సాక్షి, న్యూఢిల్లీ: ‘హిందుస్థాన్ యూనిలివర్’ కంపెనీ నుంచి వెలువడుతున్న ‘ఫేర్ అండ్ లవ్లీ’ అనే ఉత్పత్తి బ్రాండ్ ప్రజల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన విషయం తెల్సిందే. ఈ బ్రాండ్ ప్రచారం కోసం కంపెనీ మొదటి నుంచి ఎన్నో కోట్ల రూపాయలను ఖర్చు పెడుతూ వస్తోంది. తాజాగా ‘ఫేర్ అండ్ లవ్లీ’ పేరును మారుస్తూ హిందూస్తాన్ యూనిలివర్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఫేర్ అండ్ లవ్లీ’ పేరు స్థానంలో ‘గ్లో అండ్ లవ్లీ’తో ఫేర్‌నెస్ క్రీమ్‌ను మార్కెట్ చేయనున్నట్లు ఆ సంస్థ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో చోటు చేసుక్ను వర్ణవివక్ష హత్య ఉదంతం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిందూస్థాన్ యూనిలివర్ సంస్థ పేర్కొంది. (ఇక ‘ఫెయిర్’కు గుడ్‌బై..)
ఇక ‘ఫేర్ అండ్ లవ్లీ’ బ్రాండ్ పేరు నుంచి ఫేర్ అనే పదం మాయం కానుంది. ఫేర్ అనే పదం మనిషి చర్మం తెలుపు రంగును సూచిస్తున్న విషయం తెల్సిందే. హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ తమ ఉత్పత్తుల బ్రాండ్ పేర్ల నుంచి, వాణిజ్య ప్రకటనల నుంచి ఫేర్, ఫేర్‌నెస్ పదాలతోపాటు ‘వైటెనింగ్, లైటనింగ్’ అనే పదాలను కూడా తొలగించాలని నిర్ణయించింది. ’ఫేర్ అండ్ లవ్లీ’ బ్రాండ్ పేరు నుంచి ఫేర్ పదాన్ని తొలగిస్తానని చెప్పిన కంపెనీ ఆ ఉత్పత్తిని ఉపసంహరించుకుంటున్నట్లు ఎక్కడా తెలియజేయలేదు. చర్మ రంగును తెలుపు చేస్తుందన్న ప్రచారంతోని ఆ కంపెనీ ఆ ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఆ ఉత్పత్తి అలాగే కొనసాగించాలనుకుంటే ‘చర్మ సౌందర్యం కోసం’అని మార్చుకోవచ్చు.
అదే విధంగా ‘స్కిన్ వైటెనింగ్’ ఉత్పత్తులను ఉపసంహరించుకొంటున్నామని ప్రముఖ కాస్మోటిక్ కంపెనీ ‘జాన్సన్ అండ్ జాన్సన్’ కూడా ప్రకటించింది. వాటి ఉత్పత్తులకు మరిన్ని మిశ్రామాలను జోడించి, మరింత మెరుగ్గా మరో పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తామని ఆ కంపెనీ తెలిపింది. ఆ కంపెనీ ‘చర్మ సౌందర్యం కోసం’ అంటుందా, మరో పేరు పెడుతుందా ? చూడాలి. ఈ రెండు కంపెనీల తరహాలోనే ‘వైటెనింగ్’ పేరిట లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఇతర కొస్మోటెక్ కంపెనీలు కూడా చర్మం రంగును తెలియజేసే పదాలన్నింటిని తామూ ఉపసంహరించుకుంటామని, వాటికి ‘స్కిన్ కేర్’ అని పేర్లు పెడతామని చెబుతున్నాయి. వాస్తవానికి ఆ ఉత్పత్తులేవీ కూడా స్కిన్ కేర్ కిందకు రావు.
‘బ్లాక్ ఈజ్ బ్యూటీ (నలుపే అందం)’ అన్న ప్రచారం భారత్‌లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఎన్నడూ స్పందించని ఈ కంపెనీలు ఇప్పుడు స్పందించడానికి అమెరికాలో కొనసాగుతున్న ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అనే ఉద్యమమే కారణం. జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని ఓ శ్వేత జాతీయుడైన అమెరికా పోలీసు అన్యాయంగా చెప్పడంతో అక్కడ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం ఉధృతమైంది.
పుట్టుకతో వచ్చే మనిషుల చర్మం రంగు మధ్యలో మారదని, మనిషి ఒక చోటు నుంచి మరో చోటుకు మరినప్పుడు అక్కడి ఉష్ణ లేదా శీతల పరిస్థితుల్లో చర్మం రంగులో కొంత మార్పు వస్తుందిగానీ, మందులతో మార్పు రాదని వైద్య విజ్ఞానం మొదటి నుంచి చెబుతున్నా నలుపును తెలుపు చేస్తామంటున్న వ్యాపారం మాత్రం జోరుగా కొనసాగుతూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment