ముంబై: మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిగా జట్టుకట్టిన శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ), కాంగ్రెస్‌ల మధ్య లుకలుకలు నెమ్మదిగా బయటపడుతున్నాయి. వచ్చే ఏడాది జరగబోయే బృహణ్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో ఎంవీఏ మిత్రులతో పొత్తు పెట్టుకోవడం కష్టమేనని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే అవకాశం ఉందని ఆయన సూచనప్రాయంగా చెప్పారు.
శనివారం ముంబైలో మీడియాతో రౌత్ మాట్లాడారు. దేశ వాణిజ్యరాజధాని ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ను అవిభాజ్య శివసేన ఏకంగా పాతికేళ్లపాటు అప్రతిహతంగా ఏలింది. 1997 నుంచి 2022దాకా బీఎంసీపై శివసేన పట్టుకొనసాగిన విషయం విదితమే. ‘‘ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కూటమిగా కాకుండా ఒంటరిగానే బరిలో దిగుదామని మా శివసేన కార్యకర్తలు పట్టుబడుతున్నారు. అందుకే వారితో ఈ అంశాన్ని చర్చించేందుకు పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సమావేశం అవుతున్నారు’’అని రౌత్ వెల్లడించారు. కూటమిలో విభేదాలున్నాయన్న వాదనను రౌత్ తోసిపుచ్చారు.
‘‘శివసేన రెండుగా చీలకముందుకూడా మేం గతంలో బీజేపీతో కలిసి ఉన్న సందర్భాల్లోనూ ఎన్నికల్లో మేం ఒంటరిగా పోటీచేశాంకదా. పుణె, పింప్రి–చించ్వాడ్, నాసిక్ పురపాలికల్లో ఎంవీఏ కూటమి ఉమ్మడిగానే పోటీచేస్తుంది ’’అని రౌత్ అన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల మాదిరే అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ, బీజేపీలతో శివసేన ఉమ్మడిగా మహాయుతి కూటమిగా బీఎంసీ ఎన్నికల్లో బరిలో దిగుతామని శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment