fairness cream
-
ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల వల్ల ఆ సమస్యలు ! పరిశోధనలో షాకింగ్ విషయాలు
ఇటీవల కాలంలో ఎన్నో రకాల ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. అందుకు తగ్గట్టు ఉండే అడ్వర్టైస్మెంట్లు మహిళలను అట్రెక్ట్ చేసి మరీ కొనేలా చేస్తాయి ఈ ఫెయిర్‌నెస్ ప్రొడక్ట్‌లు. అయితే తాజా అధ్యయనంలో ఈ ఫెయిర్‌నెస్ వాడకం వల్ల ఆ సమస్యలు వస్తున్నాయంటూ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు ప్రజల ఆరోగ్యానికి హానికరమైన వాటితో ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు తయారు చేస్తారా? అని తయారీదారులపై ఫైర్ అవుతున్నారు. చర్మ సంరక్షణ ఎలా ఉన్నా.. ఆరోగ్యమే చెడి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు ఆరోగ్యానికి నిజంగానే హానికరమా? ఎందుకని? సవివరంగా తెలుసుకుందామా..! ఫెయిర్‌నెస్ క్రీమ్‌లంటే మహిళలకు, ముఖ్యంగా యువతకు ఎంత మక్కువ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్కెట్లో ఈ బ్యూటీ ప్రొడక్ట్స్‌కి ఉన్నంత డిమాండ్ మరే వ్యాపారానికి ఉండదంటే అతిశయోక్తి కాదేమో..!. అలాంటి ఈ ఫెయిర్‌నెస్ క్రీముల్లో మెర్క్యురీ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. దీని వల్ల మూత్రపిండాలకు సంబంధించిన మెంబ్రానస్ నెఫ్రోపతీ (ఎంఎన్) కేసులు భారత్‌లో ఎక్కువగా పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. అందుకు సంబంధించిన విషయం కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. ఈ పరిస్థితి కారణంగా మూత్రపిండాల్లో ఫిల్టరింగ్ వ్యవస్థ దెబ్బతిని ప్రోటీన్ లీకేజ్ కారణమవుతుందని చెబుతున్నారు. మూత్ర పిండాల వ్యాధి అనేది ముఖ్యంగా శరీరంలోని అంతర్గత రక్షణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీని ఫలితంగా నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఏర్పడి మూత్రపిండాల రుగ్మతకు కారణమవుతుంది. దీని కారణంగా మూత్రంలో పోటీన్లు వెళ్లిపోవడం జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే.. మనం ముఖానికి రాసుకునే ఫెయిర్‌నెస్ క్రీమ్ మూత్ర పిండాలపై ఎలా ఎఫెక్ట్ చూపుతుందంటే..?. ఆ ఫెయిర్‌నెస్ క్రీమ్‌లో వాడే పాదరసం చర్మం ద్వారా లోపలికి వెళ్తుంది. అది నేరుగా మూత్రపిండాల ఫిల్టర్ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో నెఫ్రోటిక్ సిండ్రోమ్ కేసులు పెరుగుదలకు దారితీస్తుందని పరిశోధకులు డాక్టర్ సజీష్ శివదాస్ అన్నారు. అందులోనూ మార్కెట్లో వచ్చే ప్రతి ఫెయిర్‌నెస్ క్రీమ్ తక్షణమై ముఖం ఫెయిర్‌గా ఉండేలా చేసే ఫలితాల కారణంగానే ఈ పరిస్థితి ఎదురయ్యిందని అన్నారు. అంతేగాదు జులై 2021 నుంచి 2023 మధ్య కాలంలో ఇలాంటి మూత్ర పిండాల రుగ్మతకు సంబంధించిన 22 కేసులపై అధ్యయనం నిర్వహించారు. ఆయా వ్యక్తులు తేలికపాటి ఎడెమా(వాపు), నురుగతో కూడిన మూత్రం తదితర లక్షణాలు కనిపించాయని అన్నారు. అంతేగాదు వారిలో చాలామందికి మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు పెరిగాయన్నారు. అలాగే ఒక రోగి మాత్ర మెదడులో రక్తం గడ్డకట్టే సెరిబ్రల్ వెయిన్ థ్రాంబోసిస్ కూడా వచ్చినట్లు తెలిపారు. అలాగే వైద్యపరీక్షల్లో 22 కేసుల్లో 68% మంది అంటే 15 మందికి న్యూరల్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 ప్రోటీన్(NELL-1) పాజిటివ్‌గా తేలింది. అంటే వారంతా మాత్రపిండాలకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నారని పరిశోధనలో తేలిందన్నారు. అంతేగాదు ఆ 15 మందిలో దాదాపు 13 మంది ఈ లక్షణాలు కనిపించక మునుపే తాము ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు వాడినట్లు అంగీకరించారు. మిగతా ఇద్దిరిలో ఒకరు సాంప్రదాయ స్వదేశీ క్రీములను వాడినట్లు తెలిపారు. మరోకరికి ఆ చరిత్ర కూడా లేదు. అయితే ఆయా రోగులు ఈ ఫెయిర్నస్ క్రీమ్‌లు వాడటం మానేసిన తర్వాత మూత్రిపిండాల వ్యాధి అదుపులో ఉన్నట్లు తేలింది. అంతేగాదు ఆయా ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల ఉత్పత్తులు ప్రజారోగ్యాన్ని ఎలా ప్రమాదంలో పడేస్తున్నాయి అనేందుకు ఈ తాజా పరిశోధనే ఉదహరణ అని తెలిపారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఈ ఉత్పత్తులను సమర్థించడం, పైగా ఇది బహుళ బిలియన్ డాలర్ల పరిశ్రమ కావడం వల్ల అధికారులెవరూ ఈ ఉత్పత్తులకు అడ్డకట్టవేసే సాహసం చేయడం లేదని ఆరోపించారు. ఇక్కడ కేవలం చర్మ సంరక్షణ, మూత్ర పిండాల సమస్య కాదు. ఇందులో ఉపయోగించే పాదరసం ప్రజల ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమైనదనేది గుర్తించడం తోపాటు ఈ హానికరమైన ఉత్పత్తులకు అడ్డుకట్టవేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: సెలబ్రిటీ శారీ డ్రేపర్: ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా..!) -
ఇక నుంచి ‘గ్లో అండ్ లవ్లీ’
సాక్షి, న్యూఢిల్లీ: ‘హిందుస్థాన్ యూనిలివర్’ కంపెనీ నుంచి వెలువడుతున్న ‘ఫేర్ అండ్ లవ్లీ’ అనే ఉత్పత్తి బ్రాండ్ ప్రజల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన విషయం తెల్సిందే. ఈ బ్రాండ్ ప్రచారం కోసం కంపెనీ మొదటి నుంచి ఎన్నో కోట్ల రూపాయలను ఖర్చు పెడుతూ వస్తోంది. తాజాగా ‘ఫేర్ అండ్ లవ్లీ’ పేరును మారుస్తూ హిందూస్తాన్ యూనిలివర్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఫేర్ అండ్ లవ్లీ’ పేరు స్థానంలో ‘గ్లో అండ్ లవ్లీ’తో ఫేర్నెస్ క్రీమ్‌ను మార్కెట్ చేయనున్నట్లు ఆ సంస్థ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో చోటు చేసుక్ను వర్ణవివక్ష హత్య ఉదంతం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిందూస్థాన్ యూనిలివర్ సంస్థ పేర్కొంది. (ఇక ‘ఫెయిర్’కు గుడ్‌బై..) ఇక ‘ఫేర్ అండ్ లవ్లీ’ బ్రాండ్ పేరు నుంచి ఫేర్ అనే పదం మాయం కానుంది. ఫేర్ అనే పదం మనిషి చర్మం తెలుపు రంగును సూచిస్తున్న విషయం తెల్సిందే. హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ తమ ఉత్పత్తుల బ్రాండ్ పేర్ల నుంచి, వాణిజ్య ప్రకటనల నుంచి ఫేర్, ఫేర్నెస్ పదాలతోపాటు ‘వైటెనింగ్, లైటనింగ్’ అనే పదాలను కూడా తొలగించాలని నిర్ణయించింది. ’ఫేర్ అండ్ లవ్లీ’ బ్రాండ్ పేరు నుంచి ఫేర్ పదాన్ని తొలగిస్తానని చెప్పిన కంపెనీ ఆ ఉత్పత్తిని ఉపసంహరించుకుంటున్నట్లు ఎక్కడా తెలియజేయలేదు. చర్మ రంగును తెలుపు చేస్తుందన్న ప్రచారంతోని ఆ కంపెనీ ఆ ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆ ఉత్పత్తి అలాగే కొనసాగించాలనుకుంటే ‘చర్మ సౌందర్యం కోసం’అని మార్చుకోవచ్చు. అదే విధంగా ‘స్కిన్ వైటెనింగ్’ ఉత్పత్తులను ఉపసంహరించుకొంటున్నామని ప్రముఖ కాస్మోటిక్ కంపెనీ ‘జాన్సన్ అండ్ జాన్సన్’ కూడా ప్రకటించింది. వాటి ఉత్పత్తులకు మరిన్ని మిశ్రామాలను జోడించి, మరింత మెరుగ్గా మరో పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తామని ఆ కంపెనీ తెలిపింది. ఆ కంపెనీ ‘చర్మ సౌందర్యం కోసం’ అంటుందా, మరో పేరు పెడుతుందా ? చూడాలి. ఈ రెండు కంపెనీల తరహాలోనే ‘వైటెనింగ్’ పేరిట లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఇతర కొస్మోటెక్ కంపెనీలు కూడా చర్మం రంగును తెలియజేసే పదాలన్నింటిని తామూ ఉపసంహరించుకుంటామని, వాటికి ‘స్కిన్ కేర్’ అని పేర్లు పెడతామని చెబుతున్నాయి. వాస్తవానికి ఆ ఉత్పత్తులేవీ కూడా స్కిన్ కేర్ కిందకు రావు. ‘బ్లాక్ ఈజ్ బ్యూటీ (నలుపే అందం)’ అన్న ప్రచారం భారత్‌లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఎన్నడూ స్పందించని ఈ కంపెనీలు ఇప్పుడు స్పందించడానికి అమెరికాలో కొనసాగుతున్న ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అనే ఉద్యమమే కారణం. జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని ఓ శ్వేత జాతీయుడైన అమెరికా పోలీసు అన్యాయంగా చెప్పడంతో అక్కడ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం ఉధృతమైంది. పుట్టుకతో వచ్చే మనిషుల చర్మం రంగు మధ్యలో మారదని, మనిషి ఒక చోటు నుంచి మరో చోటుకు మరినప్పుడు అక్కడి ఉష్ణ లేదా శీతల పరిస్థితుల్లో చర్మం రంగులో కొంత మార్పు వస్తుందిగానీ, మందులతో మార్పు రాదని వైద్య విజ్ఞానం మొదటి నుంచి చెబుతున్నా నలుపును తెలుపు చేస్తామంటున్న వ్యాపారం మాత్రం జోరుగా కొనసాగుతూ వస్తోంది. -
ఫెయిర్‌నెస్ క్రీమ్ అమ్మకాలు నిలిపివేత
సాక్షి,న్యూఢిల్లీ : అమెరికా హెల్త్‌కేర్, ఎఫ్ఎంసీజీ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే) మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత ఊపందుకున్న ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమానికి మద్దతుగా స్కిన్ వైట్నింగ్ (చర్మం తెల్లబడే) క్రీమ్‌ల అమ్మకాలను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. వీటితోపాటు న్యూట్రోజెనా ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల అమ్మకాన్ని కూడా ఆపివేసినట్టు వెల్లడించింది. భారతదేశం సహా ఇతర ప్రాంతాల్లో క్లీన్ అండ్ క్లియర్ ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తామని జేజే తెలిపింది. ఆసియా, మధ్యప్రాచ్యంలో విక్రయించే న్యూట్రోజెనా ఫైన్ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అమ్మకాలు ఉండవని పేర్కొంది. అయితే స్టాక్ ఉన్నంత వరకు క్లీన్ అండ్ క్లియర్ ఫెయిర్‌నెస్ ఉత్పత్తులను విక్రయిస్తామని చెప్పింది. నల్లమచ్చల్ని తొలగించుకొని అందంగా, తెల్లగా అవ్వమంటూ తమ ఉత్పత్తి పేర్లు లేదా ప్రచారం సాగిందని, మీ సొంత స్కిన్ టోన్ కంటే మెరిసిపోవాలంటూ తెల్ల రంగును హైలైట్ చేసిందని తెలిపింది. నిజానికి తమ ఉద్దేశం అది కాదని "ఆరోగ్యకరమైన చర్మం అందమైన చర్మం" అని కంపెనీ తెలిపింది. సాహసోపేతమైన తమ నిర్ణయాన్ని సానుకూల దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అయితే కంపెనీ వ్యాపారంపై ఇది పెద్దగా ప్రభావం చూపదని ఎందుకంటే దాని మార్కెట్ వాటా చాలా తక్కువ అని జేజే ప్రతినిధి చెప్పారు. మరోవైపు జాన్సన్ అండ్ జాన్సన్ నిర్ణయం తరువాత ఇతర కంపెనీలు ఇలాంటి ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసే ధైర్యం చేస్తాయా అనే ప్రశ్నకు విశ్లేషకులు పెదవి విరిచారు. దేశీయ ఫెయిర్‌నెస్ క్రీమ్ మార్కెట్లో 2019లో సుమారు 450 మిలియన్ల డాలర్ల మార్కెట్ వాటా వున్న, ఇతర ఎఫ్ఎంసీజీ కంపెనీలు దీనిని అనుసరించకపోవచ్చన్నారు. బ్రిటిష్-డచ్ బహుళజాతి సంస్థ అనుబంధ కంపెనీ హిందూస్తాన్ యూనిలీవర్, మరో విదేశీ సంస్థ ప్రొక్టర్ అండ్ గాంబుల్, గార్నియర్ (లోరియల్) ఈ విభాగంలో మార్కెట్ ను ఏలుతున్న సంగతి తెలిసిందే. బయోటిక్, లోటస్ హెర్బల్, హిమాలయ వంటి అనేక భారతీయ కంపెనీల ఫెయిర్‌నెస్ ఉత్పత్తులు కూడా భారీ విక్రయాలనే నమోదు చేస్తున్నాయి. మనదేశంలో అత్యధికంగా అమ్ముడుబోయే ఫెయిర్‌నెస్ క్రీమ్ ఫెయిర్ అండ్ లవ్లీ. హిందూస్తాన్ యునిలివర్ కు అత్యంత విజయవంతమైన ఈ క్రీమ్ 2012 నాటికి, కంపెనీ మార్కెట్లో 80 శాతం ఆక్రమించిందంటే దీని డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు గత దశాబ్ద కాలంగా పురుషుల ప్రత్యేక ఫెయిర్‌నెస్ ఉత్పత్తులు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ తారలు షారూఖ్ ఖాన్, జాన్ అబ్రహం వీటికి ప్రచారకర్తలుగా ఉన్నారు. అయితే ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల వ్యాపారం చాలా సంవత్సరాలుగా విమర్శలను ఎదుర్కొంటోంది. సౌందర్య సాధన పేరుతో జరుగుతున్న ఇలాంటి అమ్మకాలను నిషేధించాలంటూ ఇటీవల ఆన్లైన్ పిటిషన్ కూడా సర్క్యులేట్ అయింది. యూరోమోనిటర్ ఇంటర్నేషనల్ ప్రకారం, గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఫెయిర్‌నెస్ క్రీములు, మచ్చల నివారణ, యాంటీ ఏజింగ్ ఉత్పత్తులతో సహా సుమారు 6,277 టన్నుల స్కిన్ లైట్నర్ అమ్ముడుబోయిందట. -
ఒక్కరోజు 9 కోట్ల ఆఫర్.. నో చెప్పిన హీరో
ముంబై: బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన అభయ్ డియోల్ ఫెయిర్ నెస్ క్రీమ్స్ ప్రకటనలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో స్టార్ హీరోలు, హీరోయిన్లు కాస్త వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఓ అగ్రనటుడు కొన్ని గంటలకుగానూ రూ.9 కోట్లు అందుకునే భారీ ఆఫర్‌ను చేజార్చుకున్నాడని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నుంచి నటి సోనమ్ కపూర్ వరకూ ఇలా సౌందర్య సంబంధ ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే యాడ్స్‌లో నటించిన అందరిని అభయ్ బహిరంగంగానే విమర్శించాడు. మరోవైపు జాతివివక్షతో కూడిన వ్యాఖ్యలపై యాడ్ చేసినందుకు నేవియా క్షమాపణ కోరినట్లు అభయ్ డియోల్ తన ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. బాలీవుడ్లో ఫెయిర్ సెన్ క్రీమ్స్ వివాదం నెలకొన్న నేపథ్యంలో స్టార్ హీరో రణబీర్‌కపూర్‌కు ఓ ఫెయిర్ నెస్ క్రీమ్‌కు బ్రాండింగ్ చేసే చాన్స్ వచ్చింది. కేవలం ఒక్క రోజులోనే కొన్ని గంటలు యాడ్ చేస్తే రూ.9 కోట్లకు పైగా ఇస్తామని సంస్థ ఆఫర్ చేసినా.. రణబీర్ మాత్రం నో చెప్పాడట. 'తెల్లగా ఉంటే పరిపూర్ణత లభిస్తుంది. ఆత్మ విశ్వాసం పెంపొందుతుందంటూ' ప్రకటనలు చేసి జాత్యహంకారాన్ని కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయని అభయ్ డియోల్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లేని తలనొప్పి ఎందుకు కొని తెచ్చుకోవడం అనుకున్నాడేమోగానీ.. రణబీర్ కపూర్ మాత్రం ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్‌లో నటించవద్దని డిసైడయ్యాడు. -
మీరు ఫెయిర్‌నెస్ క్రీమ్స్ వాడుతున్నారా?
మరింత తెల్లగా కనిపించడం కోసం ఉపయోగించే ఫెయిర్‌నెస్ క్రీమ్‌లతో చాలా వరకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే ఈ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని గుర్తించండి. ఫెయిర్‌నెస్ క్రీమ్స్ వాడేవారికి డెర్మటాలజిస్ట్‌లు చేస్తున్న సూచనలివి. ♦ మీరు ఏదైనా ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడే ముందు దాన్ని కొద్దిగా శరీర భాగంలో ఎక్కడైనా (చేతికి అయితే మంచిది) కొద్దిగా ప్యాచ్‌లాగా రాసి... దాని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తెలుసుకున్న తర్వాతే వాడటం మంచిది. ♦ ఏదైనా క్రీమ్ ఎంపిక తర్వాత ఇలా టెస్ట్ చేసుకోకపోతే కొన్నిసార్లు కొందరిలో కాంటాక్ట్ డర్మటైటిస్, అలర్జిక్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. అదే కొద్దిగా ప్యాచ్‌లా రాసుకొని పరీక్షించడం వల్ల కొన్ని ప్రమాదాలను సమర్థంగా నివారించవచ్చని తెలుసుకోండి. ♦ స్టెరాయిడ్స్‌తో పాటు స్కిన్ లెటైనింగ్ క్రీమ్స్ వాడే సమయంలో మీ చర్మానికి సూట్ అయ్యేదాన్ని మీరే ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఒకసారి డర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం మరింత మంచిది. ♦ స్కిన్ లెటైనింగ్ క్రీమ్స్ వాడే సమయంలో దాని దురుపయోగం కూడదు. నిర్ణీత వేళల్లో నిర్ణీత మోతాదులోనే ఉపయోగించండి. ఎందుకంటే ఒక్కోసారి మరింత ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంలోని రంగునిచ్చే కణాలు తమ ధర్మాన్ని కోల్పోతాయి. అది ఒక్కోసారి కొన్ని దుష్ర్పభావాలకు దారితీయవచ్చు. ♦ స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ వల్ల చర్మం తెల్లగా అయినట్లు కనిపించినా దాన్ని విచ్చలవిడిగా వాడటం వల్ల స్టెరాయిడ్ డర్మటైటిస్ అనే సమస్య రావచ్చు. ఫలితంగా చర్మం పలచబారడం వంటి దుష్పరిణామాలు సంభవించవచ్చు. ఒక్కోసారి చర్మంపై పుండ్లు (అల్సర్స్) కూడా రావచ్చు. దాంతో చర్మం కింద ఉన్న రక్తనాళాలు కూడా మరింత వెడల్పుగా మారి (డయలేటెడ్ క్యాపిల్లరీస్) అవి దెబ్బతినే అవకాశం ఉంది. ♦ స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ మరీ ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై మొటిమలు (యాక్నే) వంటివి వచ్చే అవకాశం ఉంది. చర్మం మరింత మృదువుగా అయి చిన్న చిన్న గాయాలకే మరింత ఎక్కువగా ప్రతిస్పందించేలా (సెన్సిటివ్‌గా) మారవచ్చు. ♦ స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ మితిమీరి ఉపయోగించడం వల్ల వయసు పైబడే ప్రక్రియ వేగంగా జరగవచ్చు. శరీరంలోని చర్మకణాలను బిగుతుగా ఉండే కొలెజెన్ దెబ్బతిని ముడుతలు రావడం వేగంగా జరగవచ్చు. సన్ స్క్రీన్స్ ♦ సన్ స్క్రీన్స్ ఉపయోగించడం అన్నది ఎప్పుడూ మంచిదే. ♦ మన దేశంలో ఎస్పీఎఫ్ 25 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్స్ వాడటం మంచిది. ♦ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటి ఎండ నేరుగా పడేలా తిరగవద్దు. ♦ అలాగని అస్సలు ఎండలో తిరగకపోవడం వల్ల వైటమిన్ డి లోపం క్యాల్షియమ్ లోపం కూడా రావచ్చు. అందుకే అప్పుడప్పుడూ ఎండ తగులుతూ ఉండాలి. సాధారణ సూచనలు ♦ మీ చర్మం మరింత పొడిబారకుండా, మరీ జిడ్డు లేకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. ♦ నాన్-కమెడోజెనిక్ మాయిశ్చరైజర్లు వాడటం మంచిది. ఎందుకంటే అవి చర్మంపై ఉండే రంధ్రాలను పూడుకుపోనివ్వవు. ♦ మొటిమలు ఉన్నవారు, సున్నితంగా ఉండే చర్మం గలవారు తమకు అలవాటైన మేకప్ సామగ్రి, అలవాటైన పెర్ఫ్యూమ్స్ను మాత్రమే ఉపయోగించాలి. కొత్తవి ఉపయోగించాల్సి వస్తే కాస్త పరీక్షించాకే అవి కొనాలి. -
కీడెంచి 'యాడ్' ఎంచు...
(వెబ్ సైట్ ప్రత్యేకం) వారిద్దరూ బాలీవుడ్ నటీమణులే... ఒకరేమో ప్రకటనలో నటించి చిక్కుల్లో పడితే, మరొకరేమో 'యాడ్' ఆఫర్‌ను నిర్మొహమాటంగా తిప్పికొట్టి న్యూస్‌లో నిలిచారు. ఏక్ దో తీన్ అంటూ ఒకప్పుడు బాలీవుడ్ ను ఊర్రుతూలూగించిన అందాల తార మాధురీ దీక్షిత్ ఒకరయితే... మరొకరు ఇంట్లోవారికి ఇష్టం లేకున్నా అడ్డంకులను అధిగమించి జాతీయ ఉత్తమ స్థాయికి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్‌లో నటించేందుకు కోట్లు ఆఫర్ ఇచ్చినా ఛీ కొట్టి హైలెట్ అయితే.... మరొకరు దేశవ్యాప్తంగా దూమారం రేపుతున్న మ్యాగీ నూడుల్స్ ప్రకటనలో నటించి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. కోట్లు ఇస్తామంటే... బీడీ నుంచి బ్లేడ్ వరకూ ఏ ప్రకటనలో అయినా నటించేందుకు నటీనటులు సై అంటున్న పరిస్థితి ఉంది. అందుకు ఆయా ఉత్పత్తుల ప్రకటనలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తమ అభిమాన నటులంటే... పడి 'చచ్చే' ఫ్యాన్స్, ఫాలోయిర్స్... వారిని అనుకరిస్తూనే ఉంటారు. దాంతో ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు తమ ఉత్పత్తిని జనాల్లోకి తీసుకువెళ్లటంతో పాటు మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఆయా సంస్థలు సెకన్ల ప్రకటనలకు కూడా వాల్యూను బట్టి లక్షల నుంచి కోట్ల రూపాయలు కుమ్మరించి తారలను 'బ్రాండ్ అంబాసిడర్' లుగా నియమించుకుంటున్నాయి. దాంతో నెలలు, వారాలు తరబడి కష్టపడకుండా నటీనటులు సింపుల్‌గా గంటల్లో షూటింగ్ ముగించేసి కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు తాము నటించిన ప్రకటనలే వారి మెడకు చుట్టుకుంటున్నాయి. ప్రస్తుతం మాధురీ పరిస్థితి కూడా అదే. ఇంతకీ మాధురీ దీక్షిత్ ఏం చేసింది? 'అలసిపోయిన పిల్లలు మ్యాగీ నూడుల్స్ తింటే ఇట్టే శక్తి వస్తుంది. నేను తినిపిస్తున్నాను. మీరూ తినిపించండి' అని చెప్పటమే మ్యాగీ నూడుల్స్ ప్రకటనలో నటించటమే మాధురి చేసిన పొరపాటా? తప్పుచేసివారితోపాటు అందుకు పలువిధాలుగా సహకరించినవారు కూడా నిందార్హులేనన్న న్యాయసూత్రం ఇక్కడ ఆమె విషయంలో మరోసారి రుజువైంది. దాంతో ఆ ప్రకటనలో నటించిందుకు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'మ్యాగీ.. 2 మినిట్ నూడుల్స్'లో పరిమితికి మించి సీసం (లెడ్), మోనో సోడియం గ్లూటమేన్ ఉన్నట్లు దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ ప్రకటనలో నటించిన మాధురీ దీక్షిత్ పై కేసులు నమోదు అయ్యాయి. ఆమెతో పాటు ఈ యాడ్‌ను ప్రమోట్ చేసిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ప్రీతి జింటాలపైనా వేర్వేరుగా కేసులు నమోదు అయ్యాయి. ఇక కంగనా రనౌత్ విషయానికి వస్తే... భారీ 'ఆఫర్' చేస్తే... తారలు ఏ ప్రకటనలో అయినా నటిస్తారనే దాన్ని ఈ బాలీవుడ్ 'క్వీన్' తిరగరాసింది. ఓ ఫెయిర్ నెస్ క్రీమ్‌లో నటిస్తే పెద్ద మొత్తంలో ఇస్తామని ఆశ చూపినా ఆమె మాత్రం డోంట్ కేర్ అంది. తమ కంపెనీ ప్రకటనలో నటిస్తే ఏకంగా రెండు కోట్లు ఇస్తామన్నాఅందుకు కంగనా ససేమిరా అంది. ఆ కంపెనీ ఇంకా పెద్ద మొత్తంలో ఇస్తామన్నా.... 'ఫెయిర్' అనే పదమే తనకు నచ్చదని, విలువలే తన ఆస్థి అంటూ మొహం మీద చెప్పింది. యువతకి అందం తెచ్చేది ఆత్మ విశ్వాసం, శక్తి సామర్థ్యాలు, తెలివితేటలే కానీ వాళ్లు రాసుకునే క్రీమ్ వల్ల కాదని తెగేసి చెప్పటం విశేషం. దాంతో కంగనా నిర్ణయాన్ని అందరూ శభాష్ అని మెచ్చుకున్నారు. ఇక కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న సెలిబ్రిటీలు తమను కోట్లాది మంది ఫాలో అవుతున్నారనే విషయాన్ని కాస్త ఆలోచిస్తే మంచిదేమో. ప్రకటనల్లో నటించేటప్పుడు వచ్చే రెమ్యూనరేషన్‌తో పాటు ఆ ఉత్పత్తి ఎలాంటిది? జనానికి మంచి చేసేదా.. చెడు చేసేదా అనే విషయాలపై తారలు '2 మినిట్ మ్యాగీ'తో అయినా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మ్యాగీపై నిషేధం, నోటీసులు, కోర్టు కేసుల నేపథ్యంలో ఈ ఎపిసోడ్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. అదేదో యాడ్‌లో కష్టాల్లో ఉన్న యువతిని... ఓ బ్రాండ్ బనియన్ ధరించిన యువకుడు రక్షించినట్లు ఈ బ్రాండ్ అంబాసిడర్లను ఎవరు కాపాడతారో చూడాలి. -
నాలుగు వారాల్లో నిగారింపు..!
ఆరు వారాల్లో మీరు అందంగా తయారవుతారు.. అనేది ఒక ఫెయిర్‌నెస్ క్రీమ్ వారి ట్యాగ్‌లైన్. అయితే అలాంటి ఫెయిర్‌నెస్ క్రీమ్‌లను కాదు.. నీటిని నమ్ముకోండి నాలుగువారాల్లోనే మీరు చాలా అందంగా తయారవుతారు అని అంటోంది సారా. బ్రిటన్‌కు చెందిన సారా వయసు 42 సంవత్సరాలు. ఆ వయసుకు తగ్గట్టుగా కళ్లకింద క్యారీబ్యాగ్లతో మొహం మీద ముడతలు పడ్డ చర్మంతో ఉండేది సారా. అయితే ఇదంతా కొద్దికాలం క్రితం. ఇప్పుడు సారాలో చాలా మార్పు వచ్చింది. ఆమె కళ్ల కింద క్యారీబ్యాగులు మాయమయ్యాయి. చర్మంలో ఫ్రెష్‌నెస్ వచ్చింది. మొహంలో నిగారింపు వచ్చింది. కనీసం పదేళ్లు వయసు తగ్గినట్టుగా మారిపోయింది! మరి ఈ మార్పుకు కారణం ఏమిటి? అంటే ‘వాటర్’ అని సమాధానం ఇస్తుంది సారా. కొన్ని రోజుల క్రితం తనలో వృద్ధాప్య ఛాయలు పెరుగుతున్నాయని అర్థం చేసుకొన్నానని, ఇదంతా ఇక మామూలే అని అనుకొంటున్న సమయంలో నీటి ప్రాముఖ్యత గురించి గ్రహించానని సారా చెబుతోంది. ‘‘మనిషికి, ఒంటెకు ఒక పోలిక ఉంది. మనిషి కూడా నీటిని తాగకుండా చాలా సేపు ఉండగలడు. నేను ఉదయం టిఫిన్ సమయంలో ఒక గ్లాసు, మధ్యాహ్నం భోజనం సమయంలో ఒక గ్లాస్, రాత్రి భోజనం సమయంలో ఒక గ్లాస్ వాటర్ తీసుకొనేదాన్ని. అయితే.. అది చాలా పొరపాటు అని తర్వాత తెలిసింది. కచ్చితంగా నాలుగు వారాల కిందట లెక్కపెట్టుకొని రోజుకు మూడు లీటర్ల నీటిని తీసుకోవడం మొదలుపెట్టాను. వారం రోజుల్లోనే మొహంలో మార్పు స్పష్టంగా కనిపించింది. ప్రతివారం క్లోజప్‌లో ఫోటోలు తీసుకొని మార్పులను డాక్యుమెంటైజ్ చేశాను. ఇప్పుడు మొత్తంగా నాలో వచ్చిన మార్పును చూసి మా పిల్లలు కూడా ఆశ్చర్యపోతున్నారు...’’ అని సారా తన బ్యూటీ టిప్స్‌ను వివరిస్తోంది! మరి రోజుకుమూడు లీటర్ల నీటిని సేవించడం ద్వారా ఇన్ని ప్రయోజనాలు, ఇంత మార్పు ఉంటుందంటే.. వెంటనే సారా సలహా పాటించేయడం ఉత్తమం.