
న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఆ రాష్ట్ర మాజీ పోలీసు చీఫ్ పరమబీర్ సింగ్ తన పిటిషన్‌లో చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని సుప్రీం కోర్టు అంగీకరించింది. అయితే ఆ పిటిషన్‌ను విచారించడానికి మాత్రం నిరాకరించింది. బొంబాయి హైకోర్టుకు వెళ్లాలని పరమ్‌బీర్‌కు సూచించింది. అనిల్ దేశ్ ముఖ్ అవినీతిపై సంచలన ఆరోపణలు చేసిన పరమ్‌బీర్ ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ విచారణ చేపట్టడానికి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఆర్ రెడ్డిలతో కూడిన బెంచ్ నిరాకరించింది.
పరమ్‌బీర్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి అంగీకరించిన కోర్టు బొంబాయి హైకోర్టుకు వెళ్లాలని చెప్పింది. అయితే పరమ్‌బీర్ చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, దీనిని తీవ్రమైన అంశంగానే పరిగణించాలని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరగాలని పరమ్‌బీర్ అనుకుంటే హైకోర్టుకే వెళ్లాలని, ఈ తరహా కేసుల్ని హైకోర్టులే చూస్తాయని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. వివిధ వ్యాపార సంస్థల నుంచి నెలకి రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారి సచిన్ వాజేకి హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ లక్ష్యంగా నిర్ణయించారని ముంబై పోలీసు మాజీ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment