మ్యాగీపై ముప్పేట దాడి | Maggi Noodles Ordered off India's Shelves Due to Lead Level | Sakshi
Sakshi News home page

మ్యాగీపై ముప్పేట దాడి

Published Thu, Jun 4 2015 1:33 AM | Last Updated on Mon, Oct 8 2018 4:21 PM

మ్యాగీపై ముప్పేట దాడి - Sakshi

మ్యాగీపై ముప్పేట దాడి

‘రెండు నిమిషాల్లో నూడిల్స్...’ అంటూ మార్కెట్‌లో తిరుగులేని లీడర్‌గా చలామణిలో ఉన్న మ్యాగీకి కష్టాలన్నీ కట్టగట్టుకుని ఒకేసారి వచ్చినట్టున్నాయి. అది మూడు దశాబ్దాలుగా దేశంలో నిర్మించుకుంటూ వచ్చిన సామ్రాజ్యం పదిరోజుల వ్యవధిలో తలకిందులైంది. యూపీకి చెందిన ఆహార, ఔషధ నిర్వహణ సంస్థ (ఎఫ్‌డీఏ) సీనియర్ అధికారి ఒకరు యాదృచ్ఛికంగా చేసిన తనిఖీ దాని తలరాతను మార్చేసింది. మ్యాగీ నూడిల్స్‌లో అత్యంత హానికరమైన సీసం, మోనోసోడియం గ్లూటామేట్ (ఎంఎస్‌జీ) వంటివి పరిమితికి మించిన స్థాయిలో ఉన్నాయని పరీక్షలో వెల్లడైంది. నిరుడు మార్చిలో తయారైన ఆ బ్యాచ్ ఉత్పత్తులను వెనక్కు తీసుకోవాలంటూ మ్యాగీ ఉత్పత్తిదారులైన స్విట్జర్లాండ్‌కు చెందిన నెస్లే సంస్థను ఆదేశించడంతోపాటు మ్యాగీ వాణిజ్య ప్రకటనల్లో నటించిన మాధురీ దీక్షిత్‌కు కూడా నోటీసులు పంపింది.
 
 ఇంతలో బీహార్‌లోని ఒక న్యాయస్థానం మ్యాగీపై వచ్చిన ఫిర్యాదును స్వీకరించడంతోపాటు మాధురీ దీక్షిత్, అమితాబ్‌బచ్చన్, ప్రీతీ జింటాలపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేయమని పోలీసులను ఆదేశించింది. ఆ వెనకే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేల్కొన్నాయి. మ్యాగీ శాంపిల్స్ సేకరించి వెనువెంటనే పరీక్షలు జరిపే పనిలోబడ్డాయి. మహారాష్ట్ర, గోవా, కేరళ రాష్ట్రాల్లో అంతా సవ్యంగానే ఉన్నదని నివేదికలు రాగా ఢిల్లీలో మాత్రం వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. నెస్లే సంస్థ ఇచ్చిన సంజాయిషీతో సంతృప్తి చెందని ఆప్ సర్కారు... తుది నిర్ణయం తీసుకోవడానికి వీలుగా పక్షం రోజులపాటు మ్యాగీ అమ్మకాలను ఆపేయాలని దుకాణాలకు ఆదేశాలిచ్చింది. మరికొన్ని రాష్ట్రాలు నివేదికల కోసం ఎదురు చూస్తున్నామని చెబుతున్నాయి. ఈలోగా నెస్లేపై వినియోగదారుల వివాద పరిష్కార సంఘం (ఎన్‌సీడీఆర్‌సీ)లో ఫిర్యాదుచేయాలని కేంద్రం నిర్ణయించింది. తాము జరిపించిన పరీక్షల్లో అంతా సవ్యంగానే ఉన్నట్టు తేలిందని నెస్లే సంస్థ చెబుతోంది.
 
 హఠాత్తుగా మొదలై కొనసాగుతున్న ఈ హడావుడి అంతా గమనిస్తే పదేళ్లక్రితం బహుళజాతి సంస్థలు ఉత్పత్తిచేసే శీతల పానీయాల్లో పురుగుమందుల అవశేషాలున్నా యని వెలువడిన కథనాలు గుర్తొస్తాయి. అప్పుడు కూడా శీతల పానీయాలపై నలు మూలల నుంచీ దాడి జరిగింది. వాటి అమ్మకాలపై అప్పట్లో కేరళ ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, ఆహార ఉత్పత్తులను నిషేధించే అధికారం రాష్ట్రాలకు లేదని కేరళ హైకోర్టు కొట్టేయడంతో అమ్మకాలు యధావిధిగా మొదలయ్యాయి. అటు తర్వాత బహుళజాతి సంస్థలు దారికొచ్చి స్వచ్ఛమైన పానీయాలు అందిస్తున్నాయా లేక అదే తంతు కొనసాగుతున్నదా అనేది ఎవరికీ తెలియదు. వాటి సామ్రాజ్యాలు మాత్రం అప్పటితో పోలిస్తే బాగా విస్తరించాయి. మారిన కాలమాన పరిస్థితుల్లో అలాంటి సంస్థలు బాట్లింగ్ యూనిట్లు స్థాపించడం ఏ రాష్ట్రానికైనా ప్రతిష్టాత్మకమైన అంశంగా మారింది.
 
 ఆహార పదార్థాల్లో కల్తీ, హానికారక పదార్థాలుండటంవంటి అంశాల్లో ఎప్పటి కప్పుడు తనిఖీలు చేసి చర్యలు తీసుకునేందుకు మన దేశంలో చాలా వ్యవస్థలు న్నాయి. కానీ, అవి సక్రమంగా పనిచేస్తున్న దాఖలాలు కనబడవు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) మొదలుకొని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ) వరకూ ఎన్నో ఉన్నాయి. ఆసియాలో చైనా తర్వాత అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న మన దేశంలోకి ఎన్నో ఉత్పత్తులు వచ్చిపడుతున్నాయి. ఈ ఉత్పత్తులపై సక్రమంగా పరీక్షలు నిర్వహిస్తున్నారా... అవి సురక్షితమైనవేనని నిర్ధారణ కొచ్చిన తర్వాతనే మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు అంగీకరిస్తున్నారా అనేది ఎవరికీ తెలియదు. ఆకర్షణీయమైన ప్యాక్‌లతో, అదరగొట్టే ప్రకటనలతో జనంలోకి చొచ్చుకుపోతున్న బహుళజాతి సంస్థల ఉత్పత్తులకు స్వల్పకాలంలోనే కావలసినంత ప్రచారం లభించి అమ్మకాలు పెరుగుతాయి. సినీతారలను, క్రీడా దిగ్గజాలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుని తమ ఉత్పత్తులు వాడటం ఆధునికతకూ, ఉత్తమాభిరుచికీ నిదర్శన మని వారితో చెప్పిస్తుంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి జనం మోసపోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. మ్యాగీ నూడిల్స్ ద్వారానే నెస్లే సంస్థ ఏటా రూ. 1,500 కోట్ల వ్యాపారం చేస్తున్నదని మార్కెట్ నిపుణుల అంచనా.
 
 మ్యాగీ నూడిల్స్ వంటివి ప్రాచుర్యం పొందడానికి జీవితంలో వచ్చిన వేగం కూడా ఒక కారణం. నోరూరించే రుచితో పిల్లల్ని ఆకట్టుకున్నది గనుక.... ఇంట్లో తినడానికి ఏం ఉండాలో నిర్ణయించేది వారే గనుక మ్యాగీ అమ్మకాలు బాగా పెరిగాయని చెబుతున్నారు. అంతకుమించి వంటిళ్లలో మగ్గిపోతున్న ఇల్లాళ్ల శ్రమను అది బాగా తగ్గించడం కూడా ఒక కారణమని చెప్పాలి. అది చెప్పుకుంటున్నట్టు రెండు నిమిషాల్లో కాకపోయినా పది నిమిషాల్లో ఆ నూడిల్స్ రెడీ అవుతుంటే గంటల సమయం పట్టే ఇతర వంటకాల జోలికి వెళ్లడానికి ఎవరూ సిద్ధపడరు. అలాగే మహానగరాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం వచ్చి ఒంటరిగా ఉండే యువతకూ, హాస్టల్స్‌లో ఉంటూ వేళపట్టున భోజనం చేయడం వీలుగానివారికి నెస్లే వంటి సంస్థలు ఉత్పత్తి చేసే ఫాస్ట్ ఫుడ్స్ వరంగా మారతాయి. ఆకర్షణీయంగా కనబడే ప్యాక్‌లపై ఏం రాసివుందో, అలా రాసినవన్నీ అందులో ఉన్నాయో, లేదో...అందులో పేర్కొనని ప్రమాదకర పదార్ధాలు ఇంకేమి ఉన్నాయో ఆరా తీసే ఓపికా, తీరికా ఎవరికీ ఉండవు. ఆ పని చేయాల్సిన సంస్థలు ఎన్నో కారణాలతో నిర్లిప్తంగా ఉండిపోతాయి.
 
 ఇప్పుడు మ్యాగీలో ఉన్నాయని చెబుతున్న హానికర పదార్థాల వల్ల పిల్లల్లో మేధో శక్తి తగ్గిపోతుందని, నరాల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నదని, గుండె సంబంధ వ్యాధులు పెరగవచ్చునని, కిడ్నీలు దెబ్బతినవచ్చునని చెబుతున్నారు. దీర్ఘకాలం తింటే లివర్ పనితీరు పాడయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇన్ని రకాలుగా ముప్పు పొంచివుండే ఆహార ఉత్పత్తులపై నిఘా ఉంచాల్సిన సంస్థలు మరి ఇన్నాళ్లుగా ఎందుకు మౌనంగా ఉండిపోయాయో అర్ధంకాని విషయం. మ్యాగీ నూడిల్స్‌కు జనాదరణ బాగా ఉండొచ్చుగానీ, దాంతోపాటే చాలా సంస్థల ఉత్పత్తులు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. నూడిల్స్ మాత్రమే కాదు... ఇంకా ఎన్నో రకాల ఫాస్ట్‌ఫుడ్స్ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఈ అనుభవంతోనైనా వాటన్నిటిపైనా సమగ్రంగా పరీక్షలు నిర్వహించి ప్రజలకు సురక్షితమైన ఆహార పదార్థాలు లభ్యమయ్యేలా చూడటం తమ కనీస బాధ్యతని ప్రభుత్వాలు గుర్తించాలి. మ్యాగీ సంగతి ఎలా ఉన్నా... ఏదైనా ఉత్పత్తిని కొనాలని చెప్పే ముందు ఆ సంస్థలిచ్చే సొమ్ములే కాక ఇతరత్రా అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సెలబ్రిటీలు తెలుసుకోవాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement