ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేరు వింటే వివాదాలే మొదట గుర్తుకొస్తాయి. తరచూ అందరి మీద నోరుపారేసుకునే ఆమె ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తోనూ(పీఓకే), అధికార సంకీర్ణ సర్కార్‌ని తాలిబన్లతోనూ పోలుస్తూ చేసిన ట్వీట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కంగనాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబై సురక్షితం కాదని భావిస్తే ఈ నగరంలో ఉండే హక్కు ఆమెకు లేదన్నారు.
నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో కంగనా ముంబై పోలీసుల్ని లక్ష్యంగా చేసుకొని వరస ట్వీట్లు చేశారు. మూవీ మాఫియా కంటే ముంబై పోలీసులే ప్రమాదకారులని, వారిపై తనకు విశ్వాసం లేదని కామెంట్లు ఉంచారు. ఈ ట్వీట్ చుట్టూ మొదలైన వివాదం పెద్దదైంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పార్టీ పత్రిక సామ్నాలో కంగనాపై విమర్శలు గుప్పిస్తూ వ్యాసం రాశారు. ముంబై పోలీసులంటే గౌరవం లేని ఆమె నగరంలో అడుగు పెట్టవద్దన్నారు. ఆమె ముంబైకి వస్తే అది పోలీసులకే అవమానకరమన్నారు.
ముంబై వస్తా .. ఆపే దమ్ముందా ?
సంజయ్ రాసిన ఆర్టికల్‌తో కంగనా మరింతగా చెలరేగిపోయారు. ముంబై ఒక పాక్ ఆక్రమిత కశ్మీర్ అని ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో తన సొంత ఇంట్లో ఉంటున్న కంగనా..ముంబై రావద్దంటూ కొందరు తనని హెచ్చరిస్తున్నారని అందుకే నగరానికి రావాలని నిర్ణయించుకున్నానన్నారు. ‘‘9న ముంబైకి వస్తున్నాను. దమ్ముంటే అడ్డుకోండి’’అంటూ ట్వీట్ చేశారు.
పోలీసుల్ని అవమానించడం దారుణం
కంగనా వ్యాఖ్యల్ని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తప్పు పట్టారు. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో పోలీసులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తూ ఉంటే కంగనా వారిని టార్గెట్ చేయడం దారుణమన్నారు. ముంబైలో భద్రత కరువైందని ఆమె అనుకుంటే నగరంలో నివసించే హక్కు కూడా లేదన్నారు. దీనికి కంగనా స్పందిస్తూ తన ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదని, ప్రభుత్వం తాలిబన్లని తలపిస్తోందని దాడికి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment