక్, లోటస్ హెర్బల్, హిమాలయ వంటి అనేక భారతీయ కంపెనీల ఫెయిర్‌నెస్ ఉత్పత్తులు కూడా భారీ విక్రయాలనే నమోదు చేస్తున్నాయి.
మనదేశంలో అత్యధికంగా అమ్ముడుబోయే ఫెయిర్‌నెస్ క్రీమ్ ఫెయిర్ అండ్ లవ్లీ. హిందూస్తాన్ యునిలివర్ కు అత్యంత విజయవంతమైన ఈ క్రీమ్ 2012 నాటికి, కంపెనీ మార్కెట్లో 80 శాతం ఆక్రమించిందంటే దీని డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు గత దశాబ్ద కాలంగా పురుషుల ప్రత్యేక ఫెయిర్‌నెస్ ఉత్పత్తులు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ తారలు షారూఖ్ ఖాన్, జాన్ అబ్రహం వీటికి ప్రచారకర్తలుగా ఉన్నారు.
అయితే ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల వ్యాపారం చాలా సంవత్సరాలుగా విమర్శలను ఎదుర్కొంటోంది. సౌందర్య సాధన పేరుతో జరుగుతున్న ఇలాంటి అమ్మకాలను నిషేధించాలంటూ ఇటీవల ఆన్‌లైన్ పిటిషన్ కూడా సర్క్యులేట్ అయింది. యూరోమోనిటర్ ఇంటర్నేషనల్ ప్రకారం, గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఫెయిర్‌నెస్ క్రీములు, మచ్చల నివారణ, యాంటీ ఏజింగ్ ఉత్పత్తులతో సహా సుమారు 6,277 టన్నుల స్కిన్ లైట్‌నర్ అమ్ముడుబోయిందట.
Comments
Please login to add a commentAdd a comment