మీరు ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడుతున్నారా?
మరింత తెల్లగా కనిపించడం కోసం ఉపయోగించే ఫెయిర్‌నెస్ క్రీమ్‌లతో చాలా వరకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే ఈ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని గుర్తించండి. ఫెయిర్‌నెస్ క్రీమ్స్ వాడేవారికి డెర్మటాలజిస్ట్‌లు చేస్తున్న సూచనలివి.
♦ మీరు ఏదైనా ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడే ముందు దాన్ని కొద్దిగా శరీర భాగంలో ఎక్కడైనా (చేతికి అయితే మంచిది) కొద్దిగా ప్యాచ్‌లాగా రాసి... దాని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తెలుసుకున్న తర్వాతే వాడటం మంచిది.
♦ ఏదైనా క్రీమ్ ఎంపిక తర్వాత ఇలా టెస్ట్ చేసుకోకపోతే కొన్నిసార్లు కొందరిలో కాంటాక్ట్ డర్మటైటిస్, అలర్జిక్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. అదే కొద్దిగా ప్యాచ్‌లా రాసుకొని పరీక్షించడం వల్ల కొన్ని ప్రమాదాలను సమర్థంగా నివారించవచ్చని తెలుసుకోండి.
♦ స్టెరాయిడ్స్‌తో పాటు స్కిన్ లెటైనింగ్ క్రీమ్స్ వాడే సమయంలో మీ చర్మానికి సూట్ అయ్యేదాన్ని మీరే ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఒకసారి డర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం మరింత మంచిది.
♦ స్కిన్ లెటైనింగ్ క్రీమ్స్ వాడే సమయంలో దాని దురుపయోగం కూడదు. నిర్ణీత వేళల్లో నిర్ణీత మోతాదులోనే ఉపయోగించండి. ఎందుకంటే ఒక్కోసారి మరింత ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంలోని రంగునిచ్చే కణాలు తమ ధర్మాన్ని కోల్పోతాయి. అది ఒక్కోసారి కొన్ని దుష్ర్పభావాలకు దారితీయవచ్చు.
♦ స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ వల్ల చర్మం తెల్లగా అయినట్లు కనిపించినా దాన్ని విచ్చలవిడిగా వాడటం వల్ల స్టెరాయిడ్ డర్మటైటిస్ అనే సమస్య రావచ్చు. ఫలితంగా చర్మం పలచబారడం వంటి దుష్పరిణామాలు సంభవించవచ్చు. ఒక్కోసారి చర్మంపై పుండ్లు (అల్సర్స్) కూడా రావచ్చు. దాంతో చర్మం కింద ఉన్న రక్తనాళాలు కూడా మరింత వెడల్పుగా మారి (డయలేటెడ్ క్యాపిల్లరీస్) అవి దెబ్బతినే అవకాశం ఉంది.
♦ స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ మరీ ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై మొటిమలు (యాక్నే) వంటివి వచ్చే అవకాశం ఉంది. చర్మం మరింత మృదువుగా అయి చిన్న చిన్న గాయాలకే మరింత ఎక్కువగా ప్రతిస్పందించేలా (సెన్సిటివ్‌గా) మారవచ్చు.
♦ స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ మితిమీరి ఉపయోగించడం వల్ల వయసు పైబడే ప్రక్రియ వేగంగా జరగవచ్చు. శరీరంలోని చర్మకణాలను బిగుతుగా ఉండే కొలెజెన్ దెబ్బతిని ముడుతలు రావడం వేగంగా జరగవచ్చు.
సన్ స్క్రీన్స్
♦ సన్ స్క్రీన్స్ ఉపయోగించడం అన్నది ఎప్పుడూ మంచిదే.
♦ మన దేశంలో ఎస్‌పీఎఫ్ 25 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్స్ వాడటం మంచిది.
♦ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటి ఎండ నేరుగా పడేలా తిరగవద్దు.
♦ అలాగని అస్సలు ఎండలో తిరగకపోవడం వల్ల వైటమిన్ డి లోపం క్యాల్షియమ్ లోపం కూడా రావచ్చు. అందుకే అప్పుడప్పుడూ ఎండ తగులుతూ ఉండాలి.
సాధారణ సూచనలు
♦ మీ చర్మం మరింత పొడిబారకుండా, మరీ జిడ్డు లేకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోండి.
♦ నాన్-కమెడోజెనిక్ మాయిశ్చరైజర్లు వాడటం మంచిది. ఎందుకంటే అవి చర్మంపై ఉండే రంధ్రాలను పూడుకుపోనివ్వవు.
♦ మొటిమలు ఉన్నవారు, సున్నితంగా ఉండే చర్మం గలవారు తమకు అలవాటైన మేకప్ సామగ్రి, అలవాటైన పెర్‌ఫ్యూమ్స్‌ను మాత్రమే ఉపయోగించాలి. కొత్తవి ఉపయోగించాల్సి వస్తే కాస్త పరీక్షించాకే అవి కొనాలి.