పరంబీర్‌సింగ్, అనిల్ దేశ్‌ముఖ్
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో కేసు కీలక మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలోని శివసేన–ఎన్‌సీపీ–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్‌సింగ్ ఏకంగా రాష్ట్ర హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై ఆయన ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఎనిమిది పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. పేలుడు పదార్థాల కేసులో ఎన్‌ఐఏ అరెస్టు చేసిన మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను మంత్రి వాడుకున్నారని ఆరోపించారు.
నెలకు రూ.100 కోట్ల చొప్పున వసూలు చేయాలని వాజేకు హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పురమాయించారంటూ పరంబీర్ బాంబు పేల్చారు. ఈ సొమ్మును సీఎం ఠాక్రే పేరిట జమ చేయాలన్నారని చెప్పారు. అనిల్ అవినీతి కార్యకలాపాల గురించి ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఉపముఖ్యమంత్రి అజిత్‌లకు తెలిపానని పరంబీర్ పేర్కొన్నారు. ‘మంత్రి అనిల్ ఫిబ్రవరి నుంచి పలు పర్యాయాలు సచిన్ వాజేను తన అధికార నివాసానికి పిలిపించుకున్నారు. నిధులు సమకూర్చేందుకు సాయపడాలంటూ ఆయన్ను పదేపదే మంత్రి కోరారు. రూ.100 కోట్ల ఫండ్ కలెక్ట్ ఎలా చేయాలో కూడా సచిన్ వాజేకు చెప్పారు.
ముంబైలో 1750 బార్లు, రెస్టారెంట్లు, తదితరాలున్నాయి. ఒక్కో బార్, రెస్టారెంటు నుంచి రూ.2–3 లక్షలు వసూలు చేస్తే నెలకు రూ.40 నుంచి రూ.50 కోట్లు సులభంగా జమ అవుతాయి. ఇతర వనరుల ద్వారా మిగతా మొత్తం అందేలా చూడాలని మంత్రి కోరారు. ఆ సమయంలో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పలాండే తదితరులు అక్కడే ఉన్నారు’ అని ఆ లేఖలో పరంబీర్ సింగ్ పేర్కొన్నారు. తనతోపాటు సీనియర్ అధికారులకు తెలియకుండా ఇలా వారిని నివాసానికి పిలిపించుకోవడం, డబ్బులు వసూళ్లు చేసేందుకు టార్గెట్ ఇవ్వడం చేస్తుండేవారని ఆ లేఖలో పేర్కొన్నారు. అనేక కేసుల విచారణలో ఆయన జోక్యం చేసుకునేవారని ఆరోపించారు.
అదేవిధంగా అనిల్ దేశ్‌ముఖ్ అవినీతి కార్యకలాపాలు అనేకం పోలీసు అధికారుల దృష్టికి కూడా వచ్చాయన్నారు. ముంబైలో ఆత్మహత్య చేసుకున్న దాద్రానగర్ హవేలీ ఎంపీ మెహన్ దేల్కర్ తన సూసైడ్ నోట్‌లో అక్కడి అధికారుల తీరుపై పలు ఆరోపణలు చేసినప్పటికీ ఆ కేసును కూడా ముంబై పోలీసులకే అప్పగిస్తూ హోం మంత్రి నిర్ణయం తీసుకోవడాన్ని పరంబీర్ సింగ్ తప్పుబట్టారు. ముకేశ్ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో వాహనం పట్టుబడటం, వ్యాపారి మన్సుఖ్ అనుమానాస్పద మృతి, పోలీస్ ఇన్‌స్పెక్టర్ వాజే అరెస్టు పరిణామాల నేపథ్యంలో పరంబీర్‌ను అప్రాధాన్యంగా భావించే హోంగార్డుల విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.
మంత్రి దేశ్‌ముఖ్ ఏమన్నారు?
అవినీతి విషయం ఫిబ్రవరిలోనే తెలిసిన పరంబీర్‌సింగ్ ఇప్పటి వరకు మౌనంగా ఎందుకు ఉన్నారంటూ మంత్రి అనిల్ ప్రశ్నించారు. ఆయనపై పరువు నష్టం కేసు వేస్తానని తెలిపారు. తనను తాను కాపాడుకునేందుకే పరంబీర్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ‘వాహనం కేసు, మన్సుఖ్ హత్య కేసులతో వాజేకు సంబంధాలున్నట్లు ఇప్పటికే రుజువైంది. ఇక మిగిలింది పరంబీర్. ఇవన్నీ చివరికి ఆయనకే చుట్టుకుంటాయి. కేసు దర్యాప్తు కొనసాగుతోంది కదా’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment