జాన్సన్ అండ్ జాన్సన్‌కు రికార్డ్ జరిమానా
లాస్ఏంజిల్స్:జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి మరోసారి భారీ షాక్ తగిలింది. లాస్ ఏంజిల్స్ జ్యూరీ జాన్సన్ & జాన్సన్ రికార్డు స్థాయిలో పెనాల్టీ విధించింది. కంపెనీకి చెందిన బేబీ పౌడర్ వల్లే ఈవా ఎచివెరియా అనే మహిళకు ఒవేరియన్ (అండాశయ) క్యాన్సర్ సోకిందని నమ్మిన కోర్టు ఆమెకు రూ. 2700 కోట్లు(417 మిలియన్ల డాలర్లు) నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన ఫేమస్ బేబీ టాల్కమ్ పౌడర్ అండాశయ క్యాన్సర్ కారణమవుతోందని చెబుతూ లాస్ ఏంజిల్స్ కోర్టు ఈ భారీ జరిమానా విధించింది. దీన్ని వాడడం వల్లే ఆమెకు క్యాన్సర్ వచ్చినట్లు జ్యూరీ అభిప్రాయపడింది. టాల్కమ్ పౌడర్ వాడడం వల్ల వచ్చే క్యాన్సర్ ఇబ్బందుల గురించి జాన్సన్ కంపెనీ తమ ఉత్పత్తులపై హెచ్చరికలు చేయలేదని ఎచివెరియా ఆరోపించింది. 1950 నుంచి 2016 వరకు ఆమె జాన్సన్ బేబీ టాల్కమ్‌ను వాడుతున్నది. అయితే 2007లో తనకు ఒవేరియన్ క్యాన్సర్ వచ్చినట్లు గుర్తించారు. ప్రమాదకరమైన టాల్కమ్‌ను వాడడం వల్ల క్యాన్సర్ వచ్చినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనలాగా మరొకరికి నష్టం జరగకూడదనీ, ఇతర మహిళలకు తన పరిస్థితి గురించి హెచ్చరించాలన్న ఉద్దేశంతో కేసు ఫైల్ చేసినట్లు ఆమె లాయర్ మార్క్ రాబిన్‌సన్ చెప్పారు. నష్టం కింద 68 మిలియన్ల డాలర్లు, శిక్ష పరిహారం కింద 340 మిలియన్ల డాలర్లు చెల్లించాలని జాన్సన్ కంపెనీని ఆదేశించినట్టు తెలిపారు.
మరోవైపు ఈ తీర్పుపై జాన్సన్ & జాన్సన్ స్పందించింది. జ్యూరీ నిర్ణయంపై అప్పీల్ చేస్తామని కంపెనీ ప్రతినిధి కరోల్ గూడ్రిచ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆరోపణలకు శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు.
కాగా దాదాపు వెయ్యి దాకా ఇలాంటి వ్యాజ్యాలు కంపెనీపై దాఖలు అయ్యాయి. కొన్నింటిలో జరిమానాను కూడా ఎదుర్కొంటోంది. అయితే ఇప్పటివరకు వచ్చిన వాటిలోఇదే అతిపెద్ద పెనాల్టీగా తెలుస్తోంది. ముఖ్యంగా సెయింట్ లూయిస్, ఈ ఏడాది మే నెలలో మిస్సౌరీ జ్యూరీ వర్జీనియా మహిళకు 110.5 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించగా మరో కేసులో 72 మిలియన్‌డాలర్లు, 70.1 మిలియన్‌డాలర్లు, 55 మిలియన్‌డాలర్ల జరిమానాను ఫిర్యాదు దారులకు చెల్లించాల్సిందిగాకోర్టులు ఆదేశించాయి. అయితే సెయింట్ టూయిస్, న్యూ జెర్సీకోర్టులు బేబీ పౌడర్ వాడడం వల్లే అండాశయ క్యాన‍్సర్ వచ్చిందన్న వాదనను తిరస్కరించాయి.