మ్యాగీపై నిషేధం ఎత్తివేత
నెస్లే కంపెనీకి బాంబే హైకోర్టులో ఊరట
ముంబై: నెస్లే కంపెనీకి తాత్కాలిక ఊరట లభించింది! మ్యాగీలో హానికర రసాయనాలున్నాయంటూ భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) దేశవ్యాప్తంగా విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు గురువారం ఎత్తేసింది. అయితే మ్యాగీ తాజా నమూనాలను హైదరాబాద్, జైపూర్, పంజాబ్‌లోని ఆహార పరీక్ష కేంద్రాలకు పంపాలని ఆదేశించింది. మ్యాగీలో హానికర లెడ్(సీసం) అనుమతించిన మోతాదు కన్నా తక్కువ ఉన్నట్లు ఈ పరీక్షల్లో తేలితే తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చని తెలిపింది.
దేశవ్యాప్తంగా మ్యాగీపై నిషేధం విధిస్తూ జూన్ 5న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇచ్చిన ఆదేశాలతోపాటు రాష్ట్రంలో నిషేధం విధిస్తూ మహారాష్ట్ర ఆహార, ఔషధ విభాగం ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. నిషేధం విషయంలో సహజన్యాయ సూత్రాలను పాటించలేదని, తన వాదన చెప్పుకునేందుకు నెస్లేకు అవకాశం దక్కలేదని కోర్టు పేర్కొంది. మ్యాగీని పరీక్షించిన ల్యాబ్‌లు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ లాబొరేటరీస్‌కు అనుబంధ సంస్థలు కావంది.
అన్ని రకాల నూడుల్స్ నుంచి ఐదు శాంపిళ్లను హైదరాబాద్, జైపూర్, పంజాబ్‌లలో ఎన్‌ఏబీఎల్ గుర్తించిన ల్యాబ్‌లకు పరీక్షల కోసం పంపాలంది. 6 వారాల్లో ల్యాబ్‌లు నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న ఆహార భద్రత సంస్థలు చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని కానీ, లేదని కానీ చెప్పలేమని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది.