‘కలుషిత పోలియో’ కాల్చివేత!  | 10 lakh Polio Vaccines withdrawn from the districts | Sakshi
Sakshi News home page

‘కలుషిత పోలియో’ కాల్చివేత! 

Published Thu, Oct 11 2018 2:11 AM | Last Updated on Thu, Oct 11 2018 2:19 AM

10 lakh Polio Vaccines withdrawn from the districts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కలుషిత పోలియో చుక్కలను కాల్చివేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్రంలో రెండు లక్షల మంది చిన్నారులకు వీటిని వేసినట్లు ఆ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రుల్లో భయాం దోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని చిన్నారుల రోగనిరోధకశక్తి అధికంగా ఉన్నందున వాటివల్ల ప్రమాదం ఏమీ ఉండదని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. ఇంకా మిగిలిన వాటి లో కలుషితమైనట్లు భావిస్తున్న 10 లక్షల డోసుల పోలియో చుక్కలను జిల్లాల నుంచి ఆగమేఘాల మీద హైదరాబాద్‌కు తెప్పించారు. వాటిని ధ్వంసం చేసే అంశంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు లేఖ రాసినట్లు రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. ప్రత్యేక పద్ధతుల ద్వారా ఆ పోలియో చుక్కల బాటిళ్లను కాల్చివేస్తామని వైద్యాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
 
బ్యాచ్‌ నంబర్‌–బీ10048  
కేంద్రం ప్రకటించిన బ్యాచ్‌ నంబర్‌–బీ10048 గల కలుషిత వ్యాక్సిన్లు రాష్ట్రంలోనూ అనేకమంది చిన్నారులకు వేసినట్లు అధికారులు నిర్ధారించారు. వీటిని ఎంతమందికి వేశారో సమగ్రంగా పరిశీలిస్తున్నామని అధికారులు అంటున్నారు. కలుషిత పోలియో చుక్కలను తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చిన్నారులకు వేయించారని కేంద్రం నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ బయోమెడ్‌ సంస్థ కలుషితమైన ఈ వ్యాక్సిన్లను తయారు చేసింది. మూడు బ్యాచ్‌ల్లో కలుషితమైన 1.5 లక్షల యూనిట్ల వ్యాక్సిన్లను 2016 ఏప్రిల్‌ తర్వాత పుట్టిన పిల్లలకు వేశారు.  

3 లక్షల డోసుల పోలియో మందు రాక...  
10 లక్షల డోసుల పోలియో చుక్కలను వెనక్కి తేవడంతో రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో వాటి కొరత ఏర్పడింది. అందుకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి ప్రమాదంలేని 3 లక్షల డోసుల పోలియో మందును రాష్ట్రానికి కేంద్రం పంపిందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.వాటిని రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులకు పంపిణీ చేశామని పేర్కొన్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement