Black Lives Matter
-
SA Vs SL: డికాక్ మోకాళ్లపై నిల్చున్నాడు.. ఇప్పుడైనా వదిలేయండి
Quinton De Kock Bend Knee Black Live Matters Moment.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా వికెట్ కీపర్క్వింటన్ డికాక్ శ్రీలంకతో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అతను బరిలో ఉన్నాడనే దానికంటే బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ ఉద్యమానికి మద్దతిస్తాడా లేదా అన్నదానిపై చాలా మందిలో ఆసక్తి నెలకొని ఉంది. కాగా డికాక్ ఈసారి మాత్రం బ్లాక్‌లైవ్స్ మ్యాటర్స్‌కు ఉద్యమానికి మద్దతిస్తూ మోకాళ్లపై నిల్చొని సంఘీభావం తెలిపాడు. దీంతో అతని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుంటే.. గిట్టనివాళ్లు మాత్రం డికాక్‌పై ట్రోల్స్ ఆపలేదు. అయితే తన తప్పు తెలుసుకొని డికాక్ సంఘీబావం తెలిపాడు.. ఇకనైనా అతన్ని వదిలేయండి అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: మోకాలిపై నిలబడకపోవడంపై క్షమాపణలు కోరిన డికాక్ ఇక వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ మూమెంట్‌కు మద్దతు ఇవ్వలేనంటూ ఆఖరి క్షణంలో జట్టు నుంచి తప్పుకొని అందర్ని ఆశ్చర్యపరిచాడు. అయితే డికాక్ తీరుపై సీఎస్ఏతో(క్రికెట్ సౌతాఫ్రికా అసోసియేషన్) పాటు అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒక దశలో డికాక్ దక్షిణాఫ్రికాకు ఆఖరి మ్యాచ్ ఆడేశాడంటూ ఊహగానాలు కూడా వచ్చాయి. కానీ సీఎస్ఏ అవన్నీ కొట్టి పారేసింది.. మద్దతివ్వాలా వద్దా అనేది అతనిష్టం. కానీ మా ఆదేశాలు దిక్కరించినందుకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై క్లారిటి ఉంది. సీఎస్ఏ చర్యలు తీసుకునేలోపే డికాక్ తన తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరుతూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. చదవండి: Quinton De Kock: మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు డికాక్ ఔట్.. కారణం United against racism: Quinton de Kock joins his South ... via @t20worldcup https://t.co/b5CS6RFIUL — varun seggari (@SeggariVarun) October 30, 2021 Quinton de Kock returns as he took the knee before Sri Lanka game #SlvsSA #BLM #quintondekock pic.twitter.com/9pcWtxGxZb — Anjana Kaluarachchi (@Anjana_CT) October 30, 2021 -
De Kock: తగ్గేదేలే అన్నాడు.. ఇప్పుడేమో దిగొచ్చాడు..!
Quinton De Kock Apologises For Refusing To Take Knee: ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా వేదికలపై ఆటగాళ్లు సంఘీభావం తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) సైతం మోకాలిపై కూర్చుని ఉద్యమానికి మద్దతు తెలపాల్సిందిగా ఆ దేశ ఆటగాళ్లను ఆదేశించింది. అయితే ఆ జట్టు వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మాత్రం ఇందుకు ససేమిరా అన్నాడు. ఏకంగా జట్టు నుంచే తప్పుకున్నాడు. అయితే, సదరు అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఎస్ఏ చివరి అవకాశం ఇవ్వడంతో తాజాగా అతను దిగొచ్చాడు. Quinton de Kock statement 📝 pic.twitter.com/Vtje9yUCO6— Cricket South Africa (@OfficialCSA) October 28, 2021 జట్టు సభ్యులకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా నిలబడడం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నానని, తదుపరి మ్యాచ్‌లో మోకాలిపై నిల్చొని ఉద్యమానికి మద్దతు తెలుపుతానని అన్నాడు. ఈ సున్నితమైన అంశాన్ని రాద్దాంతం చేయడం, ఎవరినీ అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చాడు. తన చర్యలు ఎవరినైనా బాధించి ఉంటే పెద్ద మనసుతో తనను క్షమించాలని కోరాడు. జట్టుతో చేరేందుకు తాను సుముఖంగా ఉన్నానని తెలిపాడు. కాగా, మొదట్లో ఈ అంశంపై స్పందించేందుకు కూడా ఇష్టపడని డికాక్.. ఓ దశలో కెరీర్‌ను అర్ధంతరంగా ముగించేందుకు సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. చదవండి: David Warner: మోకాలిపై కూర్చుంటాం... ఆ విషయం గురించి స్పందించలేను! -
David Warner: మోకాలిపై కూర్చుంటాం... ఆ విషయం గురించి స్పందించలేను!
David Warner Response On Quinton De Kock Sitting Out: ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సంఘీభావం ప్రకటిస్తుందని ఓపెనర్ డేవిడ్ వార్నర్ వెల్లడించాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆసీస్ ఆటగాళ్లందరూ మైదానంలో మోకాలిపై కూర్చొని మద్దతునిస్తారని అతను స్పష్టతనిచ్చాడు. ‘దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఇచ్చిన ఆదేశాలపై నేను స్పందించలేను. మేం మాత్రం మోకాలిపై కూర్చొని సంఘీభావం ప్రకటిస్తాం. దానికి మేం సిద్ధం’ అని వార్నర్ అన్నాడు. కాగా జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా వేదికలపై ఆటగాళ్లు సంఘీభావం తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు.. దక్షిణాఫ్రికా బోర్డు సైతం మోకాలిపై కూర్చుని ఉద్యమానికి మద్దతు పలకాల్సిందిగా ఆటగాళ్లకు ఆదేశాలు ఇచ్చింది. అయితే, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మాత్రం.. ఇందుకు అభ్యంతరం తెలిపాడు. అలా చేయనని చెబుతూ జట్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ నేపథ్యంలో డికాక్ నిర్ణయం గురించి వార్నర్‌ను ప్రశ్నించగా... ఈ మేరకు స్పందించాడు. చదవండి: NAM VS SCO: టి20 ప్రపంచకప్ చరిత్రలో క్రేజీ ఓవర్ అంటున్న ఫ్యాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు డికాక్ ఔట్.. కారణం
Quinton De Kock Pulled Out Vs WI Match.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా వెస్డీండీస్తో మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా సిద్ధమైన వేళ మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు క్వింటన్ డికాక్ రూపంలో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌కు అతను దూరంగా ఉండనున్నాడని.. అతని స్థానంలో రీజా హెండ్రిక్స్ ఆడుతాడంటూ జట్టుకు కెప్టెన్ టెంబా బవుమా వెల్లడించాడు. అయితే డికాక్ వ్యక్తిగత కారణాల రిత్యా విండీస్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని బవుమా పేర్కొన్నప్పటికి అసలు కారణం వేరే ఉందని సమాచారం. చదవండి: T20 WC: చెత్త ప్రదర్శన.. ప్రపంచకప్ ఆడటానికి వచ్చారా.. టూరిస్ట్ వీసా మీద ఉన్నారా? బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ ఉద్యమానికి మద్దతుగా టి20 ప్రపంచకప్‌లో వివిధ జట్లు వివిధ పద్దతుల్లో మద్దతు తెలుపుతున్నాయి. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ఇకపై తాము ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో మొకాళ్లపై నిలబడి బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ మూమెంట్‌కు మద్దతు తెలపాలంటూ క్రికెట్ దక్షిణాఫ్రికా బోర్డు(సీఎస్ఏ) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విషయంలో విండీస్‌తో మ్యాచ్‌కు కొన్ని నిమిషాల ముందు సీఎస్ఏతో డికాక్ గొడవకు దిగినట్లు సమాచారం. బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ ఉద్యమానికి తాను వ్యతిరేకి కాదని.. కానీ మొకాళ్లపై కూర్చొని మద్దతు పలకలేనని తెలిపినట్లు సమాచారం. కేవలం ఈ కారణంతోనే డికాక్ కీలకమ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. అయితే డికాక్ మాత్రం అలాంటిదేం లేదని.. కొన్ని వ్యక్తిగత కారణాల రిత్యా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నానని.. అనవసరంగా దీన్ని పెద్ద విషయం చేయొద్దంటూ మీడియాను విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. చదవండి: T20 WC 2021 SA Vs WI: విండీస్ మూడో వికెట్ డౌన్.. సిమన్స్(16) ఔట్ 🚨 TEAM ANNOUNCEMENT 🇿🇦 There's one change as Reeza Hendricks comes in for Quinton de Kock 📝 Ball by Ball https://t.co/c1ztvrT95P#SAvWI #T20WorldCup #BePartOfIt pic.twitter.com/0blL4GviNO — Cricket South Africa (@OfficialCSA) October 26, 2021 -
డార్నెల్లా ఫ్రెజర్.. నిప్పులా ఉద్యమాన్ని రాజేసింది!
ధైర్యం ఏ రూపంలో ఉంటుంది? ఘనమా? ద్రవమా? వాయువా? శబ్దమా? నిశ్శబ్దమా? ఇవన్నీ కలిసిన రూపమా? అయితే ఆ రూపానికి డార్నెల్లా ఫ్రెజర్ అని పేరు పెట్టాలి. తెల్లజాతి పోలీసు మోకాలి కింద బిగుసుకుపోతున్న గొంతుతో ఊపిరందక 9 నిముషాల పాటు ‘ఐ కాంట్ బ్రీత్’ అని మూలుగుతూ గిలగిల కొట్టుకుంటున్న నల్లజాతి మనిషి జార్జి ఫ్లాయిడ్‌ను తన ఫోన్లో షూట్ చేసిన 17 ఏళ్ల నల్ల అమ్మాయే డార్నెల్లా ఫ్రెజర్. కళ్ల ముందరి ఘాతుకానికి ఆ అమ్మాయి హృదయం చెంపల మీదకు ద్రవీభవించింది. ఆవేదన ఆమె గుండెల్లో ఘనీభవించింది. గొంతులోంచి పోతున్నది తన ప్రాణవాయువే అని ఆమెకు అనిపించింది. శబ్దానికి ముందరి నిశ్శబ్దంలా ఇంటికి వెళ్లి ఆ రోజు అర్ధరాత్రి దాటాక ఆ వీడియోను ఫేస్బుక్ లో అప్ లోడ్ చేసింది డార్నెల్లా. మొన్న మంగళవారం ఆ వీడియో సాక్ష్యంతో కోర్టు ఆ పోలీసు అధికారిని దోషిగా నిర్ధారించింది. అతడికి 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఏడాదిగా జరుగుతున్న ఈ కేసు విచారణకు కీలక సాక్ష్యాన్ని అందజేసి నల్లజాతి ఉద్యమానికి మళ్లీ కాస్త ఊపిరి తెచ్చింది డార్నెల్లా ఫ్రెజర్. డార్నెల్లా ఫ్రేజర్ కనుక ఆ రోజు పాదరసంలా ఆలోచించి ఉండకపోతే డెరెక్ చావిన్ ఈరోజుకీ మినియాపొలిస్ పోలీస్ ఆఫీసర్‌గానే కొనసాగుతూ ఉండేవారు. ∙∙ ఈ స్టోరీ.. పై వాక్యంతో తప్ప ఇక ఎలానూ ప్రారంభం అవడానికి లేదు. సుమారు ఏడాదిగా అత్యున్నతస్థాయి పోలీస్ ఆఫీసర్ డెరెక్ చావిన్‌పై జరుగుతున్న విచారణ మంగళవారం ముగిసింది. కోర్టు అతడికి 40 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది! విచారణలో నల్లజాతి పౌరుడు జార్జి ఫ్లాయిడ్ దుర్మరణానికి ఈ తెల్ల పోలీసు కారణమైనట్లు నిరూపించే ఏ ఒక్క గట్టి సాక్ష్యాధారమూ లేకపోయింది. ఆఖరుగా మిగిలింది పద్దెనిమిదేళ్ల నల్లజాతి టీనేజర్ డార్నెల్లా ఫ్రేజర్ అప్రయత్నంగా తన సెల్ ఫోన్లోంచి ఆనాటి ఘటనను షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్! కోర్టు హాల్లో ఆ క్లిప్‌ను ప్రదర్శించారు. జార్జి ఫ్లాయిడ్ గొంతును మోకాలితో తొక్కుతున్నప్పుడు తన సెల్‌ఫోన్ లోంచి షూట్ చేస్తున్న డార్లెల్లా, ఆమె కజిన్ (కుడి వైపు నుంచి మూడు, రెండు స్థానాల్లో). సీసీ ఫుటేజ్ అందులో డెరెక్ చావిన్ తొమ్మిది నిముషాల పాటు జార్జి ఫ్లాయిడ్ గొంతు మీద మోకాలిని అదిమిపట్టి ఉంచడం డార్నెల్లా తీసిన పది నిముషాల వీడియోలో మొత్తం రికార్డయి ఉంది. డార్నెల్లా వీడియో తీస్తున్నప్పటి వీడియో ఫుటేజ్‌ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకుని జడ్జి చూశారు. 2020 మే 25న ఆ ఘటన జరగడానికి కొద్ది నిముషాల ముందు వరకు జార్జి ఫ్లాయిడ్ ఎవరో, డార్నెల్లా ఫ్రేజర్ ఎవరో ప్రపంచానికి తెలియదు. ఒకరికొకరు కూడా తెలియని సాధారణ పౌరులు. ఆ సాయంత్రం.. మినియాపొలిస్ నగరంలోని చికాగో అవెన్యూలో.. 38వ వీధిలో ఉన్న ‘కప్ ఫుడ్స్’ షాపింగ్ మాల్కి తొమ్మిదేళ్ల వయసున్న తన కజిన్‌తో కలిసి వచ్చింది డార్నెల్లా. అక్కడికి దగ్గర్లోనే ఒక అపార్ట్మెంట్లో ఉంటారు వాళ్లు. వచ్చిన కొద్ది నిముషాలకు నలుగురు పోలీసులు ఒక నల్లజాతి వ్యక్తిని (జార్జి ఫ్లాయిడ్) పెడరెక్కలు విరిచి తీసుకెళ్లడం ఆ కూడలి లో ఉన్నవారు చూశారు. ఆ పోలీసులలో ఒకరైన డెరెక్ చావిన్.. జార్జి ఫ్లాయిడ్‌ని కింద పడేసి, అతడి గొంతుపై తన మోకాలును నొక్కిపెట్టాడు. అప్పుడు చూసింది డార్నెల్లా.. తనకు ఐదడుగుల దూరంలో ఆ దృశ్యాన్ని. జార్జి ఊపిరి అందక విలవిల్లాడుతున్నాడు. ‘ఐ కాంట్ బ్రీత్. లీవ్ మీ’ అంటున్నాడు. పోలీస్ ఆఫీసర్ వినడం లేదు. దారుణం అనిపించింది డార్నెల్లాకు. వెంటనే తన సెల్ ఫోన్ తీసి షూట్ చేయడం మొదలు పెట్టింది. జరుగుతున్న ఒక అన్యాయాన్ని మాత్రమే తను షూట్ చేస్తున్నానని అనుకుంది కానీ.. నల్లజాతిపై అమెరికన్ల జాత్యహంకారానికి వ్యతిరేకంగా అప్పటికే కొనసాగుతున్న ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ అనే ఒక ఉద్యమానికి తనొక చోదకశక్తి కాబోతున్నానని అప్పుడు ఆమె అనుకోలేదు. చివరికి నేరస్థుడైన ఆ పోలీస్ ఆఫీసర్ కు శిక్ష పడేందుకు కూడా డార్నెల్లానే కారణం అయింది. అయితే కోర్టు తీర్పును డార్నెల్లా.. జార్జి ఫ్లాయిడ్‌కి జరిగిన న్యాయంగానే చూస్తోంది తప్ప, పోలీస్ ఆఫీసర్‌కు పడిన శిక్షగా కాదు. ‘‘థ్యాంక్యూ గాడ్. థ్యాంక్యూ థ్యాంక్యూ థ్యాంక్యూ. జార్జి ఫ్లాయిడ్.. నీకు న్యాయం జరిగింది’’ అని బుధవారం ఆమె తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. జార్జి ఫ్లాయిడ్‌ను మోకాలితో తొక్కుతున్న పోలీస్ అధికారి డెరెక్ చావిన్. ఇతడిపై నేరం రుజువైంది. ఏడాది క్రితం జార్జి ఫ్లాయిడ్ ఊపిరిపోతున్న క్షణాలను చిత్రీకరించిన రోజు డార్నెల్లాకు ఆ రాత్రి నిద్రపట్టలేదు. బాగా పొద్దుపోయేవరకు మేల్కొని ఆలోచిస్తూనే ఉంది. ఆమె హృదయం ఆక్రోశిస్తోంది. ఆమె నేత్రాలు వర్షిస్తున్నాయి. ఆమె పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. పోలీసులైతే మాత్రం ఇంత అమానుషమా అనిపించింది. తను తీసిన వీడియోను ఏం చేయాలో తోచలేదు. కళ్ల ముందే ఒక మనిషి చనిపోవడాన్ని తీసిన వీడియో అది! అది తన దగ్గరుంది. కొన్ని గంటల మౌనం తర్వాత ఫేస్ బుక్ ఓపెన్ చేసి వీడియోను అప్లోడ్ చేసింది. ‘‘ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను’’ అని రెండు ముక్కలు రాసింది. కొన్నాళ్ల వరకు ఆ వీడియోను ఎవరూ నమ్మలేదు. జార్జి ఫ్లాయిడ్ మరణానంతరం నల్లజాతి ఉద్యమకారులు ఆయనపై వేసిన పోస్టర్లలో ఒకటి. అది నిజం అని తెలిశాక ఒక్కసారిగా ప్రఖ్యాత అమెరికన్ న్యూస్ చానళ్లు సి.ఎన్.ఎన్., ఎ.బి.సి., ఫాక్స్, ఎన్.బి.సి., సి.బి.ఎస్. డార్నెల్లా కోసం వచ్చాయి. ఆ వీడియో రేపిన భావోద్వేగాలు అమెరికాలోని యాభై నగరాలలో, ప్రపంచ దేశాలలో జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమానికి ఆజ్యం అయ్యాయి. ఐక్యరాజ్య సమితి సైతం జార్జి ఫ్లాయిడ్ హత్యోదంతాన్ని నిరాకరించ తగని, నిర్లక్ష్యం చేయకూడని పరిణామంగా పరిగణించింది. నల్లజాతి ఉద్యమ భాషలో నిప్పు రవ్వ అని జార్జి ఫ్లాయిడ్ ను అంటున్నాం కానీ.. నిప్పులా ఉద్యమాన్ని రాజేసింది మాత్రం డార్నెల్లా ప్రేజరేనన్నది కాదనలేని సత్యం. లేత మనసుకు అయిన గాయం కన్నీటిగా ఉబికి, జ్వలించింది. ఉద్యమజ్వాల అయింది. తాజాగా కోర్టు తీర్పు రాగానే అమెరికా అధ్యక్షుడు జార్జి బైడెన్ ‘బ్రేవ్ యంగ్ ఉమన్’ అని డార్నెల్లాను అభినందించారు! -
ఆక్స్ఫర్డ్ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’ లేదు
లండన్: ఏటా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఏదో ఒక పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటిస్తుంది. సాధారణంగా సంవత్సరమంతటా ప్రాచుర్యం పొంది, ప్రజల నోళ్లలో నానిన పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటిస్తుంది. అయితే ఈ ఏడాది అందుకు భిన్నం. ఈ ఏడాది భాష చాలా అభివృద్ధి చెందిందని చెప్పింది. దీనికి కారణం కరోనా వైరస్. ఈ పదం కారణంగా కోవిడ్, లాక్డౌన్, సోషల్ డిస్టన్స్, రీఓపెనింగ్ వంటి పదాలు విరివిగా వాడుకలోకి వచ్చాయి. దీంతో ఒకే పదాన్ని ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించలేమని చెప్పింది. నెలల వారీగా చూస్తే పలు పదాలు బాగా ప్రాచుర్యం పొందాయి. జనవరిలో బుష్ఫైర్, ఫిబ్రవరిలో అక్విట్టల్, మార్చి నుంచి మే వరకు కోవిడ్–19, లాక్డౌన్, సోషల్ డిస్టెన్సింగ్, రీఓపెనింగ్ వంటి పదాలు ముందు వరుసలో నిలిచాయి. జూన్‌లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్, ఆగస్టులో మెయిల్–ఇన్, బెలాసరుసియన్, సెప్టెంబర్‌లో నెట్ జీరో, అక్టోబర్‌లో సూపర్ స్ప్రెడర్ పదాలు ప్రాచుర్యం పొందాయి. -
ఐపీఎల్లో మద్దతు లేదు: హోల్డర్
అబుదాబి: నల్లజాతీయులపై జరుగుతున్న దాడులకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్(బీఎల్ఎమ్) ఉద్యమం జరుగుతుంటే ప్రస్తుత ఐపీఎల్లో దాని గురించి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం తీవ్ర నిరాశను కల్గించిందని వెస్టిండీస్ క్రికెటర్, ఎస్ఆర్హెచ్ ఆటగాడు జేసన్ హోల్డర్ పేర్కొన్నాడు. దీనికి క్రికెట్ వెస్టిండీస్ ఎంతో మద్దతుగా నిలుస్తుంటే కొన్ని చోట్ల దానికి ఊసే లేకపోవడం బాధకల్గిస్తుందన్నాడు. విండీస్ జట్టు తరఫున ప్రతిష్టాత్మక పీటర్ స్మిత్ అవార్డు స్వీకరణ సందర్భంగా హోల్డర్ వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడాడు. (గంభీర్.. ఇప్పుడేమంటావ్?) ఇక్కడ(ఐపీఎల్లో) బీఎల్ఎమ్ మాటే వినిపించడం లేదు. అసలు దాన్ని గుర్తించకపోవడం చాలా నిరాశ కల్గిస్తుంది. ఇంగ్లండ్‌లో విండీస్ మహిళా జట్టు ఆడినప్పుడు కూడా బీఎల్ఎమ్ లోగోలతో ఉద్యమాన్ని మద్దతు ప్రకటించారు. ఇది సుదీర్ఘ కాలంగా నడుస్తున్న సమస్య. ఇంకా చాలాదూరం పయనించాలి. అంతా ఒక్కటై సమానత్వం కోసం ఉద్యమిస్తేనే నల్లజాతీయులపై వివక్షను రూపు మాపవచ్చు. అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యానంతరం ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతోంది. క్రికెట్ మైదానంలో దానికి సంఘీభావాన్ని తెలుపుతూ ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగమయ్యేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విండీస్ జట్టుకు ప్రత్యేక అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్లో దాని ప్రస్తావనే లేకపోవడంపై హోల్డర్ తన మాటల ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశాడు. -
‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’కు మహిళా క్రికెటర్ల మద్దతు
లండన్: నల్లజాతీయులు చేస్తోన్న ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి వెస్టిండీస్, ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్లు మద్దతు ఇవ్వనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా డెర్బీ వేదికగా నేడు తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో జాతి వివక్షకు వ్యతిరేకంగా ఇరు జట్ల ఆటగాళ్లు జెర్సీలపై ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ లోగో ధరించడంతో పాటు మ్యాచ్‌కు ముందు మోకాలిపై కూర్చొని సంఘీభావం తెలపనున్నారు. ‘ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలో చెబితే అది ఆచరించడానికి మేం సిద్ధంగా ఉన్నామంటూ ఇంగ్లండ్ కెప్టెన్ హీథెర్ నైట్ నాకు సందేశం పంపింది. జాతి వివక్షకు వ్యతిరేకంగా జెర్సీలపై లోగో ధరించడంతో పాటు ప్రతీ మ్యాచ్‌కు ముందు మేమంతా సంఘీభావం తెలుపుతాం’ అని విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ పేర్కొంది. మార్చిలో టి20 ప్రపంచ కప్ తర్వాత మహిళల క్రికెట్లో జరుగనున్న తొలి అంతర్జాతీయ సిరీస్ ఇదే కావడం గమనార్హం. -
‘కళ్ల ముందే కాలి బూడిదయ్యాయి..’
‘‘కళ్లముందే అంతా కాలి బూడిదైపోతున్నా చూస్తూనే ఉన్నారు. కానీ ఒక్కరూ ఏమీ చేయలేపోయారు. ఆరు కార్లతో మొదలుపెట్టి నేడు 100 కార్ల వరకు డీలర్షిప్ తీసుకునే స్థాయికి చేరుకున్నాం. ఒక్కోమెట్టు ఎక్కుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఇలా జరిగిపోయింది. మేము కూడా మైనార్టీలమే. మాకు అసలు దీనితో సంబంధం లేదు. ఏం తప్పు చేశామో అర్థం కావడం లేదు. అయినా మాకే ఎందుకు ఇలా జరిగింది? గత కొన్ని రోజులుగా నా కుటుంబం కన్నీళ్లు కారుస్తూనే ఉంది’’ అంటూ భారత సంతతికి చెందిన, కెనోషా నివాసి అన్మోల్ ఖింద్రీ అనే వ్యక్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన పూర్వీకులు వలస వచ్చిన నాటి అమెరికా ఇది కాదని, అసలు ఇలాంటి ఘటన జరుగుతుందని తాను కనీసం ఊహించలేకపోయానని ఉద్వేగానికి లోనయ్యారు. తమ కార్ల డీలర్షిప్ ప్లేస్‌కు నిరసనకారులు నిప్పంటించడంతో భారీ మొత్తంలో ఆస్తి నష్టం సంభవించినట్లు శనివారం స్థానిక మీడియాకు తెలిపారు. 100 వాహనాలు కాలి బూడిదయ్యాయని ఆవేదన చెందారు. పెట్రోలు బంకులు, రెస్టారెంట్లలో పనిచేసిన తమ పూర్వీకుల కష్టానికి ప్రతిఫలం లేకుండా పోయిందని భావోద్వేగానికి గురయ్యారు. (చదవండి: ‘ఇండియన్లు, చైనీయులు దేశం విడిచి వెళ్లిపోండి’) కాగా ఆఫ్రో- అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురైన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విన్కొన్సిన్ రాష్ట్రంలోని కెనోషాలో కూడా ఆగష్టు 23న ఇదే తరహా ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాకోబ్ బ్లేక్ అనే 27 ఏళ్ల నల్ల జాతీయుడిని పోలీసులు చుట్టుముట్టి కాల్చేసిన ఘటన నిరసనలకు దారి తీసింది. దీంతో అతడికి న్యాయం జరగాలంటూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు భారత సంతతికి చెందిన కుటుంబ కార్ల షాపునకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఫైరింజన్‌కు ఫోన్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, ఘటనాస్థలికి పొరుగున నివసించే జోసీ రోడ్రిగెజ్ అనే మహిళ స్థానిక మీడియాకు తెలిపారు. తాను ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్ చేశానని, అయినా అటు నుంచి ఎటువంటి స్పందనా రాలేదని, ఫైర్ఫైటర్లను అక్కడకు పంపించడం సురక్షితం కాదని సమాధానం వచ్చినట్లు పేర్కొన్నారు. (చదవండి: ‘ఆ పదవికి హారిస్ కన్నా ఇవాంకనే ఉత్తమం’) ఇక ఈ ఘటనలో బాధిత కుటుంబానికి 2.5 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లినట్లు కెనోష్ న్యూస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు గో ఫండ్ మీ పేజ్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నట్లు పేర్కొంది. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజురోజుకీ జాత్యహంకార దాడులు పెరిగిపోతుండటంతో వలసదారులు భయాందోళనలకు గురవుతున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా (డెమొక్రటిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హారిస్‌ను ఉద్దేశించి)జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం ఇలాంటి ఘటనలను మరింత ప్రోత్సాహమిచ్చేలా ఉందని వాపోతున్నారు. కాగా ఆగష్టు 23 నాటి ఘటనపై స్పందించిన ట్రంప్.. ‘‘రెండు రోజుల క్రితం జాతీయ భద్రతా దళాలను విన్కోన్సిన్కు తరలించాం. అప్పటి నుంచి ఎలాంటి హింస చోటుచేసుకోలేదు. చిన్న సమస్య కూడా తలెత్తలేదు’’ అని ఆగష్టు 28న ట్వీట్ చేశారు. జాకోబ్ బ్లేక్ ఉదంతంపై తీవ్ర విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కెనోషీలో పర్యటించి అల్లర్ల కారణంగా సంభవించిన నష్టం గురించి అధికారులతో చర్చించేందుకు మంగళవారం షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. అయితే రాష్ట్ర గవర్నర్, డెమొక్రటిక్ పార్టీ నేత టోనీ ఎవర్స్ మాత్రం సమస్యాత్మక ప్రాంతానికి రావొద్దని, అధ్యక్షుడి రాక కారణంగా దిద్దుబాటు చర్యలు మరింత జాప్యం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్రంప్‌నకు లేఖ రాసినట్లు సమాచారం. ఇక డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి సైతం సోమవారం అక్కడ పర్యటించాలని భావించారు. అయితే చివరి నిమిషంలో పెన్సిల్వేనియాలో ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లడం గమనార్హం. -
ఇదే నా నిరసన...
న్యూయార్క్: అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో పట్టపగలే నల్లజాతి వ్యక్తి జాకబ్ బ్లేక్పై పోలీసుల కాల్పుల ఘటన నిరసన సెగలు టెన్నిస్ ప్రపంచాన్నీ తాకాయి. జేకబ్‌కు మద్దతుగా వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ (సిన్సినాటి ఓపెన్) నుంచి తప్పుకుంటున్నట్లు ప్రపంచ పదో ర్యాంకర్ నయోమి ఒసాకా (జపాన్) ప్రకటించింది. ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన 22 ఏళ్ల ఒసాకా జాతి వివక్షకు వ్యతిరేకంగా తన గళమెత్తింది. అథ్లెట్ కన్నా ముందు నల్లజాతి మహిళగా అన్యాయంపై పోరు కోసమే టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు 2018 యూఎస్ ఓపెన్, 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల చాంపియన్ అయిన ఒసాకా ట్విట్టర్లో పేర్కొంది. ‘నేను ఈ మ్యాచ్ ఆడనంత మాత్రాన ఏదో అద్భుతం జరుగుతుందని అనుకోవట్లేదు. కానీ శ్వేత జాతీయుల ఆధిపత్యం ఉండే టెన్నిస్‌లో నా గళాన్ని వినిపిస్తే కాస్తయినా ఈ అంశంపై కదలిక వస్తుందని భావిస్తున్నా’ అని ఆమె రాసుకొచ్చింది. ఆమెకు సహచరుల నుంచి మద్దతు లభించడంతో నిర్వాహకులు టోర్నీని ప్రస్తుతానికి నిలిపివేశారు. దీంతో గురువారం జరగాల్సిన సెమీఫైనల్ పోటీలు ఒకరోజు పాటు ఆగిపోయాయి. వర్ణ వివక్షపై పోరు, సామాజిక న్యాయం కోసం పాటుపడే టెన్నిస్ క్రీడ మరోసారి దానికే కట్టుబడి ఉందని పేర్కొన్న యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ (యూఎస్‌టీఏ), అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) వర్గాలు జేకబ్‌కు మద్దతుగా నిలుస్తున్నామని ప్రకటించాయి. ఈ టోర్నీ క్వార్టర్స్ ఫైనల్లో ఒసాకా 4–6, 6–2, 7–5తో అనెట్ కొంటావీ (ఎస్తోనియా)పై, యోహానా కొంటా (బ్రిటన్) 6–4, 6–3తో మారియా సాకరి (గ్రీస్)పై గెలుపొందారు. మరోవైపు నల్లజాతీయులకు న్యాయం జరగాలంటూ అథ్లెట్లు డిమాండ్ చేయడంతో బుధవారం నాటి ఎన్బీఏ, డబ్ల్యూఎన్బీఏ, బేస్‌బాల్, సాకర్ లీగ్‌లు మ్యాచ్‌లన్నీ వాయిదా పడ్డాయి. -
జాతి వివక్షపై లంక మాజీ స్టార్ కీలక వ్యాఖ్యలు
కొలంబో : వర్ణ, జాతి వివక్షను రూపుమాపాలంటే చిన్నప్పటినుంచే పిల్లలకు దానిపై అవగాహన పెంచాలని మాజీ క్రికెటర్ కుమార సంగక్కర అభిప్రాయ పడ్డాడు. అందుకు వాస్తవ చరిత్రను వారు చదివేలా చూడాలని, వడబోసిన చరిత్రను కాదని అతను అన్నాడు. విలువల గురించి నేర్పించకుండా ఎంత పెద్ద చదువులు చదివినా వివక్షను తొలగించలేమని ఈ లంక మాజీ స్టార్ వ్యాఖ్యానించాడు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’పై స్పందిస్తూ సంగక్కర... ఎంతో పెద్ద చదువులు చదివినవారు కూడా ఘోరంగా ప్రవర్తించడాన్ని తాను చూశానని, వివక్షను రూపుమాపడం ఒక్క రోజులో సాధ్యం కాదని స్పష్టం చేశాడు. మరో వైపు ఇకపై పుట్టబోయే పిల్లల బర్త్ సర్టిఫికెట్లో మతం, జాతి వివరాలు నమోదు చేయమని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. (సెప్టెంబర్ 19నుంచి ఐపీఎల్!) -
'ఎన్గిడి... నిజంగా నువ్వు మూర్ఖుడివి'
జోహన్నెస్‌బర్గ్ : అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్షపై నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ హత్యోదంతం తర్వతా బ్లాక్ లైవ్స్ మేటర్ అంశంపై ప్రచారం విస్తృతంగా పెరిగింది. దీనిపై పలువురు వెస్టిండీస్ క్రికెటర్లు కూడా తమ గళం విప్పారు. క్రికెట్లోనూ వర్ణ వివక్ష ఎదుర్కొన్నామంటూ డారెన్ సామి, క్రిస్ గేల్, మైఖేల్ హోల్డింగ్ లాంటి ఆటగాళ్లు పేర్కొన్నారు. తాజాగా 'బ్లాక్ లైవ్స్ మేటర్' ఉద్యమానికి తాను మద్దతు ఇస్తానని దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ లుంగి ఎన్గిడి శుక్రవారం పేర్కొన్నాడు. ఎన్గిడి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్లో పెను దుమారాన్నే రేపుతున్నాయి.(అండర్సన్.. మొన్ననేగా పొగిడాం ఇంతలోనే) 'బ్లాక్ లైవ్స్ మేటర్‌కు నేను మద్దతు ఇస్తున్నా.. ఈ అంశంలో ఇతర ఆటగాళ్ల మద్దతు నాకు ఉంటుందనే ఆశిస్తున్నా. గడిచిన కొన్ని సంవత్సరాల్లో దక్షిణాఫ్రికాలోనూ జాత్యాహంకారం జరగుతుంది.. క్రికెట్లోనూ ఇది కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ లైవ్స్ మేటర్‌కు మా జట్టులోని ఆటగాళ్లు కూడా కలిసి వస్తారని ఆశిస్తున్నా’అని తెలిపాడు.' అయితే ఎన్గిడి వ్యాఖ్యలపై పలువురు మాజీ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. 'ఎన్గిడి నువ్వు నిజంగా మూర్ఖుడివి.. బ్లాక్ లైవ్స్ మేటర్‌కు మద్దతు ఇవ్వాలా వద్దా అనేది నీ ఇష్టం. నువ్వు మద్దతు ఇవ్వాలనుకుంటే ఇవ్వు. కానీ మొత్తం దక్షిణాఫ్రికా ప్రజలను ఇందులోకి లాగొద్దు.' అంటూ దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ పాట్ సిమ్‌కాక్స్ పేర్కొన్నాడు. ' బ్లాక్ లైవ్స్ మేటర్ ప్రచారం వెనుక రాజకీయ ఉద్యమం తప్ప మరొకటి లేదని నేను భావిస్తున్నా. ఎన్గిడి.. మద్దతు ఇచ్చే ముందు థామస్ సోవల్, లారీ ఎల్డర్, వాల్టర్ విలిమమ్స్ లాంటి తెల్లజాతి రైతులపై జరిగిన దారుణాలను గుర్తు తెచ్చుకోవాలి. ఈ విషయంలో నువ్వు సానుభూతి ప్రకటిస్తే బ్లాక్ లైవ్స్ మేటర్ ప్రచారంలో నేను నీతో పాటు వస్తా 'అంటూ మాజీ బ్యాట్స్‌మన్ బొటా డిప్పెనార్ తెలిపాడు. అయితే ఎన్గిడి వ్యాఖ్యలకు తాను మద్దతిస్తున్నట్లు విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి తెలిపాడు.' బ్లాక్ లైవ్స్ మేటర్ ప్రచారానికి ఎన్గిడి మద్దతివ్వడం చాలా సంతోషంగా ఉంది. నీ వెనుక ఎవరు లేకున్నా మేమంతా నీతోనే ఉన్నాం . ఈ విషయలంలో కలిసి పోరాడుదాం' అంటూ ట్విటర్లో పేర్కొన్నాడు. ఒకప్పుడు వర్ణ వివక్ష అన్న కారణంతోనే దక్షిణాఫ్రికా దశాబ్దాలకు పైగా క్రికెట్ ఆడలేదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.('ధోనికున్న మద్దతు కోహ్లికి లేదు..') -
క్రికెట్‌కు నమో నమః
సరిగ్గా 116 రోజుల చదివింపుల తర్వాత సగటు క్రికెట్ అభిమానికి కూసింత ఆనందం. ఏ దేశం ఆడితేనేమి... జట్టులో ఎవరుంటేనేమి... కాస్త క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం గురించి మాట్లాడుకునే అవకాశం... స్కోరు ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి... ఇన్ని రోజులూ పాత చద్ది వార్తలే చదువుతూ, నాటి ఘనతల గురించే వింటూ వచ్చిన వారికి ఇదో ఊరట. ఎప్పుడో నమిలి మింగేసిన స్కోర్లనే గుర్తుకు తెచ్చుకుంటూ ఇంత కాలం గడిపిన వారికి ఇన్నాళ్లకు క్రికెట్‌ను ఆసక్తిగా చూసే అవకాశం వచ్చేసింది. అవును... అంతర్జాతీయ క్రికెట్ తిరిగొచ్చింది. కోవిడ్–19 కష్టకాలం తర్వాత తొలిసారి ఆటకు రంగం సిద్ధమైంది. ఇందుకు ఇంగ్లండ్ చొరవ చూపించగా... అతిథిగా వచ్చేందుకు వెస్టిండీస్ అంగీకారం తెలిపింది. ఫలితంగా చరిత్రలో ప్రత్యేకంగా మిగిలిపోయే మ్యాచ్‌కు ఆమోద ముద్ర పడింది. మైదానంలో టచింగ్‌లు లేవు. ఉమ్మితో బంతిని రుద్దటాలు కనిపించవు. అడుగేస్తే సోషల్ డిస్టెన్సింగ్, దగ్గరికొస్తే శానిటైజింగ్... ఇలా కరోనా కట్టుబాట్లతో క్రికెట్ మొదలవుతోంది. 143 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారి ఇలాంటి పరిస్థితుల్లో ఆట జరుగుతోంది. టెస్టు క్రికెట్ అంటే పడిచచ్చే ఇంగ్లండ్‌లో ప్రేక్షకులు లేకుండా జరిగే ఈ మ్యాచ్‌తో నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో ఆటగాళ్లకు అనుభవంలోకి రానుంది. సౌతాంప్టన్: కరోనా విరామం తర్వాత అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంతర్జాతీయ క్రికెట్‌కు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి ఇక్కడి రోజ్‌బౌల్ మైదానంలో జరిగే తొలి టెస్టులో ఇంగ్లండ్‌తో వెస్టిండీస్ తలపడనుంది. సొంతగడ్డపై రికార్డు, ప్రస్తుత బలబలాలు... ఎలా చూసుకున్నా విండీస్‌కంటే ఇంగ్లండ్‌దే అన్నింటా పైచేయి. అయితే ఈ మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శనకంటే ఆట జరగడంపైనే అందరి దృష్టీ నిలవనుంది. కరోనా వైరస్ విజృంభణకు ముందు మార్చి 13న సిడ్నీలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య చివరి అంతర్జాతీయ మ్యాచ్ (వన్డే) జరిగింది. ఇంగ్లండ్ బలంగా... ఇంగ్లండ్ జట్టు జనవరిలో దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్‌లో టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ సిరీస్‌ను ఇంగ్లండ్ 3–1తో గెలుచుకుంది. ఇందులో ఆడిన వారిపైనే నమ్మకముంచిన బోర్డు 13 మందితో జట్టును ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో రెగ్యులర్ కెప్టెన్ జో రూట్ ఈ టెస్టుకు దూరం కాగా... తొలిసారి బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రూట్ స్థానంలో రోరీ బర్న్స్ తుది జట్టులోకి రావడం మినహా మరో మార్పునకు అవకాశం లేదు. అయితే బర్న్స్ ఓపెనర్‌గా ఆడితే క్రాలీ నాలుగో స్థానంలో బరిలోకి దిగుతాడు. మిడిలార్డర్లో ఓలీ పాప్, జోస్ బట్లర్ రూపంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. స్టోక్స్, స్యామ్ కరన్వంటి ఆల్‌రౌండర్లతో జట్టు బలం మరింత పెరిగింది. అత్యంత అనుభవజ్ఞులైన ఇంగ్లండ్ స్టార్ బౌలర్లు అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ చెలరేగితే విండీస్‌కు కష్టాలు తప్పవు. మూడో పేసర్‌గా జోఫ్రా ఆర్చర్‌కే ఎక్కువ అవకాశం ఉన్నా... వుడ్ నుంచి అతనికి పోటీ ఎదురవుతోంది. మొత్తంగా స్వదేశంలో ఇంగ్లండ్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. విండీస్ నిలిచేనా... వెస్టిండీస్ తమ చివరి టెస్టు మ్యాచ్‌ను గత ఏడాది డిసెంబరులో అఫ్గానిస్తాన్‌తో ఆడింది. అయితే భారత్‌తో పోలిస్తే ఇంగ్లండ్ పిచ్‌లు పూర్తిగా భిన్నం కాబట్టి ఇప్పటి తుది జట్టులో మార్పులు తప్పకపోవచ్చు. ఓపెనర్లుగా క్రెయిగ్ బ్రాత్‌వైట్, క్యాంప్‌బెల్ జోడీకి మంచి రికార్డే ఉంది. ఆ తర్వాత షై హోప్, బ్రూక్స్ జట్టు బ్యాటింగ్ భారాన్ని మోస్తారు. అఫ్గాన్ జట్టుపై సెంచరీతో బ్రూక్స్ తనలోని ప్రతిభను ప్రదర్శించాడు. దూకుడుగా ఆడే హెట్‌మైర్ ఈ సిరీస్‌కు దూరంగా ఉండనుండటంతో విండీస్ బ్యాటింగ్ కొంత బలహీనపడింది. అతని స్థానంలో బ్లాక్‌వుడ్‌కు అవకాశం ఇస్తారా చూడాలి. అలా అయితే ముగ్గురు రెగ్యులర్ పేసర్లకు చోటు కల్పించడం కష్టం. ఆల్‌రౌండర్లు హోల్డర్, ఛేజ్ జట్టుకు మంచి స్కోరు అందించగలరు. ఆఫ్‌స్పిన్నర్‌గా కార్న్‌వాల్‌కు చోటు ఖాయం. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌కు విండీస్ ఎంత వరకు పోటీనిస్తుందనేది ఆసక్తికరం. మ్యాచ్ తుది ఫలితం ఎలా ఉన్నా ‘బయో సెక్యూర్ బబుల్’లో ఈ జరగనున్న ఈ మ్యాచ్‌కు ఎలాంటి అవాంతరాలు రాకూడదని క్రికెట్ ప్రపంచం కోరుకుంటోంది. ‘బబుల్’ మధ్యలో బద్దలు కాకుండా సిరీస్ విజయవంతంగా ముగిసి ఈ ప్రయత్నం మరిన్ని టోర్నీలకు దారి చూపాలని ఆశిస్తోంది. ఇక యూ ట్యూబ్ పాత వీడియోలు, ఆటగాళ్ల ఇన్స్టాగ్రామ్ ముచ్చట్లను పక్కన పెట్టి ఇప్పుడు అసలైన ఆటను వీక్షించేందుకు అభిమానులు రెడీగా ఉన్నారు. పిచ్, వాతావరణం సహజంగా ఇంగ్లండ్‌లో ఉండే పరిస్థితులే రోజ్‌బౌల్ పిచ్‌లోనూ ఉన్నాయి. ఆరంభంలో స్వింగ్‌కు అనుకూలం. తర్వాత బ్యాటింగ్‌కు మంచి అవకాశముంది. అయితే తొలి రెండు రోజులు సౌతాంప్టన్‌లో వర్ష సూచన ఉంది. మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించడం ఖాయం. ప్రేక్షకులు లేకపోవడంతో మైదానంలో మ్యూజిక్ వినిపిస్తారని వార్తలు వచ్చినా... అదేమీ లేదని ఈసీబీ స్పష్టం చేసింది. తుది జట్ల వివరాలు (అంచనా) ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), బర్న్స్, సిబ్లీ, డెన్లీ, క్రాలీ, పోప్, బట్లర్, బెస్, ఆర్చర్, బ్రాడ్, అండర్సన్. వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), బ్రాత్‌వైట్, హోప్, క్యాంప్‌బెల్, బ్రూక్స్, ఛేజ్, డౌరిచ్, కార్న్‌వాల్, అల్జారి జోసెఫ్, రోచ్, గాబ్రియెల్. విశేషాలు ► ఇరు జట్ల ఆటగాళ్లు బ్లాక్స్ లైవ్స్ మ్యాటర్ లోగోను తమ జెర్సీల కాలర్‌పై ధరించి బరిలోకి దిగనున్నారు. ► రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 157 టెస్టుల్లో విండీస్ 57, ఇంగ్లండ్ 49 గెలిచాయి. మరో 51 ‘డ్రా’గా ముగిశాయి. ► కీమర్ రోచ్ మరో 7 వికెట్లు తీస్తే టెస్టుల్లో 200 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. -
ఈ తరం, ఈ చైతన్యం కావాలి
మార్కులు, ర్యాంకుల పరుగులో ఉన్న యువత సమాజ మార్పు గురించి ఆలోచిస్తున్నదా? సామాజిక చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నదా? పాలనా విధానాలలో పాలు పంచుకుని వాటిని ప్రభావితం చేసేలా ముందుకు వస్తున్నదా? అలా ముందుకు వచ్చే యువతను ఎంపిక చేసే ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమం ‘యంగ్ లీడర్స్ ఫర్ యాక్టివ్ సిటిజన్‌షిప్’ (వై.ఎల్.సి.ఏ)కు తెలుగు తేజం, హైదరాబాద్ విద్యార్థిని ఇష్వి మథాయి ఎంపిక కావడం ప్రశంసకు కారణమవుతోంది. ఈ ప్రోగ్రామ్‌కు శశి థరూర్ (పార్లమెంట్ సభ్యులు), బైజయంత్ పండా (మాజీ పార్లమెంట్ సభ్యులు), ప్రొ. మైఖేల్ వాల్టన్ (హార్వర్డ్ యూనివర్సిటీ) సలహాదారులుగా ఉంటారు. హైదరాబాద్‌లోని బాచుపల్లి ఓక్రిడ్జ్‌లో క్లాస్ 11 చదువుతున్న ఇష్వి చదువులో టాపర్‌గా నిలవడమే కాక స్విమ్మింగ్‌లో జాతీయస్థాయి ప్రతిభ చూపుతోంది. తాజాగా ఆమె వై.ఎల్.సి.ఏ ప్రోగ్రామ్‌కు ఎంపికైంది. లాక్డౌన్ సమయంలో ఆమె ప్రదర్శించిన సామాజిక చైతన్యం, ప్రతిస్పందనకు ఈ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల ప్రధాన నగరాల నుంచి విద్యార్థినీ విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌లో ఎంపిక కోసం పాల్గొనగా అనేక అంచెల వడపోతల తర్వాత ఇష్వికి ఈ గౌరవం దక్కింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించాక ఇష్వి వలస కార్మికుల సహాయానికి తన వంతు ప్రయత్నం చేయాలనుకుంది. అందుకు తనకు ప్రావీణ్యం ఉన్న బేకింగ్‌ను ఒక మార్గంగా ఎంచుకుంది. తాను చేసిన బేకింగ్ ఉత్పత్తులతో తన రెసిడెన్షియల్ కమ్యూనిటీలో నిధులు సేకరించింది. వాటిని వలస కార్మికులకు ఆహార పదార్థాలు అందించడానికి, వాకింగ్ కిట్లకు, వైద్య సహాయానికి వినియోగించింది. అయితే వై.ఎల్.సి.ఏ ప్రోగ్రామ్ నిర్వాహకులకు ఇష్విలో ఆకర్షించిన అంశం ఆమె తన బేకింగ్ ఉత్పత్తులను సామాజిక సందేశానికి కూడా ఉపయోగించడం. ఇటీవలి ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమానికి మద్దతుగా ఆ సందేశాన్ని ఇమిడ్చిన బేకింగ్ ఉత్పత్తులను ఇష్వి చేయడం నిర్వాహకులు ప్రశంసనీయంగా భావించారు. వై.ఎల్.సి.ఏ ప్రోగ్రామ్ రెండు నెలల పాటు సాగుతుంది. ఈ ప్రోగ్రామ్‌లో అలవర్చుకోవాల్సిన దృష్టికోణం గురించి, సామాజిక–రాజకీయ నిర్మాణం పట్ల ఉండవలసిన విమర్శనాలోచన గురించి, నాయకత్వ శక్తిని సమకూర్చుకోవడం గురించి, సామర్థ్యాలు దీర్ఘకాలం నిలిచేలా నైపుణ్యాలు పెంచుకోవడం గురించి దర్శనీయత ఇస్తారు. ఇంత విశేష కార్యక్రమంలో స్థానం పొందడం ఇష్వి ప్రతిభకు ఒక మెచ్చుతునక. ఇష్వి ద్వారా సహాయం పొందుతున్న వలస కార్మికులు -
‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’
లండన్: అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యానంతరం ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతోంది. ఇప్పుడు క్రికెట్ మైదానంలో దానికి సంఘీభావం తెలిపేందుకు వెస్టిండీస్ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. జూలై 8 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టులో విండీస్ క్రికెటర్లు తమ జెర్సీ కాలర్‌పై ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అని ముద్రించిన లోగోతో బరిలోకి దిగనున్నారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగమయ్యేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విండీస్ జట్టుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. కరోనా కారణంగా మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆగిపోయింది. ఇప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ‘బయో సెక్యూర్ బబుల్’ వాతావరణంలో వెస్టిండీస్‌కు సొంతగడ్డపై ఆతిథ్యం ఇచ్చేందుకు ఇంగ్లండ్ బోర్డు సిద్ధమైంది. విరామం తర్వాత జరగనున్న తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఇదే కానుంది. ‘జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం గురించి ప్రచారం చేసే, దానికి సంఘీభావం తెలిపే బాధ్యత మాకుందని భావిస్తున్నాం. క్రికెట్ చరిత్రలో ఇదో చారిత్రాత్మక ఘట్టం. మేం క్రికెట్ ఆడటానికే ఇంగ్లండ్‌కు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోందో మాకు బాగా తెలుసు. శరీరం రంగు కారణంగా ఒకరిపై అభిప్రాయాలు ఏర్పరుచుకోవడం ఎంత బాధగా ఉంటుందో వెస్టిండీస్ క్రికెటర్లకు బాగా తెలుసు. వర్ణం కారణంగా అసమానతలు ఉండరాదనేది మా కోరిక. సమాన హక్కులు సాధించడం కోసం అందరూ ప్రయత్నించాలి’ అని వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ వ్యాఖ్యానించాడు. విండీస్ ఆటగాళ్లు ధరించబోయే లోగోను అలీషా హోసానా డిజైన్ చేయగా... ఇటీవల మళ్లీ ప్రారంభమైన ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో 20 జట్ల ఆటగాళ్లు కూడా ధరించారు. సరిగ్గా ఆ లోగోకే ఐసీసీ అనుమతి ఇచ్చింది. ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు... ‘ఐసీసీ క్లాతింగ్ అండ్ ఎక్విప్మెంట్ నిబంధనల ప్రకారం రాజకీయ, మతపరమైన, జాతి వివక్షకు సంబంధించిన సందేశాలు ఎలాంటివి కూడా ప్రదర్శించేందుకు అనుమతి లేదు’... ఇలా ఐసీసీ తమ నిబంధనల్లో స్పష్టంగా చెప్పింది. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ ధోని తన వికెట్ కీపింగ్ గ్లవ్స్‌పై డాగర్ గుర్తు ముద్రించి ఉన్న ‘బలిదాన్ బ్యాడ్జ్’ను ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దానిని తర్వాతి మ్యాచ్ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంది. ఇంకాస్త వెనక్కి వెళితే భారత్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ‘ఫ్రీ పాలస్తీన్, సేవ్ గాజా’ అంటూ రిస్ట్ బ్యాండ్ ధరించగా రిఫరీ డేవిడ్ బూన్ తీసేయించారు. ఇంగ్లండ్ బోర్డు దానిని రాజకీయపరమైంది కాదు మానవత్వానికి సంబంధించి అని మొయిన్ అలీని సమర్థించినా ఐసీసీ అంగీకరించలేదు. ఇప్పుడు ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ వీటికి ఎలా భిన్నమో ఐసీసీనే చెప్పాలి. ఎలా చూసుకున్నా తాజా అమెరికా అంశానికి కూడా ఆటలతో సంబంధం లేదు. వ్యక్తిగతంగా బయట ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా... మైదానంలోకి వచ్చేసరికి ఏ క్రీడలోనైనా అంతా ఒక్కటే అంటూ బరిలోకి దిగడం ప్రాథమిక స్ఫూర్తి. ఇటీవలి పరిణామాలపై ఐసీసీ స్పందిస్తూ ‘నిబంధనల ప్రకారం అన్నింటిని ఒకే గాటన కట్టకుండా తమ విచక్షణ మేరకు ఆయా సందర్భానుసారం నిబంధనల విషయంలో కాస్త సడలింపు ఇస్తాం’ అని ప్రకటించింది. మొత్తంగా చూస్తే జాతి వివక్షను వ్యతిరేకించే విషయంలో తామెక్కడ వెనకబడిపోతామో అనుకొని దీనికి అనుమతి ఇచ్చినట్లు అర్థమవుతోంది. అన్నట్లు జట్టు మొత్తం నల్లవారితోనే నిండిన వెస్టిండీస్ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అంటూ సంఘీభావం తెలపడం కంటే శ్వేత జాతీయులతో నిండిన ఇంగ్లండ్ టీమ్ అలా చేసి ఉంటే భిన్నంగా ఉండేదేమో. -
వేరు చెయ్యకు పేరయ్యా
లవ్ ఈజ్ బ్లైండ్. నలుపూ తెలుపు చూసుకోదు ప్రేమ. పెళ్లిళ్ల సైట్లే.. నాట్ కైండ్! అన్నీ చూస్తాయి.అడుగులు.. అంగుళాలు..ఆస్తులు.. అంతస్థులు..చేస్తున్న ఉద్యోగం.. వస్తున్న జీతం..రంగు కూడా! ‘కూడా’ ఏంటి! రంగే మెయిన్.ఇద్దరమ్మాయిలకు ఇది నచ్చలేదు.రంగుతో వేరు చెయ్యొదన్నారు.రంగు ‘ఫిల్టర్’ను తీయించేశారు. అబ్బాయికి అమ్మాయిని వెదకాలి. అమ్మాయికి అబ్బాయిని చూడాలి. వెదకడానికి, చూడ్డానికి తేడా ఉంది. ‘వెదకడం’ అంటే అబ్బాయికి అమ్మాయి దొరకడం లేదని! ‘చూడడం’ అంటే అబ్బాయిలు కాళ్లకు చేతులకు అడ్డం పడుతున్నారని! మరీ మునుపటిలా లేవు రోజులు. కొద్దిగా తారుమారయ్యాయి. వధువులు దొరకడం కష్టమైపోయింది. ఇంత కష్టమైపోయినా కూడా అబ్బాయిలు ఒక విషయంలో మాత్రం ‘ఎస్’ అందామా, ‘నో’ అందామా అని ఆలోచిస్తూనే ఉన్నారు. ఆ ఆలోచన.. అమ్మాయి ఒంటి రంగు గురించి! వధువు తెల్లగా ఉండాలి. పెళ్లిచూపుల్లో అయినా అదే చూపు, ఆన్లైన్ పరిచయ వేదికల్లో అయినా అదే చూపు. మగవాళ్లలో రంగును చూసే అమ్మాయిలు ఉంటే ఉండొచ్చు. అది రెండో చాయిస్‌గానే ఉంటుంది. ఫస్ట్ చాయిస్ మాత్రం ‘అబ్బాయి మంచివాడైతే చాలు’ అనే. పైకి ఎన్నిచెప్పినా పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికి పెద్దవాళ్లందరి ‘ఔట్లుక్’ ఒకేలా ఉంటుంది. పిల్లల ‘ఫస్ట్ లుక్’ వేరుగా ఉంటుంది. పిల్లల్ని అలా వదిలేద్దాం. వాళ్లు చూసేది ఎలాగూ రంగును కాదు, వాళ్లు చేసుకునేదీ రంగును కాదు. పెద్దవాళ్లయితే మాత్రం కచ్చితంగా ఈడూజోడూ చూస్తారు. పిల్లకన్నా పిల్లవాడు రెండంగుళాలైనా ఎత్తుండేలా చూసుకుంటారు. ఎత్తు చూసే ముందే.. ఉద్యోగంలో ఎంత ఎత్తుకు ఎదగగలడో చూసుకుని ఉంటారు. ఆస్తులు ఉంటే మంచిదే. తోబుట్టువులు పెద్దగా లేకుంటే మరీ మంచిది. ఇన్ని ఉంటాయి. అన్నీ కుదిరితే అప్పుడు అబ్బాయి రంగును కూడా కుదురుతుందేమోనని చూస్తారు. అబ్బాయి వైపు వాళ్లయితే ముందుగా పిల్ల రంగును చూసుకుంటారు. తర్వాతే మిగతావన్నీ. అందుకే మ్యాట్రిమోనియల్ సైట్స్‌లో కూడా ‘ఒంటి ఛాయ’ కాలమ్ మస్ట్‌గా కనిపిస్తుంటుంది. పెళ్లి సైట్లకు ఫొటో, వివరాలు ఇచ్చేవారు.. ఫొటోలో ఎలా ఉన్నా, రంగును మాత్రం ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయాలి. తెలుపు అనీ, నలుపు అని, మరీ నలుపు కాదనీ, నలుపు కంటే కాస్త తక్కువని, చామన చాయ కంటే పిసరంత ఎక్కువనీ.. డీటెయిల్డ్‌గా ఇవ్వాలి. ‘షాదీ డాట్ కామ్’ ఇండియాలో పేరున్న పెద్ద పెళ్లిళ్ల పేరయ్య. ఆ సైట్లో రంగుకు ఏకంగా ఒక స్కిన్ కలర్ ఫిల్టరే ఉంటుంది. ఫెయిర్, వీటిష్, డార్క్. ముట్టుకుంటే కందిపోవడం ఫెయిర్. గోధుమ రంగులో ఉండటం వీటిష్. డార్క్ అంటే నలుపు. ఇప్పుడు ఈ ఫిల్టర్‌ని షాదీ డాట్ కామ్ తొలగించబోతోంది! పెద్ద విషయమే అనుకోవాలి. హీతల్, మేఘన్ అనే ఇద్దరు అమ్మాయిలు రంగును పెద్ద విషయం చెయ్యబట్టే షాదీ డాట్ కామ్ చిన్న విషయంగా కొట్టివేయలేకపోయింది. హీతల్ సంతకాల ఉద్యమం స్క్రీన్‌షాట్ పెళ్లీడుకొచ్చిన పిల్లల ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’లో ఏ రంగూ లేని ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఇదే పిల్లలు పెళ్లిళ్ల సైట్‌కి వెళ్తే మాత్రం మొదట క్లిక్ కొట్టేది రంగునే. ఆ కేటగిరీలోకి వెళ్లి ఇక ఆ దారంటా అన్వేషణ మొదలు పెడతారు. మానవ స్వభావం. సైట్ల వాళ్లను కూడా తప్పు పట్టేందుకు లేదు. కస్టమర్‌కి కావలసింది ఇవ్వలేకపోతే కొన్నాళ్లకు సైటే లేకుండా పోతుంది. అయితే మేఘన్ నాగ్‌పాల్ అనే యువతి దీన్నొక తప్పు పట్టకూడని విషయంగా తీసుకోలేకపోయారు. షాదీ డాట్ కామ్ ఎగ్జిక్యూటివ్ దృష్టికి తీసుకెళ్లి సైట్‌లోని ఆ కలర్ ఫిల్టర్లను తొలగించమని కోరారు. ‘‘కానీ మేడమ్.. చాలామంది పేరెంట్స్ ముఖ్యంగా రంగు గురించే మమ్మల్ని అడుగుతుంటారు’’ అని సమాధానం వచ్చింది. ఈ విషయాన్ని ఫేస్బుక్లో చర్చకు పెట్టారు మేఘన్. నిజమే ఈ ‘వర్ణవివక్ష’ ఏమిటి అన్నట్లు అంతా ఆమెను సపోర్ట్ చేశారు. యు.ఎస్.లో ఉంటున్న హేతల్ లఖానీ అనే యువతి మాత్రం ఆ సపోర్ట్‌ని ఇంకొంచెం పై స్థాయికి తీసుకెళ్లారు. ఆన్లైన్లో పిటిషన్ తయారు చేసి సంతకాలు సేకరించారు. ‘ఛేంజ్ డాట్ ఒఆర్జి’లో ఆమె ఆ పిటిషన్ పెట్టిన పద్నాలుగు గంటల్లోనే 1500 మంది ఫర్గా సంతకాలు చేశారు! దానిని షాదీ డాట్ కామ్‌కి ఫార్వర్డ్ చేశారు. వారి అభిప్రాయాలను గౌరవిస్తూ తన సైట్‌లోని స్కిన్ కలర్ ఫిల్టర్‌ను తొలగించబోతోంది ఆ పెళ్లిచూపుల సంస్థ. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ (నల్లవారి ప్రాణాలూ ముఖ్యమే) ఉద్యమం విస్తృతం అవుతుండటంతో.. రంగుకు ప్రాధాన్యతనిచ్చే ధోరణులు అన్ని రంగాలలోనూ మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రసిద్ధ యు.ఎస్. కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ ఇటీవలే.. చర్మాన్ని తెల్లబరిచే సౌందర్యసాధనాల విక్రయాన్ని ఇండియాలో నిలిపివేయబోతున్నట్లు ప్రకటì ంచింది. తర్వాత షాదీ డాట్ కామ్. ఇప్పుడిక తాజాగా మన దేశవాళీ హిందుస్థాన్ లీవర్ సంస్థ కూడా తమ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ బ్రాండ్ నేమ్ నుంచి ‘ఫెయిర్’ అనే మాటను తొలగిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫెయిర్, వైట్, లైట్ అనే మాటల్ని అందానికి ఏకపద ఆదర్శ నిర్వచనాలుగా వాడటం సరికాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. క్రమంగా మరికొన్ని. మరికొన్ని. మరికొన్ని. ప్రశ్నించడం వల్లనే సాధ్యమౌతున్నవీ, సాధించుకుంటున్నవీ.. ఈ మార్పులన్నీ. నాలో ఉండేవి ఉంటాయి. లేనివీ ఉంటాయి. ఉన్నవీ, లేనివీ నా రంగు చాటున ఉండిపోవడం ఏమిటి? తెలుపు రంగు నా లోపాలను కప్పిపుచ్చే పనైతే అంతకన్నా అసహ్యం ఇంకోటి ఉంటుందా? – హీతల్ లఖానీ, డాలస్, యూఎస్ బాలీవుడ్ తారలు ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి మద్దతు ఇస్తూనే ఫెయిర్‌నెస్ క్రీములకు ప్రచారం ఇస్తున్నారు. దీని వల్ల ఉపయోగం ఏమిటి? తెలుపు ఘనమైనది అనే భావన ఎలా పోతుంది? ఎప్పటికి పోతుంది?– మేఘన్ నాగ్‌పాల్ -
ఫెయిర్‌నెస్ క్రీమ్ అమ్మకాలు నిలిపివేత
సాక్షి,న్యూఢిల్లీ : అమెరికా హెల్త్‌కేర్, ఎఫ్ఎంసీజీ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే) మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత ఊపందుకున్న ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమానికి మద్దతుగా స్కిన్ వైట్నింగ్ (చర్మం తెల్లబడే) క్రీమ్‌ల అమ్మకాలను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. వీటితోపాటు న్యూట్రోజెనా ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల అమ్మకాన్ని కూడా ఆపివేసినట్టు వెల్లడించింది. భారతదేశం సహా ఇతర ప్రాంతాల్లో క్లీన్ అండ్ క్లియర్ ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తామని జేజే తెలిపింది. ఆసియా, మధ్యప్రాచ్యంలో విక్రయించే న్యూట్రోజెనా ఫైన్ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అమ్మకాలు ఉండవని పేర్కొంది. అయితే స్టాక్ ఉన్నంత వరకు క్లీన్ అండ్ క్లియర్ ఫెయిర్‌నెస్ ఉత్పత్తులను విక్రయిస్తామని చెప్పింది. నల్లమచ్చల్ని తొలగించుకొని అందంగా, తెల్లగా అవ్వమంటూ తమ ఉత్పత్తి పేర్లు లేదా ప్రచారం సాగిందని, మీ సొంత స్కిన్ టోన్ కంటే మెరిసిపోవాలంటూ తెల్ల రంగును హైలైట్ చేసిందని తెలిపింది. నిజానికి తమ ఉద్దేశం అది కాదని "ఆరోగ్యకరమైన చర్మం అందమైన చర్మం" అని కంపెనీ తెలిపింది. సాహసోపేతమైన తమ నిర్ణయాన్ని సానుకూల దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అయితే కంపెనీ వ్యాపారంపై ఇది పెద్దగా ప్రభావం చూపదని ఎందుకంటే దాని మార్కెట్ వాటా చాలా తక్కువ అని జేజే ప్రతినిధి చెప్పారు. మరోవైపు జాన్సన్ అండ్ జాన్సన్ నిర్ణయం తరువాత ఇతర కంపెనీలు ఇలాంటి ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసే ధైర్యం చేస్తాయా అనే ప్రశ్నకు విశ్లేషకులు పెదవి విరిచారు. దేశీయ ఫెయిర్‌నెస్ క్రీమ్ మార్కెట్లో 2019లో సుమారు 450 మిలియన్ల డాలర్ల మార్కెట్ వాటా వున్న, ఇతర ఎఫ్ఎంసీజీ కంపెనీలు దీనిని అనుసరించకపోవచ్చన్నారు. బ్రిటిష్-డచ్ బహుళజాతి సంస్థ అనుబంధ కంపెనీ హిందూస్తాన్ యూనిలీవర్, మరో విదేశీ సంస్థ ప్రొక్టర్ అండ్ గాంబుల్, గార్నియర్ (లోరియల్) ఈ విభాగంలో మార్కెట్ ను ఏలుతున్న సంగతి తెలిసిందే. బయోటిక్, లోటస్ హెర్బల్, హిమాలయ వంటి అనేక భారతీయ కంపెనీల ఫెయిర్‌నెస్ ఉత్పత్తులు కూడా భారీ విక్రయాలనే నమోదు చేస్తున్నాయి. మనదేశంలో అత్యధికంగా అమ్ముడుబోయే ఫెయిర్‌నెస్ క్రీమ్ ఫెయిర్ అండ్ లవ్లీ. హిందూస్తాన్ యునిలివర్ కు అత్యంత విజయవంతమైన ఈ క్రీమ్ 2012 నాటికి, కంపెనీ మార్కెట్లో 80 శాతం ఆక్రమించిందంటే దీని డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు గత దశాబ్ద కాలంగా పురుషుల ప్రత్యేక ఫెయిర్‌నెస్ ఉత్పత్తులు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ తారలు షారూఖ్ ఖాన్, జాన్ అబ్రహం వీటికి ప్రచారకర్తలుగా ఉన్నారు. అయితే ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల వ్యాపారం చాలా సంవత్సరాలుగా విమర్శలను ఎదుర్కొంటోంది. సౌందర్య సాధన పేరుతో జరుగుతున్న ఇలాంటి అమ్మకాలను నిషేధించాలంటూ ఇటీవల ఆన్లైన్ పిటిషన్ కూడా సర్క్యులేట్ అయింది. యూరోమోనిటర్ ఇంటర్నేషనల్ ప్రకారం, గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఫెయిర్‌నెస్ క్రీములు, మచ్చల నివారణ, యాంటీ ఏజింగ్ ఉత్పత్తులతో సహా సుమారు 6,277 టన్నుల స్కిన్ లైట్నర్ అమ్ముడుబోయిందట. -
సియాటిల్‌లో ఆందోళనలకు భారతీయురాలి సారథ్యం
వాషింగ్టన్/లండన్: అమెరికాలో మరోసారి జాతివివక్షకు నిరసగా ఆందోళనలు మొదలయ్యాయి. పోలీసుల దురుసు ప్రవర్తనతో చివరకు ఇద్దరు నల్లజాతీయులు జార్జ్ ఫ్లాయిడ్, రేషార్డ్ బ్రూక్స్ ప్రాణాలు కోల్పోయిన ఉదంతంలో నిరసనలు ఎక్కువయ్యాయి. సియాటిల్‌లో జరుగుతున్న ‘బ్లాక్‌లైవ్స్ మ్యాటర్’ ఆందోళనలకు 46 ఏళ్ల భారతీయ అమెరికన్ క్షమా సావంత్ నేతృత్వం వహిస్తున్నారు. సియాటెల్ డౌన్‌టౌన్ నుంచి పోలీసులను తొలగించాలన్న డిమాండ్‌పై ఆమె ఆందోళన చేస్తున్నారు. పుణేలో పుట్టి ముంబైలో చదువుకున్న క్షమా సావంత్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. సమాజంలోని ఆర్థిక అసమానతలను గమనించిన తాను ఆర్థిక శాస్త్రాన్ని చదివానని అందులోనే పీహెచ్డీ చేశానని ఆమె తెలిపారు. 2006లో సోషలిస్ట్ ఆల్టర్నేటివ్‌లో చేరి 2013లో సిటీ కౌన్సిల్ ఉమెన్‌గా ఎన్నికయ్యారు. బ్రిటన్‌లో జాతివివక్షపై కమిషన్.. బ్రిటన్‌లో జాతివివక్ష సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. జాతివివక్షకు ఫుల్స్టాప్ పెట్టే విషయంలో చేయాల్సింది ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.. జార్జి ఫ్లాయిడ్ హత్యను నిరసిస్తూ అమెరికాలోని లాస్ఏంజెలెస్లోని హాలీవుడ్లో ‘ఆల్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ప్రదర్శనలో పాల్గొన్న వందలాది మంది ఆందోళనకారులు -
నల్లజాతి నినాదం సారాపై ట్రోలింగ్
All lives matter అని పోస్ట్ చేసినందుకు సారా అలీఖాన్‌పై ట్రోలింగ్ జరుగుతోంది. #Blacklivesmatter అనే నల్లజాతి నినాదంలోని Black అనే మాటను ఎర్రగీతతో కొట్టేసి, దానిపైన అ అని రాసి సారా షేర్ చేసిన ఆ పోస్టులో అసలు నినాద చిత్రంలో ఉన్నవిధంగా పిడికిలి బిగించి ఒక తెల్ల చెయ్యి, ఒక గోధుమ రంగు చెయ్యి, ఒక నల్ల చెయ్యి ఉంటాయి. వాటి పక్కన సారా అదనంగా ఏనుగు తొండాన్ని మరొక పిడికిలిలా యాడ్ చేశారు. చేసి, జీవులందరి ప్రాణాలూ ముఖ్యమైనవే అనే అర్థంలో అ అనే మాటను పెట్టారు. ఇటీవల కేరళలో ఒక ఏనుగును అమానుషంగా చంపడాన్ని దృష్టిలో పెట్టుకుని సారా అలా చేశారు. అయితే అది వివాదం అయింది. సహనటుడు కరణ్వీర్ బోరా.. సారాకు మద్దతుగా ఆమె ఉద్దేశాన్ని విడమరిచి చెబుతూ ఒక పోస్ట్ పెట్టవలసి వచ్చింది. సారా అలీఖాన్, కరణ్వీర్ బోరా -
వివాదాస్పద యాడ్‌పై స్పందించిన కెందాల్
సాక్షి, వాషింగ్టన్: సూపర్ మోడల్, నటి కెందాల్ జెన్నర్ ఎట్టకేలకు వివాదాస్పద యాడ్ పై నోరు విప్పింది. ఈ యేడాది మొదట్లో ఆమె చేసిన ఓ డ్రింక్ యాడ్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ‘ఆ యాడ్ చేసి చాలా పెద్ద తప్పు చేశా. విమర్శల నేపథ్యంలో మానసికంగా కుంగిపోయా. నా జీవితం ముగిసిందనే భావించా. కానీ, పరిస్థితి ఇప్పుడు సర్దుమణిగింది. మళ్లీ మాములు జీవితం ప్రారంభించేందుకు సిద్ధమయ్యా అని 21 ఏళ్ల కెందాల్ చెబుతున్నారు. ప్రముఖ శీతలపానీయ సంస్థ పెప్సీ రూపొందించిన యాడ్ లో కెందాల్ నటించింది. అయితే నల్లజాతి ఉద్యమాన్ని కించపరిచేలా ఉందంటూ ఆ సమయంలో విమర్శలు వినిపించాయి. దీంతో క్షమాపణలు తెలియజేసిన పెప్సీ సంస్థ ఆ యాడ్ ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి కెందాల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు ఓ ఇంటర్వ్యూ ద్వారా యాడ్ పై స్పందించింది. యాడ్ విషయానికొస్తే.. బ్లాక్ లైవ్స్ పేరిట కొందరు ఆందోళనకారులు ర్యాలీ చేస్తుండగా, అక్కడున్న పోలీసులు అడ్డుకుంటారు. పక్కనే ఫోటో షూట్ చేస్తున్న కెందాల్ ఇది గమనించి పెప్సీ టిన్లను ఇచ్చి పోలీసులను ఛిల్ చేస్తుంది. అయితే సామాజిక పోరాటాన్ని అవహేళన చేశారంటూ రాజకీయ విమర్శలు ఎదురుకాగా, తప్పు చేశావంటూ కెందాల్ సోదరి కిమ్ కర్దాషియన్ కూడా అభిప్రాయపడ్డారు.