జార్జి ఫ్లాయిడ్‌పై దురాగతాన్ని వ్యతిరేకిస్తూ జర్మనీలోని బెర్లిన్ నగరంలో అలెగ్జాండర్ ప్లాట్జ్ వద్ద భారీ ఎత్తున గుమికూడి నిరసన వ్యక్తం చేస్తున్న జనం
వాషింగ్టన్/బెర్లిన్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ పోలీసుల దౌర్జన్యానికి బలి కావడంతో ఆగ్రహంతో ప్రారంభమైన ప్రదర్శనలు ఇప్పుడు జాతి వివక్ష అంతమే లక్ష్యంగా కొనసాగుతున్నాయి. అమెరికాలో ఫ్లాయిడ్ పుట్టిన ప్రాంతం నార్త్ కరొలినాలో కుటుంబ సభ్యులు రెండో సంస్మరణ సభ నిర్వహించారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1963లో చేసిన పేరుపొందిన ప్రసంగం ‘ఐ హేవ్ ఏ డ్రీం’ను పురస్కరించుకుని వాషింగ్టన్‌లో వచ్చే ఆగస్టులో స్మారక ర్యాలీ నిర్వహించనున్నట్లు రెవరెండ్ అల్ షార్ప్‌టన్ చెప్పారు. ‘అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మొత్తం న్యాయ వ్యవస్థ మారాలంటూ ప్రజా ఉద్యమానికి ఊపిరి పోస్తాం. అలా చేయకుంటే మరో ఏడాది గడిచిపోతుంది. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ గుర్తుపెట్టుకోరు. ఎవరూ పట్టించుకోరు’అని ఓ ఇంటర్వ్యూలో నల్ల జాతీయులనుద్దేశించి పేర్కొన్నారు.
అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా..
ఆస్ట్రేలియా, యూరప్, ఆసియా దేశాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. జాతి వివక్షను ఇక సహించబోమంటూ నిరసనకారులు గొంతెత్తి నినదిస్తున్నారు. ఆస్ట్రేలియాలో కస్టడీ మరణాలకు వ్యతిరేకంగా సిడ్నీలో భారీ ప్రదర్శనలు జరిగాయి. ‘కరోనా వైరస్‌తో మరణించకపోతే, పోలీసులు క్రూరత్వానికి మేము బలైపోతాం’అన్న నినాదాలు హోరెత్తిపోయాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో వరసగా రెండో రోజు కూడా ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. నల్ల మాస్కులు, టీ షర్టులు ధరించిన వారంతా బ్లాక్స్‌కి కొరియన్స్ మద్దతు ఉంటుందని అంటూ నినదించారు. జపాన్ రాజధాని టోక్యోలో వందలాది మంది శాంతియుత నిరసనలు చేశారు.
మేమూ మారాలి: ఇండో అమెరికన్ అడ్వొకసీ గ్రూప్
జార్జ్ ఫ్లాయిడ్, ఇతర ఆఫ్రికన్ అమెరికన్ల మరణాలతో అగ్రరాజ్యంలో నల్లజాతీయులపై కొనసాగుతున్న వివక్ష ఎంత భయానకంగా ఉంటుందో ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చిందని ఇండియన్ అమెరికన్ న్యాయవాదుల గ్రూప్ తెలిపింది. ఇలాంటి సమయంలోనూ భారత్, ఇతర దక్షిణాసియా దేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మంది మౌనంగా ఉండడమే మంచిదన్న అభిప్రాయంలో ఉంటారని, ఈ ధోరణి మారాలని ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఫండ్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇండియన్ అమెరిన్లను రాజకీయాల్లోకి చేర్చేందుకు సహకరించే ఈ సంస్థ మైనార్టీల దారుణ మరణాలపై తీవ్రంగా స్పందించింది. ‘కచ్చితంగా చెప్పాలంటే మేమేమీ నిరపరాధులం కాదు’అని ఆ ప్రకటనలో పేర్కొంది. ‘నల్లజాతీయులు, ఇతర పౌర హక్కులు అమెరికా ఇమిగ్రేషన్ కోసం నిరంతర పోరాటం చేయడం వల్ల మేము ఇప్పడు ఈ దేశంలో ఉన్నాం. వారు చేసిన కృషి ఫలితాలను అనుభవిస్తున్నాం. అయినప్పటికీ జాతి వివక్షకి సంబంధించిన దారుణాలు వెలుగులోకి వచ్చినప్పుడు భారతీయులు మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. అది మారాలి’అని ఆ ప్రకటన వివరించింది.
బెర్లిన్‌లో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న యువతి
Comments
Please login to add a commentAdd a comment