న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కట్టడికి ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికైతే మన దేశంలో ఎక్కువగా కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పూత్నిక్ వ్యాక్సిన్లను 18 ఏళ్లు పైబడిన వారికి పంపిణీ చేస్తున్నారు. అయితే.. ఇవన్ని రెండు డోసులు తీసుకోవాలి. కానీ త్వరలో సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తాను అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు ఆగస్టు 5న దరఖాస్తు చేసుకుంది. ఈ సంస్థ ‘జాన్సన్’ పేరుతో సింగిల్ డోసు వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. తమ వ్యాక్సిన్ సింగిల్ డోస్‌తో కరోనాను కట్టడి చేయవచ్చని కంపెనీ అధికారులు తెలిపారు.
ఈ మేరకు జాన్సన్ అండ్ జాన్సన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘అత్యవసర వినియోగ ప్రామాణీకరణ అనేది మూడో దశ క్లినికల్ ట్రయల్‌కు సంబంధించిన అత్యంత సమర్థవంతమైన, సురక్షితమైన డాటా మీద ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం మా వ్యాక్సిన్ పంపిణీ చేసిన అన్ని ప్రాంతాల్లో సింగిల్ డోస్ తీవ్రమైన వ్యాధిని నివారించడంలో 85 శాతం ప్రభావవంతమైనదని నిరూపితమైంది. అంతకాక వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తర్వాత మరణాల రేటును తగ్గించడంలో, కోవిడ్ వల్ల ఆస్పత్రిలో చేరే కేసులను తగ్గించడంలోనూ ప్రభావవంతంగా పని చేసినట్లు క్లినికల్ ట్రయల్ డాటా వెల్లడిస్తుంది’’ అని పేర్కొంది.
జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థతో హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ ఫార్మా కంపెనీ భాగస్వామిగా ఉంది. ఈ క్రమంలో బయోలాజికల్ ఈ తమ గ్లోబల్ సప్లై చైన్ నెట్‌వర్క్‌లో ఒక ముఖ్యమైన భాగం అని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అధికారులు తెలిపారు. తమ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన మైలురాయి అని.. బయోలాజికల్ ఈ సహకారంతో భారతదేశంలోనే కాక, ప్రపంచంలోని ప్రజలందరికి తమ సింగిల్-డోస్ కోవిడ్-19 టీకాను పంపిణీ చేయడానికి మార్గం సుగమం అవుతుంది అన్నారు.
అయితే.. గతంలో ఈ సంస్థ భారత్‌లో ట్రయల్స్ నిర్వహించేందుకు దరఖాస్తు చేసుకొని దానిని ఉపసంహరించుకుంది. పలు దేశాల్లో ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను వినియోగిస్తున్నారు. కాగా.. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు దేశాలు అనుమతించిన వ్యాక్సిన్లను.. ట్రయల్స్ నిర్వహణ అవసరం లేకుండానే నేరుగా అత్యవసర వినియోగానికి అనుమతించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment