కీడెంచి 'యాడ్' ఎంచు...
(వెబ్ సైట్ ప్రత్యేకం)
వారిద్దరూ బాలీవుడ్ నటీమణులే... ఒకరేమో ప్రకటనలో నటించి చిక్కుల్లో పడితే, మరొకరేమో 'యాడ్' ఆఫర్ను నిర్మొహమాటంగా తిప్పికొట్టి న్యూస్లో నిలిచారు. ఏక్ దో తీన్ అంటూ ఒకప్పుడు బాలీవుడ్ ను ఊర్రుతూలూగించిన అందాల తార మాధురీ దీక్షిత్ ఒకరయితే... మరొకరు ఇంట్లోవారికి ఇష్టం లేకున్నా అడ్డంకులను అధిగమించి జాతీయ ఉత్తమ స్థాయికి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్లో నటించేందుకు కోట్లు ఆఫర్ ఇచ్చినా ఛీ కొట్టి హైలెట్ అయితే.... మరొకరు దేశవ్యాప్తంగా దూమారం రేపుతున్న మ్యాగీ నూడుల్స్ ప్రకటనలో నటించి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది.
కోట్లు ఇస్తామంటే... బీడీ నుంచి బ్లేడ్ వరకూ ఏ ప్రకటనలో అయినా నటించేందుకు నటీనటులు సై అంటున్న పరిస్థితి ఉంది. అందుకు ఆయా ఉత్పత్తుల ప్రకటనలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తమ అభిమాన నటులంటే... పడి 'చచ్చే' ఫ్యాన్స్, ఫాలోయిర్స్... వారిని అనుకరిస్తూనే ఉంటారు. దాంతో ఆ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు తమ ఉత్పత్తిని జనాల్లోకి తీసుకువెళ్లటంతో పాటు మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఆయా సంస్థలు సెకన్ల ప్రకటనలకు కూడా వాల్యూను బట్టి లక్షల నుంచి కోట్ల రూపాయలు కుమ్మరించి తారలను 'బ్రాండ్ అంబాసిడర్' లుగా నియమించుకుంటున్నాయి. దాంతో నెలలు, వారాలు తరబడి కష్టపడకుండా నటీనటులు సింపుల్గా గంటల్లో షూటింగ్ ముగించేసి కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు తాము నటించిన ప్రకటనలే వారి మెడకు చుట్టుకుంటున్నాయి. ప్రస్తుతం మాధురీ పరిస్థితి కూడా అదే.
ఇంతకీ మాధురీ దీక్షిత్ ఏం చేసింది?
'అలసిపోయిన పిల్లలు మ్యాగీ నూడుల్స్ తింటే ఇట్టే శక్తి వస్తుంది. నేను తినిపిస్తున్నాను. మీరూ తినిపించండి' అని చెప్పటమే మ్యాగీ నూడుల్స్ ప్రకటనలో నటించటమే మాధురి చేసిన పొరపాటా? తప్పుచేసివారితోపాటు అందుకు పలువిధాలుగా సహకరించినవారు కూడా నిందార్హులేనన్న న్యాయసూత్రం ఇక్కడ ఆమె విషయంలో మరోసారి రుజువైంది. దాంతో ఆ ప్రకటనలో నటించిందుకు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
'మ్యాగీ.. 2 మినిట్ నూడుల్స్'లో పరిమితికి మించి సీసం (లెడ్), మోనో సోడియం గ్లూటమేన్ ఉన్నట్లు దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ ప్రకటనలో నటించిన మాధురీ దీక్షిత్ పై కేసులు నమోదు అయ్యాయి. ఆమెతో పాటు ఈ యాడ్ను ప్రమోట్ చేసిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ప్రీతి జింటాలపైనా వేర్వేరుగా కేసులు నమోదు అయ్యాయి.
ఇక కంగనా రనౌత్ విషయానికి వస్తే...
భారీ 'ఆఫర్' చేస్తే... తారలు ఏ ప్రకటనలో అయినా నటిస్తారనే దాన్ని ఈ బాలీవుడ్ 'క్వీన్' తిరగరాసింది. ఓ ఫెయిర్ నెస్ క్రీమ్లో నటిస్తే పెద్ద మొత్తంలో ఇస్తామని ఆశ చూపినా ఆమె మాత్రం డోంట్ కేర్ అంది. తమ కంపెనీ ప్రకటనలో నటిస్తే ఏకంగా రెండు కోట్లు ఇస్తామన్నాఅందుకు కంగనా ససేమిరా అంది. ఆ కంపెనీ ఇంకా పెద్ద మొత్తంలో ఇస్తామన్నా.... 'ఫెయిర్' అనే పదమే తనకు నచ్చదని, విలువలే తన ఆస్థి అంటూ మొహం మీద చెప్పింది. యువతకి అందం తెచ్చేది ఆత్మ విశ్వాసం, శక్తి సామర్థ్యాలు, తెలివితేటలే కానీ వాళ్లు రాసుకునే క్రీమ్ వల్ల కాదని తెగేసి చెప్పటం విశేషం. దాంతో కంగనా నిర్ణయాన్ని అందరూ శభాష్ అని మెచ్చుకున్నారు.
ఇక కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న సెలిబ్రిటీలు తమను కోట్లాది మంది ఫాలో అవుతున్నారనే విషయాన్ని కాస్త ఆలోచిస్తే మంచిదేమో. ప్రకటనల్లో నటించేటప్పుడు వచ్చే రెమ్యూనరేషన్తో పాటు ఆ ఉత్పత్తి ఎలాంటిది? జనానికి మంచి చేసేదా.. చెడు చేసేదా అనే విషయాలపై తారలు '2 మినిట్ మ్యాగీ'తో అయినా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మ్యాగీపై నిషేధం, నోటీసులు, కోర్టు కేసుల నేపథ్యంలో ఈ ఎపిసోడ్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. అదేదో యాడ్లో కష్టాల్లో ఉన్న యువతిని... ఓ బ్రాండ్ బనియన్ ధరించిన యువకుడు రక్షించినట్లు ఈ బ్రాండ్ అంబాసిడర్లను ఎవరు కాపాడతారో చూడాలి.