Darnella Frazier Video George Floyd: జార్జి ఫ్లాయిడ్‌.. నీకు న్యాయం జరిగింది - Sakshi
Sakshi News home page

జార్జి ఫ్లాయిడ్‌.. నీకు న్యాయం జరిగింది: డార్నెల్లా ఫ్రెజర్

Published Fri, Apr 23 2021 12:17 AM | Last Updated on Fri, Apr 23 2021 12:26 PM

Darnella Frazier a Filmed George Floyd Murder - Sakshi

డార్నెల్లా ఫ్రెజర్‌, జార్జి ఫ్లాయిడ్

ధైర్యం ఏ రూపంలో ఉంటుంది? ఘనమా? ద్రవమా? వాయువా? శబ్దమా? నిశ్శబ్దమా? ఇవన్నీ కలిసిన రూపమా? అయితే ఆ రూపానికి డార్నెల్లా ఫ్రెజర్‌ అని పేరు పెట్టాలి. తెల్లజాతి పోలీసు మోకాలి కింద బిగుసుకుపోతున్న గొంతుతో ఊపిరందక 9 నిముషాల పాటు ‘ఐ కాంట్‌ బ్రీత్‌’ అని మూలుగుతూ గిలగిల కొట్టుకుంటున్న నల్లజాతి మనిషి జార్జి ఫ్లాయిడ్‌ను తన ఫోన్‌లో షూట్‌ చేసిన 17 ఏళ్ల నల్ల అమ్మాయే డార్నెల్లా ఫ్రెజర్‌. కళ్ల ముందరి ఘాతుకానికి ఆ అమ్మాయి హృదయం చెంపల మీదకు ద్రవీభవించింది.

ఆవేదన ఆమె గుండెల్లో ఘనీభవించింది. గొంతులోంచి పోతున్నది తన ప్రాణవాయువే అని ఆమెకు అనిపించింది. శబ్దానికి ముందరి నిశ్శబ్దంలా ఇంటికి వెళ్లి ఆ రోజు అర్ధరాత్రి దాటాక ఆ వీడియోను ఫేస్‌బుక్‌ లో అప్‌ లోడ్‌ చేసింది డార్నెల్లా. మొన్న మంగళవారం ఆ వీడియో సాక్ష్యంతో కోర్టు ఆ పోలీసు అధికారిని దోషిగా నిర్ధారించింది. అతడికి 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఏడాదిగా జరుగుతున్న ఈ కేసు విచారణకు కీలక సాక్ష్యాన్ని అందజేసి నల్లజాతి ఉద్యమానికి మళ్లీ కాస్త ఊపిరి తెచ్చింది డార్నెల్లా ఫ్రెజర్‌.


డార్నెల్లా ఫ్రేజర్‌ కనుక ఆ రోజు పాదరసంలా ఆలోచించి ఉండకపోతే డెరెక్‌ చావిన్‌ ఈరోజుకీ మినియాపొలిస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గానే కొనసాగుతూ ఉండేవారు.
∙∙
ఈ స్టోరీ.. పై వాక్యంతో తప్ప ఇక ఎలానూ ప్రారంభం అవడానికి లేదు. సుమారు ఏడాదిగా అత్యున్నతస్థాయి పోలీస్‌ ఆఫీసర్‌ డెరెక్‌ చావిన్‌పై జరుగుతున్న విచారణ మంగళవారం ముగిసింది. కోర్టు అతడికి 40 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది! విచారణలో నల్లజాతి పౌరుడు జార్జి ఫ్లాయిడ్‌ దుర్మరణానికి ఈ తెల్ల పోలీసు కారణమైనట్లు నిరూపించే ఏ ఒక్క గట్టి సాక్ష్యాధారమూ లేకపోయింది. ఆఖరుగా మిగిలింది పద్దెనిమిదేళ్ల నల్లజాతి టీనేజర్‌ డార్నెల్లా ఫ్రేజర్‌ అప్రయత్నంగా తన సెల్‌ ఫోన్‌లోంచి ఆనాటి ఘటనను షూట్‌ చేసిన వీడియో క్లిప్పింగ్‌! కోర్టు హాల్లో ఆ క్లిప్‌ను ప్రదర్శించారు.

జార్జి ఫ్లాయిడ్‌ గొంతును మోకాలితో తొక్కుతున్నప్పుడు తన సెల్‌ఫోన్‌ లోంచి షూట్‌ చేస్తున్న డార్లెల్లా, ఆమె కజిన్‌ (కుడి వైపు నుంచి మూడు, రెండు స్థానాల్లో). సీసీ ఫుటేజ్‌

అందులో డెరెక్‌ చావిన్‌ తొమ్మిది నిముషాల పాటు జార్జి ఫ్లాయిడ్‌ గొంతు మీద మోకాలిని అదిమిపట్టి ఉంచడం డార్నెల్లా తీసిన పది నిముషాల వీడియోలో మొత్తం రికార్డయి ఉంది. డార్నెల్లా వీడియో తీస్తున్నప్పటి వీడియో ఫుటేజ్‌ని కూడా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి తెప్పించుకుని జడ్జి చూశారు. 2020 మే 25న ఆ ఘటన జరగడానికి కొద్ది నిముషాల ముందు వరకు జార్జి ఫ్లాయిడ్‌ ఎవరో, డార్నెల్లా ఫ్రేజర్‌ ఎవరో ప్రపంచానికి తెలియదు. ఒకరికొకరు కూడా తెలియని సాధారణ పౌరులు.

ఆ సాయంత్రం.. మినియాపొలిస్‌ నగరంలోని చికాగో అవెన్యూలో.. 38వ వీధిలో ఉన్న ‘కప్‌ ఫుడ్స్‌’ షాపింగ్‌ మాల్‌కి తొమ్మిదేళ్ల వయసున్న తన కజిన్‌తో కలిసి వచ్చింది డార్నెల్లా. అక్కడికి దగ్గర్లోనే ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటారు వాళ్లు. వచ్చిన కొద్ది నిముషాలకు నలుగురు పోలీసులు ఒక నల్లజాతి వ్యక్తిని (జార్జి ఫ్లాయిడ్‌) పెడరెక్కలు విరిచి తీసుకెళ్లడం ఆ కూడలి లో ఉన్నవారు చూశారు. ఆ పోలీసులలో ఒకరైన డెరెక్‌ చావిన్‌.. జార్జి ఫ్లాయిడ్‌ని కింద పడేసి, అతడి గొంతుపై తన మోకాలును నొక్కిపెట్టాడు. అప్పుడు చూసింది డార్నెల్లా.. తనకు ఐదడుగుల దూరంలో ఆ దృశ్యాన్ని. జార్జి ఊపిరి అందక విలవిల్లాడుతున్నాడు. ‘ఐ కాంట్‌ బ్రీత్‌. లీవ్‌ మీ’ అంటున్నాడు. పోలీస్‌ ఆఫీసర్‌ వినడం లేదు.

దారుణం అనిపించింది డార్నెల్లాకు. వెంటనే తన సెల్‌ ఫోన్‌ తీసి షూట్‌ చేయడం మొదలు పెట్టింది. జరుగుతున్న ఒక అన్యాయాన్ని మాత్రమే తను షూట్‌ చేస్తున్నానని అనుకుంది కానీ.. నల్లజాతిపై అమెరికన్‌ల జాత్యహంకారానికి వ్యతిరేకంగా అప్పటికే కొనసాగుతున్న ‘బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌’ అనే ఒక ఉద్యమానికి తనొక చోదకశక్తి కాబోతున్నానని అప్పుడు ఆమె అనుకోలేదు. చివరికి నేరస్థుడైన ఆ పోలీస్‌ ఆఫీసర్‌ కు శిక్ష పడేందుకు కూడా డార్నెల్లానే కారణం అయింది. అయితే కోర్టు తీర్పును డార్నెల్లా.. జార్జి ఫ్లాయిడ్‌కి జరిగిన న్యాయంగానే చూస్తోంది తప్ప, పోలీస్‌ ఆఫీసర్‌కు పడిన శిక్షగా కాదు. ‘‘థ్యాంక్యూ గాడ్‌. థ్యాంక్యూ థ్యాంక్యూ థ్యాంక్యూ. జార్జి ఫ్లాయిడ్‌.. నీకు న్యాయం జరిగింది’’ అని బుధవారం ఆమె తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది.


జార్జి ఫ్లాయిడ్‌ను మోకాలితో తొక్కుతున్న పోలీస్‌ అధికారి డెరెక్‌ చావిన్‌. ఇతడిపై నేరం రుజువైంది.

ఏడాది క్రితం జార్జి ఫ్లాయిడ్‌ ఊపిరిపోతున్న క్షణాలను చిత్రీకరించిన రోజు డార్నెల్లాకు ఆ రాత్రి నిద్రపట్టలేదు. బాగా పొద్దుపోయేవరకు మేల్కొని ఆలోచిస్తూనే ఉంది. ఆమె హృదయం ఆక్రోశిస్తోంది. ఆమె నేత్రాలు వర్షిస్తున్నాయి. ఆమె పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. పోలీసులైతే మాత్రం ఇంత అమానుషమా అనిపించింది. తను తీసిన వీడియోను ఏం చేయాలో తోచలేదు. కళ్ల ముందే ఒక మనిషి చనిపోవడాన్ని తీసిన వీడియో అది! అది తన దగ్గరుంది. కొన్ని గంటల మౌనం తర్వాత ఫేస్‌ బుక్‌ ఓపెన్‌ చేసి వీడియోను అప్‌లోడ్‌ చేసింది. ‘‘ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను’’ అని రెండు ముక్కలు రాసింది. కొన్నాళ్ల వరకు ఆ వీడియోను ఎవరూ నమ్మలేదు.


జార్జి ఫ్లాయిడ్‌ మరణానంతరం నల్లజాతి ఉద్యమకారులు ఆయనపై వేసిన పోస్టర్‌లలో ఒకటి.

అది నిజం అని తెలిశాక ఒక్కసారిగా ప్రఖ్యాత అమెరికన్‌ న్యూస్‌ చానళ్లు సి.ఎన్‌.ఎన్‌., ఎ.బి.సి., ఫాక్స్, ఎన్‌.బి.సి., సి.బి.ఎస్‌. డార్నెల్లా కోసం వచ్చాయి. ఆ వీడియో రేపిన భావోద్వేగాలు అమెరికాలోని యాభై నగరాలలో, ప్రపంచ దేశాలలో జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమానికి ఆజ్యం అయ్యాయి. ఐక్యరాజ్య సమితి సైతం జార్జి ఫ్లాయిడ్‌ హత్యోదంతాన్ని నిరాకరించ తగని, నిర్లక్ష్యం చేయకూడని పరిణామంగా పరిగణించింది. నల్లజాతి ఉద్యమ భాషలో నిప్పు రవ్వ అని జార్జి ఫ్లాయిడ్‌ ను అంటున్నాం కానీ.. నిప్పులా ఉద్యమాన్ని రాజేసింది మాత్రం డార్నెల్లా ప్రేజరేనన్నది కాదనలేని సత్యం. లేత మనసుకు అయిన గాయం కన్నీటిగా ఉబికి, జ్వలించింది. ఉద్యమజ్వాల అయింది. తాజాగా కోర్టు తీర్పు రాగానే అమెరికా అధ్యక్షుడు జార్జి బైడెన్‌ ‘బ్రేవ్‌ యంగ్‌ ఉమన్‌’ అని డార్నెల్లాను అభినందించారు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement