nestle company
-
పసివాళ్ల ఆహారంతో ఆటలా!
తొమ్మిదేళ్లనాటి మ్యాగీ నూడిల్స్ వివాదం నుంచి బయటపడి రెండు వారాలు గడిచాయో లేదో... నెస్లే కంపెనీ మెడకు కొత్తగా సెరిలాక్ తగువు చుట్టుకుంది. ఈసారి దీని మూలం మన దేశంలో కాదు, స్విట్జర్లాండ్‌లో వుంది. భిన్న రకాల ఉత్పత్తుల ద్వారా లాభాల రూపంలో ఏటా వేలాదికోట్ల రూపాయలు తరలించుకుపోతున్న బహుళజాతి సంస్థలకు ఇక్కడి ప్రజల ఆరోగ్యం విషయంలోగానీ... ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలపైగానీ పెద్దగా పట్టింపు వుండదని చాలామంది చేసే ఆరోపణ. అడపా దడపా వెల్లడవుతున్న అంశాలు వాటిని బలపరిచేవిగానే వుంటున్నాయి. భారత్‌లో పసివాళ్ల ఆకలి తీర్చడానికి తల్లులు ఉపయోగించే సెరిలాక్లో అధిక శాతం చక్కెరవుంటున్నదని స్విట్జర్లాండ్‌లోని స్వచ్ఛంద సంస్థ ‘పబ్లిక్ ఐ’ మరో సంస్థ అంతర్జాతీయ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్ (ఐబీ–ఫాన్)తో కలిసి గురువారం బయటపెట్టాక దేశం నివ్వెరపోయింది. నెస్లే సంస్థ ఒక్క భారత్‌లో మాత్రమే కాదు, యూరప్ దేశాలతోపాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా దేశాల్లో కూడా సెరిలాక్ విక్రయిస్తోంది. కానీ యూరప్ దేశాల పిల్లల కోసం తయారుచేసే సెరిలాక్కూ, వేరే దేశాల్లో విక్రయించే సెరిలాక్కూ చాలా వ్యత్యాసం వుంది. యూరప్ దేశాల్లో విక్రయించే సెరిలాక్లో అసలు చక్కెర పదార్థాలే వాడని నెస్లే... ఇతరచోట్ల మాత్రం యధేచ్ఛగా వినియోగిస్తున్నట్టు ‘పబ్లిక్ ఐ’ తెలిపింది. మూడేళ్లలోపు పిల్లలు తినే ఆహార పదార్థాల్లో కృత్రిమంగా తీపిని పెంచే సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి పదార్థాలేవీ కలపరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. పసిపిల్లల ఆహారోత్పత్తుల్లో కృత్రిమ తీపి పదార్థాలు, అదనపు చక్కెర వుండరాదన్నది 2022 సంవత్సర ప్రధాన నినాదం కూడా. కానీ దురదృష్టమేమంటే మన దేశం వాటి వినియోగాన్ని అనుమతిస్తోంది. తమ చిన్నారులకు అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్ తదితర పోషకాలు లభిస్తాయన్న ఆశతో తల్లులు సెరిలాక్ వంటి ఉత్పత్తులను ఆశ్రయిస్తారు. గత అయిదేళ్లుగా సెరిలాక్లో కృత్రిమ తీపి పదార్థాల వాడకాన్ని 30 శాతం తగ్గించామని నెస్లే కంపెనీ తాజా వివాదం తర్వాత సంజాయిషీ ఇస్తోంది. మంచిదే. కానీ అసలు వాడరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నప్పుడు ఈ తగ్గించటమేమిటి? ఇన్ని దశాబ్దా లుగా వాటిని ఎందుకు కొనసాగించినట్టు? ఇది తప్పించుకునే ధోరణి కాదా? నెస్లే సంస్థ సంగతలావుంచి అసలు మన దేశంలో అమ్ముడవుతున్న బహుళజాతి సంస్థల ఉత్పత్తుల్లో తగిన ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో చూసి నియంత్రించాల్సిన ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) ఏమైనట్టు? ఎక్కడో స్విట్జర్లాండ్‌లోని స్వచ్ఛంద సంస్థలు వివిధ దేశాల్లో విక్రయించే సెరిలాక్ ఉత్పత్తుల నమూనాలను సేకరించి నిగ్గుతేల్చే వరకూ ఆ సంస్థ గాఢ నిద్రపోయిందా అనే సందేహం రావటం సహజం. పసివాళ్లకు అందించే ఆహారంలో పరిమితికి మించి చక్కెర లేదా ఉప్పు ఎక్కువైతే వారి ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుందనీ, చిన్న వయసునుంచే తీపి పదార్థాలకు వారు అలవాటుపడతారనీ నిపుణులంటారు. ఈ పదార్థాలు ఊబకాయాన్ని పెంచుతాయని, పిల్లలు శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్, మధు మేహంవగైరా వ్యాధులకు లోనవు తారని హెచ్చరిస్తారు. మన పిల్లల్లో ఇటీవలకాలంలో ఊబకాయం లక్షణం పెరుగుతున్నదని అనేక సర్వేలు గొంతు చించుకుంటున్నాయి కూడా. అయినా నియంత్రణ వ్యవస్థల చెవులకు సోకలేదు. ఒక అంచనా ప్రకారం కేవలం సెరిలాక్ అమ్మకాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నెస్లే సంస్థ ఏటా వంద కోట్ల డాలర్ల (రూ. 8,400 కోట్లు)కుపైగా ఆర్జిస్తోంది. ఇందులో భారత్, బ్రెజిల్ దేశాల వాటాయే 40 శాతం వుంటుందని అంటారు. ఇంతగా లాభాలొచ్చే ఉత్పత్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసు కోవాలనీ, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలనీ నెస్లేకు తెలియదా? పోనీ అన్నిచోట్లా ఇలానే చేస్తే అజ్ఞానమో, నిర్లక్ష్యమో అనుకోవచ్చు. కానీ ధనిక దేశాల్లో ఒకరకంగా, వర్ధమాన దేశాల్లో మరో విధంగా ద్వంద్వ ప్రమాణాలు పాటించటం ఏ వ్యాపార నీతి? ఆహార ఉత్పత్తులు, శీతల పానీయాలు తదితరాల విషయంలో ఏమరుపాటు పనికిరాదు. వాటిని ఎప్పుడో ఒకసారి పరీక్షించి చూసి వదిలేయకూడదు. నిర్ణీత కాలపరిమితుల్లో నిరంతరం వాటి నమూనాలను పరీక్షిస్తూ వుండాలి. మనం తినే తిండి ఆరోగ్యదాయకమేనా, సురక్షితమేనా అని మాత్రమే కాదు... ఉత్పత్తిదారు చెప్పుకుంటున్నవిధంగా అందులో పోషకాలున్నాయో లేదో గమనించాలి. ప్రమాణాలకు అనుగుణంగా లేనివాటిని నిర్దాక్షిణ్యంగా మార్కెట్ నుంచి తొలగించాలి. ప్రపంచంలో చైనా తర్వాత మన దేశమే అతి పెద్ద మార్కెట్. అందుకే బహుళజాతి సంస్థలు సినీతారలనూ, క్రీడా దిగ్గజాలనూ తమ బ్రాండ్ అంబాసిడర్లుగా రంగంలోకి దించి ప్రకటనలతో ఊదరకొడుతూ అచిరకాలంలోనే లాభాల బాట పడుతుంటాయి. ఆ ఉత్పత్తుల్ని వాడటం ఆధునికతకూ, ఉత్తమాభి రుచికీ నిదర్శనమని బ్రాండ్ అంబాసిడర్లు చెప్తే మోసపోవటానికి మన మధ్యతరగతి ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. 2015లో మ్యాగీ నూడిల్స్‌లో అత్యంత హానికరమైన సీసం, మోనోసోడియం గ్లూటామేట్ వంటి పదార్థాలున్నాయని వెల్లడైనప్పుడు గగ్గోలైంది. తీరా తొమ్మిదేళ్లు గడిచాక జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ మ్యాగీ నూడిల్స్ విషయంలో కేంద్రం నిర్ణయం సరికాదని ఈనెల మొదటివారంలో తోసిపుచ్చింది. నెస్లేకు క్లీన్చిట్ ఇచ్చింది. భవిష్యత్తులో సెరిలాక్ విషయంలోనూ ఇదే జరుగుతుందా? ఇతరత్రా అంశాల మాటెలావున్నా హానికారక ఆహార పదార్థాలు మార్కెట్లోకి రాకుండా చూడాల్సిన కనీస బాధ్యత తమకున్నదని కేంద్ర ప్రభుత్వం గుర్తించటం అవసరం. -
గాజా గాయాలు.. పార్లమెంట్ మెనూ నుంచి వాటి తొలగింపు!
ఇజ్రాయెల్-హమాస్ గ్రూప్ మధ్య జరుగుతున్న యుద్ధం ఒకవైపు భారీ ప్రాణ నష్టం.. మరోవైపు భారీ మానవతా సంక్షోభం దిశగా ముందుకెళ్తోంది. గాజాలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. అదే సమయంలో పాశ్చాత్య, మిడిల్ ఈస్ట్ దేశాల నడుమ రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. తుర్కియే(పూర్వపు టర్కీ) ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ మెనూ నుంచి కోకాకోలా, నెస్లే ఉత్పత్తులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. హమాస్‌తో జరుగుతున్న పోరులో ఇజ్రాయెల్‌కు ఆ కంపెనీలు మద్దతు ప్రకటించాయని, అందుకే వాటిని తమ పార్లమెంట్ క్యాంటీన్ నుంచి తొలగిస్తున్నట్లు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ ప్రాంగణంలోని రెస్టారెంట్లలో, కఫేటేరియాల్లో, టీ హౌజ్‌లలో ఇకపై ఆయా ఉత్పత్తులను అమ్మకూడదని పార్లమెంట్ స్పీకర్ నుమాన్ కుర్తుల్మస్ పేరిట ఒక ప్రకటన వెలువడింది. మరోవైపు ఈ పరిణామంపై ఆ కంపెనీలు స్పందించాల్సి ఉంది. గాజాకు సంఘీభావంగా.. తమ దేశ ప్రజల డిమాండ్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ ఆ ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు గాజా దాడుల నేపథ్యంగా.. సోషల్ మీడియాలోనూ ఇజ్రాయెల్ ఉత్పత్తులను, పాశ్చాత్య దేశాల కంపెనీలను బహిష్కరించాలనే డిమాండ్ నానాటికీ పెరిగిపోతోంది. యుద్ధ వాతావరణ నేపథ్యంలో టర్కీ-ఇజ్రాయెల్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఇప్పటికే తీవ్రంగా దెబ్బ తిన్నాయి. -
నెస్లే ఇండియా భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: గ్లోబల్ ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఎస్ఏ దేశీయంగా భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. రానున్న మూడున్నరేళ్లలోగా అంటే 2025కల్లా రూ. 5,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ సీఈవో మార్క్ ష్నీడర్ వెల్లడించారు. తద్వారా దేశీ బిజినెస్‌కు జోష్‌నివ్వడంతోపాటు కొత్త వృద్ధి అవకాశాలను అందుకోనున్నట్లు తెలియజేశారు. నిధులను పెట్టుబడి వ్యయాలుగా వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త ప్లాంట్ల ఏర్పాటు, ఇతర సంస్థల కొనుగోళ్లు, ప్రొడక్టు పోర్ట్‌ఫోలియో విస్తరణ తదితరాలను చేపట్టనున్నట్లు వివరించారు. కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9 ప్లాంట్లను నిర్వహిస్తోంది. కొత్తగా తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు తగిన ప్రాంతాలను అన్వేషిస్తున్నట్లు నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. పెట్టుబడులకు అధికారిక సంస్థల నుంచి అనుమతులు లభించాల్సి ఉండగా.. మరింత మందికి ఉపాధి లభించే వీలుంది. ప్రస్తుతం 6,000 మంది సిబ్బంది ఉన్నారు. టాప్–10లో ఒకటి... నెస్లేకు ప్రాధాన్యతగల టాప్–10 మార్కెట్లలో ఒకటైన ఇండియాలో 2025కల్లా రూ. 5,000 కోట్లు వెచ్చించనున్నట్లు ష్నీడర్ తెలియజేశారు. కంపెనీ గత ఆరు దశాబ్దాలలో రూ. 8,000 కోట్లను వెచ్చించినట్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశీయంగా 110 ఏళ్ల క్రితమే కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ 1960 నుంచీ తయారీకి తెరతీసినట్లు వివరించారు. -
అయ్యో! ఆదాయం పెరిగినా.. నెస్లే ఇండియా నేల చూపులు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022) రెండో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా ఆసక్తికర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ2)లో నికర లాభం 4 శాతం క్షీణించి రూ. 515 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 539 కోట్లు ఆర్జించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు లాభాలను ప్రభావితం చేశాయి. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. కాగా.. మొత్తం ఆదాయం మాత్రం 16 శాతం ఎగసి రూ. 4,007 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 3,462 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 21 శాతం పెరిగి రూ. 3,356 కోట్లకు చేరాయి. గత క్యూ1లో రూ. 2,776 కోట్లుగా నమోదయ్యాయి. పెట్ బిజినెస్ అమ్మకాల్లో వృద్ధి కొనసాగడంతో క్యూ2లో తొలిసారి రూ. 4,000 కోట్ల మార్క్‌ను దాటినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. దేశీ అమ్మకాలు 16 శాతం బలపడి రూ. 3,848 కోట్లకు చేరగా.. ఎగుమతులు నామమాత్ర వృద్ధితో రూ. 158 కోట్లుగా నమోదయ్యాయి. స్విస్ మాతృ సంస్థ నుంచి పురీనా పెట్‌కేర్ ఇండియాను కొనుగోలు చేయడం ద్వారా పెట్ ఫుడ్ విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకు రూ. 123 కోట్లకుపైగా వెచ్చించింది. చదవండి: సంచలనం : ప్రపంచంలో తొలి 200 మెగాపిక్సెల్ ఫోన్.. ధర ఎంతంటే! -
మ్యాగీపై నిషేధం ఎత్తివేత
నెస్లే కంపెనీకి బాంబే హైకోర్టులో ఊరట ముంబై: నెస్లే కంపెనీకి తాత్కాలిక ఊరట లభించింది! మ్యాగీలో హానికర రసాయనాలున్నాయంటూ భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) దేశవ్యాప్తంగా విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు గురువారం ఎత్తేసింది. అయితే మ్యాగీ తాజా నమూనాలను హైదరాబాద్, జైపూర్, పంజాబ్‌లోని ఆహార పరీక్ష కేంద్రాలకు పంపాలని ఆదేశించింది. మ్యాగీలో హానికర లెడ్(సీసం) అనుమతించిన మోతాదు కన్నా తక్కువ ఉన్నట్లు ఈ పరీక్షల్లో తేలితే తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా మ్యాగీపై నిషేధం విధిస్తూ జూన్ 5న ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇచ్చిన ఆదేశాలతోపాటు రాష్ట్రంలో నిషేధం విధిస్తూ మహారాష్ట్ర ఆహార, ఔషధ విభాగం ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. నిషేధం విషయంలో సహజన్యాయ సూత్రాలను పాటించలేదని, తన వాదన చెప్పుకునేందుకు నెస్లేకు అవకాశం దక్కలేదని కోర్టు పేర్కొంది. మ్యాగీని పరీక్షించిన ల్యాబ్‌లు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ లాబొరేటరీస్‌కు అనుబంధ సంస్థలు కావంది. అన్ని రకాల నూడుల్స్ నుంచి ఐదు శాంపిళ్లను హైదరాబాద్, జైపూర్, పంజాబ్‌లలో ఎన్ఏబీఎల్ గుర్తించిన ల్యాబ్‌లకు పరీక్షల కోసం పంపాలంది. 6 వారాల్లో ల్యాబ్‌లు నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న ఆహార భద్రత సంస్థలు చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని కానీ, లేదని కానీ చెప్పలేమని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. -
నెస్లే ఇండియా చీఫ్‌గా 16 ఏళ్ల తర్వాత భారతీయుడు
న్యూఢిల్లీ : మ్యాగీ ఉదంతంతో స్విట్జర్లాండ్‌కు చెందిన నెస్లే కంపెనీ తన ఇండియా విభాగపు అధిపతిని తొలగించింది. ప్రస్తుతం నెస్లే ఇండియా మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న ఇటిన్నె బెనెట్‌ను తొలగించి సురేశ్ నారాయణన్ నియమించింది. ఈ నియామకం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఒక భారతీయుడిని ఈ ఉన్నత పదవిలో నెస్లే నియమించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిషేధం కారణంగా మ్యాగీ నూడుల్స్‌ను నెస్లే కంపెనీ స్టోర్స్ నుంచి ఉపసంహరించింది. 1999లో నెస్లేలో చేరిన నారాయణన్ ప్రస్తుతం నెస్లే ఫిలిప్పైన్స్ చైర్మన్, సీఈఓగా పనిచేస్తున్నారు. -
తమిళనాడులో మ్యాగీ నిషేధం
న్యూఢిల్లీ: హాని కల్గించే రసాయనాలు ఉన్నాయన్న కారణంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిషేధం ఎదుర్కొంటున్న మ్యాగీ న్యూడుల్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా మ్యాగీ నూడుల్స్ పై మూడు నెలల పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఉత్తరాఖండ్‌లో మూడు నెలలు నిషేధం విధించగా, గుజరాత్, జమ్మూకశ్మీర్‌లలో ఒక నెల చొప్పున నిషేధం విధించాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని లేదని పరీక్షల్లో తేలిన తర్వాతే అనుమతిస్తామని స్పష్టంచేశాయి. దీంతో పాటు బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా మ్యాగీపై చర్చలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి.ఢిల్లీ ప్రభుత్వం బుధవారమే మ్యాగీ న్యూడుల్స్పై 15 రోజులపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా నేపాల్ మ్యాగీ దిగుమతులపై నిషేధం విధించింది. -
మ్యాగీపై ముప్పేట దాడి
‘రెండు నిమిషాల్లో నూడిల్స్...’ అంటూ మార్కెట్లో తిరుగులేని లీడర్‌గా చలామణిలో ఉన్న మ్యాగీకి కష్టాలన్నీ కట్టగట్టుకుని ఒకేసారి వచ్చినట్టున్నాయి. అది మూడు దశాబ్దాలుగా దేశంలో నిర్మించుకుంటూ వచ్చిన సామ్రాజ్యం పదిరోజుల వ్యవధిలో తలకిందులైంది. యూపీకి చెందిన ఆహార, ఔషధ నిర్వహణ సంస్థ (ఎఫ్‌డీఏ) సీనియర్ అధికారి ఒకరు యాదృచ్ఛికంగా చేసిన తనిఖీ దాని తలరాతను మార్చేసింది. మ్యాగీ నూడిల్స్‌లో అత్యంత హానికరమైన సీసం, మోనోసోడియం గ్లూటామేట్ (ఎంఎస్‌జీ) వంటివి పరిమితికి మించిన స్థాయిలో ఉన్నాయని పరీక్షలో వెల్లడైంది. నిరుడు మార్చిలో తయారైన ఆ బ్యాచ్ ఉత్పత్తులను వెనక్కు తీసుకోవాలంటూ మ్యాగీ ఉత్పత్తిదారులైన స్విట్జర్లాండ్‌కు చెందిన నెస్లే సంస్థను ఆదేశించడంతోపాటు మ్యాగీ వాణిజ్య ప్రకటనల్లో నటించిన మాధురీ దీక్షిత్‌కు కూడా నోటీసులు పంపింది. ఇంతలో బీహార్‌లోని ఒక న్యాయస్థానం మ్యాగీపై వచ్చిన ఫిర్యాదును స్వీకరించడంతోపాటు మాధురీ దీక్షిత్, అమితాబ్‌బచ్చన్, ప్రీతీ జింటాలపై ఎఫ్ఐఆర్ నమోదుచేయమని పోలీసులను ఆదేశించింది. ఆ వెనకే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేల్కొన్నాయి. మ్యాగీ శాంపిల్స్ సేకరించి వెనువెంటనే పరీక్షలు జరిపే పనిలోబడ్డాయి. మహారాష్ట్ర, గోవా, కేరళ రాష్ట్రాల్లో అంతా సవ్యంగానే ఉన్నదని నివేదికలు రాగా ఢిల్లీలో మాత్రం వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. నెస్లే సంస్థ ఇచ్చిన సంజాయిషీతో సంతృప్తి చెందని ఆప్ సర్కారు... తుది నిర్ణయం తీసుకోవడానికి వీలుగా పక్షం రోజులపాటు మ్యాగీ అమ్మకాలను ఆపేయాలని దుకాణాలకు ఆదేశాలిచ్చింది. మరికొన్ని రాష్ట్రాలు నివేదికల కోసం ఎదురు చూస్తున్నామని చెబుతున్నాయి. ఈలోగా నెస్లేపై వినియోగదారుల వివాద పరిష్కార సంఘం (ఎన్సీడీఆర్సీ)లో ఫిర్యాదుచేయాలని కేంద్రం నిర్ణయించింది. తాము జరిపించిన పరీక్షల్లో అంతా సవ్యంగానే ఉన్నట్టు తేలిందని నెస్లే సంస్థ చెబుతోంది. హఠాత్తుగా మొదలై కొనసాగుతున్న ఈ హడావుడి అంతా గమనిస్తే పదేళ్లక్రితం బహుళజాతి సంస్థలు ఉత్పత్తిచేసే శీతల పానీయాల్లో పురుగుమందుల అవశేషాలున్నా యని వెలువడిన కథనాలు గుర్తొస్తాయి. అప్పుడు కూడా శీతల పానీయాలపై నలు మూలల నుంచీ దాడి జరిగింది. వాటి అమ్మకాలపై అప్పట్లో కేరళ ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, ఆహార ఉత్పత్తులను నిషేధించే అధికారం రాష్ట్రాలకు లేదని కేరళ హైకోర్టు కొట్టేయడంతో అమ్మకాలు యధావిధిగా మొదలయ్యాయి. అటు తర్వాత బహుళజాతి సంస్థలు దారికొచ్చి స్వచ్ఛమైన పానీయాలు అందిస్తున్నాయా లేక అదే తంతు కొనసాగుతున్నదా అనేది ఎవరికీ తెలియదు. వాటి సామ్రాజ్యాలు మాత్రం అప్పటితో పోలిస్తే బాగా విస్తరించాయి. మారిన కాలమాన పరిస్థితుల్లో అలాంటి సంస్థలు బాట్లింగ్ యూనిట్లు స్థాపించడం ఏ రాష్ట్రానికైనా ప్రతిష్టాత్మకమైన అంశంగా మారింది. ఆహార పదార్థాల్లో కల్తీ, హానికారక పదార్థాలుండటంవంటి అంశాల్లో ఎప్పటి కప్పుడు తనిఖీలు చేసి చర్యలు తీసుకునేందుకు మన దేశంలో చాలా వ్యవస్థలు న్నాయి. కానీ, అవి సక్రమంగా పనిచేస్తున్న దాఖలాలు కనబడవు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) మొదలుకొని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏ) వరకూ ఎన్నో ఉన్నాయి. ఆసియాలో చైనా తర్వాత అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న మన దేశంలోకి ఎన్నో ఉత్పత్తులు వచ్చిపడుతున్నాయి. ఈ ఉత్పత్తులపై సక్రమంగా పరీక్షలు నిర్వహిస్తున్నారా... అవి సురక్షితమైనవేనని నిర్ధారణ కొచ్చిన తర్వాతనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు అంగీకరిస్తున్నారా అనేది ఎవరికీ తెలియదు. ఆకర్షణీయమైన ప్యాక్‌లతో, అదరగొట్టే ప్రకటనలతో జనంలోకి చొచ్చుకుపోతున్న బహుళజాతి సంస్థల ఉత్పత్తులకు స్వల్పకాలంలోనే కావలసినంత ప్రచారం లభించి అమ్మకాలు పెరుగుతాయి. సినీతారలను, క్రీడా దిగ్గజాలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుని తమ ఉత్పత్తులు వాడటం ఆధునికతకూ, ఉత్తమాభిరుచికీ నిదర్శన మని వారితో చెప్పిస్తుంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి జనం మోసపోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. మ్యాగీ నూడిల్స్ ద్వారానే నెస్లే సంస్థ ఏటా రూ. 1,500 కోట్ల వ్యాపారం చేస్తున్నదని మార్కెట్ నిపుణుల అంచనా. మ్యాగీ నూడిల్స్ వంటివి ప్రాచుర్యం పొందడానికి జీవితంలో వచ్చిన వేగం కూడా ఒక కారణం. నోరూరించే రుచితో పిల్లల్ని ఆకట్టుకున్నది గనుక.... ఇంట్లో తినడానికి ఏం ఉండాలో నిర్ణయించేది వారే గనుక మ్యాగీ అమ్మకాలు బాగా పెరిగాయని చెబుతున్నారు. అంతకుమించి వంటిళ్లలో మగ్గిపోతున్న ఇల్లాళ్ల శ్రమను అది బాగా తగ్గించడం కూడా ఒక కారణమని చెప్పాలి. అది చెప్పుకుంటున్నట్టు రెండు నిమిషాల్లో కాకపోయినా పది నిమిషాల్లో ఆ నూడిల్స్ రెడీ అవుతుంటే గంటల సమయం పట్టే ఇతర వంటకాల జోలికి వెళ్లడానికి ఎవరూ సిద్ధపడరు. అలాగే మహానగరాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం వచ్చి ఒంటరిగా ఉండే యువతకూ, హాస్టల్స్‌లో ఉంటూ వేళపట్టున భోజనం చేయడం వీలుగానివారికి నెస్లే వంటి సంస్థలు ఉత్పత్తి చేసే ఫాస్ట్ ఫుడ్స్ వరంగా మారతాయి. ఆకర్షణీయంగా కనబడే ప్యాక్‌లపై ఏం రాసివుందో, అలా రాసినవన్నీ అందులో ఉన్నాయో, లేదో...అందులో పేర్కొనని ప్రమాదకర పదార్ధాలు ఇంకేమి ఉన్నాయో ఆరా తీసే ఓపికా, తీరికా ఎవరికీ ఉండవు. ఆ పని చేయాల్సిన సంస్థలు ఎన్నో కారణాలతో నిర్లిప్తంగా ఉండిపోతాయి. ఇప్పుడు మ్యాగీలో ఉన్నాయని చెబుతున్న హానికర పదార్థాల వల్ల పిల్లల్లో మేధో శక్తి తగ్గిపోతుందని, నరాల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నదని, గుండె సంబంధ వ్యాధులు పెరగవచ్చునని, కిడ్నీలు దెబ్బతినవచ్చునని చెబుతున్నారు. దీర్ఘకాలం తింటే లివర్ పనితీరు పాడయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇన్ని రకాలుగా ముప్పు పొంచివుండే ఆహార ఉత్పత్తులపై నిఘా ఉంచాల్సిన సంస్థలు మరి ఇన్నాళ్లుగా ఎందుకు మౌనంగా ఉండిపోయాయో అర్ధంకాని విషయం. మ్యాగీ నూడిల్స్‌కు జనాదరణ బాగా ఉండొచ్చుగానీ, దాంతోపాటే చాలా సంస్థల ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. నూడిల్స్ మాత్రమే కాదు... ఇంకా ఎన్నో రకాల ఫాస్ట్ఫుడ్స్ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఈ అనుభవంతోనైనా వాటన్నిటిపైనా సమగ్రంగా పరీక్షలు నిర్వహించి ప్రజలకు సురక్షితమైన ఆహార పదార్థాలు లభ్యమయ్యేలా చూడటం తమ కనీస బాధ్యతని ప్రభుత్వాలు గుర్తించాలి. మ్యాగీ సంగతి ఎలా ఉన్నా... ఏదైనా ఉత్పత్తిని కొనాలని చెప్పే ముందు ఆ సంస్థలిచ్చే సొమ్ములే కాక ఇతరత్రా అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సెలబ్రిటీలు తెలుసుకోవాలి. -
మేగీ నూడుల్స్‌కు మరిన్ని కష్టాలు
చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టంగా తినే మేగీ నూడుల్స్‌కు కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మేగీని తయారుచేసే నెస్లె కంపెనీపై కఠిన చర్యలకు దిగేలా కనిపిస్తోంది. దాదాపు 2 లక్షల ప్యాకెట్లతో కూడిన బ్యాచ్‌ని మార్కెట్ల నుంచి ఉపసంహరించాలని ఆదేశించిన ఎఫ్డిఏ.. ఇప్పుడు మరిన్ని బ్యాచ్‌లను కూడా పరీక్షిస్తోంది. వాటిలో అనుమతించిన స్థాయి కంటే ఎక్కువ మోతాదులో సీసం, ఆహారంలో ఉపయోగించే రంగులు ఉన్నాయని ఎఫ్‌డీఏ తేల్చింది. రుచిని పెంచేందుకు మోనో సోడియం గ్లుటామేట్ (ఎంఎస్‌జీ) అనే రసాయనం చాలా ఎక్కువ మోతాదులో ఉన్నట్లు ఎఫ్‌డీఏ కనుగొంది. దాంతోపాటు సీసం కూడా ఎక్కువగానే ఉన్నట్లు తేల్చింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో విడుదలైన మరో మూడు నాలుగు బ్యాచ్‌లను కూడా యూపీ ఎఫ్‌డీఏ పరీక్షిస్తోంది. ఈ పరీక్ష ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఆ నివేదికలో కూడా తేడా కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని బారాబంకి జిల్లా ఆహార అధికారి వీకే పాండే తెలిపారు. ఆహార పదార్థాల్లో సీసం పరిమాణం కేవలం 2.5 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) మాత్రమే ఉండాలని నిబంధనలుండగా.. మేగీలో ఏకంగా 17.2 పీపీఎం ఉందని ఆయన చెప్పారు. అయితే, ఈ నివేదికలను నెస్లే సంస్థ కొట్టిపారేస్తోంది. తాము ఓ స్వతంత్ర సంస్థతో మళ్లీ పరీక్షలు చేయిస్తున్నామని.. దాని ఫలితాలు వచ్చిన తర్వాత వాటిని కూడా అధికారులకు సమర్పిస్తామని చెబుతోంది.