బ్రిటన్‌ కొత్త వైరస్ టెస్టులకు దొరకదా? | RTPCR Tests Have Shown That New Type Of Virus May Not Be Present | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ కొత్త వైరస్ టెస్టులకు దొరకదా?

Published Wed, Dec 23 2020 4:57 AM | Last Updated on Wed, Dec 23 2020 9:59 AM

RTPCR Tests Have Shown That New Type Of Virus May Not Be Present - Sakshi

బ్రిటన్‌లో కొత్త రూపం సంతరించుకున్న వైరస్‌ ప్రస్తుతం చేసే కరోనా పరీక్షల్లో బయటపడకపోవచ్చని యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ (ఈ–సీడీసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం వైరస్‌పై నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం వాడుతున్న ఎస్‌–జీన్‌ (స్పైక్‌ జీన్‌) ఆధారిత ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల స్థానంలో అన్ని రకాల జీన్‌లు, మార్పులతో తయారైన కిట్లు తయారుచేయాలి. లేకుంటే ఈ వైరస్‌ను పూర్తిగా కనిపెట్టలేం.. ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల్లో దీన్ని గుర్తించడం తక్కువ.. అందువల్ల పరీక్షల్లో మార్పులు చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం స్పైక్‌–జీన్‌లో మార్పులను బట్టి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు జరగడం లేదని తెలిపింది.      – సాక్షి, హైదరాబాద్‌

60 ఏళ్లలోపు వారిపైనే పంజా 
ఈ వైరస్‌కు గురైన వారి సగటు వయసు 47 ఏళ్లు.. అంటే 60 ఏళ్లలోపు వారికే ఎక్కువగా ఈ వైరస్‌తో ప్రమాదముంది. దీనికి కారణమేంటంటే.. లాక్‌డౌన్‌ తర్వాత బ్రిటన్‌లో అన్నింటినీ వదిలేశారు. దీంతో కొత్త వైరస్‌ పుట్టుకొచ్చింది. చలికాలం కూడా అనుకూలంగా పనిచేసింది.. సాధారణ వైరస్‌తో పోలిస్తే దీని వల్ల ఎక్కువ మరణాలు సంభవించలేదు. వైరస్‌పై లేబొరేటరీల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. దీని ఇన్ఫెక్టెవిటీని తెలుసుకుంటున్నారు.

ఎలా గుర్తించారంటే?  
బ్రిటన్‌లో జన్యు విశ్లేషణ ప్రతీ పది కరోనా కేసుల్లో ఒకదానిపై జరుగుతోంది. అదే భారత్‌లో 5 వేలకు ఒక కేసుపై జన్యు విశ్లేషణ చేస్తున్నారు. దేశంలో కేసులు పడిపోతుండటంతో గత రెండు నెలలుగా కరోనా జన్యు విశ్లేషణ నిలిచిపోయింది. అయితే ఇటు సౌత్‌ ఈస్ట్‌ ఇంగ్లండ్‌లో కేసులు బాగా పెరిగినట్లు గుర్తించారు. 14 రోజుల్లో నాలుగు రెట్లు పెరిగాయి. పెరిగిన కేసుల్లో జన్యు విశ్లేషణ ఆధారంగా కొత్త వర్గానికి చెందిన కరోనా బయటపడింది. ప్రపంచంలో 10 రకాల కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌లున్నాయి. అందులో కోవిడ్‌ ఒకటి. కోవిడ్‌లో 11 రకాల ఉప గ్రూప్‌లున్నాయి. ప్రస్తుతం ప్రపం చాన్ని వణికిస్తున్న కోవిడ్‌–19 వైరస్‌లో ఏ2ఏ అనే వర్గపు వైరస్‌ ప్రధానమైంది. మన దేశంలోనూ అదే ఉంది. ఇప్పుడు యూకేలో వచ్చింది కోవిడ్‌–19లో బీ వర్గానికి చెందినది.

ఇది అనూహ్యంగా జన్యు మార్పులు చెంది 29 రకాలుగా మార్పులు చెందింది. సౌత్‌ ఈస్ట్‌ ఇంగ్లండ్‌లో వారం పది రోజుల్లో నమోదైన వెయ్యి కేసుల్లో సగం ఈ వర్గానికి చెందినవే.. గతంలో 5% ఉన్నది కాస్తా ఇప్పుడు 50% పెరిగింది. మిగిలిన కరోనా వైరస్‌ల కంటే ఇది 70% వేగంగా విస్తరిస్తుంది. అయితే దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో గుర్తించలేదని ఈ–సీడీసీ తెలిపింది. దక్షిణాఫ్రికాలోనూ ఇదే వర్గానికి చెందినదే గతంలో వచ్చింది. సింగపూర్‌లోనూ కొత్త వెరైటీలు వచ్చి బలహీనపడ్డాయి. దీనిపై పరిశోధనలు జరగాలి.. ప్రతీ దేశంలోనూ కొత్త వైరస్‌పై జన్యువిశ్లేషణ జరగాలని సూచించింది. కొత్త వైరస్‌తో అనూహ్యంగా కేసులున్నాయే కానీ, మరణాలు పెద్దగా పెరగలేదని తెలిపింది.

 కొత్త వైరస్‌లలో మార్పులకు కారణమేంటంటే?  
కొత్త రకం వైరస్‌లలో అనూహ్యంగా మార్పులున్నాయి. బీ వర్గం వైరస్‌ కూడా మార్పులకు లోనై తక్కువ కాలంలో వేగంగా విస్తరిస్తోంది. దీనికి గల కారణాలను ఈ–సీడీసీ విశ్లేషించింది. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న అతి కొద్దిమంది కరోనా రోగుల్లో కొన్ని నెలల పాటు వైరస్‌ ఉంటుంది. దీంతో వైరస్‌ వారి శరీరంలో ఎన్నో మార్పులకు లోనవుతుంది. అలా అది ఆ మార్పులతో బయటకు వచ్చి మరింత వ్యాప్తి చెందుతుందని వెల్లడించింది. ఇక రెండోది జంతువుల్లోకి వైరస్‌ వెళ్లి మార్పులు చెంది మళ్లీ మనిషికి రావడం వల్ల దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది.  చదవండి: (కరోనాకు కొత్త కొమ్ములు)

ఉదాహరణకు డెన్మార్క్‌లో మింక్‌ అనే జంతువులో వైరస్‌ ప్రవేశించి అనేక మార్పులకు లోనైంది. అందులో ఒక ప్రత్యేక మార్పును ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. అదే మార్పు ఇంగ్లండ్‌లోని బీ వర్గం వైరస్‌లోనూ కనిపిస్తోంది. అయితే అది ప్రమాదకరం కాదని నిర్ధారణ అయింది. బ్రిటన్‌లోని కొత్త రకం వైరస్‌ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ–సీడీసీ చెప్పింది. బ్రిటన్‌ నుంచి వచ్చేవారిని ఇతర దేశాల్లో క్వారంటైన్‌లో ఉంచాలి. ఎవరూ ఎక్కువ ప్రయాణాలు చేయవద్దు. ప్రస్తుతం తీసుకుంటున్న కరోనా జాగ్రత్తలు పాటించాలి. అనవసరంగా బయటకు రాకూడదని తెలిపింది.  

ఈ–సీడీసీ ప్రతిపాదనలు
►ప్రస్తుతం వాడుతున్న మందులతో నయం కాని కరోనారోగులను ప్రత్యేకంగా పరిశీలించాలి.. 
►కరోనా రీఇన్ఫెక్షన్‌ వచ్చిన వారిలోని మార్పులను గుర్తించాలి. రెండోసారి వచ్చింది బీ వర్గానిదా కాదా చూడాలి. 
►వ్యాక్సిన్‌ తీసుకున్నాక కరోనా వచ్చినవారున్నారా లేదా చూడాలి. వాళ్లల్లో కొత్త వైరస్‌ ఉందా లేదా పరీక్షించాలి.  

జాగ్రత్తలే శ్రీరామరక్ష..
కొత్త వైరస్‌ ప్రమాదకారి అని చెప్పలేం.. ఆర్‌ఎన్‌ఏ వైరస్‌లలో మార్పులు సహజమే.. దీనివల్ల మనుషులపై చూపించే ప్రభావం కూడా తక్కువేనని ఈ–సీడీసీ స్పష్టం చేసింది. బీ వర్గానికి చెందిన కొత్త వైరస్‌కు దగ్గరి పోలికలున్న వైరస్‌ను దక్షిణాఫ్రికా, సింగపూర్, డెన్మార్క్‌ల్లో గుర్తించారు. కానీ ఇది ఏమాత్రం ప్రభావితం చేయలేదని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. వ్యాక్సిన్‌ పురోగతికి, కరోనా వైద్యంపై కొత్త వైరస్‌ ప్రభావం చూపదు.. వ్యాక్సిన్‌ వచ్చే వరకు ప్రజల్ని ప్రభుత్వాలు వైరస్‌కు దూరంగా ఉంచాలి. ఆ మేరకు ప్రజలూ తగు జాగ్రత్తలు పాటించాలి..  – డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement