గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో యాంటీరేబిస్ వ్యాక్సిన్లు పుష్కలంగా ఉన్నట్టు సూపరింటెండెంట్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు తెలిపారు. ప్రతిరోజూ ఓపీగదిలో బాధితులకు వ్యాక్సిన్ వేస్తున్నట్లు వెల్లడించారు. అత్యవసర వైద్య సేవల విభాగంలో కూడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్నామని, ప్రజలు వ్యాక్సిన్ గురించి ఆందోళన చెందనవసరం లేదన్నారు.
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)తోపాటు జిల్లాలో అన్ని ఆరోగ్య కేంద్రాలకు ప్రతి రోజూ కుక్కకాటు బాధితులు వైద్యం కోసం వస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కుక్కకాటు వ్యాక్సిన్ లేదని బాధితులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేయటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీని వాస్ అక్కడి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో జీజీహెచ్ సూపరింటెండెంట్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నట్టు వెల్లడించారు.
ఇదిలావుంటే, జిల్లాలో ప్రస్తుతం కుక్కలు కరిచి గాయపడుతున్న సంఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కుక్క కరిచిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలను జీజీహెచ్ మెడికల్ స్టోర్స్ ఇన్‌చార్జి డాక్టర్ నల్లూరి విజయ్‌శ్రీ సాక్షికి తెలిపారు.
కుక్క కరిచిన వెంటనే గాయాలపై చల్లటినీటిని ధారగా పోస్తూ సాధ్యమైనంత మేరకు ఎక్కువ సార్లు సబ్బుతో కడగాలి. గాయంపై టించర్ అయోడిన్ వేయాలి. ఇలా చేయడం వల్ల రేబిస్ వైరస్ శరీరం లోపలకు ప్రవేశించకుండా నివారించవచ్చు. గాయానికి కుట్టు వేయడం, ఆయింట్‌మెంట్ పూయడం వంటివి చేయకూడదు.
కుక్క కరిచిన వెంటనే సాధ్యమైనంత త్వరగా వైద్యులను సంప్రదించి రేబిస్‌వ్యాధి నిరోధక టీకాలు నెలలో నాలుగుసార్లు క్రమం తప్పకుండా వేయించుకోవడం ద్వారా వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. పిల్లలను కుక్కల దగ్గరకు వెళ్లనీయకుండా దూరంగా ఉండేలా చూడాలి. ఇంట్లో పెంపుడు కుక్కులకు తప్పని సరిగా టీకాలు వేయించాలి.
కుక్కకాటు వ్యాక్సిన్లు ఫుల్
Published Sat, Dec 27 2014 1:41 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement