నిషేధంపై నెస్లే పిటిషన్
ముంబై: తొమ్మిది రకాల మ్యాగీ ఉత్పత్తులపై భారత ఆహార భద్రత, నాణ్యత సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిషేధం విధించడాన్ని సవాలు చేస్తూ నెస్లే ఇండియా కంపెనీ గురువారం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశంపై త్వరగా విచారణ చేపట్టాలని కంపెనీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. మార్కెట్ నుంచి తొమ్మిది రకాల మ్యాగీ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలంటూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈనెల 5న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నవించారు.
మహారాష్ట్రలో మ్యాగీ అమ్మకాలను నిషేధిస్తూ ఆహార భద్రత కమిషనర్ జారీ చేసిన ఆదేశాలను కూడా కొట్టేయాలని అభ్యర్థించారు. నెస్లే పిటిషన్‌పై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టనుంది.