కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్–వీ భారత్‌లో కోవిడ్ నిరోధానికి వాడుతున్న టీకాల పేర్లివి. ఒకట్రెండు నెలల్లో మరికొన్ని అందుబాటులోకి వచ్చేస్తాయి! వీటిల్లో ఫైజర్, మోడెర్నా కంపెనీల టీకాలు వినూత్నమైనవి. మిగిలిన వాటికంటే భిన్నమైన పద్ధతిలో తయారైనవి! అంతేకాదు.. ఈ తరహా టీకాలు భవిష్యత్తులో హెచ్‌ఐవీ, కేన్సర్‌ల వంటి... ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పించినా ఆశ్చర్యపోనవసరం లేదు!!!
కోవిడ్ నిరోధానికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న టీకాలను స్థూలంగా రెండు భాగాలుగా విడదీయవచ్చు. దశాబ్దాలుగా పలు వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు ఉపయోగిస్తున్న సంప్రదాయ టీకాలు ఒక రకమైతే వినూత్నమైన ఆలోచనతో యాభై ఏళ్ల పరిశోధనల తరువాత తొలిసారి అందరికీ అందుబాటులోకి వచ్చిన మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ క్లుప్తంగా.. ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు ఇంకో రకం. ఆటలమ్మ అని మనం పిలుచుకునే స్మాల్‌పాక్స్ వ్యాధికి 1796లో బ్రిటిష్ వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ తొలి టీకా తయారు చేశారు.
అవులకు సోకే, పెద్దగా ప్రమాదం లేని వైరస్‌ను మానవుల్లోకి జొప్పిస్తే రోగనిరోధక వ్యవస్థ చైతన్యవంతమై స్మాల్ పాక్స్ కారక వేరియోలా వైరస్‌ను అడ్డుకుంటుందన్న జెన్నర్ సూత్రం విజయవంతంగా పనిచేసింది. ఆ తరువాత స్మాల్‌పాక్స్ తరహాలో పూర్తి వైరస్‌ను కాకుండా.. నిర్వీర్యమైన వైరస్‌తో కొన్ని రకాలు, ఇతర పద్ధతులు వాడకంలోకి వచ్చాయి. కోవిడ్‌కు ఉపయోగిస్తున్న కోవిషీల్డ్, స్పుత్నిక్– వీలను చింపాంజీల్లోని అడినో వైరస్ జన్యుక్రమంలోకి సార్స్ కోవ్–2 వైరస్ కొమ్మును చేర్చడం ద్వారా సిద్ధం చేశారు. కోవాగ్జిన్‌లో మాత్రం నిర్వీర్యం చేసిన వైరస్‌ను ఉపయోగించారు. వైరస్ లేదా వైరస్ విడిభాగాలను గుర్తించి వాటిపై దాడికి యాంటీబాడీలను తయారు చేయ డం సంప్రదాయ టీకాలు చేసే పని అన్నమాట!
కణాల టీచర్ ఎంఆర్‌ఎన్‌ఏ....
ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు వ్యాధి నిరోధక ప్రొటీన్లు ఎలా ఉత్పత్తి చేసుకోవాలో శరీరానికి నేర్పుతాయి. కోవిడ్ విషయంలో ఈ టీకాలు వైరస్ జన్యుక్రమం చుట్టూ పరుచుకుని ఉండే కొమ్ములను కణాల ద్వారా తయారు చేస్తాయి. (పక్కఫొటోలో చూడండి) అమెరికన్ కంపెనీ ఫైజర్, మోడెర్నా, జర్మన్ కంపెనీలు బయోఎన్‌టెక్, క్యూర్‌వ్యాక్‌లు ఈ రకమైన టీకాలపై చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నాయి.
డీఎన్‌ఏ పోగులోని కొన్ని భాగాలను జన్యువులంటామని.. వాటిల్లో దాగున్న సమాచారం ఆధారంగా శరీరానికి అవసరమైన ప్రొటీన్లు తయారవుతాయని మనకు తెలుసు. ఎంఆర్‌ఎన్‌ఏ అంటే డీఎన్‌ఏలోని ఒక భాగమే. కోవిడ్ విషయాన్ని తీసుకుంటే.. వైరస్‌లోని కొమ్మును తయారు చేసేందుకు కావాల్సిన ఎంఆర్‌ఎన్‌ఏను టీకా ద్వారా అందిస్తారు. ఇది మన కణాల్లోకి చేరి వైరస్ కొమ్ము ప్రొటీన్లను తయారు చేసేలా సూచనలు చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ ప్రొటీన్‌తో కూడిన వైరస్‌ను చూస్తే చాలు.. వెంటనే యాంటీబాడీల ఉత్పత్తిని ప్రారంభిస్తుందన్న మాట.
1970ల్లోనే పరిశోధనలు
ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ ద్వారా ఎలాంటి వ్యాధికైనా చికిత్స కల్పించవచ్చునని 1970ల్లో శాస్త్రవేత్తలు ఊహించారు. పరిశోధనలు చేశారు.ప్రయోగాల్లో భాగంగా ఎంఆర్‌ఎన్‌ఏను జంతువుల శరీరాల్లోకి జొప్పించినప్పుడు విపరీతమైన దుష్ప్రభావాలు కనిపించాయి. అయితే.. హంగెరీ శాస్త్రవేత్త కాటలిన్ కారికో ఎంఆర్‌ఎన్‌ఏ భాగంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించారు. కాటలిన్ కారికో పరిశోధనల ఆధారంగా స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డెరిక్ రోసీ... మోడెర్నా కంపెనీని స్థాపించి పరిశోధనలను కొనసాగించారు. ఇదే సమయంలో కాటలిన్ కారికో పరిశోధనలు కేన్సర్‌పై పరిశోధనలు చేస్తున్న ఉగుర్ సాహిన్, ఓజ్లెమ్ టురెసీ దంపతులను ఆకర్షించింది. బయోఎన్‌టెక్ కంపెనీ వ్యవస్థాపకులైన వీరు కారికో టెక్నాలజీతోపాటు ఆమెను కూడా తమ కంపెనీలోకి ఆహ్వానించి కేన్సర్‌పై పరిశోధనలు ముమ్మరం చేశారు.
కేన్సర్ కణితుల నిర్మూలనకు ప్రస్తుతం కీమో, రేడియేషన్, శస్త్రచికిత్సల వంటి మొరటు పద్ధతులను వాడుతున్నామని, ఈ క్రమంలో శరీరానికి తీవ్ర నష్టం కలుగజేస్తున్నామని ఉగుర్, ఓజ్లెమ్‌ల భావన, ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ ద్వారా ఈ పరిస్థితిలో మార్పులు చేయవచ్చునని వారు విశ్వసిస్తున్నారు. కణితులపై నేరుగా దాడి చేయగల యాంటిజెన్ల ఉత్పత్తికి ఎంఆర్‌ఎన్‌ఏ ఉపయోగపడుతుందని వీరు చెబు తున్నారు. ఒకవైపు మోడెర్నా, ఇంకోవైపు బయో ఎన్‌టెక్ ఇప్పుడు రొమ్ము కేన్సర్‌తోపాటు ప్రొస్టేట్, చర్మ, కాలేయ, మెదడు, ఊపిరితిత్తుల కేన్సర్ల చికిత్సకు ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీని ఎలా ఉపయోగించాలన్న అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. అంతేకాదు.. ఇన్‌ఫ్లుయెంజా, జికా, రేబిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నివారణకు టీకాలు సి ద్ధం చేయడంలో కొంత ప్రగతి సాధించారు కూ డా. కోవిడ్ నేపథ్యంలో ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీకి గుర్తింపు రావడంతో సమీప భవిష్యత్తులోనే ఈ రంగంలో పరిశోధనలు ముమ్మరమవుతాయని, కే న్సర్‌తోపాటు అనేక ఇతర వ్యాధులకు చికిత్స కల్పించడం సాధ్యమవుతుందని అంచనా.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment