గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ధర్నా చేస్తున్న తెలుగు మహిళలు
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రచార పిచ్చి పరాకాష్టకు చేరింది. ఆ పార్టీ నేతలు మరోమారు తమ కుసంస్కారాన్ని బయట పెట్టారు. ఏ అంశాన్ని రాజకీయం చేయాలో, ఏది చేయకూడదో అన్న విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయారు. రెండురోజుల క్రితం భార్యాభర్తలు మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో జరిగిన శుభకార్యానికి హాజరై తిరిగి సత్తెనపల్లి వెళ్తుండగా కొందరు దుండగులు వారిని అడ్డగించి పొలాల్లోకి లాక్కుని వెళ్లి భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై లైంగిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. (చదవండి: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం?)
ఈ ఘటన జరిగిన వెంటనే సత్తెనపల్లితోపాటు మేడికొండూరు పోలీసులు స్పందించారు. ఆరు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది మందికిపైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలు షాక్‌లో ఉండటంతో ఇప్పటి వరకూ ఆమెను విచారణ చేయలేదు. ఆమె భర్త చెబుతున్న వివరాల ఆధారంగానే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే దీన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని తెలుగుదేశం నాయకులు శనివారం ప్రభుత్వాస్పత్రి ముందు హడావుడి చేశారు
►ఇటీవల బీటెక్ విద్యార్థిని రమ్య హత్య జరిగినప్పుడు కూడా తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బృందం చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. లోకేష్ రావడం ఆలస్యం కావడంతో అప్పటి వరకూ మృతదేహాన్ని తీసుకు వెళ్లనీయకుండా అడ్డం పడటం, ఆ తర్వాత రమ్య ఇంటి వద్ద లోకేష్ బృందం చేసిన హడావుడి, గందరగోళం వారి
కుసంస్కారాన్ని బయటపెట్టింది.
►ఏడు నెలల క్రితం హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించే పేరుతో రెండురోజుల క్రితం మరో నాటకానికి లోకేష్ తెరతీశారు. గురువారం నరసరావుపేట వచ్చి అనూష కుటుంబాన్ని పరామర్శించి ధర్నా చేయాలని నిర్ణయించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో ట్రయల్ ప్రారంభమయ్యే సమయంలో లోకేష్ రాజకీయం చేయడంపై ప్రజల నుంచి విమర్శలు ఎదురయ్యాయి.
సాటి మహిళ బాధను అర్థం చేసుకోకుండా..
తాజాగా మేడికొండూరు ఘటనపైనా తెలుగుదేశం మహిళా నేతలు అత్సుత్సాహం ప్రదర్శించారు. సాటి మహిళ బాధను అర్థం చేసుకోకుండా సంస్కారహీనంగా ప్రవర్తించారు. శనివారం తెలుగుదేశం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వేగుంట రాణి, ప్రధాన కార్యదర్శి షేక్ ఆషా, ఇతర నాయకులు పద్మ, వినీల, గుడిపల్లి వాణి కొంతమంది అనుచరులతో జీజీహెచ్‌లో బాధితురాలు ఉన్న వార్డు వద్దకు మీడియాను వెంటేసుకుని వచ్చారు.
అసలే జరిగిన ఘోరంతో తీవ్ర వేదనలో ఉన్న బాధితురాలిని కలవాల్సిందేనంటూ పట్టుబట్టారు. బాధితురాలు తనను ఎవరైనా పరామర్శించాడానికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని తెగేసి చెప్పడంతో ఆస్పత్రి సిబ్బంది టీడీపీ నేతలను అనుమతించలేదు. సూపరింటెండెంట్ ఎంత నచ్చజెప్పినా వారు వినలేదు. అక్కడే కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లైంగికదాడి కేసుల్లో బాధితుల పేర్లు కూడా ప్రస్తావించకూడ దు. కానీ టీడీపీ నేతలు మీడియాతో వచ్చి ప్రభుత్వాస్పత్రి వద్ద ధర్నాకు దిగడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
గోప్యత అవసరం
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితురాలి వివరాలు గోప్యంగా ఉంచడం పరిపాటి. ఈ కేసులోనూ పోలీసులు అదే పాటించారు. సమాజంలో మహిళలకు ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ‘దిశ’ మహిళలకు రక్షాబంధన్ లాంటిది. టీడీపీ నేతలు కావాలని ప్రభుత్వంపై బురదజల్లే యత్నాలు చేస్తున్నారు. ఏపీ పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారు. ఏదో ఒక ఘటనను అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని టీడీపీ యత్నించడం సరి కాదు. ఆ పార్టీ నేతలు విజ్ఞతతో ఆలోచించాలి.
– చెన్నంశెట్టి చక్రపాణి, రిటైర్డ్ ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment