
ముంబై/నాగపూర్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కి అనూహ్యంగా ఆ పదవి లభించిందని, ఆయన యాక్సిడెంటల్ హోం మినిస్టర్ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. పార్టీ పత్రిక సామ్నాలో ఆదివారం రాసిన సంపాదకీయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్సీపీ నేతలు జయంత్‌పాటిల్, దిలీప్ వాల్సే హోం మంత్రి పదవిని చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయని కారణంగానే, అనిల్‌దేశ్‌ముఖ్‌కు అవకాశం లభించిందని రౌత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వలో నష్ట నివారణ యంత్రాంగం సరిగా లేదని రౌత్ పేర్కొన్నారు.
నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించారని ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్ సింగ్ చేసిన ఆరోపణలను ఎదుర్కొనే విషయంలో ఈ విషయం రుజువైందన్నారు. మరోవైపు, కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో అహ్మదాబాద్‌లో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ రహస్యంగా సమావేశమయ్యారన్న వార్తలపై రెండు పార్టీలు స్పందించాయి. దీనిపై మీడియా ప్రశ్నకు షా సమాధానమిస్తూ.. అన్ని విషయాలు వెల్లడించలేమని వ్యాఖ్యానించారు. కాగా, కావాలనే షా అలా మాట్లాడారని, గందరగోళం సృష్టించాలనే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, బీజేపీ పద్ధతే అదని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ పేర్కొన్నారు.
హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై పదవీ విరమణ పొందిన హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరుపుతారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఆ విచారణలో అన్ని వాస్తవాలు బయటకి వస్తాయన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కోరానన్నారు.