ముంబై: మహారాష్ట్ర హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ తప్పుడు ఆరోపణలు చేశారని, అందువల్ల అనిల్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. ముంబైలోని హోటళ్లు, బార్లు, పబ్‌ల నుంచి నెలకు కనీసం రూ. 100 కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్‌ముఖ్ పోలీసులను ఆదేశించారని పరమ్‌వీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, ఏ రోజైతే అనిల్ దేశ్‌ముఖ్ పోలీసులను అలా ఆదేశించారని పరమ్‌వీర్ సింగ్ ఆరోపించారో.. ఆ రోజు అనిల్ దేశ్‌ముఖ్ నిజానికి నాగ్‌పూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని శరద్ పవార్ వివరించారు.
కరోనా సోకడంతో అనిల్ దేశ్‌ముఖ్ ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాగపూర్‌లో చికిత్స పొందారని, ఫిబ్రవరి 27 వరకు హోం క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు. అందువల్ల, అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రశ్నే లేదని సోమవారం పవార్ స్పష్టం చేశారు. పరమ్‌వీర్ ఆరోపణలు నిజమే అయితే.. రూ. 100 కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్‌ముఖ్ సచిన్ వాజేకు ఫిబ్రవరి మధ్యలో ఆదేశాలిస్తే.. ఆ విషయాన్ని నెల తరువాత పరమ్‌వీర్ ఎందుకు వెల్లడించారని, ముందే ఎందుకు సీఎంకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. మరోవైపు, ఆ సమయంలో అనిల్ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో ఉన్నారన్న వాదనను బీజేపీ తోసిపుచ్చింది. ఫిబ్రవరి 15న ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారంటూ ఒక వీడియోను విడుదల చేసింది. దీనిపై అనిల్‌దేశ్‌ముఖ్ స్పందిస్తూ.. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో కొద్ది సేపు మీడియాతో మాట్లాడిన వీడియోను బీజేపీ చూపుతోందన్నారు. కాగా, పరమ్‌వీర్ ఆరోపణలతో మహారాష్ట్ర హోం శాఖ ప్రతిష్ట దెబ్బతిన్నదని శివసేన వ్యాఖ్యానించింది. అయితే, ఒక్క అధికారి చేసిన ఆరోపణలతో ప్రభుత్వమేమీ కూలిపోదని, మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ముప్పేమీ లేదంది.
Comments
Please login to add a commentAdd a comment