former police officer
-
తెరపైకి ఆ పోలీస్ కమీషనర్ బయోపిక్..
Mumbai Former Police Commissioner Rakesh Maria Biopic By Rohit Shetty: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి యాక్షన్ అండ్ కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. ఇటీవల అక్షయ్ కుమార్‌తో సూర్యవంశీ తెరకెక్కించి హిట్ కొట్టాడు. అమెజాన్ ఓటీటీ కోసం ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనె వెబ్ సిరీస్‌ను రోహిత్ శెట్టి డైరెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా రోహిత్ శెట్టి మరో సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అది కూడా ముంబై ఎక్స్ పోలీస్ కమీషనర్ రాకేష్ మారియా బయోపిక్‌ను తెరకెక్కించనున్నాడు రోహిత్. రాకేష్ మారియా తన కెరీర్లో సాధించిన విజయం ఆధారంగా ఈ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు రోహిత్ శెట్టి అధికారికికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రోహిత్ శెట్టి మాట్లాడుతూ 'రాకేష్ మారియా తన 36 ఏళ్ల అద్భుతమైన ఉద్యోగ ప్రయాణంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆయన 1993 ముంబైలో జరిగిన పేలుళ్ల నుంచి అండర్ వరల్డ్ ముప్పు, 2008లోని 26/11 ముంబై ఉగ్రదాడుల వరకు ఎన్నో చూశారు. నిజ జీవితంలోని ఈ సూపర్ కాప్ ధైర్య, సాహసాల ప్రయాణాన్ని తెరపైకి తీసుకురావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను.' అని తెలిపారు. కాగా ఐపీఎస్ అధికారి అయిన రాకేష్ మారియా 1981వ బ్యాచ్ నుంచి సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 1993లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా (ట్రాఫిక్) ఉన్న రాకేష్ మారియా ముంబై వరుస పేలుళ్ల కేసును ఛేదించారు. తర్వాత ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌కు డీసీపీగా, ఆ తర్వాత జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అధికారిగా మారారు. 2008లో 26/11 ముంబై దాడులను పరిశోధించే బాధ్యతను కూడా మారియాకు అప్పగించారు. చదవండి: ప్రముఖ సింగర్ కన్నుమూత.. కరోనా కారణంగా చికిత్స ఆలస్యం ! అల్లు అర్జున్‌కు నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ విషెస్.. దేనికంటే ? -
డార్నెల్లా ఫ్రెజర్.. నిప్పులా ఉద్యమాన్ని రాజేసింది!
ధైర్యం ఏ రూపంలో ఉంటుంది? ఘనమా? ద్రవమా? వాయువా? శబ్దమా? నిశ్శబ్దమా? ఇవన్నీ కలిసిన రూపమా? అయితే ఆ రూపానికి డార్నెల్లా ఫ్రెజర్ అని పేరు పెట్టాలి. తెల్లజాతి పోలీసు మోకాలి కింద బిగుసుకుపోతున్న గొంతుతో ఊపిరందక 9 నిముషాల పాటు ‘ఐ కాంట్ బ్రీత్’ అని మూలుగుతూ గిలగిల కొట్టుకుంటున్న నల్లజాతి మనిషి జార్జి ఫ్లాయిడ్‌ను తన ఫోన్లో షూట్ చేసిన 17 ఏళ్ల నల్ల అమ్మాయే డార్నెల్లా ఫ్రెజర్. కళ్ల ముందరి ఘాతుకానికి ఆ అమ్మాయి హృదయం చెంపల మీదకు ద్రవీభవించింది. ఆవేదన ఆమె గుండెల్లో ఘనీభవించింది. గొంతులోంచి పోతున్నది తన ప్రాణవాయువే అని ఆమెకు అనిపించింది. శబ్దానికి ముందరి నిశ్శబ్దంలా ఇంటికి వెళ్లి ఆ రోజు అర్ధరాత్రి దాటాక ఆ వీడియోను ఫేస్బుక్ లో అప్ లోడ్ చేసింది డార్నెల్లా. మొన్న మంగళవారం ఆ వీడియో సాక్ష్యంతో కోర్టు ఆ పోలీసు అధికారిని దోషిగా నిర్ధారించింది. అతడికి 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఏడాదిగా జరుగుతున్న ఈ కేసు విచారణకు కీలక సాక్ష్యాన్ని అందజేసి నల్లజాతి ఉద్యమానికి మళ్లీ కాస్త ఊపిరి తెచ్చింది డార్నెల్లా ఫ్రెజర్. డార్నెల్లా ఫ్రేజర్ కనుక ఆ రోజు పాదరసంలా ఆలోచించి ఉండకపోతే డెరెక్ చావిన్ ఈరోజుకీ మినియాపొలిస్ పోలీస్ ఆఫీసర్‌గానే కొనసాగుతూ ఉండేవారు. ∙∙ ఈ స్టోరీ.. పై వాక్యంతో తప్ప ఇక ఎలానూ ప్రారంభం అవడానికి లేదు. సుమారు ఏడాదిగా అత్యున్నతస్థాయి పోలీస్ ఆఫీసర్ డెరెక్ చావిన్‌పై జరుగుతున్న విచారణ మంగళవారం ముగిసింది. కోర్టు అతడికి 40 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది! విచారణలో నల్లజాతి పౌరుడు జార్జి ఫ్లాయిడ్ దుర్మరణానికి ఈ తెల్ల పోలీసు కారణమైనట్లు నిరూపించే ఏ ఒక్క గట్టి సాక్ష్యాధారమూ లేకపోయింది. ఆఖరుగా మిగిలింది పద్దెనిమిదేళ్ల నల్లజాతి టీనేజర్ డార్నెల్లా ఫ్రేజర్ అప్రయత్నంగా తన సెల్ ఫోన్లోంచి ఆనాటి ఘటనను షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్! కోర్టు హాల్లో ఆ క్లిప్‌ను ప్రదర్శించారు. జార్జి ఫ్లాయిడ్ గొంతును మోకాలితో తొక్కుతున్నప్పుడు తన సెల్‌ఫోన్ లోంచి షూట్ చేస్తున్న డార్లెల్లా, ఆమె కజిన్ (కుడి వైపు నుంచి మూడు, రెండు స్థానాల్లో). సీసీ ఫుటేజ్ అందులో డెరెక్ చావిన్ తొమ్మిది నిముషాల పాటు జార్జి ఫ్లాయిడ్ గొంతు మీద మోకాలిని అదిమిపట్టి ఉంచడం డార్నెల్లా తీసిన పది నిముషాల వీడియోలో మొత్తం రికార్డయి ఉంది. డార్నెల్లా వీడియో తీస్తున్నప్పటి వీడియో ఫుటేజ్‌ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకుని జడ్జి చూశారు. 2020 మే 25న ఆ ఘటన జరగడానికి కొద్ది నిముషాల ముందు వరకు జార్జి ఫ్లాయిడ్ ఎవరో, డార్నెల్లా ఫ్రేజర్ ఎవరో ప్రపంచానికి తెలియదు. ఒకరికొకరు కూడా తెలియని సాధారణ పౌరులు. ఆ సాయంత్రం.. మినియాపొలిస్ నగరంలోని చికాగో అవెన్యూలో.. 38వ వీధిలో ఉన్న ‘కప్ ఫుడ్స్’ షాపింగ్ మాల్కి తొమ్మిదేళ్ల వయసున్న తన కజిన్‌తో కలిసి వచ్చింది డార్నెల్లా. అక్కడికి దగ్గర్లోనే ఒక అపార్ట్మెంట్లో ఉంటారు వాళ్లు. వచ్చిన కొద్ది నిముషాలకు నలుగురు పోలీసులు ఒక నల్లజాతి వ్యక్తిని (జార్జి ఫ్లాయిడ్) పెడరెక్కలు విరిచి తీసుకెళ్లడం ఆ కూడలి లో ఉన్నవారు చూశారు. ఆ పోలీసులలో ఒకరైన డెరెక్ చావిన్.. జార్జి ఫ్లాయిడ్‌ని కింద పడేసి, అతడి గొంతుపై తన మోకాలును నొక్కిపెట్టాడు. అప్పుడు చూసింది డార్నెల్లా.. తనకు ఐదడుగుల దూరంలో ఆ దృశ్యాన్ని. జార్జి ఊపిరి అందక విలవిల్లాడుతున్నాడు. ‘ఐ కాంట్ బ్రీత్. లీవ్ మీ’ అంటున్నాడు. పోలీస్ ఆఫీసర్ వినడం లేదు. దారుణం అనిపించింది డార్నెల్లాకు. వెంటనే తన సెల్ ఫోన్ తీసి షూట్ చేయడం మొదలు పెట్టింది. జరుగుతున్న ఒక అన్యాయాన్ని మాత్రమే తను షూట్ చేస్తున్నానని అనుకుంది కానీ.. నల్లజాతిపై అమెరికన్ల జాత్యహంకారానికి వ్యతిరేకంగా అప్పటికే కొనసాగుతున్న ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ అనే ఒక ఉద్యమానికి తనొక చోదకశక్తి కాబోతున్నానని అప్పుడు ఆమె అనుకోలేదు. చివరికి నేరస్థుడైన ఆ పోలీస్ ఆఫీసర్ కు శిక్ష పడేందుకు కూడా డార్నెల్లానే కారణం అయింది. అయితే కోర్టు తీర్పును డార్నెల్లా.. జార్జి ఫ్లాయిడ్‌కి జరిగిన న్యాయంగానే చూస్తోంది తప్ప, పోలీస్ ఆఫీసర్‌కు పడిన శిక్షగా కాదు. ‘‘థ్యాంక్యూ గాడ్. థ్యాంక్యూ థ్యాంక్యూ థ్యాంక్యూ. జార్జి ఫ్లాయిడ్.. నీకు న్యాయం జరిగింది’’ అని బుధవారం ఆమె తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. జార్జి ఫ్లాయిడ్‌ను మోకాలితో తొక్కుతున్న పోలీస్ అధికారి డెరెక్ చావిన్. ఇతడిపై నేరం రుజువైంది. ఏడాది క్రితం జార్జి ఫ్లాయిడ్ ఊపిరిపోతున్న క్షణాలను చిత్రీకరించిన రోజు డార్నెల్లాకు ఆ రాత్రి నిద్రపట్టలేదు. బాగా పొద్దుపోయేవరకు మేల్కొని ఆలోచిస్తూనే ఉంది. ఆమె హృదయం ఆక్రోశిస్తోంది. ఆమె నేత్రాలు వర్షిస్తున్నాయి. ఆమె పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. పోలీసులైతే మాత్రం ఇంత అమానుషమా అనిపించింది. తను తీసిన వీడియోను ఏం చేయాలో తోచలేదు. కళ్ల ముందే ఒక మనిషి చనిపోవడాన్ని తీసిన వీడియో అది! అది తన దగ్గరుంది. కొన్ని గంటల మౌనం తర్వాత ఫేస్ బుక్ ఓపెన్ చేసి వీడియోను అప్లోడ్ చేసింది. ‘‘ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను’’ అని రెండు ముక్కలు రాసింది. కొన్నాళ్ల వరకు ఆ వీడియోను ఎవరూ నమ్మలేదు. జార్జి ఫ్లాయిడ్ మరణానంతరం నల్లజాతి ఉద్యమకారులు ఆయనపై వేసిన పోస్టర్లలో ఒకటి. అది నిజం అని తెలిశాక ఒక్కసారిగా ప్రఖ్యాత అమెరికన్ న్యూస్ చానళ్లు సి.ఎన్.ఎన్., ఎ.బి.సి., ఫాక్స్, ఎన్.బి.సి., సి.బి.ఎస్. డార్నెల్లా కోసం వచ్చాయి. ఆ వీడియో రేపిన భావోద్వేగాలు అమెరికాలోని యాభై నగరాలలో, ప్రపంచ దేశాలలో జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమానికి ఆజ్యం అయ్యాయి. ఐక్యరాజ్య సమితి సైతం జార్జి ఫ్లాయిడ్ హత్యోదంతాన్ని నిరాకరించ తగని, నిర్లక్ష్యం చేయకూడని పరిణామంగా పరిగణించింది. నల్లజాతి ఉద్యమ భాషలో నిప్పు రవ్వ అని జార్జి ఫ్లాయిడ్ ను అంటున్నాం కానీ.. నిప్పులా ఉద్యమాన్ని రాజేసింది మాత్రం డార్నెల్లా ప్రేజరేనన్నది కాదనలేని సత్యం. లేత మనసుకు అయిన గాయం కన్నీటిగా ఉబికి, జ్వలించింది. ఉద్యమజ్వాల అయింది. తాజాగా కోర్టు తీర్పు రాగానే అమెరికా అధ్యక్షుడు జార్జి బైడెన్ ‘బ్రేవ్ యంగ్ ఉమన్’ అని డార్నెల్లాను అభినందించారు! -
ఆ పోలీసు అధికారి దోషి
వాషింగ్టన్: అమెరికా సహా ప్రపంచ దేశాల్లో సంచలనం సృష్టించిన ఆఫ్రికన్ అమెరికాన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో మాజీ పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌ను దోషిగా తేలుస్తూ స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. 12 మంది జ్యూరీ సభ్యులున్న కోర్టు ఈ ఘటనను ఉద్దేశపూర్వకంగా చేయని సెకండ్ డిగ్రీ మర్డర్, థర్డ్ డిగ్రీ మర్డర్ అని మంగళవారం వెలువరించిన తీర్పులో పేర్కొంది. చౌవిన్ బెయిల్‌ని రద్దు చేసింది. మూడు వారాల పాటు 45 మంది సాక్షుల్ని విచారించిన కోర్టు సోమవారం 10 గంటలకు పైగా తుది విచారణ జరిపింది. అయితే శిక్షను న్యాయస్థానం వాయిదా వేసింది. న్యాయమూర్తి పీటర్ కాహిల్ 8 వారాల్లో శిక్ష ఖరారు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా అమెరికా చట్టాల ప్రకారం చౌవిన్‌కు 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. తీర్పు వెలువరించిన సమయంలో డెరెక్ చౌవిన్‌కు ముఖానికి సర్జికల్ మాస్కు ధరించి ఉండడంతో అతని ముఖంలో భావాలేవీ బయటకు రాలేదు. మరోవైపు ఫ్లాయిడ్ మృతితో జాతి వివక్షకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమించిన వారు, ఫ్లాయిడ్ మద్దతు దారులు న్యాయస్థానం తీర్పు చెప్పినప్పుడు కోర్టు హాలు బయటే వేచి ఉన్నారు. తీర్పు వెలువడగానే పెద్ద పెట్టున హర్షాతిరేకాలు చేశారు. అతనికి ఉరిశిక్ష వేయాలంటూ నినదించారు. ఈ తీర్పు ఓ ముందడుగు: బైడెన్ జాతి వివక్షకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో ఈ తీర్పు అతి పెద్ద ముందడుగు అవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. తీర్పు వచ్చిన తర్వాత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో కలిసి వైట్ హౌస్నుంచి ఆయన మాట్లాడారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలకి కాంగ్రెస్ సభ్యులందరూ ఇంకా కృషి చేయాలన్నారు. ‘‘ఈ తీర్పు చాలదు. మనం ఇక్కడితో ఆగిపోకూడదు. అయితే న్యాయవ్యవస్థలో ఇదో పెద్ద ముందడుగు’’అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన బైడెన్ ఎంతో కొంత న్యాయం జరిగిందన్నారు. ఈ తీర్పు తో తాను ఊరట పొందానని అన్నారు. ఐ కాంట్ బ్రీత్ అన్న జార్జ్ ఫ్లాయిడ్ ఆఖరి మాటలు అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇది కేవలం నల్లజాతీయుల సమస్య కాదని, ప్రతీ అమెరికన్ సమస్యని అన్నారు. అందరికీ న్యాయం అని తాము కంటున్న కలల్ని జాతి వివక్ష దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊపిరి పీల్చుకున్నాం : ఫ్లాయిడ్ సోదరుడు పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చడంతో తామంతా ఊపిరిపీల్చుకున్నామని ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనైస్ అన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన అనుకూలంగా తీర్పు వచ్చినా జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఊపిరి ఆడట్లేదు... కాలు తీయండి నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ మిన్నియాపాలిస్‌లోని ఒక దుకాణంలో నకిలీ 20 డాలర్ల నోటుతో సిగరెట్లు కొనుగోలు చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఆ దుకాణంలో పని చేసే ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసు అధికారిగా ఉన్న శ్వేతజాతీయుడు డెరెక్ చౌవిన్ 2020, మే 25 రాత్రి ఫ్లాయిడ్‌ను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. 46 ఏళ్ల వయసున్న ఫ్లాయిడ్‌ను రోడ్డుమీదకి ఈడ్చుకొచ్చాడు. తన మోకాలితో ఫ్లాయిడ్ మెడపై గట్టిగా నొక్కి పెట్టి ఉంచాడు. ఫ్లాయిడ్ ఊపిరి ఆడడం లేదంటూ ఎంత మొరపెట్టుకున్నా చౌవిన్ కర్కశ హృదయం కరగలేదు. తొమ్మిది నిమిషాలు పైగా అలా తొక్కి పెట్టి ఉంచాడు. దీంతో ఫ్లాయిడ్ గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకి రావడంతో ప్రజలు ఆగ్రహోద్రిక్తులయ్యారు. ‘‘ఐ కాంట్ బ్రీత్. ఐ కాంట్ బ్రీత్’’అన్న ఫ్లాయిడ్ చివరి మాటలు విన్న వారి హృదయాలు కరిగి నీరయ్యాయి. -
అత్యంత తీవ్రమైన ఆరోపణలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఆ రాష్ట్ర మాజీ పోలీసు చీఫ్ పరమబీర్ సింగ్ తన పిటిషన్లో చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని సుప్రీం కోర్టు అంగీకరించింది. అయితే ఆ పిటిషన్‌ను విచారించడానికి మాత్రం నిరాకరించింది. బొంబాయి హైకోర్టుకు వెళ్లాలని పరమ్‌బీర్‌కు సూచించింది. అనిల్ దేశ్ ముఖ్ అవినీతిపై సంచలన ఆరోపణలు చేసిన పరమ్‌బీర్ ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ విచారణ చేపట్టడానికి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఆర్ రెడ్డిలతో కూడిన బెంచ్ నిరాకరించింది. పరమ్‌బీర్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి అంగీకరించిన కోర్టు బొంబాయి హైకోర్టుకు వెళ్లాలని చెప్పింది. అయితే పరమ్‌బీర్ చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, దీనిని తీవ్రమైన అంశంగానే పరిగణించాలని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరగాలని పరమ్‌బీర్ అనుకుంటే హైకోర్టుకే వెళ్లాలని, ఈ తరహా కేసుల్ని హైకోర్టులే చూస్తాయని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. వివిధ వ్యాపార సంస్థల నుంచి నెలకి రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారి సచిన్ వాజేకి హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ లక్ష్యంగా నిర్ణయించారని ముంబై పోలీసు మాజీ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. -
అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేయరు
ముంబై: మహారాష్ట్ర హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ తప్పుడు ఆరోపణలు చేశారని, అందువల్ల అనిల్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. ముంబైలోని హోటళ్లు, బార్లు, పబ్‌ల నుంచి నెలకు కనీసం రూ. 100 కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్‌ముఖ్ పోలీసులను ఆదేశించారని పరమ్‌వీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, ఏ రోజైతే అనిల్ దేశ్‌ముఖ్ పోలీసులను అలా ఆదేశించారని పరమ్‌వీర్ సింగ్ ఆరోపించారో.. ఆ రోజు అనిల్ దేశ్‌ముఖ్ నిజానికి నాగ్‌పూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని శరద్ పవార్ వివరించారు. కరోనా సోకడంతో అనిల్ దేశ్‌ముఖ్ ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాగపూర్‌లో చికిత్స పొందారని, ఫిబ్రవరి 27 వరకు హోం క్వారంటైన్లో ఉన్నారని తెలిపారు. అందువల్ల, అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రశ్నే లేదని సోమవారం పవార్ స్పష్టం చేశారు. పరమ్‌వీర్ ఆరోపణలు నిజమే అయితే.. రూ. 100 కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్‌ముఖ్ సచిన్ వాజేకు ఫిబ్రవరి మధ్యలో ఆదేశాలిస్తే.. ఆ విషయాన్ని నెల తరువాత పరమ్‌వీర్ ఎందుకు వెల్లడించారని, ముందే ఎందుకు సీఎంకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. మరోవైపు, ఆ సమయంలో అనిల్ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో ఉన్నారన్న వాదనను బీజేపీ తోసిపుచ్చింది. ఫిబ్రవరి 15న ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారంటూ ఒక వీడియోను విడుదల చేసింది. దీనిపై అనిల్‌దేశ్‌ముఖ్ స్పందిస్తూ.. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో కొద్ది సేపు మీడియాతో మాట్లాడిన వీడియోను బీజేపీ చూపుతోందన్నారు. కాగా, పరమ్‌వీర్ ఆరోపణలతో మహారాష్ట్ర హోం శాఖ ప్రతిష్ట దెబ్బతిన్నదని శివసేన వ్యాఖ్యానించింది. అయితే, ఒక్క అధికారి చేసిన ఆరోపణలతో ప్రభుత్వమేమీ కూలిపోదని, మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ముప్పేమీ లేదంది. -
అనిల్ దేశ్‌ముఖ్‌పై నేడు నిర్ణయం
ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నాయకుడు అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరమ్‌వీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణల రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి నష్టనివారణ చర్యల కోసం ఎన్సీపీ అధినేత, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ రంగంలోకి దిగారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం ‘మహావికాస్ ఆఘాడీ(ఎంవీఏ)’పై ఈ ఆరోపణలు ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోవని పవార్ ఆదివారం పేర్కొన్నారు. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను ప్రభుత్వంలో కొనసాగించే విషయమై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం నిర్ణయం తీసుకుంటారన్నారు. అనిల్ దేశ్‌ముఖ్‌పై పరమ్‌వీర్ సింగ్ చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని పవార్ అంగీకరించారు. ఆ ఆరోపణలపై లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై సీఎం ఠాక్రేతో మాట్లాడానన్నారు. పరమ్‌వీర్ సింగ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు సంబంధించి మాజీ ఐపీఎస్ అధికారి జూలియొ రిబీరరో సహకారం తీసుకుంటే బావుంటుందని భావిస్తున్నానన్నారు. దేశ్‌ముఖ్‌కు సంబంధించి తాము సోమవారం వరకు నిర్ణయం తీసుకుంటామని, నిర్ణయం తీసుకునేముందు, ఆ ఆరోపణలకు సంబంధించి ఆయన వాదన కూడా వినాల్సి ఉంటుందని పవార్ వ్యాఖ్యానించారు. దేశ్‌ముఖ్‌ను హోంమంత్రి పదవి నుంచి తప్పించనున్నారన్న వార్తల నేపథ్యంలో పవార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముంబైలోని హోటళ్లు, బార్లు, పబ్స్, రెస్టారెంట్లు, హుక్కా పార్లర్లు.. తదితరాల నుంచి నెలకు కనీసం రూ. 100 కోట్లు వసూలు చేయాలని హోంమంత్రి దేశ్‌ముఖ్ పోలీసు అధికారులకు టార్గెట్లు పెట్టారని పరమ్‌వీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా, సీనియర్ పోలీస్ అధికారి సచిన్ వాజేను మళ్లీ పోలీస్ విభాగంలోకి తీసుకోవడంలో సీఎం ఠాక్రేకు కానీ, హోంమంత్రి దేశ్‌ముఖ్‌కు కానీ సంబంధం లేదని శరద్ పవార్ తెలిపారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై రాజకీయ జోక్యం పెరిగిందని పరమ్‌వీర్ సింగ్ తనకు గతంలో ఫిర్యాదు చేశారని వెల్లడించారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలు సాగబోవని పవార్ స్పష్టం చేశారు. మరోవైపు, హోంమంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయని శివసేన నేత సంజయ్‌రౌత్ వ్యాఖ్యానించారు. మహా వికాస్ అఘాడీ మిత్రపక్షాలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉందన్నారు. అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించాలని, దేశ్‌ముఖ్‌ను ప్రభుత్వంలో కొనసాగించే విషయంలో నిర్ణయం తీసుకోవాలని అదే పార్టీ నేత సంజయ్ నిరుపమ్ వ్యాఖ్యానించారు. దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. ఆరోపణల తీవ్రత దృష్ట్యా అనిల్ దేశ్‌ముఖ్‌పై వేటు తప్పకపోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంపై మిత్ర పక్షాల మధ్య విబేధాలు వచ్చే అవకాశాలు న్నాయనుకుంటున్నాయి. అయితే, అనిల్‌దేశ్‌ముఖ్ రాజీనామా చేయబోరని ఎన్సీపీ స్పష్టం చేసింది. పవార్‌తో చర్చించిన తరువాత ఎన్సీపీ మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్ ఈ వ్యాఖ్య చేశారు. -
వాజే టార్గెట్ వంద కోట్లు
-
వాజే టార్గెట్ వంద కోట్లు
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో కేసు కీలక మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలోని శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్‌సింగ్ ఏకంగా రాష్ట్ర హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై ఆయన ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఎనిమిది పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. పేలుడు పదార్థాల కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను మంత్రి వాడుకున్నారని ఆరోపించారు. నెలకు రూ.100 కోట్ల చొప్పున వసూలు చేయాలని వాజేకు హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పురమాయించారంటూ పరంబీర్ బాంబు పేల్చారు. ఈ సొమ్మును సీఎం ఠాక్రే పేరిట జమ చేయాలన్నారని చెప్పారు. అనిల్ అవినీతి కార్యకలాపాల గురించి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఉపముఖ్యమంత్రి అజిత్‌లకు తెలిపానని పరంబీర్ పేర్కొన్నారు. ‘మంత్రి అనిల్ ఫిబ్రవరి నుంచి పలు పర్యాయాలు సచిన్ వాజేను తన అధికార నివాసానికి పిలిపించుకున్నారు. నిధులు సమకూర్చేందుకు సాయపడాలంటూ ఆయన్ను పదేపదే మంత్రి కోరారు. రూ.100 కోట్ల ఫండ్ కలెక్ట్ ఎలా చేయాలో కూడా సచిన్ వాజేకు చెప్పారు. ముంబైలో 1750 బార్లు, రెస్టారెంట్లు, తదితరాలున్నాయి. ఒక్కో బార్, రెస్టారెంటు నుంచి రూ.2–3 లక్షలు వసూలు చేస్తే నెలకు రూ.40 నుంచి రూ.50 కోట్లు సులభంగా జమ అవుతాయి. ఇతర వనరుల ద్వారా మిగతా మొత్తం అందేలా చూడాలని మంత్రి కోరారు. ఆ సమయంలో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పలాండే తదితరులు అక్కడే ఉన్నారు’ అని ఆ లేఖలో పరంబీర్ సింగ్ పేర్కొన్నారు. తనతోపాటు సీనియర్ అధికారులకు తెలియకుండా ఇలా వారిని నివాసానికి పిలిపించుకోవడం, డబ్బులు వసూళ్లు చేసేందుకు టార్గెట్ ఇవ్వడం చేస్తుండేవారని ఆ లేఖలో పేర్కొన్నారు. అనేక కేసుల విచారణలో ఆయన జోక్యం చేసుకునేవారని ఆరోపించారు. అదేవిధంగా అనిల్ దేశ్‌ముఖ్ అవినీతి కార్యకలాపాలు అనేకం పోలీసు అధికారుల దృష్టికి కూడా వచ్చాయన్నారు. ముంబైలో ఆత్మహత్య చేసుకున్న దాద్రానగర్ హవేలీ ఎంపీ మెహన్ దేల్కర్ తన సూసైడ్ నోట్లో అక్కడి అధికారుల తీరుపై పలు ఆరోపణలు చేసినప్పటికీ ఆ కేసును కూడా ముంబై పోలీసులకే అప్పగిస్తూ హోం మంత్రి నిర్ణయం తీసుకోవడాన్ని పరంబీర్ సింగ్ తప్పుబట్టారు. ముకేశ్ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో వాహనం పట్టుబడటం, వ్యాపారి మన్సుఖ్ అనుమానాస్పద మృతి, పోలీస్ ఇన్స్పెక్టర్ వాజే అరెస్టు పరిణామాల నేపథ్యంలో పరంబీర్‌ను అప్రాధాన్యంగా భావించే హోంగార్డుల విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మంత్రి దేశ్‌ముఖ్ ఏమన్నారు? అవినీతి విషయం ఫిబ్రవరిలోనే తెలిసిన పరంబీర్‌సింగ్ ఇప్పటి వరకు మౌనంగా ఎందుకు ఉన్నారంటూ మంత్రి అనిల్ ప్రశ్నించారు. ఆయనపై పరువు నష్టం కేసు వేస్తానని తెలిపారు. తనను తాను కాపాడుకునేందుకే పరంబీర్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ‘వాహనం కేసు, మన్సుఖ్ హత్య కేసులతో వాజేకు సంబంధాలున్నట్లు ఇప్పటికే రుజువైంది. ఇక మిగిలింది పరంబీర్. ఇవన్నీ చివరికి ఆయనకే చుట్టుకుంటాయి. కేసు దర్యాప్తు కొనసాగుతోంది కదా’అని పేర్కొన్నారు. -
11 మంది పోలీసులకు జీవిత ఖైదు
మధుర: రాజస్తాన్‌లోని డీగ్ ప్రాంతంలో భరత్పూర్ రాజవంశానికి చెందిన రాజామాన్ సింగ్, అతని ఇద్దరు అనుచరులను 35 ఏళ్ళక్రితం హతమార్చిన 11 మంది మాజీ పోలీసు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మధుర జిల్లా జడ్జి సాధనారాణి ఠాకూర్ తీర్పునిచ్చారు. శిక్ష పడిన వారిలో డీగ్ డీఎస్పీ కాన్‌సింగ్(82), స్థానిక పోలీసు స్టేషన్ ఇన్చార్జ్, ఎస్ఐ వీరేంద్ర సింగ్ (78) ఉన్నారు. వీరేంద్ర సింగ్ నాయకత్వంలోని పోలీసు బృందం ఫిబ్రవరి 21, 1985న రాజామాన్ సింగ్, అతని ఇద్దరు అనుచరులు సుమేర్ సింగ్, హరిసింగ్‌లను హతమార్చారు. ఇతర పోలీసు అధికారులైన ఏఎస్ఐ రవిశంకర్, కానిస్టేబుల్స్ సుక్రామ్, జీవన్‌రామ్, జగ్మోహన్, భన్వర్‌సింగ్, హరిసింగ్, ఛత్తార్ సింగ్, షేర్ సింగ్, దయారాం, రవిశేఖర్‌లకు ఈ కేసులో యావజ్జీవ శిక్ష పడింది. వీరంతా 70 ఏళ్ళు పైబడిన వృద్ధులే. ఆనాటి రాజస్థాన్ ముఖ్యమంత్రి శివచరణ్ మాథుర్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చినప్పుడు, అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజామాన్ సింగ్ ముఖ్యమంత్రి హెలికాప్టర్ వైపు జీపులో దూసుకెళ్లాడు. ఈ ఎన్నికల ఘటన జరిగిన మరునాడే రాజామాన్ సింగ్, అతని అనుచరులను పోలీసులు డీగ్ వ్యవసాయ మార్కెట్ వద్ద ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. -
మాజీ పోలీసు అధికారి ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్: మాజీ పోలీసు ఉన్నతాధికారి ఇంట్లో దొంగలు పడ్డారు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉండే రిటైర్డు అడిషనల్ ఎస్పీ హరీష్చంద్ర కుటుంబసభ్యులతో సహా ఊరికెళ్లారు. ఇదే అదనుగా ఇంట్లోకి చొరబడిన దుండగులు 30 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, చీరలు దోచుకెళ్లినట్టు సమాచారం. గురువారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు హరీష్ చంద్రకు సమాచారం అందించారు. బాధితులు వస్తేనే ఎంత సొత్తు చోరీ జరిగిందో తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.