సమస్త దేశాల్లో కంగారు పుట్టిస్తున్న కరోనా కొత్త రూపు దాల్చింది. వైరస్‌ల్లో జన్యుమార్పులు సహజంగానే జరుగుతుంటాయి. కానీ నెమ్మదిగా జరగాల్సిన ఇలాంటి జన్యుమార్పులను వేగంగా పూర్తి చేసుకొని కరోనా రివైజ్డ్ వెర్షన్‌లాగా సిద్ధమైంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకాలు వచ్చాయని సంతోషించేలోగానే కొత్త రూపంలో కరోనా దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. ఈ రివైజ్డ్ కరోనా వివరాలు ఇవీ..
ఏమని పిలుస్తారు? వీయూఐ 20212/01.
ఎలా ఏర్పడింది?: కోవిడ్ వైరస్‌లో 23 జన్యుమార్పులు జరిగి ఏర్పడింది.
ఎక్కడ, ఎప్పుడు బయటపడింది?
దక్షిణ లండన్‌లో, గత అక్టోబర్‌లో బయటపడింది. డిసెంబర్ నాటికి వేగంగా వ్యాపిస్తోంది. యూరప్‌లోని పలు దేశాలతో పాటు దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా సహా పలు చోట్ల ఈ వేరియంట్ జాడలు కనిపిస్తున్నాయి.
బ్రిటన్‌లో కేసులు పైపైకి
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ తీవ్ర భయోత్పాతం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసులు సంఖ్య కేవలం రెండు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 8న 12,282 కేసులు నమోదు కాగా, 21వ తేదీన కడపటి వార్తలుఅందే సమయానికి 33,364 కేసులు నమోదయ్యాయి.
ఎంత ప్రమాదకరం?
గత రూపాల కన్నా 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాపించగలదని అంచనా. అయితే వైరస్ కలిగించే వ్యాధి తీవ్రతలో పెద్దగా మార్పులేదని నిపుణులు చెబుతున్నారు.
టీకాలు పనిచేస్తాయా?
కరోనా నివారణకు కనుగొన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై కూడా సమర్ధవంతంగా పనిచేస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక వైరస్ టీకాకు లొంగని విధంగా పూర్తి జన్యుమార్పులు చెందేందుకు సంవత్సరాలు పడుతుందని, ఇప్పుడు తయారవుతున్న ఆధునిక వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లను అడ్డుకోగలవని చెబుతున్నారు. జనాభాలో 60 శాతం పైగా వ్యాక్సిన్ తీసుకుంటే వేరియంట్ల వ్యాప్తి అదుపులోకి వస్తుందంటున్నారు.
ఏం చర్యలు చేపట్టారు?
ముందుగా బ్రిటన్‌కు పలు దేశాలు రాకపోకలను నియంత్రించాయి. బ్రిటన్‌లో కూడా నూతన వ్యాప్తి అరికట్టేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు వాక్సినేషన్ మొదలెట్టారు.
భారత్‌లో పరిస్థితి..
ఇండియాలో ఇంకా అధికారికంగా ఈ కొత్త వేరియంట్ వైరస్ ఉనికి నిర్ధారించలేదు. అటు ఆరోగ్య శాఖ జనవరి నుంచి దేశ ప్రజలకు టీకాలు అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. ముందు జాగ్రత్తగా బ్రిటన్‌కు విమాన రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసింది. అనవసర పుకార్లు నమ్మవద్దని, కరోనా నివారణకు సూచించిన జాగ్రత్తలు తప్పక పాటించాలని ఆరోగ్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సోకిన వారికే మళ్లీ?
దక్షిణ లండన్‌లో బయటపడ్డ కొత్త రకం వైరస్ ప్రపంచం మొత్తానికీ ప్రమాదమేనని, తగిన జాగ్రత్త చర్యలు పాటించకపోతే కరోనా వైరస్ మరింత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా హెచ్చరించారు. అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో కేసులున్న భారత్‌లోనూ ఈ కొత్త వైరస్ వల్ల కేసులు గణనీయంగా పెరిగే అవకాశముందని సోమవారం ‘సాక్షి’తో చెప్పారు. గుండెజబ్బులతో పాటు మధుమేహం వంటి సమస్యలు ఉన్న వారిపై దీని ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.
కొత్త వైరస్ వల్ల ఒకసారి వ్యాధి బారిన పడ్డవారు మరోసారి అదే వ్యాధి బారిన పడతారేమోనన్న అనుమానం తనకు ఉందని, అదే జరిగితే సమస్య చాలా తీవ్రమవుతుందని వివరించారు. బ్రిటన్‌తో పాటు అమెరికాలోనూ కొత్త రకం వైరస్‌పై పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆ వివరాల ఆధారంగానే భారత్‌లో చర్యలపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు వైరస్‌లోని పలు భాగాలపై ఏక కాలంలో దాడి చేస్తాయని, అందువల్ల వైరస్‌లో జన్యుమార్పులు జరిగినా టీకా సామర్థ్యంలో తేడా ఉండదని వివరించారు.
(చదవండి: బ్రిటన్ విమానాలపై నిషేధం)
Comments
Please login to add a commentAdd a comment