Maharashtra Home Minister
-
యాక్సిడెంటల్ హోం మినిస్టర్
ముంబై/నాగపూర్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కి అనూహ్యంగా ఆ పదవి లభించిందని, ఆయన యాక్సిడెంటల్ హోం మినిస్టర్ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. పార్టీ పత్రిక సామ్నాలో ఆదివారం రాసిన సంపాదకీయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్సీపీ నేతలు జయంత్‌పాటిల్, దిలీప్ వాల్సే హోం మంత్రి పదవిని చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయని కారణంగానే, అనిల్‌దేశ్‌ముఖ్‌కు అవకాశం లభించిందని రౌత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వలో నష్ట నివారణ యంత్రాంగం సరిగా లేదని రౌత్ పేర్కొన్నారు. నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించారని ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్ సింగ్ చేసిన ఆరోపణలను ఎదుర్కొనే విషయంలో ఈ విషయం రుజువైందన్నారు. మరోవైపు, కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో అహ్మదాబాద్‌లో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ రహస్యంగా సమావేశమయ్యారన్న వార్తలపై రెండు పార్టీలు స్పందించాయి. దీనిపై మీడియా ప్రశ్నకు షా సమాధానమిస్తూ.. అన్ని విషయాలు వెల్లడించలేమని వ్యాఖ్యానించారు. కాగా, కావాలనే షా అలా మాట్లాడారని, గందరగోళం సృష్టించాలనే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, బీజేపీ పద్ధతే అదని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై పదవీ విరమణ పొందిన హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరుపుతారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఆ విచారణలో అన్ని వాస్తవాలు బయటకి వస్తాయన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కోరానన్నారు. -
అత్యంత తీవ్రమైన ఆరోపణలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఆ రాష్ట్ర మాజీ పోలీసు చీఫ్ పరమబీర్ సింగ్ తన పిటిషన్లో చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని సుప్రీం కోర్టు అంగీకరించింది. అయితే ఆ పిటిషన్‌ను విచారించడానికి మాత్రం నిరాకరించింది. బొంబాయి హైకోర్టుకు వెళ్లాలని పరమ్‌బీర్‌కు సూచించింది. అనిల్ దేశ్ ముఖ్ అవినీతిపై సంచలన ఆరోపణలు చేసిన పరమ్‌బీర్ ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ విచారణ చేపట్టడానికి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఆర్ రెడ్డిలతో కూడిన బెంచ్ నిరాకరించింది. పరమ్‌బీర్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి అంగీకరించిన కోర్టు బొంబాయి హైకోర్టుకు వెళ్లాలని చెప్పింది. అయితే పరమ్‌బీర్ చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, దీనిని తీవ్రమైన అంశంగానే పరిగణించాలని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరగాలని పరమ్‌బీర్ అనుకుంటే హైకోర్టుకే వెళ్లాలని, ఈ తరహా కేసుల్ని హైకోర్టులే చూస్తాయని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. వివిధ వ్యాపార సంస్థల నుంచి నెలకి రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారి సచిన్ వాజేకి హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ లక్ష్యంగా నిర్ణయించారని ముంబై పోలీసు మాజీ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. -
100 కోట్ల ఆరోపణలపై దద్దరిల్లిన లోక్‌సభ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సోమవారం లోక్‌సభ దద్దరిల్లింది. హోంమంత్రిపై ముంబై పోలీస్ కమిషనర్‌గా పని చేసిన వ్యక్తి అవినీతి ఆరోపణలు చేయడం చాలా తీవ్రమైన విషయమని, వెంటనే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారం నుంచి వైదొలగాలని బీజేపీ డిమాండ్ చేసింది. ముంబైలోని హోటళ్లు, బార్లు, పబ్‌లు తదితరాల నుంచి ప్రతీ నెల రూ.100 కోట్లు వసూలు చేయాలని ముంబై పోలీసు అధికారులకు హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్వయంగా ఆదేశాలిచ్చారని ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలను జీరో అవర్‌లో, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య బీజేపీ సభ్యుడు మనోజ్ కోటక్ లేవనెత్తారు. ఈ విషయంలో ఇంతవరకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఎలాంటి స్పందన రాలేదని, తక్షణమే ఆయన ప్రభుత్వం అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ‘ఇది చాలా సీరియస్ అంశం. హోం మంత్రే కాదు. మొత్తం ప్రభుత్వం రాజీనామా చేయాలి. సీబీఐతో సమగ్రంగా విచారణ జరపాలి’ అన్నారు. దీన్ని రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అంశంగా చూడకూడదని బీజేపీ సభ్యుడు రాకేశ్ సింగ్ పేర్కొన్నారు. ముంబై నుంచే రూ. 100 కోట్లు అయితే, మొత్తం రాష్ట్రం నుంచి ఎంత వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. అనిల్ దేశ్‌ముఖ్ అవినీతిపై ఆరోపణలు రావడం ఇదే ప్రథమం కాదని, గతంలో డీజీపీ స్థాయి అధికారి ఆయనపై ఆరోపణలు చేశారని బీజేపీ సభ్యుడు కపిల్ పాటిల్ పేర్కొన్నారు. శరద్ పవార్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ.. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొన్న మహారాష్ట్ర సీనియర్ నేత.. ఆ వెంటనే మాట మార్చారన్నారు. ‘వాస్తవాలు బయటపడ్తాయని భయపడ్డారా?’ అని ప్రశ్నించారు. శివసేన ఎంపీ వినాయక రౌత్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను అస్థిర పర్చేందుకు కేంద్ర సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందని లోక్‌సభలో కాంగ్రెస్ నేత రవ్నీత్ సింగ్ బిట్టు ఆరోపించారు. సచిన్ వాజే సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో సీఎం ఫడ్నవీస్‌ను ఉద్ధవ్ ఠాక్రే కోరారని స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా తెలిపారు. అయితే, సీఎం ఆ అభ్యర్థనను తోసిపుచ్చారన్నారు. జీరో అవర్‌ను అధికార పక్షం రిగ్గింగ్ చేస్తోందని ఎన్సీపీ సభ్యురాలు సుప్రియ సూలే విమర్శించారు. సీబీఐతో దర్యాప్తు చేయించాలి సుప్రీంలో పరమ్‌వీర్ పిటిషన్ మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అవినీతి కార్యకలాపాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే, తనను ముంబై పోలీస్ కమిషనర్ పోస్ట్ నుంచి బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరారు. ‘అనిల్ దేశ్‌ముఖ్ 2021 ఫిబ్రవరి లో సచిన్ వాజే(ముంబై క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్), సంజయ్ పాటిల్(ఏసీపీ, ముంబై సోషల్ సర్వీస్ బ్రాంచ్)లను పిలిపించుకుని ముంబైలోని హోటళ్లు, బార్లు, పబ్‌లు, ఇతర మార్గాల నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని ఆదేశించారు’ అని పిటిషన్లో పరమ్‌వీర్ సింగ్ పేర్కొన్నారు. -
అనిల్ దేశ్‌ముఖ్‌పై నేడు నిర్ణయం
ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నాయకుడు అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరమ్‌వీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణల రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి నష్టనివారణ చర్యల కోసం ఎన్సీపీ అధినేత, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ రంగంలోకి దిగారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం ‘మహావికాస్ ఆఘాడీ(ఎంవీఏ)’పై ఈ ఆరోపణలు ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోవని పవార్ ఆదివారం పేర్కొన్నారు. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను ప్రభుత్వంలో కొనసాగించే విషయమై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం నిర్ణయం తీసుకుంటారన్నారు. అనిల్ దేశ్‌ముఖ్‌పై పరమ్‌వీర్ సింగ్ చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని పవార్ అంగీకరించారు. ఆ ఆరోపణలపై లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై సీఎం ఠాక్రేతో మాట్లాడానన్నారు. పరమ్‌వీర్ సింగ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు సంబంధించి మాజీ ఐపీఎస్ అధికారి జూలియొ రిబీరరో సహకారం తీసుకుంటే బావుంటుందని భావిస్తున్నానన్నారు. దేశ్‌ముఖ్‌కు సంబంధించి తాము సోమవారం వరకు నిర్ణయం తీసుకుంటామని, నిర్ణయం తీసుకునేముందు, ఆ ఆరోపణలకు సంబంధించి ఆయన వాదన కూడా వినాల్సి ఉంటుందని పవార్ వ్యాఖ్యానించారు. దేశ్‌ముఖ్‌ను హోంమంత్రి పదవి నుంచి తప్పించనున్నారన్న వార్తల నేపథ్యంలో పవార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముంబైలోని హోటళ్లు, బార్లు, పబ్స్, రెస్టారెంట్లు, హుక్కా పార్లర్లు.. తదితరాల నుంచి నెలకు కనీసం రూ. 100 కోట్లు వసూలు చేయాలని హోంమంత్రి దేశ్‌ముఖ్ పోలీసు అధికారులకు టార్గెట్లు పెట్టారని పరమ్‌వీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా, సీనియర్ పోలీస్ అధికారి సచిన్ వాజేను మళ్లీ పోలీస్ విభాగంలోకి తీసుకోవడంలో సీఎం ఠాక్రేకు కానీ, హోంమంత్రి దేశ్‌ముఖ్‌కు కానీ సంబంధం లేదని శరద్ పవార్ తెలిపారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై రాజకీయ జోక్యం పెరిగిందని పరమ్‌వీర్ సింగ్ తనకు గతంలో ఫిర్యాదు చేశారని వెల్లడించారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలు సాగబోవని పవార్ స్పష్టం చేశారు. మరోవైపు, హోంమంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయని శివసేన నేత సంజయ్‌రౌత్ వ్యాఖ్యానించారు. మహా వికాస్ అఘాడీ మిత్రపక్షాలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉందన్నారు. అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించాలని, దేశ్‌ముఖ్‌ను ప్రభుత్వంలో కొనసాగించే విషయంలో నిర్ణయం తీసుకోవాలని అదే పార్టీ నేత సంజయ్ నిరుపమ్ వ్యాఖ్యానించారు. దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. ఆరోపణల తీవ్రత దృష్ట్యా అనిల్ దేశ్‌ముఖ్‌పై వేటు తప్పకపోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంపై మిత్ర పక్షాల మధ్య విబేధాలు వచ్చే అవకాశాలు న్నాయనుకుంటున్నాయి. అయితే, అనిల్‌దేశ్‌ముఖ్ రాజీనామా చేయబోరని ఎన్సీపీ స్పష్టం చేసింది. పవార్‌తో చర్చించిన తరువాత ఎన్సీపీ మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్ ఈ వ్యాఖ్య చేశారు. -
నాలుగంచుల ఖడ్గం
కంగనకు ముంబై రోడ్లు బ్లాక్ అయి ఉన్నాయి. లోపలికి రానివ్వం అంటున్నారు శివసైనికులు. ‘క్వీన్’లో ఇలాగే ఆమె పెళ్లి బ్లాక్ అయిపోతుంది. అప్పుడు ఆత్మాభిమానం అనే ఖడ్గాన్ని తీస్తుంది. ఇప్పుడూ.. సేమ్ అదే.. సెల్ఫ్ రెస్పెక్ట్ ఆయుధం. మూవీ మాఫియా.. సోషల్ మీడియా... ముంబై పోలీసులు.. స్టార్లు, కో–స్టార్లు.. వీళ్లందరిపై.. ఒంటరిగా యుద్ధం చేస్తోంది. నాలుగంచుల ఖడ్గంగా రీమేక్ అవుతోంది. రేపు ముంబై బయల్దేరాలి కంగనా రనౌత్. రేపు బయల్దేరితేనే ఎల్లుండికి ముంబైలో ఉంటారు. ఏమిటి అంత అత్యవసరం? ఆమె చాలెంజ్ చేశారు. ‘తొమ్మిదిన ముంబైలో దిగుతున్నాను.. ఎవరు అడ్డుకుంటారో చూస్తాను’ అని. ఆ ఛాలెంజ్ మహారాష్ట్ర హోమ్ మినిస్టర్‌కి! ‘మూవీ మాఫియా కన్నా డేంజర్ ముంబై పోలీసులు అన్నావు కదా. అయితే ముంబై రాకు’ అన్నారాయన. కంగన ఛాలెంజ్ శివసేన ఎంపీకి కూడా. ‘ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ అన్నావు కదా.. అయితే నువ్వెలా ముంబైలోకి అడుగుపెడతావో చూస్తాను’ అన్నారు ఆయన. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ మరణం తర్వాత కంగన చాలామందిని చాలానే అన్నారు. అలా అనడంలో ఒంటరి అయిపోయారు. ఒంటరిగా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడూ ఒంటరిగానే మనాలి నుంచి క్యాబ్‌లోనో, బస్‌లోనో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి విమానంలో ముంబై వెళుతున్నారు! కొన్నాళ్లుగా కంగన హిమాచల్ ప్రదేశ్‌లో తను ఇల్లు కట్టుకున్న మనాలిలో తల్లితో కలిసి ఉంటున్నారు. ముంబై చిత్రసీమలోని బంధుప్రీతి మీద, అక్కడి డ్రగ్ ముఠాల మీద, మీడియా మాఫిమా మీద, ముంబై పోలీసుల మీద ధైర్యంగా మాట్లాడగలిగిన అమ్మాౖయెతే కాదు కంగన. కానీ మాట్లాడుతున్నారు! ఆ ధైర్యం ముంబై ఇచ్చిందే. అవతలి వ్యక్తిలో తప్పు కనిపిస్తే వచ్చే ధైర్యం అది. ముంబైలో ఒక తప్పు కాదు, వంద తప్పులు కనిపించాయి కంగనకు. ముంబై చేసిన మొదటి తప్పు.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమెకు మత్తు మందు ఇచ్చి ఆమెను ఆక్రమించుకోవడం. చివరి తప్పు (ఆమె మనాలి వెళ్లే ముందు వరకు) సుశాంత్ ఎలా చనిపోయాడో తెలియనివ్వకుండా చంపేయడం. తక్కిన బయటి తారల్లా ముంబై తనకు సంబంధం లేని విషయం అనుకోవడం లేదు కంగన. ముంబై ఆమెకు ఎంత ఇచ్చిందో కానీ, ఆమె దగ్గర్నుంచి చాలానే తీసేసుకుంది! ముఖ్యంగా ఆమె అమాయకత్వాన్ని. ముంబై వచ్చిన కొత్తలో ‘క్వీన్’లా ఉన్నారు కంగన. 2014 లో వచ్చిన ఆమె చిత్రం ‘క్వీన్’ లోని రాణీ మెహ్రాలా.. కోమలంగా, లాలిత్యంగా. ‘క్వీన్’ సినిమాలో సగటు పంజాబీ అమ్మాయి కంగన. ఫ్యామిలీ ఢిల్లీలో ఉంటుంది. తండ్రిది మిఠాయి దుకాణం. పెళ్లికి ఏర్పాట్లు అవుతుండగా అప్పుడు చెబుతాడు ఆమెకు రాజ్‌కుమార్‌రావ్.. ‘నీకూ నాకూ అసలేదీ కలవదు.. ఐయామ్ సారీ. నేన్నిన్ను పెళ్లి చేసుకోలేను. చేసుకుని నా లైఫ్స్టెయిల్తో నిన్ను బాధించలేను’ అని! విదేశంలో కొంతకాలం ఉండొస్తాడు అతడు. అదీ స్టెయిల్. ఆమె వెంటపడి వెంటపడి ప్రేమించినప్పుడు, ఆమెను పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పించినప్పుడు, ఆమెకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగినప్పుడు, పెళ్లయ్యాక హనీమూన్‌కి పారిస్, ఆమ్స్టర్డ్యామ్ టిక్కెట్లు బుక్ చేసుకున్నప్పుడు అతడికి తన లైఫ్‌స్టెయిల్ గుర్తుకు రాదు. పెళ్లి ఆగిపోతుంది. ఆ షాక్ నుంచి తేరుకోడానికి కసిగా.. తనొక్కటే తల్లిదండ్రులను ఒప్పించి ప్యారిస్ వెళ్లిపోతుంది కంగన. అక్కడి నుంచి ఆమ్స్టర్డ్యామ్. ఆ కొన్నాళ్ల ఒంటరి జీవితం ఆమెకు అనేక అనుభవాలను ఇస్తుంది. స్వేచ్ఛానుభూతులను మిగులుస్తుంది. ఒక తొలిముద్దును కూడా. ఓరోజు పల్చటి డ్రెస్ వేసుకుని తీసుకున్న సెల్ఫీని కంగన పొరపాటున రాజ్‌కుమార్ రావ్‌కి షేర్ చేస్తుంది. అది చూసి కంగనను వెతుక్కుంటూ ఆమ్స్టర్డ్యామ్ వస్తాడు. సారీ చెప్తాడు. తనను పెళ్లి చేసుకొమ్మని బలవంతం చేస్తాడు. ‘నువ్వెళ్లు. ఢిల్లీ వచ్చాక కలుస్తాను’ అంటుంది. కళ్లలో ఆశలు పెట్టుకుని, ఆమె కోసం మనసులో దీపాలు వెలిగించుకుని అతడు వెళ్లిపోతాడు. ఢిల్లీలో దిగాక కంగన నేరుగా రాజ్‌కుమార్ రావ్ ఇంటికి వెళ్లి, హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్‌ని తీసి అతడి చేతిలో పెట్టి, ‘థ్యాంక్యూ’ చెప్పి వచ్చేస్తుంది. ఆమె ముఖంలో పెద్ద రిలీఫ్. ‘క్వీన్’ చిత్రం మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ప్రధానంగా అమ్మాయిలు ఆ సినిమాతో ‘రిలేట్’ అయ్యారు. ‘రాణిలా చూసుకుంటా..’ అనే మాట వినిపిస్తుంటుంది.. ప్రేమల్లో, పెళ్లిళ్లలో! ఎవరూ చూసుకోనవసరం లేదు. ఆత్మాభిమానమే ఆడపిల్లను రాణిని చేస్తుంది. ఆ ఆత్మాభిమానమే ఇప్పుడు నాలుగు భాషల్లోకి రీమేక్ అవుతోంది. తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మి’. క్వీన్ తమన్నా. తమిళ్లో ‘పారిస్ పారిస్’. క్వీన్ కాజల్. మలయాళంలో ‘జామ్ జామ్’. క్వీన్ మంజిమ. కన్నడంలో ‘బటర్‌ఫ్లై’. క్వీన్ పరుల్ యాదవ్. ముగ్గురు వేర్వేరు దర్శకులు రీమేక్ చేస్తున్న ఈ నాలుగు సినిమాలను మను కుమరన్ ఒక్కరే నిర్మిస్తున్నారు. ముంబై వచ్చిన కొత్తలో ‘క్వీన్’లా కోమలంగా ఉన్నారని కదా అనుకున్నాం కంగన గురించి. ముంబైకి ఎన్ని ముఖాలు ఉన్నాయో అన్ని ముఖాలూ తమ అసలు స్వరూపం చూపించి కంగనని క్రూరమైన రాణిగా రాటుదేల్చాయి. ఇప్పటికీ ఆమే బాలీవుడ్లో అత్యధిక పారితోషికం డిమాండ్ చేయగల బయటి తార. టాలెంట్ ఉంది. దాంతో పాటు ధర్మాగ్రహం ఉంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. నిజాన్ని నిర్భయంగా చెబుతారు. బాలీవుడ్ నలు చదరపు బంధుగణాల క్లబ్బులలో ఇమడని నికార్సయిన గుండ్రటి షాంపేన్ గ్లాస్ కంగనా రనౌత్. రాణి వెడలుతున్నారు. చూడాలి.. ముంబైలో బుధవారం రిక్టర్ స్కేలు ఎంత చూపిస్తుందో. తెలుగు క్వీన్ ‘దటీజ్ మహాలక్ష్మి’లో తమన్నా; తమిళ్ క్వీన్ ‘పారిస్ పారిస్’లో కాజల్ మలయాళీ క్వీన్ ‘జామ్ జామ్’లో మంజిమ; కన్నడ క్వీన్ ‘బటర్ ఫ్లై’లో పరుల్ యాదవ్ -
మరో వివాదంలో కంగనా
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేరు వింటే వివాదాలే మొదట గుర్తుకొస్తాయి. తరచూ అందరి మీద నోరుపారేసుకునే ఆమె ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తోనూ(పీఓకే), అధికార సంకీర్ణ సర్కార్‌ని తాలిబన్లతోనూ పోలుస్తూ చేసిన ట్వీట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కంగనాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబై సురక్షితం కాదని భావిస్తే ఈ నగరంలో ఉండే హక్కు ఆమెకు లేదన్నారు. నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో కంగనా ముంబై పోలీసుల్ని లక్ష్యంగా చేసుకొని వరస ట్వీట్లు చేశారు. మూవీ మాఫియా కంటే ముంబై పోలీసులే ప్రమాదకారులని, వారిపై తనకు విశ్వాసం లేదని కామెంట్లు ఉంచారు. ఈ ట్వీట్ చుట్టూ మొదలైన వివాదం పెద్దదైంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పార్టీ పత్రిక సామ్నాలో కంగనాపై విమర్శలు గుప్పిస్తూ వ్యాసం రాశారు. ముంబై పోలీసులంటే గౌరవం లేని ఆమె నగరంలో అడుగు పెట్టవద్దన్నారు. ఆమె ముంబైకి వస్తే అది పోలీసులకే అవమానకరమన్నారు. ముంబై వస్తా .. ఆపే దమ్ముందా ? సంజయ్ రాసిన ఆర్టికల్తో కంగనా మరింతగా చెలరేగిపోయారు. ముంబై ఒక పాక్ ఆక్రమిత కశ్మీర్ అని ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో తన సొంత ఇంట్లో ఉంటున్న కంగనా..ముంబై రావద్దంటూ కొందరు తనని హెచ్చరిస్తున్నారని అందుకే నగరానికి రావాలని నిర్ణయించుకున్నానన్నారు. ‘‘9న ముంబైకి వస్తున్నాను. దమ్ముంటే అడ్డుకోండి’’అంటూ ట్వీట్ చేశారు. పోలీసుల్ని అవమానించడం దారుణం కంగనా వ్యాఖ్యల్ని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తప్పు పట్టారు. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో పోలీసులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తూ ఉంటే కంగనా వారిని టార్గెట్ చేయడం దారుణమన్నారు. ముంబైలో భద్రత కరువైందని ఆమె అనుకుంటే నగరంలో నివసించే హక్కు కూడా లేదన్నారు. దీనికి కంగనా స్పందిస్తూ తన ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదని, ప్రభుత్వం తాలిబన్లని తలపిస్తోందని దాడికి దిగారు. -
'పటాసులు కాల్చండి.. డ్రమ్స్ వాయించండి'
నాగ్‌పూర్ : మిడతల దాడిని ఎదుర్కొనేందుకు ప్రజలు పటాసులు కాల్చాల్సిందిగా, డ్రమ్ములను వాయించాల్సిందిగా మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తన నియోజకవర్గం కతోల్‌లో మిడతల దాడి పరిస్థితిపై మంత్రి సమీక్ష చేపట్టారు. రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ఎప్పుడైతే మిడతలు దాడి చేస్తాయో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పటాకులు కాల్చడం, టైర్లను కాల్చడం, డ్రమ్ములను వాయించడం వంటి చర్యలతో మిడతలను పారద్రోలాలన్నారు.(మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ!) అంతకముందు మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి దాదా భూషే మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50 శాతం మిడతలను వ్యవసాయ విభాగం నిర్మూలించిందన్నారు. రసాయనాలు స్ప్రే చేసేందుకు అగ్నిమాపక యంత్రాలను వినియోగించినట్లు తెలిపారు. మిడతల ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు ఉచితంగా రసాయనాలు, పురుగుమందులను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.పాకిస్తాన్ నుంచి దేశంలోకి ప్రవేశించిన మిడతలు గాలి ద్వారా తమ దిశను మార్చుకుంటున్నాయి. రాజస్తాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానాలో పెద్ద ఎత్తున పంటపొలాల మీద పడి పంటను నాశనం చేస్తున్నాయి. ఒక్కో గుంపులో వేల నుంచి లక్ష సంఖ్యలో ఉండే మిడతల దండు వల్ల ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. కోట్లాదిమంది వినియోగించే ఆహారధాన్యాలు, కూరగాయలు, పండ్లు, ఫలాలను మిడతల దండు స్వాహా చేస్తాయి. (మధ్యప్రదేశ్ వైపు మిడతల దండు!) -
సంజయ్ పెరోల్‌పై విచారణకు ఆదేశించిన హోం మంత్రి
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు పెరోల్‌పై విడుదల చేయవద్దని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆయనకు నెల రోజులు పాటు పేరోల్‌పై విడుదల చేయడాన్ని ఆర్పీఐ తప్పు పట్టింది. శనివారం ఎర్రవాడ జైలు వద్ద పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. సంజయ్ దత్‌ను మిగిలిన ఖైదీలతో సమానంగా చూడాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. తన భార్య మన్యత అనారోగ్యంతో ఉందని, ఈ నేపథ్యంలో తనను నెల రోజులు పెరోల్‌పై విడుదల చేయాలని ఆయన జైలు అధికారులను అభ్యర్థించారు. అయితే జైలు అధికారులు ఆ విషయాన్ని కోర్టుకు నివేదించారు. దాంతో సంజయ్ దత్తు పెరోల్‌పై విడుదల చేసేందుకు కోర్టు అనుమతించింది. అయితే సంజయ్‌కు పెరోల్ రావడం పట్ల పలు ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాలీవుడ్ నటుడు అయినంత మాత్రాన ఎప్పుడు కోరితే అప్పుడు సంజయ్ దత్‌ను పెరోల్‌పై విడుదల చేస్తారా అంటూ ధ్వజమెత్తాయి. దాంతో ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆ అంశంపై విచారణకు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్ ఆర్ పాటిల్ ఆదేశించారు. దీనిపై త్వరిత గతిన విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తీవ్ర అనారోగ్యం కారణంగా ఇప్పటికే సంజయ్ దత్ రెండు సార్లు ఎర్రవాడ జైలు నుంచి పెరోల్‌పై విడుదల అయిన సంగతి తెలిసిందే. 1993 ముంబయి బాంబు పేలుళ్లలో సంజయ్ దత్ నిందితుడని సుప్రీంకోర్టు ధృవీకరించింది. ఆ కేసులో సంజయ్ దత్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే.