షిండే హ్యాపీయేనా? శివసేన ఏమంటోంది? | Who will be the Chief Minister of Maharashtra, What does Shiv Sena say | Sakshi
Sakshi News home page

‘మహా' డ్రామా: షిండే హ్యాపీయేనా? శివసేన ఏమంటోంది?

Published Tue, Nov 26 2024 5:24 PM | Last Updated on Tue, Nov 26 2024 5:56 PM

Who will be the Chief Minister of Maharashtra, What does Shiv Sena say

ముంబై: మహారాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారు? అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది.  ఢిల్లీ పెద్దల దౌత్యంతో.. ఏక్‌నాథ్‌ షిండే బెట్టు వీడారనే సంకేతాలు మాత్రం అందుతున్నాయి. దీంతో దేవేంద్ర ఫడ్నవిస్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యాయనే విశ్లేషణలు నడుస్తున్నాయి. మరి సీఎం పదవి వదులుకునే విషయంలో షిండే నిజంగానే హ్యాపీగా ఉన్నారా?. శివసేన అందుకు ఒప్పుకుంటోందా?.. 

అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలిచి మూడు రోజులవుతుంది. కానీ ఇంతవరకు సీఎం ఎవరనేది బీజేపీ, దాని మిత్రపక్షాలు ఎటూ తేల్చలేకపోతున్నాయి. ఈ తరుణంలో 14వ రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నేటితో ముగియగా, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన పదవికి రాజీనామా గవర్నర్‌కు సమర్పించారు. ఆపద్ధర్మ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఆయనే కొనసాగుతారు.  

ఇక.. ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలని బీజేపీ నాయకత్వం చర్చలు జరుపుతున్న తరుణంలో.. సీఎం సీటు ఎవరికి అనే దానిపై బలనిరూపణ చేయాలంటూ షిండే వర్గం కొత్త డిమాండ్‌ను తెర మీదకు తెచ్చింది.  అయితే ఆ వాదన అసంబద్ధమని తన వర్గీయులను షిండే వారించినట్లు సమాచారం. 

‘‘మహాయుతి కూటమి గొప్ప విజయం తర్వాత రాష్ట్రంలో మరోసారి మా ప్రభుత్వం ఏర్పడనుంది. మహాకూటమిగా కలిసి ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం.నేటికీ కలిసి ఉన్నాం. నాపై ప్రేమతో.. అందరూ కలిసి ముంబైకి రావాలి’’ అని తాజాగా ఈ ఉదయం ట్వీట్‌లో ఆయన విజ్ఞప్తి కూడా చేశారు. ఈలోపు..

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కొనసాగుతున్న చర్చలు మంగళవారం రాత్రి లేదంటే బుధవారం ఉదయానికల్లా ఓ కొలిక్కి రావొచ్చని శివసేన నాయకుడు సంజయ్ శిర్సత్ తెలిపారు. సీఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టాలనే దానిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ అగ్రనేతలతో ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు  చర్చిస్తున్నారని. ఇవాళో, రేపో కచ్చితంగా తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అయితే.. 

ఇదే శిర్సత్‌.. షిండేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని నిన్నటిదాకా మీడియా ముందు హడావిడి చేశారు.మహా ల్లో ప్రజాదరణ ఉన్న నేత ఏక్‌నాథ్ షిండే అని, ఆయన నాయకత్వంలో శివసేన అసెంబ్లీ ఎన్నికల్లో రెండో అతిపెద్ద కూటమి పార్టీగా అవతరించిందని, కాబట్టి ఏక్‌నాథ్‌ షిండే సీఎం అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు.. బీహార్‌ ఫార్ములా డిమాండ్‌ లేవనెత్తిన శివసేన నరేష్‌ కూడా.. ఇప్పుడు షిండే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించడం గమనార్హం. ఈ లిస్ట్‌లో ఇవాళ షిండే వర్గీయులు చాలామందే చేరారు. దీంతో.. శివసేనలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడే అవకాశం లేదనే విషయం స్పష్టమవుతోంది. 

షిండే వెనక్కి తగ్గాలి : కేంద్రమంత్రి
మహరాష్ట్ర సీఎం ఎవరు? అనే అంశంపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే స్పందించారు. ‘‘మహారాష్ట్ర వివాదం త్వరలో ముగియాలి. దేవేంద్ర ఫడ్నవిస్‌ను సీఎంను చేయాలని బీజేపీ హైకమాండ్‌ నిర్ణయించింది. ఆ నిర్ణయంపై ఏక్‌నాథ్‌ షిండే అసంతృప్తిలో ఉన్నారు. ఆ అసంతృప్తిని పోగొట్టాలి. అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంది కాబట్టి బీజేపీ అందుకు ఒప్పుకోదు. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్‌లాగా ఏకనాథ్ షిండే కూడా రెండు అడుగులు వెనక్కి వేయాలి. లేదంటే ఫడ్నవీస్ నాలుగు అడుగులు వెనక్కి వేసి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో పని చేయాలి. లేదా ప్రధాని మోదీ, అమిత్‌షాలు జోక్యం చేసుకోవాలి. ఏక్‌నాథ్ షిండేతో పాటు ఆయన 57 మంది ఎమ్మెల్యేలు..త్వరగా రాజీ కుదుర్చుకుని మంత్రివర్గాన్ని విస్తరించాలి’’ అని అన్నారు.

ఒక పార్టీ మద్దతుంటే చాలు
మహరాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ 132 మంది ఎమ్మెల్యేలు, శివసేన 57, ఎన్సీపీ 41 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో 288 మంది సభ్యుల అసెంబ్లీలో 145 మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోవడానికి బీజేపీ మహాయతి కూటమిలోని రెండు మిత్రపక్షాలలో ఒక మిత్ర పక్షం మద్దతుంటే సరిపోతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement