
జైపూర్ : అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్‌కు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ మాత్రమే కాదు బేబీ షాంపూ కూడా ప్రమాదకరమైనదేనని తాజా పరీక్షల్లో తేలింది. రాజస్థాన్‌లో జరిపిన నాణ్యతా పరీక్షల్లో జాన్సన్ అండ్ జాన్సన్ షాంపూ భారత ప్రమాణాలను అందుకోలేకపోయింది. ఈ మేరకు రాజస్థాన్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జాన్సన్ అండ్ జాన్సన్‌కు మార్చి 5వ తేదీని నోటీసులు జారీ చేసింది. కంపెనీ బేబీ షాంపూ రెండు బ్యాచ్‌ల నమూనాల పరీక్షల్లో షాంపూలో హాని కారక పదార్థాలు ఉన్నాయని తెలిపింది. ఈ శాంపిల్స్‌లో ప్రమాదకర ఫార్మల్ డిహైడ్ ఉన్నట్లు తేలిందని పేర్కొంది. ఈ ఫార్మల్‌డిహైడ్‌ను భవన నిర్మాణ సామగ్రి (కార్సినోజెన్) తయారీలో ఉపయోగిస్తారని వ్యాఖ్యానించింది.
మరోవైపు ఈ అంశాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రతినిధి తిరస్కరించారు. తమ కంపెనీకి చెందిన ఎస్యూరెన్స్ ప్రాసెస్ ప్రపంచంలోనే అత్యంత కఠినంగా ఉంటుందనీ అత్యంత సురక్షితంగా తమ ఉత‍్పత్తులను ఉంచుతామంటూ ఈ ఆరోపణలను తిరస్కరించారు. ఈ ఫలితాలు ఏకపక్షమైనవనీ, వీటిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమన్నారు.
కాగా జే అండ్ జే బేబీ పౌడర్‌లో ప్రమాదకర క్యాన్సర్ కారకాలు ఉన్నాయని ఇప్పటికే తేలింది. అలాగే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థపై ప్రపంచ వ్యాప్తంగా వేలాది కేసులు విచారణలో ఉన్నాయి. పలు కేసులో భారీ నష్టపరిహారం చెల్లించాలని సంబంధిత కోర్టులు సంస్థను అదేశించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment